Site icon Sanchika

కలవల కబుర్లు-48

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]కిం[/dropcap]దటి వారం పెళ్ళి ముచ్చట్లే.. కొనసాగిద్దాం.

సరే.. తాంబూలాలు పుచ్చుకోవడం అయింది. ముహూర్తం పెట్టేసారు. ఇక మొదలు ఆడపెళ్ళి వారి ఉరుకులు, పరుగులు. పెళ్ళికొడుకు తల్లి తండ్రులు ముందే చెప్పారుగా.. ‘మేమసలు కట్నమనే మాటే అనడం లేదు. కట్నం పుచ్చుకోవడం మా ఇంటా వంటా లేదు. కాకపోతే పెళ్ళి మాత్రం కనీవినీ ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరపాలి. మేమడిగేది ఇదొకటే! ఏసీ ఫంక్షన్ హాలు బుక్ చేయండి. మా వాళ్ళందరూ వుండడానికి స్టార్ హోటల్‌లో ఏసీ రూములు కనీసం పాతికైనా బుక్ చేయండి. మీ అల్లుడికి మాత్రం సూట్ బుక్ చేయడం మర్చిపోకండి. మేమడిగింది ఇదొకటేగా!’ పేరుకి కట్నం లేదనే కానీ..దానికి మించిన ఖర్చులు మొదలవుతాయి.

ఇన్ని అడిగినవారు భోజనాల దగ్గర మాత్రం రాజీ పడతారేంటీ? అబ్బే.. ఊహూ..

వంటలు చేయడానికి ఎవరిని కేటరింగ్‌కి మాట్లడాలో.. మెనూ ఏమిటన్నదీ కూడా మగపెళ్ళివారే డిసైడ్ చేసేస్తారు. ఒకో విస్తరిలోనూ అధమ పక్షం అరవై రకాలైనా వుండాలంటారు. కొన్నిటికైతే ఊరూ పేరూ, రుచీ పచీ కూడా వుండవు.. అయినా సరే.. మావాళ్ళెవరో ఇవి పెట్టారు.. మన ఇంట్లో పెళ్లిలో పెట్టకపోతే ఎంత నామర్ధా? అంటారు. ఇక పిల్ల తండ్రికి తప్పదు.. తప్పించుకోలేడు కూడా.. ఔను మరి.. రోట్లో తల పెట్టాక రోకటి దెబ్బలకి వెరిస్తే ఎలా?

‘మేము కట్నం వద్దన్నాం కానీ.. లాంఛనాలు వద్దని అనడం లేదు సుమీ! మీరూ అది గ్రహించి మా ముద్దు ముచ్చట్లు తీర్చాలి. అయినా ఆడపిల్ల పెళ్ళి చేస్తున్నారు మీకు ఆమాత్రం తెలీదా ఏంటీ?’ అంటూ పిల్లాడి తల్లి సన్నాయి నొక్కులు నొక్కుతూంటే పిల్ల తండ్రి చెవిలో పెద్ద బేండ్ మేళమే మోగుతుంది.

‘మాకా ఒక్కగానొక్క ఆడపిల్ల. దానికి ఏ అచ్చటైనా ముచ్చటైనా తీరేది.. అన్నగారి పెళ్ళిలోనేగా! అందుచేత మీరు ఇవి మాత్రం కాదు, లేదు, వద్దు అనడానికి వీల్లేదు. ఆడబడుచు కట్నం కింద.. లక్ష రూపాయలు, పెట్టాల్సిన చోటల్లా ఇరవై వేలకి తగ్గని కంచి పట్టు చీరలూ, వాళ్ళ జంటకి వెండి కంచాలు, వెండి పానకం బిందెలు ఇవి చాలు. మర్చిపోయా చెప్పడం.. మా ఇంట్లో అత్తగారి లాంఛనాలు ఆనవాయితీ కూడా వుందండోయ్. నాకైతే అంత ఆశ లేదు.. కానీ సాంప్రదాయం కాదనకూడదు కదా.. డబ్బు రూపంలో వద్దు లెండి.. నాలుగు పేటలు పలకసర్లు చేయించండి చాలు. మేమేం కట్నం అడగలేదుగా!’ వడ్డాణం సవరించుకుంటూ పిల్లాడి తల్లి అంటూంటే.. ఆడపిల్ల తల్లితండ్రులకి ఆమాంతం ఆవిడని ఎత్తి కుదేయాలనిపిస్తుంది. కానీ.. తమకి తెలీకుండానే అసంకల్పితంగా తలలూపి సమ్మతిని తెలియచేస్తారు.

‘మీ అల్లుడే కదా! వాడికి కావలిసినవేవో మీరే చూసుకుంటారు మాకు తెలుసు. ఏదో ఒకసారి మీ చెవిన వేస్తే బావుంటుందని చెపుతున్నామంతే.. పైగా మా వాడు కానీ, మేము కానీ మిమ్మల్ని కట్నం కోసం పీడించే వారిమే కాదు. అయినా మగపిల్లలకి పెద్దగా బంగారం పెడదామన్నా ఏముంటాయిలెండి? మెళ్ళోకి గొలుసు, బ్రాస్‌లెట్టు, రెండు ఉంగరాలూ, వెండి కంచం, వెండి చెంబు, గ్లాసు తీసుకోండి. పెట్టే బట్టల సంగతైతే.. వాడు అన్నీ బ్రాండెడ్‌వే ఇష్టపడతాడు.. మీరు ఓ రెండు లక్షలిచ్చేయండి వాడికి నచ్చినవి వాడే కొనుక్కుంటాడు. ఏం బాబూ సరేనా?’ అంటూ పిల్లాడిని అడుగుతూంటే.. ఔనౌనౌంటూ వాడు గోడలకేసీ, ఇంటి పై కప్పుకేసీ చూస్తూ తలాడిస్తోంటే.. మా నాయినే! ఎంత బుద్ధిమంతుడివిరా! అనుకుని ఎండుమిరపకాయలు దిగతుడిచి ఎర్రని నిప్పులున్న కుంపట్లో వేయాలనిపిస్తుంది పిల్ల తల్లికి.

ఇలాంటి భూకంపాలు, సునామీలు దాటుకుంటూ.. ఎప్పటి నుంచో దాచుకున్న మూటని కరగపెట్టడానికి పిల్ల తండ్రి సిద్ధమవుతున్న తరుణంలో.. పిల్ల మాత్రం తక్కువేం కాదంటూ,

‘నాన్నాగారూ! అమ్మ చూడండి.. పాత నగలే ఇస్తానంటోంది. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్.. నాకు ఇప్పుడు లేటెస్టుగా వచ్చేవి తీసుకోండి. అందులో ఒకటి డైమండ్ సెట్ మాత్రం వుండేలా తీసుకుంటాను. పట్టు చీరలు మెరిసిపోయేలా అదిరిపోవాలి. మీరు, అమ్మ కొంటే అమ్మమ్మ కాలం నాటివి తీసుకుంటారు. అందుకని నేనే సెలెక్ట్ చేసికుంటాను. పాతిక వేల చీరకి తక్కువ రేటుకు అయితే వద్దే వద్దు. జాకెట్లు వర్క్ చేయించుకోవాలి. అన్ని చీరల జాకెట్లకీ లక్ష రూపాయలు అవుతుంది. ఇంకా పెళ్లి సమయానికి బ్యూటిషియన్ ని పెట్టించుకుంటాను. హెయిర్ డ్రెస్సింగ్, చీరలు మార్చి కట్టడానికి ఆ మూడు రోజుల పాటు వుండేలా మాట్లాడతాను..’ ఇంకా ఈ లిస్ట్ ఇలా చదువుకూనే వుంటుండగా.. ఆ తండ్రికి హార్ట్ఎటాక్ వస్తుందన్నా అనుమానం లేదు.

అసలు కొన్ని చోట్ల ఆడపిల్ల తల్లిదండ్రులే.. తగ్గేదే లేదు అనుకుంటూ.. అతిశయాలతోనూ, ఆడంబరాలతోనో, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఎవరో చేసారు మనమెందుకు చేయకూడదు అనుకుంటూ.. అతిగా ఖర్చులు చేస్తూంటారు. వీటికి అంతే లేదు.

ఇంతటితో ఆగిందా? పెళ్ళి పత్రికలలతోనే వాళ్ళ వాళ్ళ తాహతులు, పెట్టే ఖర్చులు తెలిసిపోతాయి. భారీ భారీ రిటర్న్ గిఫ్ట్‌లు ఈ శుభలేఖలు పంచేటపుడే పంచిపెట్టి తమతమ స్థోమతని తెలుపుకుంటారు. ఫోటోగ్రాఫర్ ఖర్చు తడిసి మోపెడు.. ఇంతా చేసి ఆ తర్వాత ఆ ఫోటోలు, వీడియోల జోలికి పోయి అప్పుడప్పుడు అయినా చూసేవారుండరు. పెళ్లి మండపం డెకరేషన్? ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అన్న చందాన.. లారీల లెక్కన పూవులు తెప్పించి, అలంకరణలు, భారీ సినీ సెట్టింగ్స్ లాగా సింహాసనాలు, ఆకాశం నుండి పూల ఉయ్యాలలో నుండి కిందకి దిగే వధూవరులు.. ముత్యాల పల్లకీలు, ఇంకా మొన్నీ మధ్యనే ఏదో వీడియోలో చూసాను. పెళ్లి విందు చేస్తున్న అతిథులందరికీ పెద్ద సింహాసనాలు వేసి కూర్చోపెట్టి పెద్ద బంగారు పళ్ళాలలో (నిజంవో నకిలీవో) వడ్డించడం చూసాను. సరేలెండి.. దాచుకున్న సొమ్ముల అధికంగా వుంటే ఇలాగే చేస్తారు కాబోలు.. ఎవరి అభిరుచి వారిది అనుకున్నాను.

కానీ.. చాలా చోట్ల ఇంతింత ఖర్చులు పెట్టి పెళ్ళిళ్లు చేసుకునేవారి సంఖ్య ప్రస్తుతం తగ్గుతోందేమో అనిపిస్తోంది. ఔను.. తగ్గాలి. అనవసరపు వ్యయాలు తగ్గించుకోవాలి. వివాహపు తంతు కోసం పెడుతున్న అనవసరపు, వృథా డబ్బుతో ఆ జంట భావి జీవితంలో వుండడానికి ఓ ఇల్లు వస్తుంది.. లేదా వారికి ఎందుకైనా అవసరానికి పనికొస్తుంది. లేదా ఏదైనా మంచిపనికి పనికొస్తుంది. అప్పులు చేసి మరీ గొప్పలకి పోతే తర్వాత తిప్పలు తప్పవు.

Exit mobile version