కాలయంత్రం – కథల తంత్రం – ఒక విశ్లేషణ – 6

5
2

[dropcap]1[/dropcap]952 తరువాత చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసినవారి జాబితాలో పులిచర్ల సుబ్బారావుగారు చేరతారు. ఈ వివరాలు అందించింది సీహెచ్ సుశీలమ్మ.

***

‘కాలయంత్రం’ కథల సంకలనంలో ఇంతవరకూ విశ్లేషించనివి రెండు కథలు,  వెంకట్ శిద్దారెడ్డి రచించిన ‘1948 ‌- డైరీలో కొన్ని పేజీలు’, డాంజి తోటపల్లి రచించిన ‘వీరకోడిదండు’.

వెంకట్ శిద్దారెడ్డి కథ ‘1948 ‌- డైరీలో కొన్ని పేజీలు’ ఈ సంకలనంలోని కథలన్నిటిలోకి సులభంగా చదవగల కథ. ఎందుకంటే, కథని డైరీ రూపంలో ఒక పాత్ర దృష్టితో చెప్పటం వల్ల ఇతర కథల్లోలాగా, అనవసరమైన వర్ణనలు, పాత్రలు కథలోకి జొరబడే వీలులేకపోయింది. పైగా కథకుడు చరిత్రలో జరిగిన సంఘటనలను దాదాపుగా జరిగినవి జరిగినట్టు ఎలాంటి పెద్ద కల్పనలు లేకుండా తన భాషలో తిరిగి రాసినట్టుగా కథ ఉండటంతో, అక్కడక్కడా రచయిత వ్యాఖ్యలు తప్ప కథలో నాటకీకరణ కానీ కల్పనలకు కానీ తావు లేకుండా పోయింది. అందువల్ల కథను సులభంగా చదివే వీలు చిక్కింది. అయితే ఈ కథలో ప్రధానంగా  అవగాహన లోపం, అధ్యయన లోపం,  కథ చెప్పటంలో ఎలాంటి ఉద్విగ్నతలూ లేకపోవటం, లోపాలు.   అవి కల్పించాలని రచయిత ప్రయత్నించలేదు కూడా!

తెలుగులో మహాత్మాగాంధీ హత్య చేసిన వారిపై జరిగిన కోర్టు విచారణ ఆధారంగా వచ్చిన కథ బహుశా ఇదే మొదటిది కావచ్చు. విశ్వనాథ ‘ఉరి’ అన్న కథ రాశారు కానీ ఆయన దృక్కోణం వేరు. ఆ కథ స్థాయి వేరు. దానిలో ఎక్కడ మహాత్మాగాంధీ ప్రసక్తి తేకుండా అత్యంత ప్రతీకాత్మకంగా ఆ కథకు  సార్వజనీన స్థాయిని ఆపాదించారు విశ్వనాథ. అది ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడి హత్యకైనా వర్తించే రీతిలో మానవ సమాజంలోని ఒక విశ్వజనీన భావనను స్ఫురించే రీతిలో రూపొందించారు విశ్వనాథ. అలాంటి కథ తెలుగులో ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కాఫ్కాలు, కామూలు, బోర్హెస్‍లు, మార్క్వెజ్‍లు సైతం ఆశ్చర్యపడి, సంతోషంతో సంబరాలు చేసుకుంటారు ఆ కథ చదివితే.

వెంకట్ శిద్దారెడ్డి కథ కేవలం సంఘటనల ‘క్రానికల్’గా మాత్రమే మిగులుతుంది. మహాత్మాగాంధీ హత్య కుట్రదారుల్లో ‘శంకర్ కిష్టయ్య’ అన్న తెలుగువాడు ఉన్నాడు. అతడు అమాయకుడు. ‘దిగంబర్ బాడ్గే’ సేవకుడు అతడు. ఏమీ తెలియదు. చెప్పినది కూడా సరిగ్గా చేయలేడు.  అతనికి తెలుగు, కాస్త హిందీ మాత్రమే వచ్చు.  మహాత్మాగాంధీ హత్య కేసును పరిశోధిస్తున్న వారికి తెలుగు రాకపోవటంతో వారికి తెలుగు తెలిసిన వ్యక్తి అవసరం అయ్యాడు. ఆ సమయంలో ఆస్కార్ బ్రౌన్  ఆఫీసుకు బళ్లారిలో జన్మించిన ఓ 26 ఏళ్ళ అమ్మాయి కమలమ్మ ‘డొమిసైల్ సర్టిఫికేట్’ కోసం వచ్చింది. ఆ సమయంలో బొంబాయి చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ ఆస్కార్ బ్రౌన్ కూడా గతంలో బళ్ళరిలో పనిచేసినవాడు కావటంతో ఆమెతో మాట్లాడేడు. ఆమెకి తెలుగు రావటంతో అతడు ఆమెని తెలుగు అనువాదకురాలిగా నియమించాడు. ఢిల్లీ పంపించాడు. నిజానికి కథను రాయటానికి ఈ సంఘటన చక్కని ఆరంభం అవుతుంది. కానీ కథకుడు మొదటి మూడు పేజీలు అనవసరమైన నేపథ్యం  జోడించాడు. ఆమెని పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసినట్టు, ఒంటరిగా ఎలా ఉంటావని పెద్దలు అంటున్నట్టు చూపించాడు.   నిజానికి కమలమ్మకు 13వ ఏటనే వివాహమయింది. ఎదిగిన తరువాత ఆమె ఈ వివాహాన్ని తిరస్కరించి, చదువుకుంది. పెద్దల మాటలను పట్టించుకోకుండా స్వతంత్రపుటాలోచనలనూ, వ్యక్తిత్వాన్నీ ప్రదర్శించింది. కమలమ్మ మైసూరులో చదువుకుంది. చదువుకునే సమయంలోనే ఆమెకు (సైకాలజీలో ఆనర్స్ గ్రాడ్యుయేట్) మహరాజా కాలేజీలో హెచ్.వై శారద ప్రసాద్‍తో పరిచయం అయింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కాబట్టి కథలో పొందుపరచిన అనవసరమైన నేపథ్యంవల్ల, కథ నిడివి పెరిగింది తప్ప సాధించింది ఏమీ లేదు. కానీ, కమలమ్మ గాంధీ హత్య కేసు విషయంలో డైరీ రాయలేదు.  కథలో ఎక్కడా కూడా డైరీ రాస్తున్న ‘కమలమ్మ’ పేరు ప్రస్తావించలేదు.  అది ఎందుకనో అర్థం కాదు. కమలమ్మ పేరు ప్రస్తావించి ఉంటే కథ  విలువ పెరిగేది. అయితే, నిజ జీవితంలో ఆమె భర్తకు డైరీ రాసే అలవాటు  ఉండేది. ఆమె డైరీ రాసినట్టు చూపటం సృజనాత్మక రచయిత లైసెన్సుగా పరిగణించవచ్చు. కానీ, ఆమె పేరు చెప్పకపోవటంవల్ల సాధించిందేమిటో అర్థంకాదు. నిజానికి, ఆమె పేరు చెప్పి, ఆమె నేపథ్యం, ఆమె వ్యక్తిత్వం వివరించివుంటే ఒక చక్కని గుర్తిండిపోయే మహిళ పాత్ర అయ్యేది.   ఆమెని ఆస్కార్ బ్రౌన్ ఎంచుకోవటం నుంచి తిన్నగా కథ ఆరంభిస్తే కథ మరింత ‘షార్ప్’ అయ్యేది.  ఆమె వ్యక్తిత్వం వల్ల కథపై ఆసక్తి కలిగేది. అయితే, ఇతర కథల్లో లాగా, ఈ కథలో కూడా దేనిపై ఫోకస్ చేయాలో అన్న విషయంపై సందిగ్ధం కనిపిస్తుంది. కథను ఆమె (కమలమ్మ) దృక్కోణంలో రాస్తున్నారు కాబట్టి, జరుగుతున్న వ్యవహారాలపై ఆమె స్పందనను ప్రధానంగా చూపాలో, తెలుగు వారి గొప్ప చరిత్రను చూపే కథల సంకలనం కాబట్టి, శంకర్ కిష్టయ్య అమాయకత్వంపై ఫోకస్ చేయాలో, గాంధీ హత్యకు కారణమయిన వాళ్ళ క్రూరత్వం చూపి, వారిని సమర్థించేవారి నైచ్యం చూపాలో అన్న విషయంలో నిర్ణయించుకోలేక, అన్నీ కొంచెం కొంచెం పొందుపరచటంవల్ల కథ ఎలాంటి ప్రభావమూ చూపలేక అటూ ఇటూ కాకుండా అయింది. కనీసం గాంధీ గొప్పతనమూ ఈ కథ ద్వారా తెలియదు. ఇక కథలో డైరీ రూపంలో రాసిందంతా మనకు మామూలుగా దొరికే సమాచారమే. అయితే కథలో శంకర కిష్టయ్య, కమలమ్మతో చెప్పినట్టు రాసిన విషయాలన్నీ శంకర కిష్టయ్య చెప్పినవి కావు. అతనికంత తెలివిలేదు.

My mother, a psychology graduate had developed a good rapport with Badge and Karkare and had won their confidence, while they played badminton together in the evenings at Red fort’ అని కమలమ్మ తనయుడు రవి విశ్వేశ్వరాయ శారద ప్రసాద్, పలు వ్యాసాలలో రాశాడు. అంటే ఆమె కిష్టయ్యకు అనువాదకురాలిగా ఉన్నా కిష్టయ్య ఏమీ మాట్లాడక, అతని మాటలు పొంతన లేనివి కావటంతో ఆమె ఇతరులతో స్నేహం చేసిందన్నమాట. కిష్టయ్యకు ఏమీ రాదు తెలియదు. అతను బాడ్గే ఏమి చెప్పమంటే అదే చెప్పేవాడు. అతనితో కోర్టులో ఏమి చెప్పాలో జైలులో బాడ్గే కోచింగ్ ఇచ్చేవాడు. దీని గురించి కోర్టులో స్వయంగా శంకర్ చెప్పాడు.

One night Nagarvala came and…. asked Badge, “have you given Shankar enough practice? asked me in Hindustani what I had to say. I committed 5-6 mistakes.

ఇది కోర్టులో చెప్పినందుకు బాడ్గే జైలరు ముందే శంకర్‌ను చెంపమీద కొడతాడు. ఈ చెంపదెబ్బ సంఘటనను కథలో బాడ్గే దుష్టుడు అన్న అర్థం వచ్చే రీతిలో చూపించాడు రచయిత. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శంకర్ ఎంత అమాయకుడో.  అతను కమలమ్మకు ప్రత్యేకంగా చెప్పిందేమీలేదు. బాడ్గే ఏమి చెప్పమంటే అది చెప్పాడంతే.. కానీ, కథకులకుండే సృజనాత్మక స్వేచ్ఛ ప్రకారం ఈ కథను ఆమోదించినా, కథలో రచయిత ఏమి జరిగిందో స్పష్టంగా చెప్పే డాక్యుమెంటెడ్ ఆధారాలను విస్మరించి తన ఊహ ప్రకారం కథనల్లుకుపోవటంతో ఇది అటు చరిత్ర ఆధారిత కాల్పనిక కథలా ఎదగక, ఇటు కథగా మామూలు కథగా పరిగణించలేక అటూ ఇటూ కాకుండా కేవలం  అక్షరాల సమూహంలా  మిగిలిపోయింది.

గాంధీ హంతకులలో ఆమెకు కర్కరే , దిగంబర్ బాడ్గేలతో సాన్నిహిత్యం ఏర్పడింది. గాంధీ హత్య నేరస్థులలో విష్టు కర్కరే అత్యంత కలర్‍ఫుల్ కేరెక్టర్. ‘Men who killed Gandhi’ అనే పుస్తకంలో ‘మనోహర్ మాల్గోంకర్’ లోతైన పరిశోధన చేసి అనేక విషయాలు వెల్లడించాడు. దాన్లో విష్ణు కర్కరే ప్రేమ జీవితం కూడా ప్రస్తావించాడు.  హిందూ ఫేనటిక్‌గా పరిగణకు గురయ్యే విష్ణు కర్కరే ప్రేమిక మనోరమ అనే క్రీస్టియన్ యువతి. కర్కరే గాంధీ హత్య కేసులో పాల్గొన్నప్పుడు ఆమె గర్భవతి. కర్కరేకు అప్పటికే పెళ్ళయింది. పిల్లలున్నారు.  నిజానికి కమలమ్మకు శంకర్ కిష్టయ్యతో పనేమీలేక, ఆమె అధిక సమయం కర్కరే, బాడ్గేలతో, ప్రాసెక్యూటర్లతో గడిపింది. కర్కరే కమలమ్మకు అనేక విషయాలు చెప్పాడు. దాన్లో బాగ్డే గడ్డంలో తుపాకీ దాచిపెట్టటం, నోట్లో నాణేలు పెట్టుకుని మాట్లాడగలగటం వంటివి ఉన్నాయి. ఇవన్నీ కిష్టయ్య చెప్పినట్టు రాశారు రచయిత. అంత తెలివే వుంటే అతనికి శిక్ష పడేది. శంకర్ కిష్టయ్యకు ఏమీ తెలియదు. ఏమీ అర్థం కాదు.  అందుకే  నాలుగు నెలల తరువాత హైకోర్టు పర్చురే, శంకర్‌లకు స్వేచ్ఛను ప్రసాదించింది. అందుకే కథలో చూపినట్టు  – జనవరి 20న గాంధీ మీద చేసిన హత్యా ప్రయత్నం గురించి శంకర్ చెప్పగలిగితే అతను ‘accessory after the fact’ నిజాన్ని దాచిపెట్టిన వాడవుతాడు. శిక్షార్హుడవుతాడు. తాను పట్టుకున్నది ‘గ్రెనేడ్’ అని కూడా తెలియని అమాయకుడు శంకర కిష్టయ్య. అందుకే తరువాత అతడిని విడుదల చేశారు,  ఆరంభంలో యావజ్జీవ శిక్ష విధించినా. నిజానికి శంకర కిష్టయ్యకు ‘గాంధీ’ ఎవరో కూడా సరిగ్గా తెలియదు. అందుకే కథలో ‘గాంధీని వీళ్ళేందుకు చంపాలనుకుంటున్నారు?’ అని శంకర్ కిష్టయ్య అడగటం అర్థరహితం. గాంధీ ఎవరు? అని అడిగితే ఔచిత్యంగావుండేది.  అయితే ‘ఆయన వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అందుకు’ అన్న సమాధానం హాస్యాస్పదమే కాదు రచయిత అవగాహనా రాహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. బహుశా ఆ ప్రశ్నకు సమాధానం గాడ్సే ఆలోచనలకు ప్రచారం ఇచ్చినట్టు అవుతుందని రచయిత భయపడ్డట్టుంది. లేదా, రచయితకు గాంధీని ఎందుకు చంపారో కారణం తెలియదేమో నిజంగానే!! స్వతంత్రం తెచ్చినందుకు గాంధీని చంపేరని కమలమ్మతో అనిపించటం ఆమె తెలివిని తక్కువచేసి అవమానించటమే కాదు, రచయిత తన పరిజ్ఞాన్నికూడా ప్రశ్నార్ధకం చేసినట్టయింది. లేదా, తెలివిలేని కిష్టయ్యకిదంతా చెప్పటం ఎందుకని పాత్ర అనుకుందో?? కానీ, రచయిత అలాంటి భావనను కలిగించడు.

అలాగే ‘సావర్కర్ వంటి పేరున్న వ్యక్తి పాత్ర ఈ కేసులో ఉందో లేదో అని నిర్ణయించే హక్కు, జ్ఞానం నాకు ఉందని నేను అనుకోవటం లేదు’ అని కమలమ్మ పాత్రతో అనిపించటం ఆమె గురించి రచయితకు ఏమీ తెలియదన్న భావన కలిగిస్తుంది.

‘My mother and other junior members of the prosecutor team, suspected that the case against the Hindu Mahasabha and Vinayaka Damodar Savarkar, was being deliberately weakened under directions from deputy prime minister and home minister Sardar Vallabhai Patel and Moraji Desai then home minister of Bombay, no matter what they personally said.’

ఆ కాలంలోనే కమలమ్మ స్వతంత్ర భావాలు కల మహిళ. తనదైన ఆలోచనలు, అభిప్రాయాలు కల మహిళ. అలాంటామె ‘హక్కు, జ్ఞానం నాకుందో లేదో అనటం’ అర్థరహితం, ఆమెకు అవమానం కూడా. ఎందుకంటే, ఆమె పలు సందర్భాలలో తన అనుమానాలను స్పష్టం చేసింది. బహిరంగ పరిచింది.

‘My mother described  to me numerous lacunae in the investigation’.

‘Karkare whispered to my mother that Savarkar was lying…..

‘More importantly Karkare let slip to my mother while they were playing badminton that Bagde’s statement  on Savarkar saying ‘Gandhi, Nehru and Suhrawardy should be finished ‘was absolutely true’.

బాగ్డే తనకు చెప్పిన విషయాలను ఆమె పబ్లిక్ ప్రాసెక్యూటర్‌కు చెప్పి వాటిని బహిరంగ పరచమని ఒత్తిడి తెచ్చింది.

కమలమ్మ 92 ఏళ్ళ వయసులో ఆగష్టు 11, 2014న మరణించింది.

వ్యాసం నిడివి అనవసరంగా పెరుగుతున్న కారణంగా  చర్చను పొడిగించటం లేదు. కానీ, ఆ కాలంలోనే వివాహమయినా తనకు నచ్చలేదని, ఆ వివాహాన్ని తిరస్కరించి, స్వతంత్రంగా ముంబాయిలో ఉద్యోగానికి వచ్చి, ఎవరి అనుమతులూ లేకుండానే డిల్లీకి వెళ్ళిన మహిళ, అన్యాయం జరుగుతూంటే, దాని గురించిన జ్ఞానం, హక్కు తనకిలేవని అనుకున్నట్టు చూపటం అసంబద్ధం, అనౌచిత్యమే కాదు, బహుశా గాంధీ హత్య విషయంలో సావర్కర్ పాత్ర గురించి చర్చించి, అనవసర వివాదాల్లో ఇరుక్కోవటం ఎందుకని హక్కు జ్ఞానం లేకపోవటాన్ని పాత్రకు ఆపాదించారేమో అనిపిస్తుంది. కమలమ్మ ‘హక్కు, జ్ఞానం’ గురించి రచయిత చులకనగా రాయటం క్షమార్హం కాదు. ఆ కాలంలో స్వతంత్ర మహిళగా జీవిస్తూ, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకున్న కమలమ్మ ‘జ్ఞానం’ గురించి రచయితకు అస్సలు అవగాహన లేదని తెలుస్తుంది. ఇక్కడే చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసేవారు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

చరిత్రలో ఉన్న వ్యక్తుల  ఆధారంగా రచన చేసేటపుడు వారి వ్యక్తిత్వాలను అందుతున్న ఆధారాలకు భిన్నంగా ప్రదర్శించకూడదు. లభ్యమవుతున్న ఆధారాల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి. వీలైతే ఆ వ్యక్తిత్వ ఏర్పాటుకు దారి తీసిన కారణాలను ఊహించి విశ్లేషించాలి. ఒక పాత్రను పాఠకుల ముందు నిలిపేకన్న ముందు రచయిత ఆ పాత్ర గురించి సంపూర్ణమైన అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే తానే ఆ పాత్ర అయి ఆలోచించాలి. అది జరగకపోతే, పాత్రల వ్యక్తిత్వాలు దెబ్బతినటమే కాదు కథ రక్తి కట్టదు కూడా.

‘1948 ‌- డైరీలో కొన్ని పేజీలు’ కథనే తీసుకుంటే ఈ కథలో ప్రత్యక్షంగా కనబడేవి రెండే పాత్రలు. ఒకటి డైరీ రాసే అమ్మాయి, రెండవది శంకర కిష్టయ్య. డైరీ రాసే అమ్మాయి కమలమ్మ. రచయిత కనుక కమలమ్మ వ్యక్తిత్వాన్ని, శంకర కిష్టయ్య వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేసి, వారి వ్యక్తిత్వాల ఆధారంగా వారి నడుమ జరిగిన సంఘటనలను ఊహించి రాస్తే కథ మరో రకంగా ఉండేది. కమలమ్మ నిర్దిష్టమైన భావాలు, వ్యక్తిత్వం కల స్వతంత్ర మహిళ. శంకర కిష్టయ్య ఏమీ తెలియని అమాయకుడు. మూర్ఖుడు. గాంధీ హత్య నేరస్థుడు.   తీర్పు వెలువడినప్పుడు, బాడ్గేకు స్వేచ్ఛనిచ్చి, అతను చెప్పినట్టు చేసిన తనకు యావజ్జీవ ఖైదు శిక్ష విధించటం అర్ధంకాని, శంకర్ కిష్టయ్య వేదననీ, అది చూసి కమలమ్మ పడే బాధనీ రచయిత డైరీలో ఎంట్రీ ద్వారా పాఠకుడికి చేరువచేసివుంటే కథ విలువ పెరిగేది. అయితే, సరయిన అధ్యయనం, అవగాహనల వల్ల, ఏ సంఘటనకు ప్రాధాన్యం ఇవాలి, ఏ సంఘటనను డ్రమటైజ్ చెయ్యాలి అన్నది తెలుస్తుంది. అధ్యయనం చేసి ఉంటే, ఆమె వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఉంటే, ఆ కాలంలో పురుషులతో సమానంగా బాడ్మింటన్ ఆడుతూ, వారినుంచి విషయాలు రాబట్టటం, ఆ విషయాలను న్యాయవాదులకు అందిస్తూ కేసు పరిశోధనలో తోడ్పటం వైపు దృష్టి మళ్ళేది. చక్కని సస్పెన్స్ కథ అయి ఉండేది. గాంధీ హత్య పరిశోధన విషయాలను తెలిపిన కథ అయి ఉండేది. ఇందుకు భిన్నంగా వ్యక్తిత్వాలపై అవగాహన లేకుండా లేనివి పాత్రలకు ఆపాదిస్తూ, ఉన్నవి తీసివేస్తూ, పాత్రలను దిగజారుస్తూ, తన ఆలోచనలను పాత్రల వ్యక్తిత్వాలకు భిన్నంగా పాత్రలకాపాదిస్తూ, చరిత్రను పక్కకుతోసి, తనకు తోచిందే  వాస్తవ చరిత్ర అన్నట్టు కథను అర్థవిహీనం చేయటం కనిపిస్తుందీ కథలో. అందుకే చరిత్ర ఆధారిత రచనలు చేయాలనుకునే వారు పరిశోధకులు అధ్యయనపరులు మాత్రమే కాదు, ఇతరుల వైపు నుంచి వాళ్ళలాగా, ఆలోచించగలిగేవారు, ఉన్మత్త ఊహాశాలురు కూడా అయి ఉండాలి.

‘డాంజి తోటపల్లి’ రాసిన ‘వీరకోడిదండు’ కూడా సంకలనంలోని ఇతర కథలలాగే ఎలాంటి ఉద్విగ్నత లేకుండా అవసరమైన చోట డ్రమటైజేషన్ లేకుండా, అవసరం లేని వర్ణనలతో సాగుతుంది. అనవసరమైన పాత్రలు, కథకు ఏ మాత్రం ఊపును ఇవ్వని పాత్రలు కథను దెబ్బతీస్తాయి. దీన్లో ప్రధాన పాత్ర వీరభద్రుడు, వ్యాపారుల బిడార్లను కాపాడే దండు నాయకుడు. తన ప్రయాణాన్ని సురక్షితం చేసే బాధ్యత ‘తాంబూల శ్రేష్టి’ వీరభద్రుడికి అప్పచెప్తాడు. అతడు ఎర్రయ్య అనే దొంగల ముఠా నుంచి బిడారును రక్షిస్తూ ప్రాణాలు కోల్పోతాడు. టూకీగా ఇదీ కథ.

ఈ కథను సూటిగా, ఉద్విగ్నత భరితంగా చెప్తూ ఆనాటి సామాజిక పరిస్థితులను, చరిత్రను వివరిస్తూ కథను రచించవచ్చు. కానీ ఇందుకు భిన్నంగా ఈ సంకలనంలోని ఇతర రచనలలాగే ఈ కథలో కూడా అనవసరమైన విషయాలను, పాత్రలను చొప్పించటంతో కథ కుంటుపడటమే కాదు ఎటుపోతుందో కూడా తెలియకుండా లక్ష్య రహితంగా అయింది. ఈ కథలో వీరోచితమైన పోరాటాల వర్ణనలతో, వీరభద్రుడి పాత్రను గొప్ప వీరుడిగా చూపించేందుకు చక్కటి అవకాశం ఉంది. కానీ ఇతర అనవసర విషయాల వర్ణనలో చూపించిన ఉత్సహం పోరాట వర్ణనలో లేదు. ముఖ్యంగా వీరభద్రుడి మరణం ‘ఒక్క నిముషం తరువాత వెనక్కి చూస్తే, ఇంకేముంది, వీరభద్రుడు నేలమీద పడి ఉన్నాడు. ఎర్రయ్య మనుషులు ఈటెల్తో అతడిని పొడుస్తున్నారు’ అంటూ తేల్చేయటం కథలో ఏమాత్రం ఆసక్తి మిగిలి ఉన్నా దాన్ని చంపేస్తుంది. ఈ కథలో దేవరసమ్మ పాత్ర, బాలుడి పాత్రలు అనవసరం. కథని పొడిగించి, అర్థరహితం చేయటం తప్ప మరెందుకూ పనికిరావు ఈ పాత్రలు. ముఖ్యంగా దేవరసమ్మ పాత్ర కథను పెంచటానికి తప్ప కాస్త శృంగార రసం ఒలకపోయటానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఎర్రయ్య దాడినుంచి ఎలా తప్పించుకుందో కథలో లేదు. ‘దేవరసమ్మ బళ్లతో సహా సరకు బళ్ళన్నీ కమరు దిగువకు చేరిపోయాయి’ అన్న వాక్యం తప్ప ఈ విషయంపై మరో వాక్యం లేదు. ఈ వాక్యం తరువాత వచ్చే సందేహం ఏమిటంటే, ఇంతకీ ఎర్రయ్య బిడారంపై పథకం ప్రకారం రెండు గుంపులతో ఎందుకు దాడి చేశాడు? వీరభద్రుడిని, తమలశెట్టిని చంపటానికా? బిడారాన్ని దోచుకోటానికా? ఇలాంటి దాడులలో దొంగలు ఏదో రూపంలో కాపలా వారి దృష్టిని మళ్ళించి సరుకులను దోచుకుంటారు. ఈ కథలో దొంగలు అలాంటి ప్రయత్నాలే చేయలేదు. చంపటానికి, చావటానికి వచ్చినట్టున్నారు తప్ప దోచుకోవటానికి వచ్చినట్టు లేరు.

‘వీరకోడిదండు’ కథ ఆరంభంలో రచయిత ఆనాటి పరిస్థితులను వర్ణిస్తారు. ‘పనికి తగ్గ జీతభత్యాలు లేక బతకటానికి బలుసాకు అన్నట్లుగా యుద్ధం చేయటం  ఒక్కటే తెలిసిన యోధులు కిరాయి సైనికులుగా మారి డబ్బుకి అమ్ముడుబోయినారు’ (పేజి 53) అని వ్యాఖ్యానిస్తారు రచయిత.

కిరాయి సైనికులు అన్నది , భారతదేశంలో తురకలు  ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ, వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంటే ఏర్పడిన వికృతి. అంతకుముందు దేశంలో ఇంతటి అవ్యవస్థ లేదు. ముఖ్యంగా కథలో వర్ణించిన కాలంలో భారతీయ వ్యాపారం అత్యంత అభివృద్ధి చెందింది. తీరాలను దాటి విదేశాలకు విస్తరించిందన్న విషయాన్ని గమనిస్తే ఈ వ్యాఖ్య అంత సమంజసం అనిపించదు. దీనికితోడు వ్యాపారులను రక్షించే బాధ్యత ఆ కాలంలో రాజులది. రాజులు వ్యాపారుల ప్రయాణ బాటల్లో సైన్యాన్ని కాపలాగా పెట్టేవారు. ఈ బాటలను ‘దండుబాట’ లనేవారు. దండు అంటే ‘సైన్యం’ అని అర్థం. అలాగే పలు వ్యాపారులు తమకంటూ ప్రత్యేక సైన్యాన్ని యోధులను నియమించుకుని పోషించేవారు. వై. సుబ్బరాయులు రచించిన ‘South India under Cholas’, ‘Nagapattinam to Suvarnadwipa – Reflections on the Chola Navel Expeditions to Southwest Asia by Herman Kulke : K. Kesavapany, Vijaya Sekhuja   చదివితే వీరిని కిరాయి సైనికులు అనటం కుదరదని అర్థమవుతుంది. అయిన్నురువర్ (Ainnurruvar) శాసనాలలో , ఎరివీర పట్టిణం శాసనాలు మనకు ఈ విషయం తెలుపుతాయి.

‘erivira – pattinam inscriptions record the decision of merchants to confer the name of erivira pattinam, meaning ‘the town of the brave soldiers on the town in which the merchants as well as the soldiers live’ (South Indian Merchant Guilds in the Indian Ocean and Southeast Asia by Noboru Karashima, page 138)

టి. ఎన్. సుబ్రమణియన్ వీటిని Mercantile Towns అన్నాడు. వెంకటరామ అయ్యర్ ‘Fortified Marts’ అన్నాడు. కె. ఇంద్రపాల ‘market towns protected by erivirar (warriors) అన్నాడు. హాల్ వీటిని నగరాలకు పట్టణాలకు నడుమ ఉన్నవి అన్నాడు. చంపకలక్ష్మి ‘Privileged town which has protected warehouse for itinerant merchants’ అంటుంది.

ఈ విషయంపై లభించే శాసనాలు కూడా వీరిని వీరులు, సైనికులు అన్నాయే తప్ప ‘కిరాయి సైనికులు’ అనలేదు.

‘The Samuttirapatti శాసనం ప్రకారం ‘అయిన్నురువర్’ వ్యాపారులు, వారు, వీరకోడియార్ అనే వీర సైనికులు కలిసి ఉన్న పట్టణాన్ని ‘ఎరి వీర పట్టణం’ అన్నారు. సాహసం ప్రదర్శించిన వీరులకు వారు పలు బహుమానాలు, ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. ‘విహరిహిన్న’ శాసనం ప్రకారం వీరార్ (సైనిక వీరులు) తమకు వ్యాపారులు ఇచ్చిన సౌకర్యాలను, ఆదాయాన్ని ప్రజలకు అర్పించారని ఉంది. అంటే ఈ ‘వీరకోడి’ సైనికులు కిరాయి  సైనికులు కారు. డబ్బుకోసం ఏమైనా చేసేవారు కారు. స్థానిక రాజు ఒక వీరుడిని జైలులో పెడితే అతడిని విడిపించటం కోసం వీరులు ధనం చెల్లించారు కూడా. వీరు కిరాయి సైనికులు కారని, వీరు చట్టానికి, న్యాయానికి లోబడి ఉన్నారని నిరూపించే అంశం ఇది.

‘The new interpretation is that, erivire-pattinam was the name of the town conferred by the merchants of Ainnurruvar on it in appreciation of the brave deeds  done for them by soldiers such as  virar, virekkodiyar whom the Ainnurruvar merchants usually affectionately called nam makkel ‘our sons’.’ అంటే వీరకోడియన్లు కిరాయి సైనికులు కారు. వ్యాపారులు తమ సంతానంగా భావించే వారు. ఈ శాసనాలు అన్నీ పదకొండు – పన్నెండు శతాబ్దాల నాటివే. ‘వీరకోడిదండు’లు కిరాయి సైనికులు కారనటంతో పాటే వీరు తమిళదేశానికి చెందినవారు అని అర్ధమవుతుంది.  బహుశ రచయిత చెప్పిన ‘అయినవారు స్వాములు ‘ అయినురువర్ లేమో! తమిళ దేశానికి చెందిన వీర కోడియార్‍లను తెలుగు దేశంలో  వీరకోడిదండుగా చూపించటం అంత ఆమోదయోగ్యం కాదు. అదీగాక ‘కందెనవోలు’ జైనానికి పెద్ద స్థావరం కూడా కాదు. ప్రయాణ మార్గంలో కందెన పూసే స్థలం తప్ప కర్నూలు పెద్ద వ్యాపార కేంద్రం కాదు. ఈ విషయం ‘History and culture of the Kurnool Dist’ అన్న డి. గంగిరెడ్డి Phd ధీసిస్ స్పష్టం చేస్తుంది. ‘the name Kurnool is derived from kandenavole according to tradition in the time of Chalukyas (11th C). The persons who carted stones for construction of a temple used the site on which the town now stands as a halting place before crossing Tungabhadra River and greased their cart wheels. These circumstances led to formation of a small settlement on the spot, which gradually sprang up into a town, hence the name kandenavolu, the town of kandena or grease’. అంటే కథా కాలంలో కందెనవోలు ‘small settlement’ మాత్రమే. రచయిత చెప్పినట్టు ఆ కాలంలో ‘కందెనవోలు పట్టణం’ కాదు. రచయిత చెప్పినట్టు జైనం కందనవోలు సమీపంలో స్థిరంగా లేదు. ఇప్పటి కర్నూలు జిల్లాలోని ‘ఆదోని’ తాలూకాలోని ‘చిన్నతుంబలం’ ‘పెద్దతుంబలం’లు  ఆకాలంలో ప్రధాన జైనుల కేంద్రాలు. ‘ఆదోని’ అప్పటి ప్రధాన జైన కేంద్రం. ‘శిల్పగురి’లో కూడా జైనుల ఆలయాలున్నాయి.

ఇలా పరిశీలిస్తూ పోతే ‘వీరకోడిదండు’ కథలో అనవసర ప్రస్తావనలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తూ పోతే చరిత్రపరంగా పలు దోషాలు, అనౌచిత్యాలు ప్రస్తావించాల్సి ఉంటుంది. చరిత్ర ఆధారిత రచనలో కథకు అవసరమైనంత చరిత్ర పరిజ్ఞానాన్ని మాత్రమే పొందుపరచటం శ్రేయస్కరం. అయితే ‘వీరకోడిదండు’ కథ కూడా కాల్పనికమే. నేపథ్యంలో చరిత్రను ఉంచి, తమిళనాడులోని వీర సైనికులను  తెలుగుదేశంలో కిరాయి సైనికులుగా చూపించటం ఈ కథలో కనిపిస్తుంది. ఇది ఆంధ్రుల చరిత్ర కాదు. తెలుగులపై ఆరోపించిన తమిళచరిత్ర. దేశం ఎంత అల్లకల్లోలమైనా రాజులు వ్యాపారులను రక్షించే బాధ్యతను విస్మరించలేదు. వ్యాపారులు సైతం తమ రక్షణకు తామే దళాలను ఏర్పాటు చేసుకున్నారు తప్ప ‘కిరాయి సైన్యం’ కోసం భారతదేశంలో ఆధారపడలేదు. తమ రక్షణ కోసం రాజుకు ధనం చెల్లించేవారు వ్యాపారులు. ఇప్పటి పెద్ద వ్యాపారులలానే ఆ కాలంలోనూ వ్యాపారులు రాజ్యవిధాన నిర్ణయాలపై ప్రభావం చూపించేవారు. వీరినిరక్షించటంకోసమే దండు బాటలేర్పడ్డాయి. తమ రాజ్యంలో వ్యాపారులు ప్రయాణించే మార్గాలను ప్రత్యేకంగా దండు బాటలుగా ఏర్పాటుచేసి, ఆ బాటలకు సైనికులను కాపలాగా నియమించేవారు రాజులు. అందుకే అది దండుబాట అయింది.  రాయలసీమ ప్రాంతంలో నిరంతర పోరాటవీరులు పాలెగాళ్ళు. ఈ వ్యవస్థ విజయనగర కాలంలో ఏర్పడింది. విజయనగర పతనం తరువాత రాయలసీమలో బలమైన రాజుల పాలనలేదు. రాయలసీమ అల్లకల్లోలం అయింది. ఆ సమయంలో దివిటీ దొంగలు ప్రజలను పీడించేవారు. వారినుంచి పాలెగాళ్ళు ప్రజలను కాపాడేవారు. తరువాత ఈ వ్యవస్థా దిగజారి ప్రజలను పీడించేదిగా తయారయింది. అంతేతప్ప, రాయలసీమ చరిత్ర పరిశోధనల్లో ఎక్కడా వీరకోడిదండుల్లాంటి కిరాయి సైనికుల ప్రసక్తిలభించలేదు.  పాలెగాళ్ళ వ్యవస్థ తమిళనాడు, కర్ణాటకల్లోనూ వుంది. తమిళంలో వీరిని పాలైయాక్కర్ అనీ, కన్నడలో పాలెయగరు అనీ అంటారు. కథలో చూపినట్టు కిరాయి సైనికుల ప్రసక్తి, అదీ 10-11 శతాబ్దాల్లో మాత్రం  రాయలసీమ ప్రాంతాల్లో  ఎక్కడా లభ్యంకాలేదు. ఒకవేళ ఏవరయినా ఆధారాలు చూపితే అభిప్రాయాన్ని సరిచేసుకుంటాను.

కాలయంత్రం కథల సంకలనంలోని కథలన్నీ చదివి సంకలనానికి ముందు మాటను, అట్ట వెనుక మాటలను, ప్రతి కథ ముందూ సంపాదకులు  కథలకు   రాసిన పరిచయ వాక్యాలను చదివితే, రచయితలకు కానీ, సంపాదకులకు కానీ చరిత్ర ఆధారిత కాల్పనిక రచనల పట్ల అంతగా అవగాహన లేదన్న విషయం స్పష్టమవుతుంది.  రచయితలకు ఆసక్తి ఉందన్న విషయంలో సందేహం లేదు. అయితే కథా రచనలో ఆసక్తి ఒక్కటే సరిపోదు. కథ అల్లటం తెలియాలి. చరిత్ర గురించి ఏమాత్రం తెలియకున్నా ఫరవాలేదు. కానీ కథ అల్లటం తెలియాలి. ఏ అంశాన్ని కథగా మలచాలో నిర్ణయించే విచక్షణ అత్యంత అవశ్యకం. ఈ సంకలనంలో   కొన్ని చెప్పవలసిన కథలున్నాయి. అన్నీసా, గాంధీ హంతకుల కేసు కథ, సారంగపాణి కథ వంటివి చెప్పాల్సిన కథలు. కానీ, వీటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించటంలో దోషం, కథను చెప్పేపద్ధ తి ఎంపికలో లోపం, చరిత్ర పరిశోధనలోని అలసత్వం వంటి విషయాలు సంకలనంలోని కథలను దెబ్బతీశాయి. పలు కథలలో చక్కని అంశాలను కథగా మలచటం కోసం ఎంచుకున్నా, ఆ అంశంలో దేనిపై దృష్టి పెట్టాలో తెలియకపోవటం కనిపిస్తుంది. కథాంశాన్ని ప్రజెంట్ చేయటంలో కూడా అనుభవ  రాహిత్యం కనిపిస్తుంది. నాటకీకరణ, సంభాషణల ద్వారా కథను నడపటం, పాత్రల వ్యక్తిత్వ చిత్రణ, ఔచిత్య పాలన వంటి వాటిని విస్మరించటం కనిపిస్తుంది. కొన్ని రచనలలో కథ పూర్తయిన తరువాత కూడా కథ దేని గురించో తెలియని అయోమయం మిగులుతుంది. కొన్ని కథలు కథలుగా కన్నా నవలలుగా రాస్తే బాగుండేదని అనిపిస్తుంది. అనేక కథల్లో చరిత్ర, సంపాదకుడి మాటలో తప్ప కథలో కనబడలేదు. కథలో చరిత్ర ఉంటే, దాన్ని కథలో అంతర్భాగం చేసి ఆసక్తిగా చెప్పటం కనబడదు. దోష రహితంగా చరిత్రను ప్రదర్శించటం లేదు. ముఖ్యంగా చరిత్ర ఆధారిత రచనలకు ఆవశ్యకమైన పరిశోధన, పరిశీలన, అధ్యయనం, అవగాహన వంటివేవీ ఏ ఒక్క కథలోనూ కనబడకపోవటం శోచనీయం. ఏదో ఓ అంశం ఆధారంగా ఎలాగోలాగ కథ రాసేస్తే ‘చెల్లిపోతుంది’ అన్న అలసత్వం, నిర్లక్ష్యం ఈ సంకలనంలోని ప్రతి కథలోనూ కనిపిస్తుంది.

అయితే ఈ కథల సంకలనం ఔచిత్యపరంగా, నాణ్యతపరంగా, నైపుణ్యం పరంగా నిరాశ కలిగించి, విఫలమైనా, తెలుగు సాహిత్య ప్రపంచ దృష్టిని చరిత్ర రచనవైపు మళ్ళించటంలో విజయం సాధించింది. ఇందుకు ఈ సంకలనం కర్త, కర్మ, క్రియ అయిన సాయి పాపినేని అభినందనీయుడు. వ్రతం చెడ్డా ఫలితం దక్కటం అంటే ఇదే!

ఈ సంకలనం వల్లనే ఈ విమర్శనాత్మక వ్యాస పరంపర సాధ్యమయింది. ఈ సంకలనం వల్లనే కొద్ది విరామం తరువాత ‘తెలుగు సాహిత్యంలో చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు – 1872 నుండి నేటివరకూ’ అన్న వ్యాస పరంపర సంచికలో రాబోతోంది. ఈ సంకలనం ప్రభావంతో ఇటీవల జాగృతి వారపత్రిక చారిత్రక కథల పోటీ ప్రకటించింది. సిరికోన గ్రూపు చారిత్రక నవలల పోటీ నిర్వహించింది. చెలిమి వెబ్‍పత్రిక సంధ్య యల్లాప్రగడ రచించిన చారిత్రక నవలను సీరియల్‍గా ప్రచురిస్తోంది. అనేక యువ రచయితలు చరిత్ర కథలు ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు. ఉత్సాహం చూపుతున్నారు. దీనికంతటికీ కారణం ‘కాలయంత్రం’ కావటం, సాయి పాపినేనిని   అభినందనీయార్హం చేస్తుంది. అయితే ఉత్సాహానికి పద్ధతి తోడై ఉంటే బాగుండేది.   ఇలాంటి చారిత్రక కథా సంకలనాలు ప్రతి సంవత్సరం ప్రచురించాలన్న ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించడం వల్ల ‘కాలయంత్రం’ సంకలనంలోని లోపాలను, దోషాలను సవరించుకుంటూ రాబోయే సంకలనాలు నాణ్యతపరంగా, నైపుణ్యం పరంగా, చరిత్ర పరంగా ఉత్తమ స్థాయిలో ఉండేటట్టు చూసుకుంటే తెలుగు సాహిత్యం సాయి పాపినేనికి ఋణపడుతుంది. అయితే రాబోయే సంకలనంలో, తనకన్నా ముందు వచ్చిన చారిత్రక రచనలను పరిశీలించి, అధ్యయనం చేసి, వారి టెక్నిక్కులను అవగాహన చేసుకుని, వారు చేసిన పొరపాట్లను గమనించి, వారికి భిన్నమైన దారిలో తమదైన నూతన మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేయాలన్నది అభ్యర్థన. తమకన్నా  ముందు చరిత్ర రచనలు శూన్యం అనే అహంకారం కానీ, అజ్ఞానం కానీ, ఏం రాసినా చెల్లుతుందనే నిర్లక్ష్యం కానీ ఉత్తమ లక్ష్యాన్ని దెబ్బతీసే అంశాలు. వీటిని రాబోయే సంకలనాలలో పరిహరించటం వాంఛనీయం. చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు సృజనాత్మక రచనలు. ఈ రచనల్లో మనకెంత చరిత్ర తెలుసు అనేదానికన్నా, మనం ఎంచుకున్న అంశాన్ని ఎంత చక్కగా ప్రదర్శించి పాఠకుడికి అందిస్తున్నామన్నదే ప్రాధాన్యం. ఈ సంకలనం ఈ విషయాన్ని విస్మరించింది. రాబోయే సంకలనాల్లో సృజనకు ప్రాధాన్యం ఇవ్వాలి.  సరైన పరిశోధన, అవగాహన, కథలో అనవసర అంశాలు లేకుండా, సూటిగా చెప్పదలుచుకున్న అంశాన్ని అవసరమైన వివరాలు, నిరూపణలతో హృద్యంగా ప్రదర్శిస్తే రాబోయే సంకలనాలను ఆహ్వానించి, ఆదరించి, పాఠకులకు చేరువ చేయటం ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసే ప్రయత్నంలో అందరికన్నా ముందు ‘నేనే’ ఉంటానన్నది నిస్సందేహం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో విభిన్న రచనలకు గుర్తింపు ప్రోత్సాహం లేదన్నది, వాటికి గుర్తింపు కల్పించి, తెలుగు సాహిత్యంలో సముచిత స్థానం కల్పించాలన్నది  ఎప్పటి నుంచో నా పోరాటం. ఇన్నాళ్లకి దానికి ఒక మద్దతు లభించింది. అది సరైన రీతిలో లభించలేదన్నది ఆవేదన. భవిష్యత్తులో ఈ ప్రయత్నం ఫలవంతమై తెలుగు సాహిత్య పరిధిని విస్తృతం చేస్తుందన్నది ఆశ. చేయాలన్నది ఆకాంక్ష. అభిలాష.

ఈ వ్యాస పరంపరను సహృదయంతో స్వీకరించిన రచయితలకు, ఆసక్తితో  చదివి ఆదరించిన తెలుగు సాహిత్య అభిమానులైన పాఠకులకు, ప్రచురించిన సంచిక సంపాదకవర్గానికి ధన్యవాదాలు, బహు కృతజ్ఞతలు!

కొంత విరామం తరువాత 1872 నుంచి తెలుగులో చారిత్ర ఆధారిత కాల్పనిక రచనలు- ఒక పరిశీలన అనే వ్యాస పరంపర ఆరంభమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here