కలవల కబుర్లు-8

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]హ[/dropcap]లో.. గుడ్ మార్నింగ్ అండీ!

అలో అలో అలో..

నమస్తే అండీ..

ఎలా ఉన్నారు?

ఏ భాషలో అయినా కామన్‌గా వుండే పలకరింపు పదం ‘హలో’.

పరిచయం తెలియనివారిని కూడా తెలిపేలా చేసే పదం ‘హలో’ పదమే..

“హలో.. కొంచెం ముందుకు వెడతారా?”

“హలో.. కాఫీ ప్లీజ్”

“హలో.. ఈ వారం సంచికలో ‘కలవల కబుర్లు’ చదివారా?”

ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే వుంటాయి.

అసలు ‘హలో’ బదులుగా.. రెండుచేతులూ జోడించి నమస్కారము చెపుతూ పలకరించడం మన సంస్కారమనుకోండి. అలా చెపితే మర్యాదగా, మన్ననగా వుంటుంది.

కానీ.. ఈ ‘హలో’ ఒకటి బాగా మనందరికీ అలవాటై పోయింది.

బాపు గారి సిన్మాలో రావుగోపాలరావు గారి డయిలాగ్‌తో ఈ ‘అలో.. అలో..’ మరీ పాపులర్ డైలాగయిపోయింది.

ఫోన్ ఎత్తగానే ముందుగా వచ్చే మాట ఈ ‘హలో’ యే కదా!

ఆ ఫోను కనుక్కున్న పెద్దమనిషి గ్రాహం బెల్, తన భార్య పేరు ‘మార్గరెట్ హలో’ అట, ఆయన, ఆవిడని ముద్దుగా ‘హలో’ అని పిలుచుకుంటాడట. ఈయన ఫోను కనిపెట్టీపెట్టగానే.. మొట్టమొదటి కాల్.. ఆవిడకి చేసి.. ‘హలో’ అని పిలిచాడట. అంతే ఇక.. ఇక అప్పటినుండి.. ఎవరు ఎవరికి ఫోను చేసినా.. అదే మాట పరిపాటై పోయిందనీ.. ఎక్కడో చదివిన గుర్తు. అందుకే ఇప్పుడు కూడా మనం ఫోన్ తియ్యగానే అటునించో ‘హలో’ .. ఇటునించో ‘హలో’ అనే మాట వస్తుంది.

ఈ ‘హలో’ లలో రకరకాల ‘హలోలు’ వున్నాయి

1.పలకరింపు హలో..

ఇదేంటంటే..

‘హలో’ మాటకొస్తే.. పరిచయస్తులు కనపడగానే చిన్న పలకరింపు మాట ‘హలో’ అనడం కొనసాగుతూంటుంది. లేదంటే చిన్న చిరునవ్వుతో కూడిన ‘హలో’ కూడా పలకరింపు కింద వస్తుంది.

నాకు మోర్నింగ్ వాకింగ్‌లో ఒకాయన రోజూ ఎదురుపడతారు. ఆయనెవరో పరిచయమే లేదు.. దారిలో అందరినీ ‘గుడ్ మార్నింగ్’ అనో.. ‘హలో’ అనో.. ‘నమస్తే’ అంటూనో పలకరిస్తారు. అదొక మంచి అలవాటు. మనకి తెలిసినవారినే కాదు.. తెలీని వారికి కూడా విష్ చేయడం కొందరికి అలవాటు. అలా ఆయన చేసిన అలవాటుతో నేను కూడా ఆయన కనపడగానే ఓ ‘హలో’ ఇచ్చేస్తూ వుంటాను. ఎదురింటావిడా, నేనూ పొద్దున్నే ఇంచుమించుగా ఒకేసారి, పాలు, పేపర్ల కోసం.. వీధి గుమ్మం తలుపు తీస్తూంటాము. ఎదురు పడగానే.. అంత పొద్దున్నే పోసుకోలు కబుర్లు కాకుండా.. ఓ ‘హలో’ ఇచ్చేసుకుని దైనందిన జీవితంలోకి వెడుతూంటాము. ఆ తర్వాత పనులయాక.. ఇద్దరం సమావేశమయి.. ఈ హలోకి కంటిన్యూగా.. చాలా హలోలే వెడతాయనుకోండి. అది వేరే సంగతి.

2.తప్పించుకునే హలో..

దీంట్లో.. కొందరు ఉంటారు.. పరిచయస్థులు అల్లంత దూరాన కనపడగానే ఎక్కడ పలకరించాలో అని ఇక్కడ మొఖం చాటేస్తారు.. వాళ్ళ సొమ్మేమీ పోదు కదా కాస్త పలకరిస్తే.. ఏంటో ఈ మనుషులు.. పలుకే బంగారం అనుకుంటారు కాబోలు. తప్పించుకునే పరిస్థితి లేక ఎదురు పడ్డప్పుడు, ఆముదం తాగిన ముఖం పెట్టి.. మొక్కుబడిగా, ‘హలో’ చెప్పేసి ఇక తప్పించేసుకుంటారు. అయినా, పాపం.. వాళ్ళ తిప్పలు వాళ్ళవనుకోండి. ఎప్పుడో అప్పు తీసుకున్న పాపానికి, ఇప్పుడు హలో చెపితే.. ఎక్కడ తిరిగి ఇమ్మంటారో అని తప్పించుకోవచ్చు. లేదా ‘హలో’ చెప్పిన పాపానికి , తిరిగి హలో చెప్పడమే కాకుండా.. నడిరోడ్డు మీద నాలుగు గంటలు జిడ్డుగా పట్టుకుంటామేమోనని తప్పించుకోవచ్చు. లేదంటే మన మీద వారి మనసులో మరేదైనా వుండవచ్చు. చెప్పుకుంటూ పోతే.. కర్ణుడి చావుకు బోలెడు కారణాల లాగా.. ఇలా తప్పించుకునే హలోలు బోలెడు.

3.జర్నీలలో హలోలు..

ప్రయాణాల్లో కూడా తోటి ప్రయాణీకులతో, ‘హలో.. కాస్త జరుగుతారా?’, ‘ఏదీ మీ పేపర్ ఒకసారి ఇవ్వండి.’ ‘మీరెక్కడి దాకా ప్రయాణం?’ ఇలా మాటలు కలురుతారు కదా! ఆ తర్వాత చిన్నగా.. ‘హలో! గురువుగారూ! మీరేం అనుకోకపోతే ఈ లోయరు బెర్త్ నాకు త్యాగం చేయకూడదూ? మోకాళ్ళ నొప్పులు సలిపేస్తున్నాయి’ అంటూ బాధగా మోకాలు పట్టుకుని పిసికేసికుంటూంటే.. అప్పటికే కాస్త ముందుకు సాగిన మన రైలు హలో స్నేహంతో.. మన మెదడు మోకాలిలోకి జారి, అసంకల్పితంగా, “అయ్యో! ఔనా! అలాగే తీసుకోండి. నేను పై బెర్త్‌కి ఎక్కుతానులెండి” మాటి మాటికి వాష్ రూమ్‌కి వెళ్ళాలికదా! అనే ఆలోచన మర్చిపోయి, పైకి ఎక్కేసి.. జర్నీ హలోల మత్తులో పడిపోతూంటాము. తర్వాత మన చావు మనదనుకోండి. ఈ చిన్న పలకరింపులే తర్వాత  అడ్రసులు, ఫోను నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగి స్నేహాలు కొనసాగుతూంటాయి. కానీ.. చాలా వరకూ రైలు దిగగానే మర్చిపోయే స్నేహాలే ఎక్కువ అనుకోకండి.

4.గుర్తు రాని హలోలు..

కొందరు మనం కనపడగానే, ఎప్పుడో ఏదో పెళ్ళో పేరంటాలలోనో ఒకేసారి కలుసుకున్నప్పటికీ గుర్తు పెట్టుకుని చక్కగా పలకరిస్తారు. కానీ మన మతిమరపు బుర్రకి వాళ్ళెవరో సరిగ్గా గుర్తు రారు. అప్పుడు ఉంటుంది చూడండి మన పరిస్థితి.. ‘మీరు ఎవరండీ’ అని తిరిగి అడిగితే ఏమనుకుంటారో అనే మొహమాటంతో ‘హలో’ అంటాం కానీ.. తర్వాత జుట్టు పీక్కుంటాం.

5.అవసరార్థ హలోలు..

ప్రస్తుతం ఇవే ఎక్కువగా చలామణీ అవుతున్నాయి. కొందరు ఉంటారు.. వాళ్ళ పలకరింపులు వారి అవసరాల వరకే.. అవి తీరగానే ఎవరికివారే యమునా తీరే అన్న చందాన ఉంటారు. తర్వాత ఎక్కడ కనపడ్డా ఎవరో తెలీనట్టు ఉంటారు. మళ్లీ అవసరం వచ్చిందనుకోండి.. హలో హలో అంటూ వచ్చేస్తారు ఈ అవకాశవాదులు.

6. సోషల్ మీడియా హలోలు..

ఇక ప్రతిరోజూ వాట్స్ఆప్ లలోనూ.. ఫేస్‌బుక్ శుభోదయపు హలోల పలకరింపులకి, అంతే లేదనుకోండి. ‘హలో’, ‘హి’, ‘హాయ్’, ‘హు’, ‘హాహా’ ఇలా ‘హ’ గుణింతం.. గునగునా దొర్లుతూ వుంటుంది. ఒకరి నుంచి మరొకరికి తోపుడులు.. అదే ఫార్వర్డ్ హలోలు ఎక్కువగా వుంటూంటాయి. రోజూ ఈ గోలేంటని విసుక్కుంటాం అనుకోండి.

వీటి మీదే ఈమధ్య ఒక కథ ఏదో చదివాను. ఒకాయన ప్రతిరోజూ అందరికీ శుభోదయం అంటూ వాట్స్ఆప్ లలో పెడుతూ ఉంటాడు. అందరూ రోజు ఇదేం గోల అనుకుంటూ ఎవరూ కూడా తిరిగి సమాధానం ఇవ్వరు. తిరిగి జవాబు కోసం కూడా ఎదురుచూడని ఆయన క్రమం తప్పకుండా పెడుతూనే ఉంటాడు. సడన్‌గా ఆయన దగ్గర నుంచి అందరికీ ఈ శుభోదయాలు ఆగిపోయయి. ఏంటో వెలితిగా అనిపించి ఏంటా అని ఆరా తీస్తే.. ఆయన చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు అందరూ అనుకున్నారు.. ఎంతో అభిమానంతో ప్రేమతో ఆయన మనకి గుడ్ మార్నింగ్ అంటోంటే తిరిగి జవాబు ఇవ్వలేకపోయాము.. ఇప్పుడు మనకి మంచి రోజు అని గుర్తు చేసేదెవరు? అనుకుని బాధ పడ్డారు.

ఇలా వాట్స్ఆప్లో పలకరించడమే కాదు.. ఇంట్లో కూడా మనవారిని, మన కుటుంబ సభ్యులకు ఉదయం లేవగానే చిన్న చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అనో.. శుభోదయం అనో.. హలో అనో పలకరిస్తోంటే ఆ ఇంట ప్రతిరోజూ ఒక ఆనందపు రోజే.

ఇలా చెప్పుకుంటూ పోతే.. హలోలే హలోలు..

హలో! అదండీ సంగతి.. మరి మీరు కూడా ఓసారి పలకరించేసి.. హలో చెప్పండి.

ఈ హలో కబుర్లు చెపుతున్నది.. కలవల గిరిజా రాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here