కలయో వైష్ణవ మాయో???

0
3

[dropcap]పూ[/dropcap]లతోరణాలతో అలంకరించిన ఆ స్టేజి.. దానిమీద కుర్చీలో నేను..

తండోపతండాలుగా వచ్చిన జనంతో పత్రికల వాళ్లతో ఫొటోగ్రాఫర్లతో పోలీసులతో అక్కడ ఎంతో కోలాహలంగా ఉంది. పోలీసు ఆఫీసరుతో బాటు నా మెడనిండా కూడా పూలదండలు..

‘సాహసం’ అనే మాటకే అర్థం తెలియని పిల్లాడిని నేను ఏదో సాహసం చేసానని పోలీసులతోబాటు అంతా నన్ను కూడా సత్కరిస్తున్నారు.

నేనేం చేసానని? అంటే ‘ఇంతకంటే ఏం చెయ్యాలని?’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు పోలీసులతోబాటు ఎందరో తల్లిదండ్రులు. నేను సాహసం చేసాననేందుకు సాక్షిగా మోకాలివరకు తీసేసిన గాలిలో వేలాడిపోతున్న నా మొండి కాలును చూపిస్తున్నారు. ఇప్పటికీ నేను బయటి ప్రపంచంలోకి వచ్చానని నాకు పూర్తిగా నమ్మకం కలగడం లేదు..

నిన్న రాత్రి కూడ సొరంగంలో ఊపిరాడక చచ్చిపోతున్నట్టు భయంకరమైన కలలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఇంతకీ అసలు జరిగిన విషయమేమిటంటే.. మొదట్నుంచీ చెప్పుకొస్తేనేగాని అర్థంకాదు ఎవరికీ!!!

***

వారం క్రితం ఆరోజు..???

“ఏయ్ గుంట ఎదవల్లారా! పోయి పడుకోండి. రేపు తెల్లారుజామునే లేవకుండా ఎవరన్నా ఆలీసం చేసారో తెలుసుగా కమ్చీ దెబ్బలు తప్పవు.” నల్ల రాక్షసుడు కర్కశంగా చేతిలో కమ్చీని మా మొహాల మీద గట్టిగా ఝళిపించి తలుపు మూసేసి వెళ్లిపోయాడు. మాకందరికీ తెలుసు మేం పారిపోకుండా ఎప్పటిలాగే బయట పెద్ద తాళం కప్ప వేసివుంటాడని.

వాడిని నల్ల రాక్షసుడు అని ఎందుకంటున్నానంటే తారు పూసినట్టున్న రంగులో పెద్ద పొట్టతో ఎత్తుగా ఉండడమేకాదు మా పిల్లల్లో ఎవరు కాస్త నీరసంతో పని ఆలస్యం చేసినా కమ్చీతో వాతలు తేలేలా కొట్టేస్తాడు కదా!

నిజానికి మాకందరికీ వాడిమీద పడి పీక పిసికి చంపెయ్యాలనివున్నా క్కక్క ప్రాణులం కదా ఏంచేస్తాం?

వీడికంటే పెద్ద రాక్షసుడొకడున్నాడు. చూసేందుకు మాత్రం సాత్వికంగా కనిపిస్తున్నా వాడి కళ్లు ఎప్పుడూ మండుతున్న నిప్పుల్లానే ఉంటాయి. మోకాళ్లమీదకి కట్టిన పంచెతో లావుగా రోడ్డురోలర్లా ఒక చేతిలో కాలుతున్న చుట్టతో ఇంకో చేతిలోని సీసాలోంచి ఎప్పుడూ ఏవో ఎర్రని నీళ్లు తాగుతూనే ఉంటాడు. కానీ వాడి బండ గొంతు విప్పితేనే మా పిల్లల గుండెలు దడదడలాడిపోతుంటాయి.

నెల క్రితం వాడెందుకోగానీ చాలా కోపంగా ఆంబోతులా రంకెలేస్తూ ఉన్నాడు.

దురదృష్టవశాత్తూ మా గ్రూపులోని సోముగాడికి ఆరోజు విరోచనాలు అవుతుండడంతో మట్టి తవ్వడానికి గునపం పైకెత్తలేక కాసేపు నీరసంతో కింద కూలబడ్డాడు. అంతే.. బూతులు తిడుతూ వాడిని పైకెత్తి దూరంగా విసిరేసాడు ఆ పెద్ద రాక్షసుడు. వాడి చావుకేక వినిపించినా పైకి ఏడిస్తే సోముగాడికి పట్టిన గతే మాకూ పడుతుందనే భయంతో ఎవరమూ కిక్కురుమనలేక ఏడుపును మాలోనే మింగేసాం. ఆ ముందు రాత్రి కడుపులో బాగా లేదని వాడి రొట్టెముక్కలు నాకే ఇచ్చేసేడని నాకయితే ఇంకా ఎక్కువ ఏడుపొచ్చింది.

అంతే. తర్వాత సోముగాడిని మళ్లీ మేం చూడలేదు. ఏ రాతికో తల తగిలి చచ్చిపోయుంటాడు. ఇలాగే పోయినవాళ్లు పోగా ఇప్పటికి యాభయి మందిమి మిగిలేం. కానయితే మళ్లీ ఎక్కడ్నుంచో మాలాంటి పిల్లలను తెచ్చి మా గుంపులో కలుపుతుంటారు.

అలాంటి చావు దృశ్యాలు మాకు అక్కడ కొత్త కాదు. సొరంగాలలో తవ్వుతున్నప్పుడు ఒకోసారి మట్టిపెళ్లలు విరిగి పిల్లల తలలు పగిలిపోయేవి. సొరంగంలోనే అలా భూస్థాపితమయిపోతున్నా ఆ రాక్షసులకు కనికరము లేదు.

వచ్చిన కొత్తల్లో నాలాంటి పిల్లలు దోస్తు చచ్చిపోయాడని గుండెలవిసిపోయేలా ఏడ్చేవాళ్లు. తర్వాత తమగతి అంతేననే భయంతో వణికిపోయేవారు. అలా చచ్చిపోయినవాళ్లని ఆ పాపిష్టివాళ్లు అక్కడే పూడ్చేసేవారు.

వాళ్ల దృష్టిలో మేము మనుషులం కాదు.. డబ్బిచ్చికొనుక్కున్న బానిసలం. ఎంత పనిచేసినా చాలీచాలని తిండి. తింటే బలిసిపోతామని సొరంగాలలో పట్టమేమోనని మా కడుపు మాడ్చేస్తున్నారు.

అబ్బా! ఈ జీవితం ఓ నరకం. అంతులేని తవ్వకాలవి. కొన్ని చోట్లయితే గాలిలోనే మా ప్రాణాలు. ఇక్కడికి మమ్మల్ని తెచ్చిన మొదట్లో నేను ఈ తవ్వకం పని ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. చెయ్యకపోతే వాళ్లు కొడతారు. చిత్రహింసలు పెడతారు. అంతకంటె పనిచేసి ఎండిన డొక్క నింపుకోవడమే మంచిదనుకున్నాను.

ఆ తవ్వకాలన్నీ విలువైన రంగురాళ్ల కోసమని ఒకసారెప్పుడో వాళ్ల మాటల ద్వారానే తెలిసింది.

సొరంగాల్లో బాధ తెలియకుండా తవ్వగలుగుతామని కాబోలు వీళ్లు అపుడప్పుడు మాకు కల్లు పట్టించి మరీ పంపుతారు. లోపల ఒకోసారి ఊపిరి సలపక నలిగిపోతున్నా కిక్కురుమనం. ఎక్కడినుంచి ఏ రాయి జారి తలమీద పడుతుందోననే భయం.. ఒకవేళ చచ్చినా మా ప్రాణాలు ఎవరికి విలువ కనుక..

అమ్మోరు మమ్మల్ని రక్షించేందుకు ఎవరినయినా పంపిస్తే ఎంత బాగుండునో?

కానీ ఎప్పుడయినా పోలీసులొస్తారని వాళ్లకు ముందే ఎలా తెలుస్తుందో ఏమో గాని నిముషాల్లో మమ్మల్ని అక్కడినుంచి తప్పించేస్తుంటారు. తరవాత మళ్లీ మరో ప్రాంతం.. అక్కడా అదే జీవితం.. ఇలా ఇప్పటికి ఎన్ని చోట్లు మారానో?

మా ఊరి నేస్తం సుబ్బు నాతో కలసివుంటే కనీసం ఇద్దరం కష్టసుఖాలయినా చెప్పుకునేవాళ్లంకదా!

అప్పట్లో ఊరి చెరువుగట్టు దగ్గరే ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవాళ్లమని?

సంక్రాంతి వస్తోందంటే చాలు ఊళ్లో మా పిల్లలందరికీ ఒకటే సందడి..

మేమంతా పోటీపడి గాలిపటాలు తయారు చేసి దారానికి గాజుపొడి రాసి మాంజా తయారు చేసి అవి వయ్యారంగా తోక ఊపుకుంటూ అలా అలా గాలిలో తేలిపోతూ నాట్యం చేస్తుంటే.. అబ్బ ఎంత సంబరపడిపోయేవారమని! ఎవరి గాలిపటం ఎత్తుకు ఎగురుతుందో అని పోటీలు పడేవాళ్లం. గాలిపటంగాని దారం తెగిపోయి చాలాసేపు గాలిలో చక్కర్లు కొడుతూ తర్వాత కిందకి రాలిపోతుంటే దానిని పట్టుకోవడానికి ముందూ వెనుకా చూసుకోకుండా ఎలా పరుగులు పెట్టేవారమని?

ఒకసారి సుబ్బు, నేను ఎగరేసిన గాలిపటాల మాంజా ఎగురుతున్న ఓ పావురం రెక్కకి తగిలి తెగి విలవిలా కొట్టుకుంటూ కిందపడేసరికి.. ఏంచెయ్యాలో తెలియక ఏడుపుమొహాలు పెట్టాం.

ఇంతలో అటువైపు తెలుగు మేష్టారు వచ్చారు. ఆయన ఆయుర్వేద వైద్యంకూడా చేసేవారేమో.. మాచేత ఏవో ఆకులు తెప్పించి.. నూరించి ఆ పావురాయి దెబ్బకి పూయించి కట్టు కట్టించారు.. మాస్టారితోబాటు వారం రోజుల పాటు అందరమూ దానిని కళ్లల్లో వత్తులు వేసుకుని సంరక్షించాం. రోజూ ప్రేమగా దానిని చేతుల్లోకి తీసుకుని గింజలు తినిపించేవాళ్లం. చివరకి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే అంతా తృప్తిగా ఊపిరి వదిలాం. ఇక ఆరోజు నుంచి గాలిపటాల దారానికి ఊళ్లో పిల్లలంతా గాజుపొడి మాంజా పూస్తే ఒట్టు.. కానయితే పట్టులేని దారం తొందరగా తెగిపోయి గాలిపటాలు గాలిలో దారీ తెన్నూ లేక కొట్టుకుపోతూంటే బాధగా నిట్టూర్చేవాళ్లం తప్ప ఇలా నేనూ సుబ్బూ ఆ గాలిపటాల్లాగే తలో దిక్కుకూ పోతామనుకున్నామా? అసలే బక్కలా ఉండే సుబ్బు అసలు బ్రతికి ఉన్నాడో లేదో? తలచుకుంటున్న కొద్దీ నాకు కన్నీళ్లాగడం లేదు.

చేప తనంత తానుగా కొంగ నోటికి చిక్కినట్టు.. ఆరోజున నేను, సుబ్బు చేసిన తెలివితక్కువ పనికి మా బ్రతుకులే మారిపోయాయి. మావూరి అమ్మోరి సంబరాల్లో.. మా యిద్దరితో సరదాగా మాటలు కలిపిన ఓ వ్యక్తి .. ఆ తర్వాత “మీరు నాకు బాగా నచ్చారు కనుక నాతో వస్తే మీకు మాత్రమే బంగారం తయారు చేసే విద్య నేర్పిస్తాను. ఈ విషయం ఇంకెవరికీ చెప్పకండి” అనేసరికి గుడ్డిగా నమ్మి ఇంట్లో చెప్పకుండా ఆ వ్యక్తి వెంట వెళ్లాం. అతను మాయమాటలాడుతూనే మమ్మల్ని తీసికెళ్లి ఓ పాడుపడిన ఇంట్లో పడేసాడు. అక్కడ చాలామంది మా వయసు పిల్లలున్నారు. “వీళ్లంతా మీలాగ నా శిష్యులే.” అన్నాడా మనిషి వెకిలిగా నవ్వుతూ.

ఆ పదమూడేళ్ల వయసులో వాడిది మోసం అని మాకెందుకు తెలియలేదో? అప్పుడే వస్తున్న నూనూగు మీసాల వెనుక మాకెన్ని స్వతంత్ర భావాలో? మాఅంతట మేముగా బంగారంతో బోలెడు డబ్బు సంపాదించేసి నాన్నావాళ్లకి చూపిస్తే ఎంత గర్వంగా చెప్పుకుంటారో అనేగా వీడి ఉచ్చులో చిక్కుకున్నాం? ఇప్పుడు అమ్మానాన్నా మాకోసం ఎంత ఏడుస్తున్నారో అని గుర్తొస్తుంటేనే మళ్లీ దుఃఖం ముంచుకొచ్చి నేను పడుకున్న కటిక నేల తడిసిపోయింది.

ఇవాల్టి ఎండదెబ్బకి నరిసిగాడికి ఇందాక గదిలోకి వచ్చిన వెంటనే పెద్ద వాంతి అయిపోయింది. యాభైమందిమి పడుకున్న గాలి చొరని ఆ గదిలో ఆ వాసనకి నాకు కడుపులో తిప్పేస్తోంది. అయినా ఆకలి తీరని డొక్కలోకి కాళ్లు మునగదీసుకుని వాసన తప్పించుకునేందుకు నా ముక్కుని చొక్కాలో దాచుకునేందుకు ప్రయత్నించాను. అయినా నిద్ర వస్తేనా???

మళ్లీ సుబ్బు గుర్తొచ్చాడు. ఆనాడు పాడుబడిన ఇంట్లోంచి ఆవ్యక్తి మమ్మల్ని తెలివితప్పించి ఎన్నెన్ని వాహనాలలో ఎక్కడెక్కడికి తరలించాడో ఇప్పుడు ఏం జ్ఞాపకం? కానయితే ఆతర్వాత నేను సుబ్బుని మా గ్రూపులో మరి చూడలేదు.

ఆ వ్యక్తి నన్నెవరికో అమ్మేసాడు. అక్కడ నా బ్రతుకు కొన్నాళ్లపాటు అడుక్కోవడమే అయింది. నాకు ఒక కాలు విరిచేసారు. ఎంతగా గగ్గోలు పెట్టానో? నా కాలికి ఆటల్లో చిన్న దెబ్బ తగిలితేనే కన్నీళ్లు పెట్టుకునే అమ్మకి ఈ విషయం తెలిసే ఉపాయమే లేదు.

నాతో ఉండే కొందరు పిల్లలకి కంట్లో జిల్లేడు పాలు పోసి గుడ్డివాళ్లను చేసారు. అడుక్కుని డబ్బులు తీసుకురాని రోజున ఒంటిమీద అందరికీ వాతలు. కొందరికి జేబులు కత్తిరించే పని అప్పజెప్పారు. ఇలా కొన్నాళ్లు మా అందరినీ ఎన్నిరకాలుగా అడ్డదారుల్లో ఉపయోగించుకోవాలో అన్నిమార్గాల్లోను ఉపయోగించుకున్నారు.

పట్టుబడితే జనంచేత తన్నులు తినేవాళ్లం. ఆ తర్వాత డబ్బు తేలేదని యజమాని చేత కూడా దెబ్బలు.. ఎంత సంపాదించినా యజమానికి ఇచ్చితీరాలి. అతనిచ్చే దాంతోనే బతకాలి. అక్కడ నాలాగ ఎంతమంది పిల్లలో? వాళ్లనీ ఎక్కడెక్కడినుండో మాయమాటలతో ఎత్తుకొచ్చి ఉండాలి. పారిపోయేందుకు కూడా లేకుండా యమభటుల్లాంటి రాక్షసులు కాపలా.. కొన్నాళ్ల తర్వాత నాతో కలిపి ఓ యాభైమంది పిల్లల్ని ఓ కాంట్రాక్టరుకి అమ్మేసాడు ఆ వ్యక్తి.

అప్పటినుంచి ఇదిగో వీళ్ల దగ్గరకి చేరుకున్నాను. ఓపికలేకపోయినా జొరం వచ్చినా ఇక్కడ ఈ గనుల్లో తవ్వాల్సిందే. ఎప్పుడో ఏ సొరంగం మధ్యనో ఊపిరాడకో.. లేదా ఈ రంగురాళ్ల తవ్వకంలో ఏ ఎర్రమట్టిపెళ్లల మధ్యలోనో నా రక్తం ఆవిరై పోతుందేమో! అబ్బా ఒళ్లునొప్పులు.. ఎంతకీ నిద్ర రాదేం? మళ్లీ పొద్దుటే లేవకపోతే వీపు చిట్లిపోతుందే! రక్తం చారికలు కట్టిన చిరిగిన నా చొక్కాకేసి చూసుకున్నాను. ఆ మరకలను చూసేసరికి మాఊళ్లో నేస్తాలతో మొదటిసారి ఆడిన హెూలీ గుర్తొచ్చింది,

అప్పుడు ఏడవ తరగతిలో ఉన్నాను.

కరణంగారమ్మాయి సరోజ ఎక్కడెక్కడో వెతికి ఊదారంగునిచ్చే బచ్చలి పళ్లను పోగుచేసింది. లలిత తిలకం సీసాలను, సిరాబుడ్డిని పట్టుకొచ్చింది. సుబ్బు అదే మా సుబ్రమణ్యం, నేను ఆకుల వేటలో పడ్డాం. వెంకటి వాళ్ల పక్కింటి నర్సును బతిమాలి పాత ఇంజక్షన్ గొట్టాలు సంపాదించాడు. మొత్తానికి మిత్రులమంతా పాత బకెట్లు సంపాదించి అన్ని రంగులూ కలిపేసి పిచికారీ చేసేసరికి అందరికీ ఒళ్లంతా దురదలు మొదలయాయి. చెరువు దగ్గరకి పోయి అందులో ఎంతసేపు ములిగినా దురదలు పోలేదు. ఆఖరికి వెంకటి పక్కింటి నర్సు ఇచ్చిన మందు బిళ్లలు వేసుకున్న గంటకిగానీ అందరికీ దురదలు తగ్గలేదు. చివరకు తేలిందేమిటంటే.. మేము కోసిన ఆకుల్లో దురదగుంటాకు కూడా కలిసిపోయిందని.

ఆ రోజంతా ఎంత నవ్వుకున్నామో కదా! అదంతా గుర్తొచ్చి నవ్వొచ్చి పొలమారింది నాకు. మా అమ్మ తలుచుకుంటోందేమో!

వెంకటి, నందూ వాళ్లంతా ఇప్పుడు ఏంచేస్తున్నారో? ఆ వయసులో ఏక్షణాన ఎందుకు పోట్లాడుకున్నామో మళ్లీ ఎప్పుడు కలిసిపోయామో తెలియని అపురూప క్షణాలవి. వాళ్లను తలుచుకునేసరికే నా మనసు ఆనందంతో పులకరిస్తోంది.

“ఏటిరా నక్కమొగం ఎదవా! నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మిఠాయి తింటున్నట్టుగాని కలొచ్చిందేటి? లెగవరా!” నల్ల రాక్షసుడు బూటుతో నా డొక్కలో పొడిచేసరికి నా పేగు తెగినట్టయి గట్టిగా మూలిగి గబాలున లేచి బయలుదేరాను.

నా అదృష్టమేమో మధ్యాన్నమయేసరికి ఎప్పటిలా ఎండ మండిపోవడం లేదు. కడుపులో ఆకలిమాత్రం దంచేస్తోంది.

“ఏరా రొట్టె ముక్కలు తింటారా?” అంటూ ఎండిపోయిన రొట్టెముక్కల్ని కుక్కకి చూపించి ఊరిస్తున్నట్టు ఆ బండ రాక్షసి వెధవలు మా కళ్లముందు ఆడిస్తుంటే నేను కుక్కనయితే వాడిమీద పడి పీకేసి అయినా తినేవాడినే.. కానీ..

“తినేసి లగెత్తండి. ఆ పెద్ద సొరంగంలో మీకు డూటీ ఏసాం.” అంటూ ఓ రాక్షసుడు మామీదకి రొట్టె ముక్కలు విసిరాడు.

సొరంగం పేరు విని కుంగిపోయాను. ఆ ఇరుకులో దూరి మోచేతులు కొట్టుకుపోతుంటే అటూ ఇటూ తవ్వుకుంటూ వెళ్లాలి. కానీ ఎదురుగా ఆహారం కనిపించేసరికి అక్కడున్న పిల్లలం వాటికోసం కలబడ్డాం. ఆ విషయంలో మాత్రం మేం నేస్తాలం కాదు. దక్కిన వాడికి దక్కినంత.. అయితే తినేసిన వాళ్లు ముందుగా సొరంగం కేసి కదలాలి.

అసలు ఆరోజు నాకెందుకో సొరంగంలో పని చెయ్యాలని లేనందున నేను కాస్త వెనకబడ్డాను. కానీ నా ఇష్టాయిష్టాలు ఎవడిక్కావాలి? ఫలితంగా విసిరిన రొట్టెముక్కల్ని నా నేస్తాలు ముగ్గురూ దక్కించేసుకోవడంతో నాకు ఆకలే మిగిలింది.

నీరసంగా కాలు ఈడ్చుకుంటూ నడుస్తున్నాను.. సొరంగంలోకి వెళ్లేందుకు ఒక్క పదినిమిషాలు ఆలస్యమయినా చాలని.. ఇదిగో ఈ రాళ్ల గుట్ట దాటితే సొరంగమొచ్చేస్తుంది.

ఇంతలో అక్కడ ఒక్క సారిగా ఎర్రదుమ్ము పైకి లేచింది. ఆ ధూళి వెనుక..

ఎక్కడనుంచో బూట్లతో పరుగులు పెడుతున్న చప్పుళ్లు.. తుపాకీమోతలు..

అంటే.. అం..టే.. పోలీసులు వచ్చారన్నమాట.. నా నరనరానా సంతోషం.. పొంగిపొరలింది.

కొందరు పిల్లలు అదును చూసుకుని ప్రాణాలకు తెగించి పోలీసుల వైపు పరిగెట్టే ప్రయత్నం చేస్తుంటే..

రాక్షసులు వాళ్లను ఈడ్చుకుపోయి బలవంతంగా సొరంగంలోకి తోసేస్తున్నట్టు నాకు కనిపిస్తోంది.

రాళ్ల గుట్ట అడ్డుగా ఉన్నందున నేను అటు రాక్షసులకే కాదు.. అటు పోలీసులకి కూడా.. కనిపించడం లేదు.

నేను గట్టిగా అరిస్తే పోలీసులు నన్ను గుర్తిస్తారు.. కానీ అదే సమయంలో రాక్షసులు కూడా.. అందుకే సాహసించలేదు.

కాసేపు అక్కడ ఎంతో పెద్ద యుద్ధమే జరిగింది.. పట్టుకునేందుకు పోలీసులు.. తప్పించుకోవడం కోసం రాక్షసులు.. చివరికి కొందరు రాక్షసులు పోలీసులకి దొరికిపోయారు.

వాళ్లకి ఒక్క పిల్లవాడూ దొరకలేదంటే??? అదంతా రాక్షసులు చాకచక్యమే. అయ్యో నేనయినా వాళ్లకి దొరికితే ఎంత బాగుండునో?

నేను గట్టిగా అరిస్తే ఇప్పటికైనా నాకు అవకాశముంది.

అందుకే ఆ ఆలోచన రాగానే తెగించి అరిచేందుకు ప్రయత్నించాను.

కానీ చిత్రం.. నా గొంతులోంచి శబ్దం బయటికి రాలేదు. మళ్లీ ప్రయత్నించాను.. ఊహూ..

మ ళ్లీ.. మ..ళ్లీ .. ఊహూ.. కేక బయటికి రావడంలేదు.. నీరసం వల్లనోయేమో..

ఇంక అక్కడ ఎవ్వరూ మిగిలి లేరని నిర్ణయించుకున్నట్టు పోలీసులు వాళ్లను తీసుకుని జీపులవైపు వెనుతిరిగి పోతున్నారు. అమ్మోరు తల్లీ! ఇంక జీవితాంతం నాకీ నరకం తప్పదా?

కాదు.. కనీసం లేచి ఎలాగయినా పరిగెత్తాల్సిందే..

పట్టుదలగా లేచి ఒంటికాలితో పోలీసులున్నవైపు ఆ పరిగెత్తడంలో పెద్ద రాయి తగిలి ముందుకు బోర్లా పడిపోయాను. అయ్యో పోలీసులు నన్ను చూడకుండానే వెళ్లిపోతారేమోనని ఏడుపొచ్చేస్తోంది.

ప్రాణాలుగ్గబట్టుకుని లేచి ఎలాగో నిలబడ్డాను కాని, అప్పటికే నా తలకు తగిలిన దెబ్బనుంచి రక్తమోడుతోంది. మూసుకుపోతున్న కళ్లను తెరిచి ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా శక్తి చాలడం లేదు.

నాకు తెలివి తప్పేలోగా పోలీసులు నన్ను చూడకపోతే..???

అటు పోలీసులు వెళ్లగానే ఈ రాక్షసులు మళ్లీ వచ్చేస్తారు. మమ్మల్ని బందీలుగా చేసి మరో చోటుకి పట్టుకుపోతారు. అంతే.. ఇంక జీవితాంతం ఈ సొరంగం తప్పదు. వద్దు అది నేను భరించలేను.. అంతకంటే నాకు చావు నయం. అయ్యో ఇక్కడ నేనున్నట్టు వెళ్లిపోతున్న ఆ పోలీసువాళ్లకు తెలిసేదెలా?

అరుద్దామంటే నా నోటినుంచి మాట బయటికి రావడంలేదు. అరవకపోతే పోలీసులు వెళ్లిపోతారు.

అదిగో.. దొరికిన రాక్షసులతో చాలా దూరమే వెళ్లిపోయారు.

కొన్ని క్షణాల్లో.. కనుమరుగయిపోతారు. బంగారంలాంటి అవకాశం జారిపోతోంది.

‘అమ్మోరు తల్లీ! అరిచే శక్తినియ్యమ్మా!’ నా గుండె ఆక్రోశిస్తోంది.

ఏం చెయ్యాలి? ఏంచెయ్యాలి?.. నా ఒళ్లు చెమటతో తడిసిపోతోంది.

ఉన్నట్టుండి నా తలలో పెద్ద మెరుపు.. అంతే!!! లేని ఓపిక తెచ్చుకుని పక్కనే పడిపోయిన నా గునపం ఎత్తి బలంగా నాకున్న ఒకే ఒక్క కాలి ఎడమపాదం మీద గట్టిగా దిగేసాను.

అంతే ఆకాశం భూమి బద్దలయ్యేలా నాగొంతులోంచి.. పె..ద్ద ..కే..క ..

చిట్టచివరి నడుస్తున్న పోలీసాయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. తక్కిన పోలీసులు చాలా దూరం వెళ్లిపోయారు.

కానీ ఆయన ఒక్కడే వస్తే చాటున నక్కివున్న రాక్షసుల చేతుల్లో కత్తులకి బలయిపోతాడు.

కానీ ఆయన భయపడలేదు. సాహసంతో నా వైపు అడుగులు వేసాడు.

ఆయనమీదకి దాడి చెయ్యడానికి చాటున నక్కిన రాక్షసులు కూడా నాకు కనిపిస్తున్నారు.

అయితే అతడు చేసిన తెలివైన పని విజిల్ ఊదడం. అంతే..

ముందు వెళ్తున్న పోలీసులందరూ.. వెనక్కి తిరిగి ఇటు వైపుకు పరిగెత్తుకు రావడం కనిపించింది నాకు.

విపరీతమైన రక్తస్రావంతో నాకు తెలివి తప్పుతూంటే.. ఎలాగో నా చెయ్యెత్తి ఆయనకు సొరంగాన్ని చూపించాను.

నాకు తెలుసు అటువెళ్తే అక్కడ దాచేసిన యాభైమంది నాలాంటి అభాగ్య పిల్లలకు నరకం నుండి విముక్తి దొరుకుతుంది..

నా కళ్లు మూసుకుపోతున్నా నా చెవులకి.. మాత్రం ఇంపుగా ఎన్నో పోలీసు బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.

ఆరోజు నా జీవితంలో నిజంగా బంగారు అక్షరాలతో రాసుకోవలసిన రోజు..

సొరంగం నుండి నాకు శాశ్వత విముక్తి.. ఎవరో నన్ను రెండు చేతులతోను పైకెత్తారు.

ఆ స్పర్శ ఎంతో ప్రేమగా.. ఉన్న ఊరులా.. మా అమ్మ ఒడిలా..!!!

ఇపుడు చెప్పండి. నిజమైన సాహసం ఎవరిది? తన ప్రాణానికి తెగించి ఒంటరిగా వెనక్కి వచ్చి నన్నాదుకున్న పోలీసాయనది. కాదా? కానీ వీళ్లంతా నాకు మిగిలిన రెండో కాలుని కూడా బలిపెట్టి నా తోటి యాభై పిల్లలను కాపాడిన నాది అంటున్నారు ఎందుకో? నాకు మాత్రం.. నేను ఎగరేసిన గాలిపటం దారం తెగి గాలిలో పల్టీలు కొడుతూ ఊరికి దూరంగా పొలాల మధ్యలో దొరికినప్పుడు కలిగిన వెర్రి ఆనందం!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here