కలవల కబుర్లు-49

1
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మ[/dropcap]న జీవన పయనం నుంచి మరో సంవత్సరం గడిచి పోయింది.

నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాము. మరి గడచిన సంవత్సరం ఆరంభంలో అనుకున్న గోల్స్ ఏవైనా పూర్తి చేసామా? అసలు మొదలెట్టామా? కనీసం సగమైనా చేసామా? అనుకోవడం వరకే పరిమితం అయిపోయామా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందామా? వద్దులెండి.. అలా చూసుకుంటే.. చేయాలి అనుకుని, చేయలేక పోయినవెన్నో కనిపించి బేజారెత్తిపోతాము.

కనీసం.. ఇప్పటినుంచైనా ఒక గట్టి మాట మీద ఉందామా? కొత్త సంవత్సరం.. మరి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుందాము. తప్పనిసరిగా ఆచరిద్దాము. సరేనా?

ముందు మనం కొన్ని ఛాలెంజ్‌లని మనకి మనమే స్వీకరిద్దాము. అవి ఎవరి ఆశయాలు, ఊహలు, అవసరాలు ఇలా వాటి మీద ఆధారపడి వుంటాయి. కొందరు చదువులో మరింత ఉన్నతికి వెళ్ళాలి. మరికొందరు ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. మరికొందరు ఆర్థికంగా ఎదగాలి. లేదా స్వంత ఇంటి కల నెరవేర్చుకోవాలి. ఇంకా కొందరు, తమ తమ ఇష్టమైన కళలలో మంచి పేరు తెచ్చుకోవాలి. లేదా ఆరోగ్యం పట్ల శ్రద్ధాసక్తులు తీసుకోవాలి. వాకింగ్, యోగా వంటివాటి పట్ల ఆసక్తి పెంచుకుని, సాధించి తీరాలి.

ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఏ రంగంలో అయినా సరే మనమే ముందు వుండడానికి ప్రయత్నం చేయాలి.

ఇలా ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. తప్పనిసరిగా వాటిని రీచ్ అయితీరాలి. తీసుకున్న గోల్ మీదనే దృష్టి పెట్టుకోవాలి. అది చేరడం కోసం తగిన ప్లాన్ వేసుకోవాలి. అందుకు సమయపాలన, క్రమశిక్షణ చాలా అవసరం.

మనం అనుకున్న పనిని వాయిదా వేయవద్దు. ‘రేపటి పనిని ఈరోజే చేయాలి. ఈ రోజు పనిని ఇప్పుడే చేయాలి’ అని అనుకోవాలి. బద్ధకం అనేదాన్ని దగ్గరకి రానీయకూడదు. ఇదివరలో ఎక్కడో చదివాను. బద్ధకం, పిరికితనం, భయం వంటివి, మన శరీరంలోకి ఇంజక్ట్ చేయబడ్డ స్లో పాయిజన్ వంటివట. ఈ పాయిజన్ నెమ్మదిగా మన శరీరంలో నరనరానా పాకుతూ మనల్ని ఎలాగైతే జీవచ్ఛవంలా చేస్తాయో, ఈ బద్ధకం, భయం, పిరికితనం కూడా అలాగే ఎప్పుడైతే మనలో మొదలవుతాయో అవి కూడా అలాగే పెరిగి పెరిగి భూతంవలే మారి మనల్ని నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి వాటిని మన సమీపంలోకి కూడా రానీకూడదు. ఏ పని తలపెట్టినా ముందు బద్ధకం ఆవగించకుండా, ‘ఎంతసేపూ? ఈ పని గంటలో అయిపోదూ?’ అనుకుని ముందు మొదలెడితే, ఆ బద్ధకం అటు నుంచి అటే తోక జాడించి పారిపోతుంది.

మనకి మనం కొన్ని ధ్యేయాలని నిర్మించుకోవాలి. పూర్తి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అది చేద్దాం, ఇలా చేద్దాం, ఎలా చేయాలి? అనే ఎడతెగని ఆలోచనలలో కూరుకిపోయి కూర్చోకుండా, ముందు మొదలెడదాం. తర్వాత కొనసాగిద్దాం. ఆ తర్వాత అదే పూర్తవుతుంది. అందుకే ఫస్ట్ స్టాప్ థింకింగ్. ముందు చిన్న చిన్న వాటితో మొదలెడదాం. విజయం సాధించేవరకూ ఆపకుండా చేద్దాం. ఆ తర్వాత మన భుజం మనమే తట్టుకుని ప్రోత్సహించుకుందాం. మనం సాధించినది ఓస్ ఇంతేగా! అని మాత్రం అనుకోవద్దు. చిన్న చిన్న గెలుపులే రేపు పెద్ద గెలుపులకి దారి తీస్తాయని గుర్తుంచుకుందాము.

ముందుగా మనం తలపెట్టిన పనికోసం కొంత సమయం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ పనికి ఒక పదిరోజులు కేటాయిద్దాం. అప్పటికల్లా అయిపోయితీరాలి అనే ధృఢ నిశ్చయంతో మొదలెడదాము. అనుకున్న రీతిలో పూర్తిచేద్దాము. ఒక ప్లాన్ ప్రకారం చేసుకోగలిగితే ఏదైనా సాధ్యమే అవుతుంది.

మనం తలపెట్టిన పనులకి కొన్ని కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అవి ఏమిటో మనం గ్రహించాలి. వాటిని దూరంగా వుంచాలి. కొందరు స్నేహితులే ఈ ఆటంకాల రూపంలో మనకి ఎదురవవచ్చు. లేదా మన చుట్టూ వుండే వాతావరణం కావొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా మన ఆశయాలకి, మనం అనుకున్న ధ్యేయాలకి ఆటంకం అవ్వొచ్చు. ఈ రోజుల్లో చూస్తూనే వున్నాము.. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు. ఇరవైనాలుగు గంటలూ వాళ్ళ తలకాయలు ఆ ఫోన్ల్లలలోనే కూరుకుపోయుంటాయి. ఫేస్‌బుక్ లలో పోస్టులు పెట్టడం, ఇక ఆ క్షణం నుంచి ఎన్ని లైకులు వచ్చాయో, ఎన్ని కామెంట్స్ వచ్చాయో లెక్క పెట్టుకోవడమే సరిపోతోంది. ఇన్‌స్టాలు చూడడం, రీల్స్ చూసుకోవడంలో, గంటలు గంటలు మనకి తెలీకుండానే అవి చూడడంలో నిమగ్నమయిపోతూంటాము. వీటి వల్ల ఏదైనా ఎవరికైనా ఉపయోగం వుందా? మనం పోస్ట్ పెట్టాక రెండు రోజుల్లో ఆ పోస్ట్ ఎక్కడో వెనక్కి కిందకి కనపడకుండా పోతుంది. ఎవరూ పట్టించుకోరు. అటువంటి దానికోసం ఎందుకు వెంపర్లాడటం? ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. అలాగే వాట్స్‌అప్ లలో మెసేజ్లు.. నొక్కుకుంటూ నొక్కుకుంటూ కూర్చునే బదులు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేస్తే సరిపోతుంది కదా? మనం నిర్మించుకున్న మన ధ్యేయాలని పూర్తి చేసుకోవడానికి ఆటంకం కలిగించే వాటిలో మొబైల్ ఫోన్ మొదటి స్థానంలో వుంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు కదూ?

అందుకే ఈ కొత్త సంవత్సరములో కొన్ని మంచి పనులు మొదలెడదాము. అన్ని చెడు పనులూ ఆపేద్దాము.

ఆరోగ్యం మీద శ్రద్ధ పెడదాము. మంచి ఆహారం తీసుకుందాము. వేళకి తిందాము. మంచి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుందాము. కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిద్దాము. రోజులో ఒక పూటైనా ఇంటిల్లిపాది కూర్చుని భోజనం చేద్దాము. ఆ సమయంలో మన చేతుల్లో మొబైల్ వుండకూడదు సుమీ! మంచి పుస్తకాలు చదువుదాము. మంచి మాటలు విందాము. చెపుదాము. ఆచరిద్దాము. సరేనా?

మరి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

సర్వే జనా సుఖినోభవంతు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here