Site icon Sanchika

కలవల కబుర్లు-51

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఇ[/dropcap]ష్టంతో చేసే ఏ పనైనా కష్టమనిపించదు.

అయితే దాని మీద చేయాలనే చిత్తశుద్ధి, శ్రద్ధ, ఆసక్తి వుండాలి. ఆటంకాలు ఎదురయినా.. ఆపకూడదు అనే పట్టుదల వుండాలి. ఆ నమ్మకం వున్నపుడే ఆ పనిని చేయడానికి ఆరంభం చేయాలి అంతేకానీ ఆరంభ శూరత్వం పనికి రాదు. ఎవరో ఏదో చేసారు.. నేనెందుకు చేయకూడదు అని మొదలుపెట్టడం కాదు.. నిజంగా తాను మొదలుపెట్టి పూర్తి చేయగలలనే నమ్మకం వుంటేనే మొదలుపెట్టాలి.

ఏదైనా పుస్తకం చదవాలి అనుకున్నపుడు.. ఒకరోజులోనే పూర్తి చేయలేకపోయినా రోజుకి కాస్త కాస్త చదివి పూర్తి చేయగలగాలి. అలాగే ఏదైనా కూడా అంచెలంచెలుగా అయినా కూడా చేసుకుంటూ పూర్తి చేయగలిగామనే తృప్తిని పొందాలి.

కొందరు ఒకేసారి తలకి మించిన పనులు తలపెట్టుకుంటారు. సమయానికి అనుకున్నది అనుకున్నట్లు అవక, విపరీతంగా ఒత్తిడికి లోనవుతారు. బాబోయ్! పనెక్కువ అయిపోయింది.. ఒకటే టెన్షనుగా వుందంటారు. దాంతో మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఇబ్బందులకు గురవుతారు. నిజానికి అది ఆ పని వల్ల వచ్చింది కాదు. వారు దానిని ఒక ప్రణాళిక మేర అనుకువి, మొదలెట్టి, కొనసాగించలేకపోవడం మూలాన వచ్చిన ఆదుర్దా అది.

ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. ఏదో పండుగ వస్తోంది, ఇల్లు సర్దుకోవాలని తలపెడతారు. అయితే నెమ్మదిగా ఒకొక్క అలమారా లోని సామాను, ఒకొక్క గదిలోని సామాను తీసి, దుమ్ములు దులిపి, తుడిచి.. మళ్లీ ఎక్కడివక్కడ సర్దుకుని ఆ తర్వాత మరో గది శుభ్రపరుచుకుంటే అనువుగా, వీలుగా వుంటుంది. ఏ టెన్షన్ వుండదు. అలా కాకుండా.. ఇంట్లో సామానంతా కుప్పలా పోసుకుని.. ఏది ముందు సర్దాలో తెలియక సతమతమయిపోతూ గాభరా పడిపోతూంటే పని ముందుకి ఎలా సాగుతుంది? ఒత్తిడి రాక ఏమవుతుంది?

అందుకే చిన్న పనైనా, పెద్ద పనైనా ప్రణాళిక ప్రకారం చేసుకుంటే ఇబ్బంది వుండదు.

విద్యార్థులు విషయం తీసుకుంటే.. సంవత్సరం మొత్తం ఆషామాషీగా గడిపేస్తారు. తీరా పరీక్షల ముందు కొండలా పెరిగిపోయివున్న కోర్సులని, పాఠాలని చూసి బుర్ర వేడెక్కించేసుకుంటారు. ఎంత చదివినా తరగదు అది. ఫలితం అనుకున్నట్లు రాదని, తల్లితండ్రులు చెవిలో రొద పెడుతూ వుంటే.. అప్పుడు ఆ పిల్లల మానసిక స్థితి వర్ణనాతీతం. కొందరైతే ఒత్తిడికి తట్టుకోలేక మానసికంగా బలహీనులై.. ఆత్మహత్యలకు కూడా తలపోస్తున్నారు. మొదటిరోజు నుండే ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయంలో చదువుతూ వుండడం అలవాటు చేసుకుని, ఒక ప్రణాళిక ప్రకారం.. ఇష్టంగా చదవడం మొదలెడితే.. అనుకున్న ఫలితం రాకపోదు. ఆ విద్యార్థుల్లో కూడా క్రమశిక్షణ అనేది అలవడుతుంది.

ఏదేమైనా మన శక్తి సామర్థ్యాలు చూసుకునే ఏ పనైనా మొదలెట్టాలి.

మరి కొందరు మొహమాటాలకి పోయి, ఎదుటివారు ఏ పని అప్పచెప్పినా సరే అంటూంటారు. అటువంటప్పుడు ఒకవేళ చేయలేకపోతే అది మరింత ఇబ్బంది అవుతుంది. వారికి చెప్పిన టైముకి ఇవ్వలేకపోతే.. మాట పడవలసి వస్తుంది.

అందుకే ముందే నిర్మొహమాటంగా నేను చేయను. నాకు తగిన సమయం లేదు. మరోలా అనుకోకండి. వేరే ఎవరితోనైనా చేయించుకోండి అని చెప్పేస్తే చాలా మంచిది. మన మొహమాటాలని, కాదు, చేయలేము అని చెప్పలేని మన మనస్తత్వాలని వారు బాగానే వాడుకుంటారు. అలాంటి వారికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మన పనుల ఒత్తిడి తోనే మనం సతమతమవుతూంటే.. ఇలా ఇతరులు అప్పచెప్పినవి కూడా మనం తలమీద వేసుకుంటే.. సమయానికి పూర్తి చేయలేక బిపీలూ, సుగర్లూ మాత్రం మనం తెచ్చుకోవడం ఖాయం.

మనకి తగిన ఖాళీ సమయం వుంటే.. వారడిగిన సహాయమో, ఆ పనో చేయవచ్చు. లేని సమయాన్ని మనం మాత్రం ఎక్కడ నుంచి తీసుకురాగలము. అన్నిటికన్నా విలువైనది కాలమే కదా! మరి ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. గడియారాన్ని వెనక్కి తిప్పలేము కదా!

సాధించాలి అనే తపన వుంటే.. ఎంతటి కష్టతరమైనా సాధించి తీరుతాము. కష్టే ఫలీ! అన్నారు పెద్దలు. కష్టపడి, సాధించిన ఫలితాన్ని చూసుకుంటే కలిగే మానసిక సంతృప్తిని మించిన ఐశ్వర్యం వేరే వుండదు. అది ఏదైనా కావొచ్చు. చేసే వృత్తిలో ఉన్నతి స్ధానం పొందడానికి కావొచ్చు, విద్యార్థులు చదువులలో కావొచ్చు, ఆటలు, పాటలు పోటీలలో కావొచ్చు, లేదా పెరుగుతున్న శరీరపు బరువుని తగ్గించుకుందుకు చేస్తున్న ప్రయత్నాలు కావొచ్చు.. ఏదైనా సరే సాధించి తీరాలి.. తీరుతాను అనే ధృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. విజయం తప్పక వరిస్తాము. వెనకంజ వేయడమో, మధ్యలో ఆగిపోవడమో చేయకూడదు. మన ప్రయత్నాలకి ఆటంకం కలిగించేలా వుండేవారు మన చుట్టూ వుంటారు. అటువంటి వారి ఎవరి మాటలూ.. ఎవరి సలహాలు మన చెవిన వేసుకోవలసిన అవసరం మనకి వుండకూడదు. అసలు అటువంటి వారిని మనకి దూరంగా వుంచాలి. మనం ముందుకు ఒక అడుగు వేస్తే.. నెగెటివ్ మాటలతోనో, నిరాశ పెంచేలా మనల్ని నిరుత్సాహపరుస్తూ పదడుగులు వెనక్కి లాగే పదిమందీ మన చుట్టూ వుంటారు. వారందరినీ మనం పట్టించుకోకూడదు. వారి మాటలన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ.. అనుకున్న గమ్యం చేరుకుని ..అలా వెనక్కి లాగిన వారి చేతనే శభాష్ అనిపించుకోవాలి.

మనల్ని మోటివేటివ్ చేస్తూ.. మనలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు దారి చూపే వారు ఒకరిద్దరున్నా చాలు.. ఆ స్ఫూర్తితో ముందుకు సాగగలము. అనుకున్నది నెరవేర్చగలము. ఇష్టంగా మొదలెట్టినదేనినైనా కష్టంగా వున్నాకూడా.. పూర్తి చేసి తీరుతాము.

Exit mobile version