[dropcap]సా[/dropcap]యి పాపినేని సమాలోచన నిర్వహించి, వర్తమాన రచయితలతో(?) చారిత్రక కథా రచన కార్యాలను నడిపి, వారితో రచింపచేసిన పాతిక కథలలోంచి 15 కథలను మూడు మెట్లుగా సూక్ష్మంగా పరిశీలించి, కూర్చిన చరిత్ర కాల్పనిక కథల సంకలనం ‘కాలయంత్రం’ . తెలుగులో ఇలాంటి తొలిప్రయత్నం ఇది. ఇలాంటి ప్రయత్నం సంకల్పించి, నిర్వహించి, విజయవంతంగా కథల సంకలనం వెలువరించి సాహిత్య ప్రపంచం దృష్టిని చరిత్ర ఆధారిత కాల్పనిక కథా రచన వైపు మళ్ళించిన సాయి పాపినేని అభినందనీయుడు.
తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య ముఠాలు, సాహిత్య మఠాలు, సాహిత్య పీఠాలు ఏర్పరచుకొని మాఫియా ముఠాల్లా కొందరు కథ చుట్టూ ముళ్ళ కంచెలు బిగించారు. ‘కథ అంటే ఇలా ఉండాలి’, ‘ఇలాగే కథ రాయాలి’, ‘వీళ్ళే కథకులు’ అంటూ అనంతమైన కథా ప్రక్రియను గుప్పెట్లో పట్టేంతగా కుంచింపచేశారు. తెలుగులో అందుకే ఒకే రకమైన కథలు వస్తాయి. ఒకే రకమైన కథకులు వర్క్‌షాపుల్లో తయారైన వస్తువుల్లా ఒకే రకంగా రాస్తారు. ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కొత్తగా రాసే కథకులు ఈ మఠాలు, పీఠాలు, ముఠాల్లో చేరకపోతే వారెంతగా రాసినా ఎందుకూ కొరగారు. వారి సాహిత్యం పనికిరాదు. అందుకని యువరచయితలు తమ స్వీయ వ్యక్తిత్వానికి తిలోదకాలిచ్చి, వర్కుషాపుల్లో తామూ ఓ వస్తువైపోతున్నారు. విమర్శకులు సైతం ఈ వర్క్‌షాపు సరుకుల తయారీలను మాత్రమే కథకులుగా గుర్తిస్తూ విభిన్నమైన కథలను ఏదో ఓ కుంటిసాకుతో కథగా గుర్తించరు. అసలు అలాంటి రచనలున్నాయని, అలాంటి రచయితలున్నారని తెలియనట్టే ప్రవర్తిస్తారు. ఇలాంటి కథలే ఇతర భాషల్లో రాస్తే వాటిని పొగిడి, వాటి గురించి రాసి కాలరెగరేస్తారు. కానీ తెలుగులో మాత్రం రచయితలు అలాంటి కథలు రాయకూడదు. దాంతో తెలుగు కథ ఒక కొమ్మ మాత్రమే విపరీతంగా ఎదిగిన వికృత వృక్షంలా ఎదుగుతోంది. విభిన్నమైన రచనలు చేసినా ఆదరణ లేక, గుర్తింపులేక సాహిత్య ప్రపంచంలో అలాంటి రచయితలు, రచనలు చీకటి నీడల్లో ఒదుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో, అంతగా ఆదరణ లేని, తిరస్కారానికి గురయ్యే చారిత్రక కథా రచన పై అందరి దృష్టిని పూనుకుని ప్రసరింపచేయటం అభినందించాల్సిన విషయమే. కానీ ప్రయత్నం ఫలితం నిరాశ కలిగించేదిగా వుంది. కథల సంకలనంలోని కథలు నిరాశను కలిగిస్తాయి.
సముద్రపుదిబ్బ అన్న నవలలో విశ్వనాథ సత్యనారాయణ వ్యంగ్యంగా రాసినట్టు, చేనేత పరిశ్రమ గురించి తెలియనివాడు చేనేత శాఖ మంత్రి అవుతాడు. చరిత్రకథల సమావేశాల్లో చరిత్రకథలు రాసినవారు తప్ప మిగతా అంతా వుంటారు. దాంతో వున్నా చరిత్ర రచనలు లేనట్టే కనిపిస్తాయి. వజ్రం చూడలేనివారికి వజ్రామూ రాయే!!! తెలుగు సాహిత్య ప్రపంచంలో అడిగేవాడు లేడు. జవాబుదారీలేదు. అధ్యయనం లేదు. పరిశోధనలేదు. అందుకే తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్యం గురించిన ఆలోచన, అవగాహన, భవిష్యత్తుగురించిన ఆలోచన వున్నట్టు ప్రవర్తించరు. లేని రాజుగారి వస్త్రాల సౌందర్యాన్ని పొగిడేవారే అంతా. తెలుగులో కళ్ళకు గంతల విమర్శకులు ఉన్నారు కానీ తెలిసిన విమర్శక వ్యవస్థ లేదు. గుడ్డిగా పొగిడే అమ్ముడైపోయిన అజ్ఞాన అంధ మాగధ విమర్శకులున్నారు కానీ విషయం తెలిసి నిజానిజాలు విమర్శించే విమర్శకులు అరుదు. అయితే నిజానిజాలు అందరికీ తెలిస్తే పీఠాలు, ముఠాలు, మఠాల మనుగడకే ప్రమాదం కాబట్టి అలాంటి వారు తెలుగు సాహిత్యానికి అవసరం లేదు. అలాంటి వారు రాకుండా చూసుకుంటారు.
ప్రయత్నిస్తే ఎవరైనా కథలు రాయవచ్చు. కానీ మెప్పించే కథలు అందరూ రాయలేరు. అయితే ప్రయత్నిస్తే మామూలు సాంఘిక కథలను మెప్పించే రీతిలో రాయవచ్చు. కానీ చరిత్ర కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, హారర్ కథలు, డిటెక్టివ్ కథలు, సాంఘిక కథల రచనకు భిన్నమైనవి. ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా రాస్తే అభాసుపాలవుతారు. అవి రాయటానికి ఒక ప్రత్యేక ప్రయత్నం అవసరం. ఒక దృక్కోణం అవసరం. తయారీ అవసరం. పరిశోధన అవసరం. అవగాహన అవసరం. ప్రణాళిక అవసరం. అవి లేకుండా రాస్తే వందిమాగధగణ భజన బృందాలు పొగడవచ్చు. ముఠాల వారు ఆకాశానికి ఎత్తేయవచ్చు. జర్నలిస్టు స్నేహితులు పొగడుతూ ప్రచారం చేయవచ్చు. ఉన్నత స్థానాలలో ఉన్నవారు మంచిమాటలు ప్రచారం చేయవచ్చు. కానీ ‘తెలిసిన’ వారి మెప్పుమాత్రం పొందటం కష్టం. తాత్కాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత అపకీర్తిని మూట కట్టుకుంటాయి ఇలాంటి కథలు. అయితే అలా ‘తెలిసినవారు’ అరుదు. అలా ఉన్నవారిని పరిగణలోకి తీసుకోవడం ముఠాల గుప్పిట్లో ఉన్న తెలుగు సాహిత్య ప్రపంచంలో దాదాపుగా అసంభవం.
Historical novel is the most difficult form of fiction- john Buchan.
I have written novels, not strictly historical in a fifth of the time taken by an historical novel, and this must be the experience of any writer who has essayed both forms of fiction- Alfred Tresidder sheppard.
The task of writing historical fiction turned me from young woman to an old woman- George Elliot.
(ఇవి మచ్చుకి మాత్రమే. చరిత్ర రచనలు రాయటంలోని సాధక బాధకాలు ఈ సమీక్ష తరువాత వెలువడే వ్యాస సంపుటిలో విపులంగా వుంటాయి.)
సైన్స్ ఫిక్షన్ కానీ, చరిత్ర ఆధారిత కథలు కానీ రాయటానికి చాలా శ్రద్ధ కావాలి. ఉదాహరణకు ‘సైన్స్ ఫిక్షన్’ రాస్తూ విశ్వంలో కాలంలో బొరియలలాంటి ‘వార్మ్ హోల్స్’ (worm holes) ఆధారంగా కాలంలోకి ప్రయాణం చేసే కథ రాస్తూ, వార్మ్ హోల్స్‌ని జేబులో పెట్టే కాలయంత్రంలానో, లేకపోతే స్విచ్ ఆన్ చేస్తే ఆరంభమయి, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయే యంత్రంగానో, దాన్లో వందలు వేల సంవత్సరాలు వెనక్కి ప్రయాణించినట్టు గానో రాస్తే సైన్స్ తెలిసిన వారెవరూ దాన్ని సైన్స్ ఫిక్షన్‍గా పరిగణించరు. ఎందుకంటే worm hole అన్నది ఒక సిద్ధాంతం మాత్రమే. ఆ సిద్ధాంతం ప్రకారం వార్మ్ హోల్స్‌లో ప్రయాణిస్తే విశ్వాలు మారిపోతాయి. వేల సంవత్సరాలు కాదు మిలియన్ సంవత్సరాలు మారి మరో విశ్వంలోకి ప్రయాణిస్తారు. వెనక్కి మళ్ళే వీలుండదు. కానీ వార్మ్ హోల్ స్విచ్ ఆన్ చేసి ఓ వంద సంవత్సరాలు వెనక్కు ప్రయాణించి, మళ్ళీ వెనక్కి వచ్చినట్టుఎవరైనా కథ రాసి సైన్స్ ఫిక్షన్ అంటే తెలిసినవారు నవ్వి పోతారు తప్ప దాన్ని కథగా కూడా పరిగణించరు. కానీ తెలుగు సాహిత్యంలో, సరైన ముఠాకో, పీఠానికో చెందిన వాడయితే అది అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ కథ అవుతుంది. ఆ రచయిత అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ రచయిత అవుతాడు. అవకాశం దొరికినప్పుడల్లా సైన్స్ ఫిక్షన్ అనగానే వందిమాగధ గణాలు ఆ కథ, రచయిత పేర్లు ప్రస్తావిస్తూ, మరో పేరు వినపడకుండా జాగ్రత్తపడతాయి.
ఎవరయినా ఏదయినా పని ఆరంభించేముందు, తమ కన్నా ముందు ఈ విషయంలో పనిచేసినవారెవరు? ఆ పనిలో వారే స్థాయి సాధించారు? వంటి విషయాలని పరిశోధించి తెలుసుకుంటారు. వారు చేసినపనినే మళ్ళీ తాముచేయకుండా వుండేందుకు ఇది అత్యవసరం. వైజ్ఞానిక పరిశోధనలోనేకాదు, నిత్య జీవితంలోకూడా ఇది తప్పనిసరి. తన కన్నా ముందు ఎవరెవరు ఏమెమిచేశారు అన్నది తెలుసుకోవటం తప్పనిసరి.
ఈ పుస్తకం 2021లో ప్రచురితమయింది. ఇప్పటి నుంచి డెభ్భయి ఏళ్ళు వెనక్కి అంటే 1951. ఈ పుస్తకం అట్టవెనుక మాట ప్రకారం 1951 తరువాత తెలుగులో చరిత్ర రచనలు దాదాపుగా శూన్యం!!!!
చారిత్రక నవలా చక్రవర్తిగా గుర్తింపు పొంది 60పైగా రచనలు చేసిన ముదిగొండ శివప్రసాద్ రచనలన్నీ 1950 తరువాతవే. చరిత్ర రచనలకు ప్రసిద్ధి పొందిన లల్లాదేవి నవలలు , కథలు 1950 తరువాతవే. చరిత్ర రచనల పట్ల అత్యంత ఆసక్తిని రగిలించిన ప్రసాద్ రచనలు 1950 తరువాతవే. ప్రాచీన గాథాలహరి పేరిట రాజతరంగిణితో పాటూ పలు ఇతర చరిత్ర ఆధారిత రచనలను చేసిన పిలకా గణపతిశాస్త్రి, ఘండికోట బ్రహ్మాజీరావు, వాసిలి యామినీదేవి, చల్లా రాధాకృష్ణ శర్మ, బలివాడ కాంతారావు, జ్వాలాముఖి, కే ఆర్ కే మోహన్, కాటూరి రవీంద్ర త్రివిక్రం, జీవీ పూర్ణచంద్, దోరవేటి, పుట్టపర్తి నారాయణాచార్యులు, పీ రాజగోపాల నాయుడు, అంబడిపూడి వేంకట రత్నం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దిట్టకవి శ్యామలాదేవి, ఓగేటి ఇందిరాదేవి, ప్రాణ్‍రావ్, ఎస్డీవీ అజీజ్, శ్రీగంగ, తుర్లపాటి రాజేశ్వరి, ఎమ్మెస్వీ గంగరాజు, కల్లూరి రాఘవేంద్ర, ఘన శ్యామల, వేలూరి శివరామశాస్త్రి , పడాల, గోపరాజు నారాయణ రావు, చిత్తర్వు మధు వంటి వారి చరిత్ర ఆధారిత నవలలు, కథలు అన్నీ 1950 తరువాతవే. నందమూరి లక్ష్మీపార్వతి, వివినమూర్తి, సాయి బ్రహ్మానందం గొర్తి, సి. శ్రీనివాసరావు, గులాబీల మల్లారెడ్డి, ఉణుదుర్తి సుధాకర్, ఐతా చంద్రయ్య, వోల్గా, కె.బి గోపాలం, చిల్లర భవానిదేవి, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, యర్రం చంద్రశేఖర్, ఛాయరాజ్, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై, వంటివారు తమ రచనలు చేసింది 1950 తరువాతనే. (ఇంకా అనేకుల రచనల వివరాలు ఈ సమీక్ష తరువాత ప్రచురితమయ్యే వ్యాస పరంపరలో వుంటాయి. చరిత్ర రచనలు చేసి తమ ప్రస్తావనరానివారు ఆ విషయం తెలిపితే, ఆ వ్యాస పరంపరను సరిచేస్తాము. మరోసారి తెలుగులో మా కన్నా ముందు చరిత్ర రచనలు శూన్యం అని ఎవరూ అనకుండా ప్రామాణికము, సమగ్రమయిన వ్యాసాన్ని రూపొందించటంలో సహకరించండి.)
చరిత్ర రచనలలో నూతన ఒరవడి దిద్ది అత్యద్భుతమైన రీతిలో నూతన రచన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన విశ్వనాథ సత్యనారాయణ పురాణ వైర గ్రంథమాల, కాశ్మీర రాజవంశ నవలలు, నేపాల రాజవంశ నవలలు వంటి ప్రామాణిక చరిత్ర ఆధారిత రచనలు చేసింది 1955-65 నడుమ, అంటే 1951 తరువాతనే. భవదీయుడు కూడా కల్హణ కాశ్మీర రాజతరంగిణి కథలు (15 కథలు), ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు (32 కథలు), రోషనార, ముస్సోలిని, చరిత్ర పుటల్లోంచి (56 కథలు), శ్రీ కృష్ణ దేవరాయలు వంటి చరిత్ర ఆధారిత రచనలు చేసిందీ 1951 తరువాతనే. ఇవి వెంటనే గుర్తుకువచ్చిన కొద్దిమంది రచయితల పేర్లు. ఈ పేర్లలో చరిత్ర ఆధారిత కావ్యాలు, నాటకాలు సృజించిన వారివి లేవు. (మిగతా వివరాలు సంచికలో ప్రచురమయ్యే వ్యాసపరంపరలో ఉంటాయి) ఇతర రచన ప్రక్రియలతో పోలిస్తే ఇవి తక్కువ అనిపించవచ్చు . ఇతర భాషల్లో వున్నన్ని చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు తెలుగులో లేవన్నట్టు అనిపించినా, ఇతర భాషల సాహిత్య ప్రపంచంలో తెలుగులో వున్నన్ని ముఠాలులేవు. తెలుగు సాహిత్యంలో వున్నటు వంటి పరిస్థితులులేవు. కానీ ముఠాలు, మఠాలు, పీఠాల ఉక్కుపిడికిళ్ళలో బిగుస్తూ కూడా ఇన్ని రచనలు చరిత్ర ఆధారంగా రచించటమనే ఏటికి ఎదురీదే చందాన చేసిన రచనలను అభినందించకుండా ‘దాదాపు శూన్యం’ అనటంతోటే పై రచనలన్నీ హుళక్కి అయిపోతాయి. సాహిత్యం చిన్నబోతుంది. ఇది అన్యాయం. వున్న రచనలనూ లేవనుకోవటం కూడని పని. తనముందు ఆ మార్గంలో ప్రయాణించినవారిని అభినందిస్తూ, తనదైన మార్గంలో ప్రయాణించటం అభిలషణీయం. వాంఛనీయం. ఎలాంటి ఆదరణ, గుర్తింపు, ఉత్సాహ ప్రోత్సాహాలు లేకుండా కూడా ఇంతమంది, ఇన్ని రకాల రచనలు చేయటం ఒక విశేషం. ఇలాంటి వీరిని గుర్తించకుండా, వారికి అంజలి ఘటించకపోయినా ఫరవాలేదు, కనీసం అలాంటివారున్నారన్న స్పృహకూడా లేనట్టు ప్రవర్తిస్తూ, డెభ్బయి ఏళ్ళుగా తెలుగులో వాస్తవ చరిత్ర రచనలు దాదాపుగా శూన్యం అనటం ఆమోదయోగ్యంకాదు.
అయితే అట్టవెనుక వాడిన ‘వాస్తవ చారిత్రక రచనలు’ అన్న పదం గురించి కాస్త చర్చించాల్సి ఉంటుంది. చరిత్రలో వాస్తవం ఏది? కల్పన ఏది? ఈనాడు ‘వాస్తవం’గా భావించింది, రేపు కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే ‘అవాస్తవం’ అవుతుంది. లభించిన ఆధారాలను ఉపయోగించి తీర్మానించిన వాస్తవానికి గూడా ‘ఉహ’నే ఆధారం. ఈ ఊహా ఆ ఆధారాలను విశ్లేషించే వ్యక్తి నేపథ్యం, సంస్కారం, దృష్టి వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పైగా చరిత్ర చెప్పే వాస్తవం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. శాసనాలు, నాణేలు, శిలా ఫలకాలు వంటి వాటి ద్వారా తెలిసే నిజాలు కూడా ఒకోసారి వాటిని విశ్లేషించే వ్యక్తిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ‘మాముందు కొన్ని వాస్తవ చరిత్ర ఆధారిత రచనలు వచ్చాయి. డెభ్బయి ఏళ్ళుగా తెలుగులో చరిత్ర రచనలు దాదాపుగా శూన్యం అనటం వాస్తవ దూరం. వాస్తవమన్నది సాపేక్షం. ఇంద్రియాల ద్వారా లభించిన ఏ జ్ఞానం సంపూర్ణం కాదు. సంపూర్ణ సత్యం కాదు. ‘గత డెభ్భయి ఏళ్ళుగా చరిత్ర రచనలు శూన్యం’ అన్నది సంపాదకులకు వాస్తవం. కానీ సాహిత్య అధ్యయనపరులకు అది అవాస్తవం. సామాన్య పాఠకుడికి అది అప్రస్తుతం.
కాబట్టి ‘వాస్తవ చారిత్రక రచనలు చాలా కొద్ది’ అనటం ఆమోదయోగ్యం కాదు. అంతెందుకు, గమనిస్తే, పెద్దలకే చరిత్ర గురించి మంచి అభిప్రాయం లేదని అర్ధమవుతుంది. మచ్చుకి కొన్ని అభిప్రాయాలు.
Falsified history perhaps had more influence than true history—Dean Inge
I am reading an idle tale, and am very glad it is not metaphysics to puzzle my judgement, or history to mislead my opinion—–Mary Wortley Montagu.
Read anything but history, for history must be false—-Robert Walpole
History is only a confused heap of supposed facts– Chesterfield.
History is like sacred writing, because truth is essential to it- nevertheless there are many who think that books may be written and tossed into the world like fritters—-Cervantes.
కాబట్టి వాస్తవ చరిత్ర అన్నది అర్ధం లేని పదం. అప్పటికి లభించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఒక వ్యక్తి తానూహించినది వాస్తవంగా అనేకులను నమ్మిస్తే అది అప్పటికి వాస్తవ చరిత్ర అవుతుంది. వీర్ సావర్కర్ పూనుకుని అనేక ఆధారాలను పరిశీలించి ప్రథమ స్వాతంత్ర్య పోరాటం గురించి రాయకపోతే మనకు ఝాన్సీ లక్ష్మీ బాయి లేదు, తాంతియా తోపేలేడు. అనేక ఇతర వీరులూ లేరు. బ్రిటీష్ వారు చెప్పినట్టు అది దారితప్పిన అల్లరిమూకల అల్లరి అయ్యేది తప్ప ప్రథమ స్వతంత్ర పోరాటంగా నిలచివుండేది కాదు. ఇదీ వాస్తవ చరిత్ర స్వరూపం.
(చరిత్ర అంటే ఏమిటన్న విషయం గురించిన సమగ్రమయిన చర్చ ఈ సమీక్ష తరువాత ప్రచురితమయ్యే వ్యాస పరంపరలో..)
అయితే చరిత్ర ఆధారిత కాల్పనిక రచన కొన్ని నియమాలతో ఒదిగి ఉండాల్సి ఉంటుంది. కొన్ని సూత్రాలూ ఉంటాయి. అప్పటికీ చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలో విశృంఖలత్వం కూడా ఆమోదమే. ‘హిట్లర్ పై జరిగిన హత్యా ప్రయత్నాలు ఫలిస్తే’ అని ఊహించి రాయటం కూడా చరిత్ర రచనలో ఒక రకమైన రచన. అందుకే సమాంతరంగా ప్రయాణించే హిస్టారికల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ఒక స్థాయిలో కలసిపోతాయి. (ఈ అంశంపై సమగ్రమైన చర్చ రాబోయే వ్యాసపరంపరలో) అయినా సరే అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని చేసే ఊహలు, కల్పనలు తర్కబద్ధంగా ఉండాలి. లాజిక్ లేని ఊహలు ఎంత ఫాంటసిలో కూడా చెల్లవు. చెల్లని ఊహలు కూడా సమంజసమనిపించే రీతిలో సృజించి మెప్పించటం అత్యుత్తమ ప్రతిభకు తార్కాణం.
చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలను పలు విభిన్నమైన అంశాల ఆధారంగా విశ్లేషించాల్చి ఉంటుంది. ప్రధానంగా చరిత్ర అంశాల ఆధారంగా కథను అల్లటం గమనించాలి. అల్లిన కథలో రచయిత ప్రదర్శించాల్సిన అంశాలలోని తార్కికత, ఎంతవరకూ అవి సమంజసం వంటి విషయాలను చర్చించాల్సి ఉంటుంది. ఆ పై రచయిత కథను రూపొందించిన విధానం, దానిలో సంభాషణలు, వ్యక్తిత్వ చిత్రణ వాటి ఔచిత్యం గమనించాలి. రచయిత లక్ష్యం ఏమిటి? చరిత్ర ఆథారిత కథ ద్వారా రచయిత పాఠకుడికి చెప్పాలనుకున్న విషయం, దాన్ని ఆమోదయోగ్యంగా ప్రదర్శించటంలో రచయిత ఎంతవరకూ కృతకృత్యుడయ్యాడు వంటివి విశ్లేషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కథలో ఎంచుకున్న చరిత్ర అంశానికి తగ్గట్టు వాతావరణం సృష్టించటం, పాఠకుడికి అప్పటి పరిస్థితులు, మనస్తత్వాలు, ఆందోళనలు, ఆవేశాలు అర్థమయ్యేట్టు చేయటం, ఒక చారిత్రక నేపథ్యం సృజించటం వంటి విషయాలను పరిశీలించాలి. అంటే ఎలాగైతే సినిమాలో కథ, స్క్రీన్‍ప్లే, నటన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్, సంగీతం వంటి పలు అంశాలను ప్రత్యేఖంగా విశ్లేషిస్తూ, సినిమాపై వాటి ప్రభావం మొత్తంగా చర్చిస్తామో, చరిత్ర ఆధారిత రచనలను, సైన్స్ ఫిక్షన్ రచనలనూ కూడా ఇలాగే విశ్లేషించాల్సి ఉంటుంది. ఇదికాక పైపై పొరలన్నీ తీసి చూసి, చరిత్ర నేపథ్యంతో రచన చేస్తూ సమకాలీన సమాజాన్ని రచయిత స్ఫురింపచేయటం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చరిత్ర ఆధారిత రచనలలో అత్యంత ప్రాధాన్యం వహించే అంశం.
ఉదాహరణకు కాలయంత్రంలో వెంకట్ శిద్ధా రెడ్డి రాసిన ‘1948 - డైరీలో కొన్ని పేజీలు’ అన్న కథలో ‘గాడ్సే’ సిద్ధాంతం గురించి వ్యాఖ్యానిస్తూ రచయిత ‘రానున్న కాలంలో ఇలాంటి విపరీత ధోరణి కలిగిన వారి చేతుల్లో ఆ దేశం పడకూడదని ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను’ అంటాడు. ఇది ఆ కాలంలో జరుగుతున్న కథ అయినా ఈ వ్యాఖ్య సమకాలీన సమాజాన్ని స్ఫురింపచేస్తూ పరోక్షంగా రచయిత వేలు ఏవైపు చూపుతుందో తెలుపుతుంది. రచయిత అభిప్రాయంతో ఏకీభవించినా, ఏకీభవించకున్నా, రచయిత దృక్కోణాన్ని గమనించి, దాన్ని కథలో చొప్పించిన విధానాన్ని పరిశీలించాల్సివుంటుంది. ఇలాంటివి రచయిత దృక్కోణాన్ని తెలపటమే కాదు, కథ ద్వారా రచయిత పాఠకుడి మనస్సులో కలిగించలనుకున్న ఆలోచనను పసిగట్టే వీలిస్తాయి.
కాబటి చరిత్ర ఆధారిత రచనలను విశ్లేషించేటప్పుడు అనేక అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక చరిత్ర ఆధారిత రచన చేసేకన్నా ముందు రచయిత ఎంతగా చరిత్ర అంశాలను పరిశోధించి, పరిశీలించి, ఆ కాలానికి తాను ప్రయాణించి కథను సృజిస్తాడో, ఆయా కథలను విశ్లేషించేందుకు అంతకన్నా శ్రమ పడాల్సి ఉంటుంది. ఏదో పైపైన బాగుందనో, బాలేదనో రాస్తే సరిపోదు. ప్రతి పదం పరిశీలించాలి. చరిత్ర ఆధారిత రచనలో ప్రతి అక్షరం విలువైనది. ప్రతిభావం గమనించదగ్గది. ప్రతి చారిత్రక సమాచారం భావితరాలకు ప్రామాణికం అయ్యే శక్తి కలది. ‘కాలయంత్రం’ సంకలనంలోని కథలకే కాదు, ఏ చరిత్ర ఆధారిత రచనను అయినా లోతుగా, విశ్లేషించాల్సి ఉంటుంది. లేకపోతే విశ్లేషించినవాడు అభాసుపాలవుతాడు. సాహిత్యం, దాన్ని చదివిన భావితరాలు నష్టపోతాయి.
ఉదాహరణకు ఒక రచయిత కల్హణుడు రచించిన రాజతరంగిణి ఆధారంగా ఒక రచన చేశాడనుకుందాం. సామాన్య పాఠకుడు ఆ రచన చదివి మెచ్చుకున్నా తిట్టినా అతనికి ఆ హక్కు ఉంటుంది. విమర్శకుడన్నవాడు ‘రాజతరంగిణి’ తెలియకుండా కనీసం ఆ రచన రాజతరంగిణిలో ఏ అంశం ఆధారంగా సృజించిందో, ఆ అంశాన్ని అధ్యయనం చేయకుండా ‘ఇది అవాస్తవం’, ‘ఇది బాలేదు’, ‘ఇది సబ్ స్టాండర్డ్ రచన’ అంటే అపహాస్యం పాలయ్యేది విమర్శకుడే. ఒక రచన అసలు విలువను నిరూపించేది కాలం ఒక్కటే!!! ఎవరెన్ని తంత్రాలుచేసి తాత్కాలిక లాభాలు పొందినా కాలయంత్రం కరాళ దంష్ట్రలకు తన మన భేదం లేదు. దానికి మఠాలు, ముఠాలతో పనిలేదు. నిజం నిప్పులాంటిది. అది దాచినవాడినే దహించివేస్తుంది.
ఈ నేపథ్యంలో కాలయంత్రం చరిత్ర ఆధారిత కథల సంకలనంలోని కథలను విశ్లేషించాల్సి ఉంటుంది.
ఈ విశ్లేషణ వచ్చేవారం నుంచి ఆరంభమవుతుంది. ఈ విశ్లేషణలో వ్యక్తిగతం అన్నది ఏమీ ఉండదు. నిష్పాక్షికంగా, నిజాయితీగా కథలలోని పలు అంశాలను విశ్లేషించటం ఉంటుంది.