Site icon Sanchika

కాలయంత్రం – కథల తంత్రం – ఒక విశ్లేషణ – 5

[dropcap]1[/dropcap]952 తరువాత చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసిన వారి జాబితాలో డాక్టర్ జూకూరి నాగ నరసింహరాజు (కశ్యప యోధుడు) చేరతారు. ఈ సమాచారాన్ని అందించినవారు కేపీ అశోక్ కుమార్.

***

కాలయంత్రం కథల సంకలనంలో మిగిలిన ఏడు కథల్లో కూడా మిగతా కథల్లో ఉన్నటువంటి లోపాలే కనిపిస్తాయి. వీటిల్లో, ఝాన్సీ పాపుదేశి రచించిన కథ ‘ఏకపర్ణిక’, ఈ సంకలనంలో చరిత్రనూ కాల్పనిక కథనూ ముడివేసి చరిత్ర ఆథారిత కాల్పనిక కథను సృజించాలని ప్రయత్నించిన కథ. అయితే ఇతర కథలను పట్టి పీడించిన లోపాలు ఈ కథలోనూ ఉండటంతో కథ దెబ్బతిన్నది. ఏకపర్ణిక పాత్ర ఈ సంకలనంలోని అన్ని కథలలోని అన్ని పాత్రలతో పోలిస్తే కొద్దిసేపైనా గుర్తుండే పాత్ర. దానికి కారణం రచయిత్రి ఆ పాత్రను సున్నితంగా, మృదువుగా వర్ణించిన తీరు.

‘అడవి మల్లెలంత స్వచ్ఛంగా, అందంగా ఉంటుందామె. దానికి తగినట్టే ఆమె రూపురేఖలు కూడా ఆ ప్రాంతపు ప్రజలకి భిన్నంగా ఉంటాయి’ అంటూ ఆమె పాత్రకు  ఒక రూపు, రేఖ, వ్యక్తిత్వం ఇవ్వాలన్న ప్రయత్నం ఈ కథలో కనిపిస్తుంది. చరిత్ర నేపథ్యంగా కల్పిత ప్రేమకథను సృజించటం కనిపిస్తుందీ కథలో. ఇది అభినందనీయమైన విషయం. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలలో ‘ప్రేమ’ అన్నది అత్యంత ఆకర్షణీయమైన అంశం. విశ్వనాథ ‘ఏకవీర’ ను మించిన ప్రేమగాథ మరొకటి లేదు. ఎవరెన్ని ప్రేమకథలు రాసినా ‘ఏకవీర’ పరిధిలోనే పరిభ్రమించాలి తప్ప దాన్ని దాటిపోలేవు. అలాగే అడవి బాపిరాజు చారిత్రక నవలలన్నీ ప్రేమకథలే. ముదిగొండ శివప్రసాద్ రచించిన పేరుపొందిన చారిత్రక రచనలూ ప్రేమగాథలే. ఇది కేవలం చరిత్ర ఆధారిత కాల్పనిక రచనల్లోనే కాదు, ఏ ప్రక్రియలోనైనా పాఠకులలో ఉత్సుకత కలిగించి, ఆకర్షించేందుకు ‘ప్రేమగాథ’ చక్కటి సాధనం. ప్రేమకథ  అల్లి దానికి చారిత్రక నేపథ్యం కల్పిస్తే వీరి ప్రేమపై చరిత్రలో జరిగిన సంఘటనల ప్రభావం ఉన్నట్టు చూపిస్తే ఆ రచన సగం ‘సూపర్‍హిట్’ అయినట్టే. మిగతా సగం కథను నడిపిన విధానం, పాత్రలను తీర్చిదిద్దిన విధానం, చరిత్రను కథలో లాజికల్‍గా భాగం చేసిన ఒడుపు, పాఠకుడు ప్రేమగాథలో లీనమవుతూ, చరిత్ర సంఘటనల ప్రభావం వారి ప్రేమను ఎలా రూపాంతరం చెందిస్తుందోనని ఆలోచించేట్టు చేయగలగటంపై ఆధారపడి ఉంటుంది. కథాంశం ఎంచుకోవటంలో విజయం సాధించిన ఈ కథ రెండవ విషయం, ఆ కథను చరిత్రతో లాజికల్‌గా ముడివేసి ఆసక్తి కరమైన కథగా మలచటంలో  దెబ్బతిన్నది.

ఆకులో భవిష్యత్తు కనబడటం అంతగా నప్పని అంశం. కథానాయకకు  ‘ఏకపర్ణిక’ అని పేరు పెట్టినందుకు, ఆమెకు భవిష్యత్తు ఆకుల్లో కనబడినట్టు రాశారో, లేక ఆకుల్లో భవిష్యత్తు చూపేందుకు ‘ఏకపర్ణిక’ ఆన్న పేరు పెట్టారో కానీ నాయిక పేరు బాగుంది, కథలో మాత్రం ఆకులో భవిష్యత్తు కనబడటం నప్పలేదు. ముఖ్యంగా వాస్తవ చారిత్రక రచనలు లేని లోటు పూరించేందుకు రచించిన కథలివి అనటంతో ఏరకంగానూ వాస్తవం కాలేని ఈ అంశం కథపట్ల వ్యతిరేక భావనను కలిగిస్తుంది.  అయితే అందమైన ప్రేమకథగా ఎదగాల్సిన కథ ఆమె ప్రియుడు మాధవుడి పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోవటం, వారి నడుమ అనుబంధం ఆత్మకు అని చిత్రించినా భౌతికానికే ప్రాధాన్యం ఇవ్వటంతో కథ తేలిపోయింది. వారి ప్రేమ తీవ్రత, సాంద్రతలను సంఘటనల ద్వారానో, సంభాషణల ద్వారానో నిరూపించే బదులు, వారి నడుమ సంభాషణలు అర్థరహితంగా, తేలికగా ఉండి ఏదో తొందరలో ఉన్నట్టు ముందుకు సాగటంతో ప్రేమ అనుభూతి కానీ, ప్రేమికులపై సానుభూతి కానీ కలిగే వీలు లేకుండా పోయింది.

‘ఇంత చిన్న కోరిక తీర్చలేని నా ప్రేమెందుకు? నువ్వు ఇక నా దానివి. నిన్ను వివాహం చేసుకుంటాను. అందుకు అందరినీ ఒప్పిస్తాను. నాకు కొంత సమయమివ్వు’ చిన్నగా నవ్వి ఏకపర్ణిక చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు.

అది మొదలు మాధవుడూ, ఏకపర్ణిక ప్రేమలో ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. పంపా నదీ ఒడ్డున శృంగారంలో మునిగి తేలుతున్నారు’ (పేజి నెం. 125)

ఇక్కడే వారి ప్రేమ హాస్యాస్పదమవటం ప్రారంభమవుతుంది. ప్రేమగాథలో ప్రేమ లభించటం, అది ఫలమంతమవటం ఎంత కష్టమైతే, అంతగా పండుతుంది. అది ఎంత సులభంగా లభిస్తే అంతగా దానిపై ఆకర్షణ తగ్గుతుంది. ఈ కథను నేపథ్యంలో జరుగుతున్న చరిత్రతో అనుసంధానించి ఒక దృశ్యం అటూ, ఒక దృశ్యం ఇటూగా చెప్పివుంటే, కథలో ఉత్సుకత పెరిగేది. ఈ అమాయకమైన ప్రేమపై వారిచుట్టూ అలముకుంటున్న యుద్ధ వాతావరణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న గుబులు కలిగేది. ఇందుకు భిన్నంగా కథ చివరివరకూ చరిత్రకూ కథకూ సంబంధంలేకుండా కథ సాగుతుంది. ఆ ప్రేమకూడా ఉద్విగ్నత  అన్నది లేకుండా సాగటంతో ఆసక్తి సగంలోనే పోతుంది.

కథలో చరిత్ర అంతర్భాగం చేయటంలో విఫలమవటంతో కథ రెండు మూడు వేర్వేరు భాగాలుగా అనిపిస్తుంది. నాయికా, నాయకుల అనుబంధాన్ని చిత్రించటంలో విఫలమయినట్టే, నాయిక, ఆమెకు పెంచిన సిద్ధుడి పాత్రల నడుమ అనుబంధాన్ని తేల్చివేయటం, సిద్ధుడు ఆమె చెప్పే భవిష్యత్తు కోసమే ఆమెను భరిస్తున్నట్టు చూపటం కూడా కథలో ఉద్విగ్నత అన్నది లేకుండా చేసింది.

‘ఆమె అలంకరణలను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సిద్ధుడు. నాయకుని దళపతితో ఆమె సాగిస్తున్న సరససల్లాపాలు అతడికి తెలుసు. ఆమె స్వైరిణి, పెళ్ళీ పెటాకులు లేని జోగిని. మనసైన మగాడితో తిరిగే స్వేచ్ఛ ఆమెకుంది. అందుకే ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు’. (పేజి 126)

దీంతో కథలో తరువాత ఆమె చెప్పే భవిష్యత్తు ఆధారంగా వ్యాపారం చేయాలని సిద్ధుడు భావించటం, ఆమె పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఆందోళన చెందటం వంటివి అర్థం లేనిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇలా ప్రేమించి, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడెలా? ఆమె ద్వారా భవిష్యత్తు చెప్పి ధనం సంపాదించటం ఎలా? ఆమెను పర పురుషులతో స్వేచ్ఛగా తిరగనివ్వటం, ఆమె స్వైరిణి అని వదిలేయటం ఆపై వ్రతాలు, భూత బలులూ అని డబ్బు గుంజటం అన్వయం కుదరని అంశాలు.  పైగా అనుబంధంలేని పెంపకం కథను అర్ధరహితం చేసిన అంశం.  ఇది కూడా కథ అల్లటంలో అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది. మళ్ళీ ‘అయినా ఇన్నాళ్ళూ ఆమెనొక అవసరానికి పనికివచ్చే వస్తువుగానే చూశాడు. ఇప్పుడు ఏ మూలలోనో అతడిలో దాగిన వాత్సల్యం పెల్లుబికింది’ (పేజి 131) అనటం పొసగని విషయాలు. అందుకే తరువాత జరిగే విషయాలకు ఎలాంటి స్పందన కలగదు. ఆ తరువాత సిద్ధుడి పాత్ర అటూ ఇటూ కాకుండా ఎదిగింది. దాంతో చివరలో అతడిని చిత్రహింసలు చేసి చంపినప్పుడు ఎలాంటి భావన కలగదు.  కథ  అనుభవించినట్టు ఉండకపోవటం కూడా కథలో తీవ్రతను ఎదగనివ్వని అంశం.  పైగా కథ హఠాత్తుగా రాజులవైపు, యుద్ధం వంటి విషయాల వైపు మళ్ళుతుంది. ఇంతకీ యుద్ధంలో మాధవుడు ఏం చేశాడు? అన్న విషయం కథలో లేదు. ఒక చక్కని ఆలోచన, కాస్త సాధన చేసి ఉంటే, కొన్ని పాత చరిత్ర రచనలు అధ్యయనం చేసి ఉంటే చక్కని కథగా రూపొంది ఉండేది. అయితే గత డెభ్భయి ఏళ్ళుగా వాస్తవ చరిత్ర ఆధారిత రచనలు తెలుగులో శూన్యం అనుకుంటే…. అయితే ఇది కూడా వాస్తవ చరిత్ర ఆధారిత కథ కాదు. పూర్తిగ కల్పన. నిజానికి చరిత్రను ఈ కథలోంచి తీసేసి కేవలం ప్రేమ కథపైనే దృష్టి పెట్టి కాస్త జాగ్రత్తగా రాస్తే చక్కటి ప్రేమకథ అయ్యేది. మామూలుగానే ప్రమకథలు రాసేటప్పుడు రచయిత కనుక కథలో తాదాత్మ్యం చెందకుండా పాత్రల భావనలు తనవి చేసుకోకుండా కథ రాస్తే ఆ కథ పాఠకులనూ మెప్పించలేదు. పైగా, రాస్తున్నది చరిత్ర కథ అయినప్పుడు రచయిత ప్రేమకథను అనుభవించటమేకాదు, ఆ ప్రేమచుట్టూ అలముకుంటున్న మేఘాలపట్ల ఆందోళననూ, సందిగ్ధాలనూ తాను అనుభవిస్తేనే పాఠకుడితో అనుభవింపచేస్తాడు. ఆ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే కథ నిస్తేజంగా, నీరసంగా, రసవిహీనంగా ఉంటుంది. అది ఈ కథను సంపూర్ణంగా దెబ్బ తీసిన అంశం.

మత్తి భానుమూర్తి కథ ‘రాజయోగం’ కూడా పూర్తిగా కాల్పనిక కథ. ఇందులో చరిత్ర అన్నది లేదు. అనవసర వర్ణనలు, సంభాషణలు, సంఘటనలను తొలగించి పూర్తిగా చెప్పదలచుకున్న అంశంపై దృష్టి కేంద్రీకరించి, లాజికల్‍గా కథను అభివృద్ధి చేసి ఉంటే ఇది చక్కని జానపద నీతికథ అయి ఉండేది. పూర్తిగా సినిమాటిక్ ముగింపు ఉన్న కథ ఇది.

ఇంకా బివి  శివప్రసాద్ కథ ‘వారసత్వం’, శ్రీ పద్మ కథ ‘అందచందాల అన్నమ్మ’ లను చరిత్ర ఆధారిత కాల్పనిక కథలుగా కన్న అపరిపక్వ కాల్పనిక కథలుగా పరిగణించవచ్చు. బివి  శివప్రసాద్ కథలో సంఘటనలన్నీ కల్పితాలు. అవీ సరిగా చిత్రించలేదు. కానీ ఇందులో ‘సారంగపాణి’ చారిత్రక పురుషుడు. ఈ కథలో కూడా ఫోకస్ లేదు. ‘సారంగపాణి’ అంతగా అందరికీ తెలియని భక్తుడు. నిజానికి ఈ కథను సారంగపాణి పదాల ఆధారంగా ఆనాటి ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ, సారంగపాణిని ప్రధానపాత్రగా చేసి రచిస్తే గుర్తుంచుకోదగ్గ కథ అయివుండేది.  ఆవైపు దృష్టిని సారిస్తే చక్కని కథ అయ్యేది. ఇంతవరకూ ఎవరికీ అంతగా పరిచయం లేని మహోన్నత వ్యక్తిని పరిచయం చేసినట్టు అయ్యేది. అన్నమయ్య, క్షేత్రయ్యలతో సమానంగా నిలబడవలసినవాడు సారంగపాణి. ప్రధానంగా భక్తి పదాలయినప్పటికీ పద సాహిత్యంలో సాంఘిక, సాంస్కృతిక స్థితి గతులను అత్యద్భుతంగా ప్రదర్శించారాయన. రాయలసీమ రత్నంగా పరిగణనకు గురై, కార్వేటి నగర ఆస్థాన విద్యాధికారిగా, వైణిక విద్వాంసుడిగా, అభినయాచార్యుడిగా, వాగ్గేయకారుడిగా, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన సారంగపాణి, తమిళనేలలో పుట్టి, తెలుగునేలలో స్థిరపడిన ఉభయ సంస్కృతుల సమైక్యతకు సజీవప్రతీక. అయితే ఈ కథలో ఆయన ఔన్నత్యం ఏమీ కనబడదు. పైగా తన గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన సభలో సమస్య వస్తే ‘నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కార్యక్రమం ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగాల్సిందే నీ ఇష్టం’ అని మంకు పట్టుపట్టే పిల్లవాడిగా చూపటమే కాక ‘అప్పటికే ఆయన రొప్పుతున్నాడని’ కొసరు అంటించటం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజానికి ఈ కథలో సారంగపాణిని ప్రధాన పాత్ర చేసి రాస్తే బాగుండేది. కానీ ఈ సంకలనంలోని ఇతర కథలలాగే ఈ కథ కూడా చరిత్ర కన్నా కాల్పనిక కథపై అధికంగా ఫోకస్ చేస్తుంది. కథను దెబ్బతీస్తుంది.

జి.వి శ్రీనివాస్ కథ ‘పురిటిపన్ను’ నిజానికి ఆసక్తికరంగా ఉండాల్సిన కథ. అనవసరమైన సంఘటనలు, అసలు కథను దెబ్బ తీస్తాయి. నిడివి ఎక్కువవటంతో అసలు అంశం చిన్నది కావటంతో విసుగు కలుగుతుంది. ఇతర కథలలోలాగే, ఏ ఒక్క పాత్ర సరిగ్గా ఎదగకపోవటంతో  పాఠకుల మనస్సులపై ముద్ర వేయటం ఈ కథలో కూడా కనబడదు.

పూర్ణిమ తమ్మిరెడ్డి కథ ‘అన్నీసా’లో కూడా సంకలనంలోని ఇతర కథల్లోలాగే ఏది ప్రధానాంశమో, దేనిపై ఫోకస్ చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధం, అయోమయం కనిపిస్తుంది. ఆమె (సుగ్రా హుమాయున్ బేగం) ఇన్‍స్పిరేషన్‍తో రచించిన కథ ‘అన్నీసా’ అని సంపాదకులు ఈ కథ గురించి వ్యాఖ్యానించారు. ఒక కోణం నుంచి చూస్తే ఈ కథాంశం చాలా ఆవశ్యకమైన కథాంశం. ఇది చెప్పవలసిన కథ. ‘As History has been taken away from women, it is necessary to put that  back into the picture and document their role and work’ అంటుంది ప్రొఫెసర్ రేఖాఫాండే తన పేపర్ ‘Women in the Hyderabad State in 19th and 20th centuries’ లో . ఇది నిజం కూడా. చరిత్రలో అధిక ప్రాధాన్యం పురుషులకే. చరిత్ర ప్రధానంగా రాజులు, రాజ్యాలు, యుద్ధాలకు సంబంధించినదే కావటంతో యుద్ధాలలో పాల్గొన్న మహిళలు, రాజ్యాధికారం నెరపిన మహిళలకే చరిత్రలో ప్రాధాన్యం లభించింది. రాజులు ప్రేమించిన మహిళలు, రాజుల అంతఃపురాలలో రాజకీయ కుట్రలు చేసిన మహిళలకూ ప్రాధాన్యం లభించింది. అంతే తప్ప మహిళల దృక్కోణంలో చరిత్ర రచన ప్రయత్నాలు జరగలేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళాభ్యున్నతికి తోడ్పడిన మహిళ, (అదీ నిజాం రాజ్యంలో) కేంద్రబిందువుగానో, ఆమె స్ఫూర్తిగానో కథ రాయటమన్నది అత్యంత అభినందనీయమైన విషయం. ఆహ్వానించదగ్గ విషయం. కానీ కథ ప్రధానంగా ‘సుగ్రా హూమాయూన్ బేగం’ పై కేంద్రీకృతం అయినా బాగుండేది. లేదా, ఆమె ప్రేరణతో, ఆమె స్ఫూర్తితో పైకి వచ్చిన మరో మహిళ, ఊహా పాత్ర,  కేంద్రంగా నడిచినా బాగుండేది. కనీసం, కథ పేరు ‘అన్నీసా’ (సుగ్రా బేగం నడిపిన పత్రిక) అవటంతో ‘అన్నీసా’ పత్రిక ఆధారంగా ఏ రకంగా సుగ్రా బేగమ్ మహిళ అభ్యుదయానికి పాటుపడిందో, ఎలాంటి రచనల ద్వారా మహిళల పరిస్థితి మెరుగుపడేందుకు తపన పడిందో వివరిస్తుందనుకుంటాం. సుగ్రా హుమయూన్ బేగం ఆరంభించిన పాఠశాల ‘సఫ్దరియా స్కూల్’ (ఇంకా హైదరాబాదులో నడుస్తూన్నది) ప్రసక్తి తెచ్చి,  ఆమె ఎలా ‘విద్య’ మహిళల అభ్యున్నతికి రాచబాటగా భావించిందో వివరిస్తుందనుకుంటాం. 1920లో ‘అన్నీసా’లో రాసిన ఓ రచనలో ‘మహిళలు విద్యావంతులైతేనే కదా వాళ్ళు వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పేది’ అని వాదించటం కనిపిస్తుంది. ఆమె కవితలు, ఇతర రచనల లోంచి అనేక అంశాలు తీసుకుని ‘అన్నీసా’ ద్వారా ఆమె వ్యక్తిత్వం గురించి వివరించటం ఉంటుందనుకుంటాం.

సాధారణంగా చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు ఒక చారిత్రక ప్రాధాన్యం కల వ్యక్తికి సంబంధించినవి అయితే, అప్పటి సామాజిక పరిస్థితులు, వాటి నేపధ్యం, ఆ వ్యక్తి ఆనాటి వ్యతిరేక పరిస్థితులను తట్టుకొని ఆమె ఎలా తన కర్తవ్యాన్ని నిర్వహించింది వంటి విషయాలను ప్రదర్శిస్తాయి. అంటే, ఆ కథ చదివితే పాఠకుడికి ఆమె వ్యక్తిత్వం పట్ల అవగాహన రావాలి. కానీ ఈ కథలో అలాంటి వేవీ తెలియవు. కనీసం ఆమె పుట్టిన సంవత్సరం, తండ్రిపేరు, భర్త పేరు వంటి విషయాలూ తెలియవు. ఆమె రచనలు, ఆమె సామాజిక నేపథ్యం, బురఖాను త్యజించిన తొలి మహిళగా ఆమె ఎదుర్కొన్న వివక్షత, ఆమె ధైర్యం వంటివిషయాలేవీ ఈ కథ ప్రతిబింబించదు.  ఆమెకు స్ఫూర్తిగా నిలచిన వారు, ఆమె గురువులు, ఆ సమయంలో ఆమె తోటి మహిళల మనస్తత్వాలు, స్థితిగతులు కూడా మనకు తెలియవు. దాంతో ఆమె ఎందుకని గొప్పనో, ఆమెని ఎందుకని మనం గుర్తుంచుకోవాలో ఈ కథద్వారా తెలిపే అవకాశం పోయింది. కథాంశం చక్కనిది ఎంచుకున్నా ఏ అంశం ప్రదర్శించాలి, దేనివల్ల కథ విలువ పెరుగుతుంది అన్న పరిణతి ఈ సంకలనంలోని ఇతరకథల్లాగే ఈ కథకూడా ప్రదర్శించదు.

కథలో రెండు ప్రధాన పాత్రలుంటాయి. ఒకటి హుమయూన్ బేగం, రెండవది సుజాత. దీన్లో సుజాత కల్పిత పాత్ర. హుమయూన్ బేగంకు సహాయం చేస్తూ సుజాత విద్యావంతురాలవటమే కాదు అబుల్ కలాం ఆజాద్ ఉపన్యాసాన్ని తర్జుమా చేసి ఆయనతో ‘బహుత్ హుందా’ (అది బహుత్ ‘ఉందా’, ‘హుందా’ కాదు. ‘ఉందా’ అంటే బాగుంది అని అర్థం) అనిపించుకోవటంతో కథ ముగుస్తుంది. కథ అటు హుమయూన్ బేగంపైనైనా, ఇటూ సుజాత పాత్ర పైనైనా, ఫోకస్డ్‌గా సాగితే కథకు ఒక అర్థం వచ్చేది. కానీ కథ అటూ సగం, ఇటు సగం కావటంతో అర్థవిహీనం అయింది. హుమయూన్ బేగం చేసిన గొప్ప పనులు, సాధించిన మహిళా ప్రగతి, ఆమె తపన వంటివేవీ కథ ద్వారా తెలియవు. ఏవో కొన్ని అర్థవిహీనమైన సంఘటనలు, ఎలాంటి సాంద్రత, లోతైన అధ్యయనం, అవగాహన వంటి విషయాలేమీ లేకుండా కథను,  సంపాదకుడు చెప్పినట్టు,  ‘తాకీ తాకనట్టు’ రచించినట్టు తోస్తుంది.

నిజాం రాష్ట్రంలో న్యూ జనానా (new zanana) అనే పాఠశాల 1907లో ప్రారంభమయింది. Florence Wyld అనే ఆంగ్ల మహిళ, మరో ముగ్గురు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు. ఫోరెన్స్ విల్డ్ ప్రిన్సిపాల్. మొదటి రోజు విద్యార్థినులు నలుగురు మాత్రమే. పాఠశాలకు వచ్చిపోయేందుకు ‘పర్దా’ తో సహా అన్ని రకాల వ్యవస్థలూ ఉండేవి. ఈ పాఠశాలనే 1919 కల్లా మహబూబియా స్కూల్‍గా రూపాంతరం చెందింది. అప్పటి విద్యార్థినుల సంఖ్య 100. 1930 కల్లా హైదరాబాదులో 79 పాఠశాలలు ఏర్పాటయ్యాయి. కథలో ఇలాంటి వివరాలు ఇస్తూ మహిళల అభివృద్ధి కోసం సుగ్రా హుమయూన్ బేగం చేపట్టిన కార్యకలాపాలు వివరిస్తే చరిత్ర ఆధారిత కథగా కథ విలువ పెరిగేది. ఇందుకు భిన్నంగా కథలో అక్కడక్కడా ఉర్దూ పదాలు రాసి, జిన్నా, అబుల్‍ కలామ్ అజాద్ వంటి వారి పేర్లు ప్రస్తావించి కథకు historical authenticityని ఆపాదించాలని ప్రయత్నించటం కనిపిస్తుంది. అయితే చరిత్ర ఆధారిత రచనలలో చరిత్ర పరంగా దోషాలుండకూడదు. ఆ దోషాలవల్ల కథ దెబ్బ తిన్నదా? లేదా? అన్న మీమాంస అనవసరం.  చరిత్ర ఆధారిత కథల్లో చరిత్ర పరంగా దోషాలు రావటం అంటే, స్వరాలలో లోపాలతో సంగీతం పాడటంలాంటిది. గొంతు శ్రావ్యంగా వుంది కదా  తప్పు వస్తే ఏమిటి? అనటం ఆమోదనీయం కాదు.. కథలో చారిత్రిక  పురుషులను, తేదీలను ప్రస్తావించటం కథకు చరిత్ర పరంగా ఒక ప్రామాణికతను సంతరించటం కోసం. కాబట్టి ఆ ప్రస్తావనలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. రచయితలు అలాంటి జాగ్రత్తలు చూసుకోక పొరపాటు చేస్తే, రచయిత సరైన పరిశోధన చేయకుండా,  చరిత్ర గురించి తెలియకుండా ఏదో రాసేశాడన్న భావన కలుగుతుంది. అలా పొరపాటు చేసి అందువల్ల కథ దెబ్బతినలేదు కదా? అని వాదించటం  రచయిత అవగాహన రాహిత్యం, పరిణతి రాహిత్యాలను స్పష్టంచేస్తాయి. అధ్యయన లోపాలతో పాటు కథారచన పట్ల రచయిత నిబద్ధతను, పాఠకుల పట్ల గౌరవాన్ని ప్రశ్నార్థకంలో పడేస్తాయి. ఈ కథలో 1920లో జిన్నా హైదరాబాదు వస్తున్న వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ‘అన్నీసా’ పత్రిక ప్రచురణను పట్టించుకోలేదన్న సంఘటన ఉంది. ఈ సంఘటన ద్వారా కథ చారిత్రక నేపథ్యాన్ని బలపరచటంతో పాటు, మహిళల పత్రికలంటే ఉన్న చులకన భావం, వివక్షత, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటూ మహిళ పత్రికను నడిపిందన్న విషయాలను ప్రదర్శిస్తుంది కథ. అయితే హుమయూన్ బేగం ఆ కాలంలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ, ఆమె భర్త సామాజికంగా శక్తిమంతుడు (బేరిస్టర్) అన్న నేపథ్యంలో చూస్తే ఈ సంఘటన అర్థవిహీనం, కల్పితం అనిపిస్తుంది. దీనికి తోడు 1919 తరువాత మళ్ళీ 1934 లోనే జిన్నా హైదరాబాదులో అడుగు పెట్టాడన్న చారిత్రక వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే సరైన అధ్యయనం లేదన్న భావన కలుగుతుంది. మరో సందర్భంలో మా ‘ఆలిమ్-ఎ-నిస్వాన్’ పత్రిక గురించి రాస్తూ ‘బేగం చిన్నతనంలో వాళ్ళింటికి తెప్పించేవారు. అందులో ఆడవాళ్ళని చైతన్య పరచటం కోసం ఎన్నో వ్యాసాలుండేవి. ఆయన పర్దాని వద్దని గట్టిగానే రాసేవాడు. ఎప్పటి మాట ఇది? 1880లోనే. ఊరుకుంటుందా లోకం? పెద్దపెద్ద గొడవలే అయ్యాయి. ఆఖరికి పత్రిక మూసేయాల్సి వచ్చింది. వివాదాలకి తట్టుకోలేక’ (పేజి నెం.166) అని ఉంది.

ఇది చదివితే   చిన్నతనంలో ఈ పత్రిక చదివి బేగం ప్రభావితురాలైందన్న భావనతో పాటు పత్రిక 1880లోనో ఇంకొన్నాళ్ళలోనో మూతపడింది అనిపిస్తుంది. చరిత్రకు సంబంధించిన ఇలాంటి అంశాలు రాసేటప్పుడు స్పష్టంగా ఎలాంటి సందేహానికి తావు లేకుండా రాయాలి రచయితలు. లేకపోతే పాఠకుడు అయోమయానికి గురవటమే కాదు రచయిత చరిత్ర పరిజ్ఞానాన్ని శంకించే వీలుంటుంది. సుగ్రా హుమాయూన్ మిర్జా జన్మించింది 1884వ సంవత్సరంలో. 1880లోనో కొన్నేళ్ళ తరువాతనో పత్రిక మూతపడితే ఏ వయసులో ఆమె ఈ పత్రిక చదివి ప్రభావితురాలైందన్న సందేహం వస్తుంది. 1880లో ఈ పత్రిక  ఎప్పుడు ఆరంభమయిందో స్పష్టంగా తెలియటంలేదు కానీ, జమాలుద్దిన్ అఫ్ఘని (1837-1897), 1879-1882 నడుమ  హైదెరాబాద్‌లో  ఉన్నప్పుడు  ము’ అల్లిం అనే ముహిబ్-ఎ-హుస్సైన్  పత్రికలో “అఘోరియాన్ బ షాన్-ఎ-షౌకత్”  అనే వ్యాసం రాశాడని తెలుస్తోంది. కాబట్టి 1882కే ఈ పత్రిక వుందని ఊహించేవీలుంది. 1895నుంచీ పత్రిక కాపీలు లభిస్తున్నాయి.   1901లో  పత్రిక మూతపడింది.

‘ఆలిమ్-ఎ-నిస్వాన్’ పత్రిక 1895 నాటి ఒక సంచిక.

కానీ కథలో చదివితే 1880లోనో, ఓ నాలుగైదేళ్ళు అటో, ఇటుగానో మూతపడినట్టు అనిపిస్తుంది. కథలో ఇచ్చిన సమాచారం పొరపాటు అర్థాన్ని ఇస్తుంది. ఇంతకీ ఆ మొదటి పత్రిక ఆరంభించిన వ్యక్తి పేరు ముహిబ్-ఎ-హుస్సేన్.

కథ చివర్లో, ఒక కీలకమైన ఘట్టంలో సుజాత చక్కటి అనువాదం చేసే స్థాయికి ఎదిగిందని నిరూపించేందుకు, ఆమె 1930లో అబుల్ కలాం ఆజాద్ విజయవాడకు వచ్చి ఇచ్చిన ఉర్దూ ఉపన్యాసాన్ని తెలుగులోకి చక్కగా అనువదించిందని చూపిస్తారు. అయితే, 1930 మొదటి నుంచి 1931లో మహాత్మా గాంధి, ఇర్విన్‌ల ఒప్పందం జరిగేవరకూ అబుల్ కలాం ఆజాద్ జైలు శిక్షను అనుభవించాడని తెలిస్తే, ఈ కీలకమైన ఘట్టం కుప్పకూలిపోతుంది.  ఒకవేళ అబుల్  కలాం ఆజాద్ జైలుకి వెళ్ళకుండా వున్న రోజుల్లో విజయవాడ వచ్చివుంటే,  1930 సంవత్సరంతో పాటూ తేదీ కూడా చెప్పాలి.  అందుకే, ఈ కథలోనే కీలకంగా భావించిన ఒక సంభాషణను చరిత్ర ఆధారిత రచనలు చేసేవారందరూ గుర్తుంచుకోవాలి. చరిత్ర ఆధారిత రచనలో తొందరపాటు కూడదు. అన్ని కోణాల్లో, లోతుగా పరిశీలించి, పరిశోధించి, అవగాహన కలిగిన తరువాతే కథ రాయటం గురించి ఆలోచించాలి. అప్పటివరకూ, సబ్ర్ కరో మెరీ జాన్ (ఓపికపట్టు మిత్రమా!!!)… అన్నది పాటించాలి.  ఇలాంటి   దోషాలు చరిత్ర ఆధారిత కాల్పనిక రచయితలు పరిహరించాలి. జాగ్రత్తపడాలి. కథలో ఫోకస్ లేక పోవటంతోపాటు ఇలాంటి దోషాలు పాఠకుడిని విముఖుడిని చేస్తాయి.

సాధారణంగా విమర్శకులు కోడిగుడ్డుకు ఈకలు పీకుతారు, చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపి అనవసరంగా ఆర్భాటం చేస్తారు అని విమర్శకులను తీసిపారేస్తారు కొందరు రచయితలు. ఇలాంటి రచయితలు పొగడ్తలకు అలవాటు పడినవారో, విమర్శను సహించలేని వారో, లేక అన్నీ తమకే తెలుసు, తామేం రాస్తే అదే సరైనది అన్న అహంకారులో అయి ఉంటారు.

ఈ సందర్భంగా ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ అన్న కథను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కథలో ఇంగ్లీషువాళ్ళు వీడ్కోలు తీసుకోవడం ఉంటుంది. ఆ వీడ్కోలు సమావేశం ద్వారా ఆనాటి ఇంగ్లీషు వారి పరిస్థితులు, వాళ్ళ మనస్తత్వాలు, సమస్యలు వంటి విషయాలను ఎక్కడా చరిత్ర కథ రాస్తున్నానన్న అహంభావం ప్రదర్శించకుండా ఎంతో హాయిగా రాస్తాడు రచయిత. అతి చక్కని కథను అంతే చక్కని పద్ధతిలో చెప్తాడు. కథలో ఓ సందర్భంలో ఆర్థర్ కాటన్ వచ్చి వెళ్తాడు. కథలో సంభాషణల ద్వారా కథ జరిగే కాలాన్ని ఊహిస్తాము తప్పించి రచయిత స్పష్టంగా చెప్పడు. ‘ఆర్థర్ కాటన్ పదవీ విరమణ చేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు’ అని, ప్రభుత్వం వారి పిలుపు మీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడనీ అనటం వల్ల కాలాన్ని ఊహించే వీలుంటుంది. అయితే ఆర్థర్ కాటన్ విశాఖపట్నం వచ్చిన భావన కలిగించే వాక్యాలు ఉంటాయి. పాఠకుడు ఆ విషయాన్ని అంత సీరియస్‍గా పట్టించుకోడు కూడా. కథ గమనానికి అది అంత అవసరం లేదు కూడా. కానీ ‘అరే ఆయన విశాఖపట్నం 1863 తరువాత రాలేదే’ (జిన్నా 1919 తరువాత 1934 వరకూ హైదరాబాదు రాలేదు అన్నట్టు) అనే అవకాశం ఉందని,  రచయిత,  కథ పూర్తయిన తరువాత వివరణల్లో ‘విశాఖ రాక కథ కోసం సృష్టించబడింది’ అని స్పష్టం చేస్తాడు. నిజానికి రచయిత చెప్పకపోతే సాధారణ పాఠకుడి దృష్టికి ఆ విషయం రాదు కూడా. కానీ అలా చెప్పటం ఒక మర్యాద, పాఠకుడికి పొరపాటు అభిప్రాయం కలిగించకుండా ఉండేందుకు. ఈ కథను ఆధారం చేసుకుని ఎవరూ ఆర్థర్ కాటన్ 1863 తరువాత విశాఖ వచ్చాడని వాదించే వీలులేకుండా. తెలిసినవారికి  రచయిత కథా రచనలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు, చరిత్ర అధ్యయనం సరిగ్గా చేయలేదు అన్న చులకన భావం కలగకుండా ఉండేందుకు రచయిత తాను చేసిన కల్పనకు  వివరణను ఇచ్చాడు. ఇది రచయిత నిబద్దతను, నిజాయితీని, చరిత్ర అధ్యయనాన్ని, అవగాహనను, ముఖ్యంగా చరిత్ర ఆధారిత కాల్పనిక రచయిత బాధ్యతను,  పాఠకుల పట్ల రచయితకు ఉన్న  అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తుంది. చరిత్ర ఆధారంగా కాల్పనిక రచనలు చేసేవారికి ఇది చక్కని ఆదర్శం. (ఈ కథ తూరుపు గాలులు అన్న కథా సంపుటిలో వుంది.) అయితే తమకు డెభ్భై ఏళ్ళ ముందు సరైన  చారిత్రక రచనలు లేవనీ, ఆ లోటును పూడ్చేందుకే ఈ కథలు రాశామని అనుకొనేవారికి  ‘ఆదర్శం’, ‘మార్గదర్శకత్వం’ ఏముంటుంది?

చివరగా ‘అన్నీసా’ అన్నది పొరపాటు.   అన్-నిసా (An-Nisa) అంటారు. ‘అన్-నీసా’ అంటే అరబిక్‍లో ‘మహిళ’ అన్న అర్థం. పలికేటప్పుడు ‘అన్నీసా’ అని,  రాసేటప్పుడు మాత్రం ‘అన్-నిసా’ అని రాయాలి.

మిగిలిన కథల విశ్లేషణతో వచ్చేవారం ఈ విశ్లేషణ ముగుస్తుంది.

Exit mobile version