కలవల కబుర్లు-9

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]వ[/dropcap]చ్చేసింది.. వచ్చేసింది..

హుష్షురష్షునిపించే ఎండాకాలం.. మండేకాలం.. వచ్చేసింది. ఉదయం నుండే ఏసీలూ.. కూలర్లూ.. బయ్యిబయ్యిమని తిరిగేస్తూ వుంటాయి. ఫంక్షన్ హాళ్ళూ.. షాపింగ్ మాల్సూ.. అన్నీ ఏసీలే.. ప్రయాణాలు కూడా ఏసీ బళ్ళలోనే.. ఏంటో, అవి లేందే వుండలేని పరిస్థితి ఇప్పుడు.. వీపున కట్టుకునే ఏసీ మిషన్లు కూడా వచ్చేస్తాయేమో త్వరలో.

అలా ఓ ముఫ్ఫై, నలభై, ఏభై ఏళ్ల వెనక్కి ఓసారి వెళ్ళొద్దాం. ఇప్పుడు మనం అలవాటు పడిపోయిన ఈ సౌకర్యాలన్నీ అప్పుడేవీ? అయినా శుభ్రంగా బానే వున్నాము. చాలా హాయిగా కూడా వున్నాము. ఒకానొకచోట కనీసం ఫాన్లు కూడా వుండేవి కావు. అయినా హాయిగా వుండేవాళ్ళం.

ఓ సారి గుర్తు చేసుకోండి ఆ రోజులు. పెరట్లో ఏ వేప చెట్టు కిందో.. కొబ్బరి చెట్టు కిందో.. ఏ నులక మంచమో.. లేకపోతే మడతమంచమో వాల్చుకుని నడుం వాల్చిన రోజులు ఎంత బావుండేవో!! ఇప్పుడు ఆ ఏసీలు వేసుకుని, తలుపులు బిడాయించుకుని, బయట ఎవడు కాలింగ్ బెల్ కొడుతున్నాడో వినపడక.. ఏసీ చల్లదనానికీ వణికి… ఆనక వచ్చే కరెంటు బిల్లుకీ కూడా వణికే రోజులు ఇవి.

ఇహ.. సాయంత్రం అయేసరికి వాకిట్లో చల్లటి నీళ్లు వత్తుగా చల్లి.. పెద్దవారందరికీ వరుసగా నవారు మంచాలు, మడతమంచాలు, కిందన పరుపులు, పాతచీరలతో కుట్టిన మెత్తని బొంతలని పిల్లలు, ఆడవాళ్లు.. వేసుకుని.. గూట్లో దీపం.. నోట్లో ముద్ద.. గబగబా భోజనాలు ముగించేసి.. ఈ పక్కల మీదకి చేరేవారు. పిల్లలంతా, ఏ బామ్మగారి చుట్టూనో చేరి, ఆవిడ చెప్పే కధలు వింటూనో.. లేదా పైన కనపడే ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ.. వాటిని తలా కాసిని వాటాలు వేసుకుంటూనే.. పక్కన చెట్ల నుంచి వీచే చిరుగాలికి నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవారు.

పెద్దలకైతే తమ లోకాభిరామాయణాలు తమకి వుండనే వుంటాయి. మంచాల కింద మట్టి కూజాలలో నీళ్లు నింపుకుని.. మధ్య మధ్యలో గాలి స్తంభిస్తే తమకి, పిల్లలకి విసరడానికి తాటాకు విసనకర్రలు కూడా పక్కనే పెట్టుకునేవారు. ఎక్కడా దోమలు అనే మాటే లేదు. ఎంత బావుండేవి ఆ రోజులు.

ఎప్పుడైనా ఈ ఎండాకాలం రాత్రుళ్లు ముసురు పట్టి.. చిన్న జల్లు పడ్డాకూడా లేవడానికి బద్ధకం.. ఆ.. ఇదేం వానా? మనల్ని లేపడానికే వచ్చింది.. మనం లోపలకి వెళ్ళగానే తగ్గిపోతుంది.. ఈ చినుకులని లెక్క చేయకూడదనుకుంటూ.. దుప్పటిని నిండా ముసుగేసుకున్నా కూడా.. ఆ వాన అంతకన్నా మొండిది. మనం లేచేదాకా సూదుల్లాంటి చినుకులతో పొడిచి, పొడిచి, ఇంట్లోకి తరిమేది. కాస్త తెరిపివ్వగానే, మనమూ, మన బొంతా తిరిగి తయారయే వాళ్ళం బయటకి రావడానికి. ఆ మట్టివాసన ఎంత బావుండేదో! ఆ వాసన అనుభూతి చెందుతూ, మళ్లీ గాఢనిద్ర లోకి జారుకునేవాళ్ళం.

ఇంతలోనే తెల్లారిందోయ్!! లేవండోయ్!! అంటూ.. సూరిబాబు గారి సూది చురుకులూ, కొక్కొరోకో అంటూ కోడిగారి కూతలూ, పేడనీళ్ళ కళ్ళాపి వాసనలూ.. చుయ్ చుయ్ అంటూ పాలపొదుగుల నుంచి పాలు పిండేటప్పుడు వచ్చే శబ్దాలూ.. వీటన్నితో పాటు.. లేవరా వెధవాయ్!! అనే పెద్దల అష్టోత్తరాలతో.. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచే ఉదయాలూ…

బావి దగ్గర తాటాకు చేదలతో నీళ్ళు తోడుకొని చేసే స్నానాలూ లేవు.. జట్లు జట్లుగా ఊరి బయట చెరువులోనో, కాలువల్లో కొట్టే ఈతలూ లేవు.

అబ్బే!! ఇప్పుడెక్కడా లేవు. కాగడా వేసి వెతికినా.. అంజనం వేసి చూసినా కానరావు.

వేసవి సెలవలంటే పిల్లలకి ఆటవిడుపులే. ఆఖరుగా ఎండాకాలం పరీక్షల ముందు ఓ నెల్లాళ్ళు ఒంటి పూట బడులు పెట్టేవారు. ఇంట్లో చల్లపాటున ఉంటారని మధ్యాహ్నమే లాంగు బెల్లు కొట్టి పంపిస్తే.. తిన్నగా కొంపకి చేరతారా, ఈ కోతిమూక? చెట్లమ్మటా, పుట్లమ్మటా మిట్ట మధ్యాహ్నాలు ఆటలు, గెంతులూ, గోళీ ఆటలూ, వీటితో తిరిగి తిరిగి ఎప్పుడో చేరడం. వడదెబ్బలతో డస్సి పోవడం ఇదే తంతు.

పరీక్షలు అయి సెలవలు ఇవ్వగానే.. జైలు నుంచి విడుదల అయిన ఖైదీలలాగా ఎంతో స్వేచ్ఛని ఫీలయేవారు. ఇక అమ్మమ్మ, మేనమామల, పెదనాన్నల ఇళ్ళకి సమ్మర్ కేంపులు. రెండునెలల పాటు చదువు, బడులు సంగతే మర్చిపోయి గెంతులే గెంతులు.

ఇప్పుడు ఆ ఆనందాలూ , కేరింతలూ పిల్లల్లో కాగడా వేసినా కనపడ్డం లేదు. చదువులు, రేంకుల పరుగు పందాలలో వేసవి సెలవల అనుభూతులే కరవయిపోతున్నాయి. చుట్టాలు, బంధువుల ఇళ్ళకి వెళ్ళడం మాట అటుంచి.. బంధాలు, అనుబంధాలకే దూరం అయిపోతున్నారు.

ఏవీ? ఇప్పుడేవీ? ఆ అనుభూతులూ, అనుభవాలూ. అర్ధరాత్రి దాకా, టీవీలూ, ఫోన్లూ, ఛాటింగలూ కదా! ఏసీ లతో బంధించిన గదులు లోపలిగాలి బయటకిపోక.. బయటగాలి లోపలకి రాక.. మట్టివాసన స్థానే.. రూమ్ స్ప్రే లు కొట్టుకుంటూ.. ఏదో బతికేస్తున్నాం హుష్షురష్షు అనుకుంటూ.. ఇలా అందమైన, గతాలను తలుచుకుంటూ.. ఎండాకాలాలు గడిపేయడమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here