కాళీ – తెలుగుభాష

1
2

[dropcap]స[/dropcap]హజంగా మన తెలుగువాళ్ళు కొత్తవాళ్ళ ముందు తెలుగులో మాట్లాడటం ఎంతో నామోషిగా భావిస్తూ ఎంత సేపూ వచ్చీ రానీ ఆంగ్లంలో మాట్లాడటానికే యిష్టపడతారనే విషయం మనకు తెలిసిందే. కానీ దానికి విరుద్దంగా పట్టభద్రుడైనప్పటికి ఉద్యోగం ఎప్పటికీ రాకపోయేసరికి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తన వాటాకి వచ్చిన ఆస్తితో కాలక్షేపం చేస్తూ ఎక్కువగా ఖాళీగా ఉండే కాళీకి తెలుగుభాష అన్నా, తెలుగులో మాట్లాడటమన్నా ఎంతో ఇష్టం. అటువంటి కాళీకి ఇపుడు ఎలా పట్టుకుందో తెలీదు కానీ తెలుగు భాష చచ్చిపోతుందేమోనని బెంగపట్టుకుంది. ఇక ఎవరైనా తనతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఎన్ని ఆంగ్లపదాలు దొర్లుతున్నాయో చూడటం, వాళ్ళని చడామడా దులిపేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.

“ఏవండీ! డైనింగ్ టేబుల్ మీద టీ గ్లాస్ పెట్టాను, తాగి బేగ్ తీసుకుని మార్కెట్‌కి వెళ్ళి ఫ్రెష్ కాయగూరలుంటే పట్టుకురండి” అని ఆర్డర్ (బాబోయ్! ఆజ్ఞ) జారీ చేసింది కాళీ భార్య.

“ఏమేవ్! ‘భోజనాల బల్ల మీద తేనీరుతో లోటా పెట్టాను, తాగి సంచి తీసుకుని సంతకివెళ్ళి తాజా కాయగూరలు తీసుకురండి’ అంటే నీ కొంపలేం అంటుకుపోతాయి” అందుకున్నాడు కాళీ.

“నా కొంపలేం అంటుకోవు కానీ లేట్ అయి మార్కెట్ క్లోజ్ చేసేస్తే నైట్‌కి ఫుడ్ పికిల్‌తో తినాల్సిఉంటుంది చూసుకోండి” అని తిరిగి సమాధానమిచ్చింది.

“అదుగో! అదుగో! మళ్ళా అవే మాటలు, ఆలస్యమైతే సంత మూసివేస్తే రాత్రికి పచ్చడి మెతుకులే గతి అనవచ్చు కదా” తిరిగి అందుకున్నాడు.

“చాల్లే సంబడం, ముందా పని చక్కబెట్టుకురండి” అని కసురుకోవడంతో సంచి పట్టుకుని సంతకి బయలుదేరాడు.

“గేట్ ముందు మోటర్ సైకిల్ తీసి ఆ కనిపిస్తున్న షెడ్‌లో లైన్‌లో పెట్టండి” కాళీకి కర్కశంగా వినిపించింది వాచ్‌మన్ (బాబోయ్! కాపలాదారుడు) కంఠం, హాడావిడిగా ఎక్కడ సంత మూసివేస్తారనే కంగారులో గుమ్మం ముందే మోటర్ సైకిల్ అదేనండి ద్విచక్ర వాహనాన్ని స్టాండ్ వేస్తుంటే… అదేనండి నిలబెడుతుంటే.

అసలు విషయం వదిలేసి కాపలాదారుడితో “ ఏమయ్యా! ‘గుమ్మం ముందు ద్విచక్రవాహనం నిలపకుండా, కనిపిస్తున్న ఆ పందిరి కింద వరసలో పెట్టండి’ అంటే నీ సొమ్మేం పోతుందయ్యా” అని ప్రశ్నించాడు.

“నా సొమ్మేం పోదండి, నా జాబ్ ఊస్టింగ్ అవుతందండి” అన్నాడు.

“అదుగో ‘నా ఉద్యోగం ఊడుతుంద’ని ఏడవచ్చు కదా” అని అందామని మరల దానికి సమాధానంగా ఆంగ్లంలో ఎన్ని పదాలు వినవలసి ఉంటుందోనని మనసులోనే గొణుక్కుని లోపలికి అడుగుపెట్టి ఒక కాయగూరల దుకాణం దగ్గరకు వెళ్ళాడు.

“కాయగూరలు ఏం కావాలి?” అని అడగటం మానేసి “కాయగూరల బేగ్ తెచ్చుకున్నారండీ, లేకపోతే జ్యూట్ బేగ్ ఇమ్మంటారా” అన్నాడు కాయగూరలు అమ్మేవాడు.

‘జ్యూట్ బేగ్ ఏంట్రా, జిడ్డుమొహం వేసుకుని, జనపనార సంచి అనటానికి ఏం జబ్బు వచ్చింది’ అందామని, అలా అంటే అక్కడనుంచి ఉన్న కాయగూరల పేర్లన్నీ ఆంగ్లంలోనే చెపుతాడేమో అని భయపడి కావలసిన కాయగూరలేంటో కొనుక్కుని సంత నుండి బయటపడి తిరిగి ఇంటికి బయలుదేరాడు.

***

అలా ఎంతసేపూ తెలుగు భాష ఏం అయిపోతుందో అనే ధ్యాసతో ఉంటున్నందుకో ఏమో తెలియదు కానీ అదుగో, ఒక రోజు చిన్నగా కునుకు తీస్తుంటే కాళీ కలలోకి కనువిందు చేస్తూ కనిపించారు శ్రీకృష్ణదేవరాయులు.

“ఏవోయ్ కాళీ! నీ తెలుగుభాషాభిమానానికి అభినందన చందనాలు. ఇదే విధంగా ఎల్లవేళలా తెలుగులోనే భాషించు, సంభాషించు, అలాగే అందరూ తెలుగుభాష విరివిగా ఉపయోగించేలా చూడు, లేనిచో అలనాడు కాళీయుని పడగలపై శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసినట్లు నీ భారీకాయంపై కాళీ మర్దనం చేస్తా” అని శ్రీకృష్ణదేవరాయలు కలలో అల్లకల్లోలం చేసేసరికి ఒక్కసారిగా మెలుకువ వచ్చేసింది కాళీకి. కల నిజమేనా అని తన పళ్ళతో తన గోళ్ళను ఒక్కసారి కొరుక్కున్నాడు. నిజమే, అలనాడు గజేంద్రుని మొసలి బారినుంచి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వేంచేసిన రీతిలో ఈనాడు తనని తెలుగుభాషని రక్షించడానికి పూనుకొనమని చెప్పటానికి సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు కలలో వేంచేసాడని భావించాడు. ఇంతలో ఇంటి ఇల్లాలి నుంచి ఇల్లెగెరేలా అరుపు వినిపించింది.

“పడుకుంది చాలు, లేచి అరటిపళ్ళ దుకాణానికి వెళ్ళి ఓ అరడజను కర్పూర అరటిపళ్ళు భజనలోనికి, ఇంకో అరడజను చక్కరకేళి అరటిపళ్ళు భోజనంలోకి పట్టుకు రండి” అంది.

అంతే ముఖమైనా కడగకుండానే మరింత గ్రాంథిక భాషతో తెలుగు భాషను రక్షించే కార్యంలో కార్యోన్ముఖుడైపోయాడు పక్కమీదనుంచే.

“’పడుకుంది చాలు’ ఏంటే ‘పవళించింది చాలు’ అనాలి, ‘అరటి పళ్ళేంటే’ ‘కదళీ ఫలాల’నాలే” అన్నాడు.

“పొద్దుపొడిచే వరకు మొద్దు నిద్రపోయి ఇప్పుడు ఏంటా సుద్దులు, ముందు నేను చెప్పిన పని ఒద్దికగా చేసి తగలడండి” అని, కాళీ తల కింద నున్న తలగడని ధడేల్న లాగేసింది.

ఇలా మొహం కడుక్కుని వచ్చాడో లేదో ఒక చేతిలో కాఫీ, ఇంకో చేతిలో చేతిసంచి ఉంచింది.

చేతిలో సంచితో కించిత్ ఆనందంతో పళ్ళ దుకాణానికి ఏతెంచి కనిపించిన అరటిపళ్ళ బండి అతనితో “కదళీఫలములు కడు కనువిందుగా కనిపించుచున్నవి, ఖరీదు ఎంత” అని అడిగాడు.

“నా దగ్గర కదిలే పళ్ళు, నడిచే పళ్ళు, పరిగెత్తే పళ్ళు ఉండవండీ. అంటిపళ్ళు మాత్రమే ఉంటాయండి, ఇట్టమైతే అట్టుకెళ్ళండి” అన్నాడు అరటి పళ్ళ దుకాణమతను.

“అదేనాయనా, ఓ అర డజను కర్పూర అరటిపళ్ళు భజనకు కావాలి, ఇంకో అరడజను చక్కరకేళి అరటిపళ్ళు భోజనంలోకి కావాలి, అమ్మే ధర ఎంతో నొక్కి వక్కాణించు” అన్నాడు కాళీ.

“భజనకే కావాలో, బుగ్గనే ఎట్టుకుంటారో నాకెందుకండీ, అలాగే నొక్కటాలు అవేం కుదరవండి, కనిపింతున్నయి కదండీ, ఏయీ మిగిలిపోయినియి కాదండీ. అలాగే మిగలముగ్గిపోయినియి కాదండి, మీ కిట్టమైతే అట్టుకెళ్ళండి లేపోతే లేదండి” అన్నాడు.

“అదికాదు నాయనా! అరడజను కర్పూర అరటిపళ్ళు, అరడజను చక్కరకేళి అరటిపళ్ళు అమ్మే ధర ఎంత” అడిగాడు.

“అరడజను చక్కరకేళీ అరవై అండి, అరడజను కర్పూర ఇరవై అండి” అన్నాడు అరటిపళ్ళ దుకాణమతను.

“అల్లంత దూరాన అమ్ముతున్న అరటిపళ్ళతను అమ్మే ధరకు నీవు అమ్మే ధరకు హస్తిమసికాంతర భేదముంది నాయనా” అన్నాడు తిరిగి.

“ఆస్తి మొత్తం రాసిచ్చేయమన్నానా! ఏం ఎకసిక్కాలాడుతున్నారా, యెళ్ళండి, యెళ్ళండి ఆడి దగ్గరకే యెళ్ళండి. అల్లంత దూరాన అమ్ముతున్న బొంత అరటిపళ్ళను మీ కంతలో యేసుకుని యెళ్ళండి” అనేసరికి చేసేదేంలేక అరటిపళ్ళతనికి ఎనభై యిచ్చి అరటిపళ్ళను సంచిలో వేసుకుని ఇంటిదారిపట్టాడు తెలుగుభాషకు తగినంత గౌరవం ఇవ్వటం లేదు అని తిట్టుకుంటూ.

***

ఈసారి ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊరిలో ఉంటున్న తన అన్నకు తనకు ఇష్టమైన స్వీట్స్ అదేనండీ మిఠాయిలు పంపించమని వాట్సప్‌లో తెలుగుభాషాభిమానాన్ని జోడించి ఇలా చాటుకుంటూ పోయాడు.

“అగ్రజులైన అన్నపేర్రాజు గారికి,

నాకు గర్రాజు(పిచ్చుకగూళ్ళు) లన్నా, కాజాలన్నా వల్లమాలిన మోజు అని మీకు తెలుసు. రోజురోజుకి ఆ మోజు పెరిగిపోతుంది. అందుకే తాజా అయిన గర్రాజులను అరడజను, కాజాలొక కేజీ పంపించగలరు.”

దానికి సమాధానంగా పేర్రాజు దగ్గరనుండి తిరిగి వాట్సప్‌లో సందేశమిలా దర్శనమిచ్చింది…

“ఖాళీగా కాలక్షేపం చేసే కాళీకి,

ఈ రోజే నీవు చెప్పిన గర్రాజులు అమ్మే షాప్‌కి వెళ్ళా. తాజా గర్రాజు ల్లేవు, అయినా లూజ్ ఇవ్వరంట, పేకెట్‌కి డజను ఉంటాయట, కాస్త బూజు పట్టినట్టు కూడా అనుమానం. కాజాలు తాజాగా ఉండి నాజూకైన నాలుగు సైజులలో ఉన్నాయి. తాజాగాలేని బూజు పట్టిన గర్రాజులే కావాలో, తాజాగా ఉండి నాజూకైన నాలుగు సైజులలో ఉన్న కాజాలలో ఏ సైజు కాజాలు కావాలో చెపితే ఆర్డర్ చేస్తా. ఫాస్ట్‌గా ఏ విషయం చెప్పు, డ్యూటీకి లేట్ అయితే మా బాస్ బోర్డర్ దాటిస్తాడు.”

అది చూసి కాళీకి ఒళ్ళు మండిపోయింది. నాలుగు ముక్కలు మాట్లాడితే దానిలో మూడు ముక్కలు ఆంగ్లంలో వగలు పోతూ తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు అని దిగులు పోయాడు, అసలు విషయం మరిచిపోయి తిరిగి ఇలా మెసేజ్ పెట్టాడు.

“అప్రాచ్యుడైన అన్నగారికి,

ఆలి లాంటి ఆంధ్రభాషను విడిచిపెట్టి వెలయాలి లాంటి ఆంగ్లభాషపై మోజు పెంచుకుని నీచాతినీచమైన పనికి ఒడిగట్టుతున్నావు. తక్షణమే వెలయాలిని విడిచిపెట్టకపోతే నా వంతుగా నీ అంతు చూస్తాను.”

తిరిగి అన్న దగ్గరనుండి ‘తక్షణమే ఓ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేయి’ అని మెసేజ్ చూసేసరికి హుతాశుడైనప్పటికి తన అన్న లాంటి వాళ్ళను మార్చడానికి తక్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఎన్ని లంకణాలు చేసి అయినా తెలుగు భాషకు వెలుగు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే ‘మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు భాషపై పట్టుసాధించి ఓ పట్టుపట్టడానికి రండి, తెలుగు భాషను అనర్గళంగా మీ గళం నుండి సంభాషించడానికి రండి, చేరండి. తెలుగు భాషకు వన్నె తీసుకురండి’ అని అట్టహాసంగా ఓ బోర్డ్ పెట్టాడు. ఒక్కడు వచ్చి చేరితే ఒట్టు. అంతే తెలుగు భాష వెలుగులోకి రావటంలేదనే దిగులుతో బెంగ పెట్టుకుని కుంగిపోసాగాడు.

తెలుగు భాషపై బెంగతో కుంగిపోతున్న కాళీని చూసి ఈసారి స్వర్గలోకంలో ఉన్న గిడుగు భూలోకంలో కాళీ కలలోకి ఒక అడుగు వేసి “బాబూ! కాళీ, మరీ గ్రాంథికంలోకి పోయావు, అందుకే అన్ని చోట్ల నీకు చుక్కెదురయ్యింది. కనుక వాడుక భాషను వాడు, వాడు వీడు అని లేదు ప్రతివాడి దగ్గర, ఇక తెలుగుభాష వేడుక చూడు” అని చెప్పేసరికి ఆ దిశగా మన కాళి ముందడగు వేసాడు.

“రండి, అతనితో కలిసి మనం అడుగులో అడుగు వేద్దాం, తెలుగుభాషకు వెలుగు తీసుకొద్దాం.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here