Site icon Sanchika

కలవల కబుర్లు-5

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఏ[/dropcap]వి తల్లీ? గతమున ఇత్తడి పాత్రన ఉడికిన ఉప్పుడు పిండులు?

ఏవి తల్లీ? ఆ కుంపటి సెగన మాడిన పెచ్చు ముక్కలు?

ఏవి తల్లీ? అడుగంటిన మాడు పెచ్చు కొరకు హోరాహోరీ యుద్ధాలు?

బెల్లం ముక్క, ఆవకాయ పెచ్చులతో ఉప్పుడు పిండితో పాటుగా అరిటాకుని కూడా నాక్కుంటూ తినే ఆ రోజులేవి?

ఆకాశమంతటి బెల్లపు పానకంలో మునిగి తేలే

చందమామ లాంటి దిబ్బరొట్టెని తలుచుకోవడం అత్యాశే కదూ!

అప్పడప్పుడు పండగలలో మెరిసి మురిపించే

అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు ఏవీ?

సంక్రాంతి పండుగ రోజుల్లో ఇరుగు పొరుగు అందరూ కలిసి, తలా ఒక చేయి వేసుకుని, సామూహికంగా చేసుకున్న అరిసెల కోసం, పిండి దంపుళ్ళు, జల్లెడ పట్టడాలు, యాలకుల వాసనలు ఘుమఘుమల బెల్లం పాకాలూ, కట్టెల పొయ్యిమీద సలసలకాగే నూవె, నేతి ఎసరులు.. అబ్బే.. కనిపించనే మానేసాయి.

ఎండలు మండేకాలంలో

కడుపులో చల్ల కదలకుండా

ఉండే కుండ తరవాణీ తర్వాతే కదా ఏదైనా..

ఏవి తల్లీ? ఏవి తల్లీ?

గుమ్మపాలు తెచ్చి,

పిడకదాలికపైన

అరచేతి మందాన ఎర్రని తొరక నిండుగా

చెంబుడు పాలు తాగించే అమ్మ ఏదీ?

ఉట్టి నిండుగ వెన్న పెరుగులు

పట్టి పెట్టి, అడిగినవారికి లేదనుచు

పంచిపెట్టు రోజులిప్పుడు పట్టి చూసిన

కానరావు.

‘వెన్నాచేయవే గొల్లాభామా!’ అనుకుంటూ తిప్పిన కవ్వపు చప్పుళ్ళే వినరావడం లేదే?

కుంపటి బొగ్గులు మధ్య

కుమ్మించుడికిన చిలకడదుంపల

ఉఫ్ఫూ ఉఫ్ఫూ బూడిదనూదుకుని

తిన్న రోజులేవి?

తంపటవేసిన తేగలలో చందమామని

సుతారంగా కొరికిన రోజులేవి?

కఠినమైన చెరకుగడని కూడా

కరకరా పరపరా పిప్పి చేసిన

దంతసిరి ఇపుడు సుంతైనా లేదుగా

మూడు కన్నుల లేత తాటి ముంజె కాయల

ఒడుపుగా నోటికందిన పాత రోజులేవి?

ఏవి తల్లీ? నిరుడు కురిసిన.. కాదు కాదు

అప్పడెప్పుడో చవి చూసిన

చవులూరించిన రుచులు, శుచులు?

అరాకొరా దొరికినా అరాయించుకునే రోజులా ఇవి?

కరెంటు కుక్కర్ మాటున.. గేసు పొయ్యి మీదున

హడావుడి గజిబిజి కల్తీ వంటలే..

చల్ల పెట్టె (ఫ్రిజ్)

నుంచి తీసి వేడి పెట్టె (ఓవెన్) కి ఎక్కు చద్ది శాకములే..

అజపజా లేని రుచులు లేని పచులు లేని.. పిజాలు బర్గర్లే..

నానా యాగీలతో రెండు నిమిషాల మేగీలే..

స్విగ్గీల జమాటాల పాల పడిన

పేర్లు కూడా తెలియని పదార్థములే..

అద్దాల బీరువాల వెనక రంగురంగులతో, ఆకర్షణీయంగా అమర్చేసి.. పేరేదో కూడా తెలియనికుండా రకరకాల వాటికి చూపులు అతుక్కుపోతున్నాయి. మన వెంటపడిపోతున్నాయి. తప్పడంలేదు. వినాయకుడికి ఉండ్రాళ్ళు అయినా, వరలక్ష్మి దేవికి పూర్ణాలయినా, చెక్కర పొంగలి అయినా, పులిహోర అయినా ఆర్డర్ ఇస్తే అరనిమిషంలో ముందుంటున్నాయి. అనవసర శ్రమ ఎందుకులే అనుకుని సర్దుకుపోవడమే సరిపోతోంది.

ఏం చేస్తాం.. ఇలా సర్దుకుపోతూనే.. అలా.. తీపి గతాలని తలచుకుకోవడమే తప్పదు.

Exit mobile version