కలవల కబుర్లు-45

0
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మొ[/dropcap]హమాటం అంటారో లేదా ముఖమాటం అంటారో కానీ..

ఈ మొగమాటంతో చచ్చేచావే బాబూ చాలా మందికి. ఏదీ కాదనలేని అశక్తత.. నావల్ల కాదు, నాకు కుదరదు, నేను చేయలేను అని చెప్పలేకపోతారు పాపం. ఇక అలాంటి వారంటే అందరికీ తక్కువే. ఎలా వాడుకోవాలా? ఎలా ఆడుకోవాలా? అని చూస్తూంటారు మిగతావారు.

ఆఫీసు పనుల్లో పాపం చాలా మంది ఈ మొహమాటాలతో బలై పోతూ వుంటారు. తప్పించుకునే ధోరణి వాళ్ళు, ఈ మొహమాటస్తులని తెగ వాడేసుకుంటారు. హాయిగా పని తప్పించుకుని మొత్తం వీళ్ళ మీదకి తోసేస్తూంటారు. చచ్చీచెడీ ఒప్పుకున్న నేరానికి తమ సమయాన్ని, శ్రమనీ ఉపయోగించి ఎదుటివారికి సాయం చేస్తే, మెప్పు మాత్రం, ఆ తెలివైన వారు వాళ్ళ ఖాతాలో వేసుకుని తామే విజయాన్ని సాధించినట్లు ఫీలయిపోతారు.

ఇలా మొహమాటాలకి పోయి పాపం కొందరు, లోన్ల విషయంలో ష్యూరిటీలు వుండడం, హామీలు వుండడం చేస్తూంటారు. ముందు ఆలోచనలు లేకుండా, స్నేహితులే కదా అని సాయాలు చేయడం, తర్వాత వాళ్ళు నెత్తిన చేతులు పెట్టడం, ఆ తర్వాత వీళ్ళు లబోదిబో అనడం అవుతూంటూంది. అందుకే ముందే కాదు, మా వల్ల కాదు, అని చెప్పేస్తే ఏ గోలా వుండదు.

అలాగే, ఇరుగు పొరుగులు కూడా చిన్న సాయాల నుంచి పెద్ద సాయాల వరకూ అడగడం.. ఇక కాదనలేకపోవడం.. ఆ తర్వాత కక్కలేక మింగలేక గింజుకోవడం అవుతుంది.

“మీరు చేసే సాంబారంటే మా వారికి ఎంత ఇష్టమో చెప్పలేను వదినగారూ! మొన్న మీరు ఇచ్చినది గిన్నె కూడా నాకేసారు. నేను ఎంతలా చేసినా మీరు చేసినంత రుచి మాత్రం రాదంటే నమ్మండి. అందుకే నన్ను అసలు సాంబారు జోలికి పోవద్దని మా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అందుకే, ఈసారి మీరు ఎప్పుడు చేసినాసరే.. మా వాటా మాకు ఇవ్వాల్సిందే!” అనేసరికి ఈ మొహమాటస్తురాలు కాదని అనలేకపోతుంది. మొదట్లో తప్పక ఇచ్చినప్పటికీ.. తర్వాత తర్వాత , ఇక వాటాలు ఇవ్వలేక.. సాంబారు వాసనలు బయటకి రాకుండా కిటికీ తలుపులు వేసుకుని భయపడుతూ సాంబారు చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది.

ఇలా ఇదొకటే కాదు.. ఇంట్లో వాడుకునే విలువైన వస్తువులు, చీరలు, నగలు ఇలా కూడా మొహమాటానికి ఇవ్వడం..ఆ తర్వాత జరిగే సంఘటనలకు మౌనంగా బలవ్వడం అయిపోతుంది.

బయటవారే కాదు ఇంట్లో కూడా అక్కచెల్లెళ్ళో, అన్నదమ్ములో ఇలాగే కాస్త మెత్తగా వుంటే మిగిలిన వారు తెగ వాడేసుకుంటూ వుంటారు. ఇంటి పనులన్నీ వాళ్ళ నెత్తిన వేసేస్తూంటారు.

పెళ్ళి సంబంధాలు చెప్పే విషయాలకి వస్తే.. ఎవరికైనా ఏదో మనకి పరిచయం వున్నవారో, లేదా ఏదో వాకబులో వచ్చిన సంబంధం గురించి చెప్పడంతో మన బాధ్యత తీరిపోతుందనుకుంటాము. అదృష్టవశాత్తు ఆ జంట చక్కగా కాపురం చేసుకుంటూంటే.. ఫర్వాలేదు. ఏ కలతలో, కీచులాటలో వచ్చాయే అనుకోండి.. ఆ సంబంధం గురించి చెప్పినవారు చచ్చారే ఇక. వచ్చి వీళ్ళ పీక మీద కూర్చుంటారు. దరిద్రపు సంబంధం కుదిర్చామని తిట్టిపోస్తారు. అందుకే మధ్యవర్తిత్వం నడపడపం, మాట సాయం చేయడం కత్తి మీద సాము లాగే వుంటాయి. పుణ్యానికి పోతే పాపం ఎదురయినట్టు వుంటుంది.

ఇక మనవాళ్ళు ఎవరైనా ఏ విదేశాలో వెడుతున్నారని తెలిస్తే చాలు.. “మావాడి కోసం ఆవకాయ పెట్టాము. ఎంతో వుండదు ఓ రెండు కేజీలుంటుంది. కాస్త పట్టుకెళ్ళి మావాడికి అందించండి. మీ పేరు చెప్పుకుని పిల్లలు ఆవకాయ తింటారు.” అంటే కాదనలేం కదా! చూడబోతే అది రెండు కేజీలు కాదు.. మరో రెండైనా వుంటుంది. ఏదో సామెత చెప్పినట్టు ఒప్పుకున్నాక తప్పదు అనుకుంటూ ఎలాగో సర్ది చెప్పుకుంటారు. ఇలా ఒకరైతే ఫర్వాలేదు.. మరో ఇద్దరో ముగ్గురో వస్తే ఈ మొహమాటస్తులు మరింత మొహమాటపడతారు.

ఇదే సాయం, ఎప్పుడైనా వీళ్ళే అడిగారే అనుకోండి.. ఆ ఎదుటివారు నిర్మొహమాటంగా చేయమనే చెపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మొహమాటం వుండదు మరి.

అందుకే ఎవరైనా సరే, ఏదైనా సరే పని కానీ, సాయం కానీ, మాట సహాయం కానీ ఎదుటివారు అడిగినప్పుడు.. కొంత టైం తీసుకునైనా సరే, సాధ్యమైనంత వరకూ ‘నో’ చెప్పడమే మంచిది. ఎందుకంటే ఈరోజుల్లో మంచికి స్ధానం వుండడం తగ్గిపోయింది. మంచి చేసిన వారే చెడు కూడా అవుతున్నారు. ముందు సరే అని ఒప్పుకొని, తప్పనిసరై చేసాక, మరోసారి ఎప్పుడైనా కాదంటే వెంటనే శత్రవులైపోవడం ఖాయం. అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here