[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]“ఏం[/dropcap]టోయ్! చాలా స్లిమ్ముగా కనిపిస్తున్నావు. నాలుగు నెలల క్రితంకీ, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. బాగా తగ్గావు. డైటింగ్ మరీ ఎక్కువగా చేసేస్తున్నట్టున్నావు. అదొకటేనా? వాకింగూ, యోగాలు కూడానా? మొన్నామధ్య మీ అక్కయ్య కనపడితే చెప్పింది.. నువ్వు పడీపడీ ఎక్సర్ సైజులు, ఏరోబిక్సూ చేసేస్తున్నావనీను.. ఎందుకబ్బా.. మరీ అంత జీరో సైజ్‌కి వచ్చేయాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? అయినా మరీ అంత సన్నగా డొక్కుగా అయిపోతే ముఖంలో కళాకాంతులు వుండవు. ఆ బుగ్గలు లోపలికి పోయి ఎలా వున్నావో చూడు. ఎండిపోయిన మునక్కాడలా అయిపోయేలా వున్నావు. ఇలా చేసావంటే, లేనిపోని కొత్త రోగాలు కూడా పుట్టుకొస్తాయి జాగ్రత్త. అయినా శుభ్రంగా కడుపునిండా తినడానికి.. నీకు డబ్బుకి ఇబ్బందులు ఏవీ లేవు కదా! లేనివాళ్ళు ఎలాగూ తినరు.. నీకేంటి చెప్పు.. మీ ఆయన రెండు చేతులతో సంపాదిస్తున్నాడు. ఇలా బక్కచిక్కి పోడానికి ఏం ఖర్మ చెప్పు? హాయిగా తిని కూర్చోక.. నా మాటవిని రేపటినుంచి ఈ డైటింగులూ, వాకింగులూ మానేయి.. నువ్వు ఓ పిసరు చుట్టుకొలత పెరిగితేనే చూడ్డానికి బావుంటావు.”
ఎవరైనా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ.. కాస్త డైటింగులూ, ఎక్సర్‌సైజులు గట్రా చేస్తూ వెయిట్ తగ్గి కనపడితే, చూసినవారందరిలో తొంభై శాతం మంది ఇచ్చే, చెప్పే ఉచిత సలహాలు ఇవే వుంటాయి. మన మానాన ఏదో ప్రయత్నాలు చేసుకుంటూంటే మధ్యలో వీళ్ళ గోలేంటో అర్థం కాదు.
అలాగే పిల్లలు కూడా కాస్త బక్కగా కనపడితే చాలు.. “మీ పిల్లది మరీ సన్నగా వుందేంటీ? తిండి పెట్టడం లేదా ఏంటి? ఎదిగే పిల్లలు బాగా తినాలి. రోజూ ప్రొటీను వుండాలి. ఆకుకూరలు పెట్టాలి. పోనీ ఉడికించిన గుడ్డు పెట్టవోయ్. పిల్ల ఇలా వుంటే ఎలా? వాళ్ళు తినడానికి పేచీలు పెట్టినా సరే.. నువ్వు బలవంతంగా తినిపించాలి.” అని మనతో అంటారు అయితే అలా అనేవారి పిల్లాడు.. ఈసురోమంటూ.. ఎముకలు బయటపడి కనపడతాడు. మరి ఈ మాటలు తనకి వర్తించవు కాబోలు. ఈ జనాలు వున్నారే.. నోరుంది కదా అని ఎంచక్కా ఏదైనా చెపుతారు.
అదే కాస్త బొద్దుగా వున్నామనుకోండి.. ఇక వాళ్ళ చూపులన్నీ మనమీదనే. “మరీ ఇలా వుంటే రేపు బీపీ, సుగర్లూ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ముందు చెప్పేది వెయిట్ తగ్గమనే. నీకు ఈపాటికి మోకాళ్ళ నొప్పులు వచ్చేవుంటాయే. రోజూ కాసేపు వాకింగ్ చేయకపోయావా?” ఇక ఇలా చెప్పేవాటికి అంతుండదు.
ఇలాంటి సలహాలే కాకుండా ఏం చేస్తే సన్నబడతామో? ఏలా వుంటే లావు తగ్గుతామో కూడా వారే మన మీద రెస్పాన్సిబిలిటీ తీసేసుకుని సలహాలు, చిట్కాలు, సూచనలు గుప్పించేస్తూ వుంటారు.
ఏంటో మనం సన్నగా వున్నా వాళ్ళకే సమస్య, లావుగా వున్నా వాళ్ళకే సమస్య.. మనకి కాదన్నమాట.