కాళిదాసు కావ్యాలలో కలికి తురాయి – రఘువంశం

4
3

[2024 ఏప్రిల్ 17 శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రాసిన ‘కాళిదాసు కావ్యాలలో కలికి తురాయి – రఘువంశం’ అనే వ్యాసాన్నిఅందిస్తున్నాము.]

[dropcap]సం[/dropcap]స్కృత విద్యార్థులు మొట్టమొదటగా రఘువంశం కావ్యం విధిగా అధ్యయనం చేయాలి అని ప్రతీతి. రఘువంశం కావ్యం రచించింది కాళిదాసు. ఈయన కవితా మాధుర్యానికి, ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయి ఈ కావ్యం. కాళిదాసు రచనల్లో ప్రముఖమైనవి రఘువంశం, మేఘసందేశం, కుమారసంభవం అనే మూడు కావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అనే మూడు నాటకాలు. కాళిదాసు ధారానగరాన్ని పరిపాలించే భోజమహారాజు ఆస్థానకవి అని ప్రసిద్ధి. కానీ చారిత్రకంగా చూస్తే కాళిదాసు క్రీ.పూ. ఒకటవ శతాబ్దంవాడు అనీ, భోజమహారాజు క్రీ. పూ. పదకొండవ శతాబ్దంవాడు అనీ పరిశోధకులు చెబుతారు. ఇతమిద్దంగా ఏదీ నిర్ధారణ లేదు. ఎందుకంటే కాళిదాసు రచనలలో తన కాలం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సరే! రఘువంశం గురించి మాట్లాడుకునేటప్పుడు చారిత్రకాంశాల గురించి ఎందుకు? ‘మాయాబజార్’లో శ్రీకృష్ణుడు అన్నట్లు “రసపట్టులో తర్కం కూడదు”.

రామాయణంలో సీతారాముల వివాహ సందర్భంలో దశరథుడు, జనకుడు ఇరువంశాల యొక్క వంశక్రమాలు చెప్పుకుంటారు. అప్పుడు ఇక్ష్యాకువంశంలో వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకువు దగ్గర నుంచీ శ్రీరాముడి వరకు చెబుతారు. కానీ కాళిదాసు, దశరథ మహారాజు ముత్తాత దిలీపుడి నుంచీ మొదలుపెట్టి లవకుశుల ముని ముని ముని మనవల వరకు రఘువంశ చరిత్ర చెబుతాడు.

అయోధ్యా నగరాన్ని పరిపాలించే దిలీప మహారాజు సకల విద్యా పారంగతుడు, ధర్మనిరతుడు. అయన భార్య సుదక్షిణాదేవి. దిలీపుడు యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతుష్టి పరచితే, దేవేంద్రుడు స్వర్గం నుంచీ భూమి మీద వర్షం కురిపించి పంట పైరు సమృద్ధిగా ఉండేటట్లు చేస్తాడు. ఆ విధంగా దిలీపుడు, దేవేంద్రుడు పరస్పర సహకారంతో స్వర్గ భూలోకాలను సంరక్షించుకుంటూ ఉంటారు. దిలీపుడికి ఎంత కాలానికీ సంతానం కలగలేదు. పుత్రసంతాన ప్రాప్తి కలిగించే అనుష్టానం కోసం కులగురువు వశిష్ఠ మహర్షిని దర్శించాలని భార్యతో కలసి అయన ఆశ్రమానికి వెళ్ళాడు దిలీపుడు.

వశిష్ఠ మహర్షి రాజుకి అతిధి సత్కారాలు చేసి “రాజా! పూర్వం నీవు దేవేంద్రుడిని దర్శించి తిరిగి భూలోకానికి వస్తూ ఉండగా త్రోవలో ఒకచోట కల్పవృక్షం నీడలో కామధేనువు పవళించిఉంది. కానీ నువ్వు ఆ కామధేనువును నమస్కరించకుండా వచ్చేశావు. అందుకు ధేనువు కోపించి “నన్ను తిరస్కరించావు కాబట్టి నా సంతతిని పూజించకుండా నీకు సంతానం కలుగదు” అని నిన్ను శపించింది. ఆ సమయంలో ఐరావతం ఆకాశగంగలో యథేచ్చగా మునుగుతూ పెద్ద ధ్వని చేస్తూ ఉండటం వలన కామధేనువు శాపం నీకు వినిపించలేదు. కాబట్టి నువ్వు, నీ భార్యతో కలిసి ఇప్పుడు కామధేనువు పుత్రిక అయిన నందినీ ధేనువుని పూజిస్తే సంతానం కలుగుతుంది” అని చెప్పాడు.

ఆరోజు నుంచీ వశిష్ఠుడి అనుమతి ప్రకారం దిలీపుడి భార్య నందినీ ధేనువుని గంధ, పుష్పాలతో పూజించి పూలమాలలతో ప్రతిరోజూ అలంకరించేది. అయన గోవు సంరక్షణా భారం చేపట్టాడు. అది మేత కోసం అడవికి వెళ్ళినప్పుడు క్రూరమృగాలు దాడి చేయకుండా అనుక్షణం అప్రమత్తతతో ఉండేవాడు. అది కూర్చుంటే తను కూర్చుంటూ, నిలుచుంటే తను నిలుస్తూ వెన్నంటి ఉండేవాడు. ఆ విధంగా దంపతులు ఆ ధేనువుని ఇరవై ఒక్కరోజులు సేవించారు.

ఇరవైరెండవ రోజు నందిని హిమవత్పర్వత ప్రాంతంలో గడ్డిమేస్తూ ఉండగా దిలీపుడు ఆ పర్వతశోభ తిలకిస్తూ ఒక్కక్షణం మైమరచిపోయాడు. ఇంతలో “అంబా!” అనే అరుపు వినిపించింది. గభాలున పక్కకు తిరిగి చూచేసరికి ధేనువుపై లంఘించి మెడ నోట కరచుకున్న ఒక సింహం కనిపించింది. వెంటనే దిలీపుడు బాణం తీయటానికి చెయ్యి ఎత్తాడు. చిత్రంగా ఆ చెయ్యి అలాగే బిగుసుకుపోయింది. సింహం మానవ భాషలో “రాజా! నేను పరమశివుడి సేవకుడను. నా పేరు నికుంభుడు. ఎదురుగా కనిపించే ఆ దేవదారు వృక్షం అంటే పార్వతీదేవికి ప్రాణంతో సమానం. దానికి ఎటువంటి హానీ కలగకుండా కావలిగా నన్ను ఇక్కడ నియమించింది. ఈరోజు భోజనం వేళకు నాకీ ఆవు దొరికింది. పరమేశ్వరుడి అనుగ్రహపాత్రుడనైన నన్ను నువ్వు ఏమీ చేయలేవు. కనుక దీన్ని నాకు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో!” అన్నది.

“సింహరాజా! చరాచర సృష్టి స్థితి లయాలకు కారకుడైన పరమేశ్వరుడు నాకు పూజ్యుడు. అయితే నా గురువు వశిష్ఠులవారికి ఎన్నో విధాల ఉపయోగపడుతున్న ఈ ధేనువు మరణిస్తూ ఉంటే చూస్తూ ఉండటం న్యాయం కాదు. నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో! దయచేసి ఈ ధేనువుని విడిచిపెట్టు” అని ప్రార్ధించాడు దిలీప మహారాజు.

సరే అని ఆవుని విడిచింది సింహం. మరుక్షణంలో సింహం మహిమ వలన ఆయన చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది. తనని చంపమని కళ్ళు మూసుకుని చేతులు మోడ్చి నిలబడ్డాడు. “వత్సా! ఇక లే!” అనే వాక్కు వినబడింది. ఎదురుగా నందినీధేనువు నిలబడిఉంది. సింహం మాయమయింది. “నిన్ను పరీక్షించటానికి నేనే ఈ మాయని సృష్టించాను. వశిష్ఠ మహర్షి ప్రభావం వలన నన్ను క్రూరమృగాలే కాదు, యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. నీ అభీష్టం నాకు తెలుసు. నా పాలను నువ్వు, నీ భార్య సేవించండి. త్వరలోనే సర్వలక్షణ సమన్వితుడైన కుమారుడు కలుగుతాడు” అని చెప్పింది.

నందిని చెప్పినట్లుగా ఆమె పాలను సేవించిన కొద్దిరోజులకి సుదక్షిణాదేవి గర్భవతి అయింది. అనతికాలం లోనే ఆమెకు చందమామ వంటి పుత్రుడు కలిగాడు. ఆ బాలుడికి రఘువు అని నామకరణం చేశాడు దిలీపుడు. రఘువు పెరిగి పెద్దయిన తర్వాత రాజ్యం అప్పగించి తపోవనానికి వెళ్ళిపోయాడు దిలీపుడు. రఘుమహారాజు విజయయాత్రకి వెళ్లి దేశానికి నాలుగు దిక్కులా ఉన్న రాజులను జయించాడు. వారంతా రఘుమహారాజుకి పాదాక్రాంతులయి కప్పాలు చెల్లించారు. కొంతకాలానికి అయన విశ్వజిత్తు అనే యాగం చేశాడు. జైత్రయాత్రలో జయించిన సంపదనంతా దానధర్మాలు చేశాడు.

యాగం చేస్తున్న రఘు మహారాజు – చిత్రం శ్రీమతి గోనుగుంట సరళ

ఆ సమయంలో కౌత్సుకుడు అనే ఋషి కుమారుడు రఘువు దర్శనానికి వచ్చాడు. మట్టితో చేసిన పాత్రతో పూజాద్రవ్యాలు తెచ్చి ఆయనను పూజించి కుశలప్రశ్నలు వేశాడు మహారాజు. “రాజా! మీ పరిపాలనలో అందరూ సుఖంగానే ఉన్నారు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా చీకటి వస్తుందా! నేను ఒక కార్యార్థినై వచ్చాను. కానీ నీ చేతిలో మృణ్మయ పాత్ర ఉండటం వలన నేను సమయం మించి పోయిన తర్వాత యాచించటానికి వచ్చాను అని విచారిస్తున్నాను” అన్నాడు కౌత్సుకుడు.

“అదేమిటో చెప్పండి” అన్నాడు మహారాజు.

“నేను విద్యాభ్యాసం ముగిసిన తర్వాత గురుదక్షిణ చెల్లిస్తానని మా గురువుగారు పరతంతు ఋషితో అన్నాను. నేను వినయ విధేయతలతో చేసిన శుశ్రూషలే చాలు, వేరే గురుదక్షిణ అవసరం లేదు అని చెప్పారు. కానీ నేను బలవంతపెట్టటంతో కోపించి, నేను ధనహీనుడనని తెలిసి కూడా ఒక్కొక్క విద్యకూ కోటి చొప్పున పధ్నాలుగు విద్యలకూ పధ్నాలుగు కోట్ల బంగారు నాణాలు కావాలని కోరారు. నీ దగ్గర ధనం లేదని అర్థమై నిన్ను యాచించలేకపోతున్నాను. మరొక దాతను అర్థించటానికి వెళతాను” అని చెప్పాడు కౌత్సుకుడు.

“మహాత్మా! నన్ను యాచించటానికి వచ్చిన విద్వాంసుడిని రిక్త హస్తాలతో పంపించాననే అపవాదు నాకు రాకుండా చేయండి. దయచేసి ఒక్కరోజు గడువు ఇవ్వండి. మీరు కోరిన ధనం ఇస్తాను” అన్నాడు రాజు. ఋషి కుమారుడు అంగీకరించాడు.

రఘుమహారాజు తన శస్త్రాస్త్రాలను రథంలో ఉంచాడు. సైనికులు అందరినీ కుబేరుడిపై దండయాత్ర చేయటానికి సంసిద్ధులను చేసాడు. ఆరాత్రి నిద్రించి, మరుసటిరోజు వెళ్ళటానికి సన్నాహాలు చేశాడు. ఈ సంగతి కుబేరుడికి తెలిసింది. రఘుమహారాజు శౌర్యపరాక్రమాలు తెలిసిన కుబేరుడు భయపడిపోయి అడగకుండానే కనకవర్షం కురిపించాడు. తెల్లవారి చూసేసరికి కోశాగారం అంతా ధనరాశులతో నిండిపోయింది. అయోధ్యానగర వీధులనిండా బంగారు నాణాలు వెదజల్లి ఉన్నాయి. పౌరులందరూ మహారాజు ప్రతాపాన్ని, దాతృత్వాన్ని కొనియాడుతూ ఆ నాణాలు ఏరుకున్నారు. ఋషి కుమారుడికి కావలసిన ధనం ఏనుగుల మీద, ఒంటెల మీద ఎక్కించి ఆశ్రమానికి తరలించాడు మహారాజు.

“రాజా! మహనీయుడైన నీ తండ్రికి నువ్వు ఎలాగో నీకూ అలాంటి పుత్రుడు కలగాలని ఆశీర్వదిస్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయాడు ఋషి కుమారుడు. రఘువుకి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడికి బ్రహ్మదేవుడి పేరైన ‘అజుడు’ అని పేరు పెట్టాడు మహారాజు. అజుడు పెరిగి పెద్దయి యౌవనవంతుడు అయిన తర్వాత రాజ్యం అప్పగించి వానప్రస్థానికి వెళ్ళాడు రఘువు.

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా అన్ని విధాల తండ్రితో సమానుడిగా పేరు తెచ్చుకున్నాడు అజమహారాజు. విదర్భ రాకుమారి ఇందుమతీదేవి స్వయంవరానికి ఆయనకు కూడా ఆహ్వానం వచ్చింది. రతీదేవి ప్రార్థించటం వలన ఈశ్వరుని అనుగ్రహం వల్ల మళ్ళీ జన్మనెత్తిన మన్మథుడిలా మెరిసిపోతున్నాడు యౌవనంలో ఉన్న అజమహారాజు. ఇందుమతి స్వయంవరంలో అతడిని వరించింది. ఇద్దరూ చాలారోజుల పాటు ఆనందంగా గడిపారు.

ఒకరోజు దంపతులు ఇద్దరూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆకాశమార్గాన విహరిస్తున్న నారదుడి వీణమీద పూలమాల జారి ఇందుమతి మీద పడిపోయింది. దానితో ఆమె మరణించింది. సతీవియోగంతో బాధ పడుతున్న అయన దగ్గరకు కులగురువు వశిష్ఠుడు శిష్యుడి చేత ఒక సందేశం పంపించాడు. “మహారాజా! వశిష్ఠుల వారికి మీకు వచ్చిన ఆపద తెలుసు. కానీ వారు యజ్ఞదీక్షలో ఉండటం వలన నా ద్వారా కొన్నిమాటలు చెప్పి పంపించారు. పూర్వం తృణబిందు మహర్షి తపస్సు చేసుకుంటుంటే, తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు హరిణి అనే అప్సరసను పంపించాడు. ఆమె ఒయ్యారాలు ఒలికిస్తూ తపస్సు భగ్నం చేయటానికి ప్రయత్నించింది. అందుకు మహర్షి కోపించి ఆమెను భూలోకంలో జన్మించమని శపించాడు. ‘స్వామీ! దేవేంద్రుడి అనతిపై నేను వచ్చాను. నేను అస్వతంత్రురాలిని. ఇందులో నా దోషం ఏముంది? క్షమించండి’ అని ప్రార్ధించింది. మహర్షి శాంతించి ‘దివ్యపుష్ప సందర్శనం కలిగే వరకు నువ్వు భూలోకంలో ఉంటావు’ అని శాపవిమోచనం చెప్పాడు. ఆ హరిణే ఇందుమతీదేవిగా జన్మించింది. ఇప్పుడు శాపం తీరిపోయింది. స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇందుకు నువ్వు దుఃఖించటం తగదు అని వశిష్ఠ మహర్షి చెప్పి పంపారు ప్రభూ!” అని చెప్పాడు. అజమహారాజు మనసు దిటవు చేసుకుని కొంతకాలం పరిపాలించి అనంతరం కుమారుడు దశరథుడికి పట్టాభిషేకం చేసి, గంగా సరయూ సంగమ ప్రాంతంలో దేహత్యాగం చేశాడు.

అజమహారాజు తర్వాత దశరథుడు రాజయ్యాడు. ఆయన జితేంద్రియుడు. మునులను ప్రజలను రక్షిస్తూ ప్రజారంజకుడు అయ్యాడు. అంతేకాదు, దేవేంద్రుడికి యుద్ధంలో సహాయపడ్డాడు. ఒకసారి వేటకు వెళ్ళాడు. పులులను, సింహాలను, అడవి పందులను వేటాడాడు. అలా వేటాడుతూ తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ పొదలచాటు నుంచీ బుడబుడమని శబ్దం వినిపించింది. ఏనుగు నీళ్ళు తాగుతున్నది అనుకుని శబ్దవేధి అస్త్రం ప్రయోగించాడు. యుద్ధంలో తప్ప ఏనుగులను వధించకూడదు అని ధర్మశాస్త్రం. కానీ దశరధుడు ధర్మాన్ని అతిక్రమించాడు. అందువల్ల వెంటనే ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది.

బాణం వేయగానే పొదలచాటు నుంచీ “అమ్మా” అనే ఆర్తనాదం వినిపించింది. గాబరాగా వెళ్లి చూసేసరికి బాణం గుచ్చుకుని విలవిలలాడుతూ రక్తప్రవాహంలో ఒక ముని కుమారుడు పడిఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే ఆ బాణం తనకే గుచ్చుకున్నట్లు తల్లడిల్లిపోయాడు దశరథుడు. “నాయనా! ఎవరు నువ్వు? నీ తల్లిద్రండ్రులు ఎవరు?” అని అడిగాడు.

“రాజా! ఇక్కడికి సమీపంలోనే మా ఆశ్రమం ఉంది. మా తల్లిదండ్రులు అంధులు. దాహంతో ఉన్నారు. ఈ మంచినీరు అందించు. నేనిక బ్రతకను” అంటూ కమండలం అందించి మరణించాడు. దశరధుడు అక్కడికి వెళ్లి భయపడుతూ తను చేసిన ఘోరకృత్యం అతడి తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఏకైక పుత్రుడిని కోల్పోయినందుకు వాళ్ళు గోలుగోలున ఏడుస్తూ “మా లాగే నువ్వు కూడా వృద్ధాప్యంలో పుత్రశోకంతో మరణింతువు గాక!” అని శపించి కన్నుమూశారు.

“మహర్షీ! నాకు ఇంతవరకూ సంతానం లేదు. మీ శాపం వలన నాకు పుత్రప్రాప్తి అవుతుందని తెలిసింది. ఇది నాకు శాపం కాదు, వరం” అంటూ నమస్కరించాడు.

కొన్నాళ్ళకు దశరథమహారాజుకు నలుగురు కుమారులు కలిగారు. మూడవ భార్య కైకకు ఇచ్చిన వరం ప్రకారం రాముడిని వనవాసం పంపించవలసి వచ్చింది. అతడి వియోగాన్ని భరించలేక మరణించాడు దశరథుడు. ఆ విధంగా ముని శాపం ఫలించింది. అడవిలో రాముడిని చూసి శూర్పణఖ మోహించింది. అతడు కాదన్నాడు, కోపంతో అన్న రావణాసురుడికి చెప్పింది. రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి, సీతను అపహరించి తీసుకుపోయాడు రావణుడు. రాముడు వానరుల సాయం తీసుకుని, సముద్రం పైన వారధి నిర్మించి, వెళ్లి రావణుడిని వధించాడు. వనవాసం ముగిసిన తర్వాత అయోధ్యకు రాజయ్యాడు. కానీ పౌరులు సీత శీలం మీద నిందలువేయటంతో ఆమెను మళ్ళీ అడవులకు పంపించాడు. సీత అడవిలో లవుడు, కుశుడు అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది.

శివధనుర్భంగం – చిత్రం శ్రీమతి గోనుగుంట సరళ

రాముడు యజ్ఞం చేసే సమయంలో లవకుశులు రామగానం చేశారు. వాల్మీకి మహర్షి సీతను వెంటబెట్టుకుని వచ్చి “ఈ బాలకులు ఇద్దరూ నీ కుమారులే!” అని రాముడికి చెప్పాడు. సీత తన పాతివ్రత్యం నిరూపించుకోవటానికి భూదేవిని ప్రార్థించింది. భూదేవి బయటకు వచ్చి సీతను తీసుకుని భూమి లోపలకి వెళ్లిపోయింది. రాముడు లవకుశులకు పట్టాభిషేకం చేసి సరయూనదిలో దేహత్యాగం చేశాడు.

చాలాకాలం గడిచిపోయింది. ఒకరోజు కుశమహారాజు భార్యలతో కలసి సరయూనదిలో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. ఇంతలో అయన చేతికి ఉన్న చైత్రాభరణం నీటిలో జారిపోయింది. అది ఆయనకు తండ్రి రాముడు ప్రీతితో ఇచ్చినది. ఆ ఆభరణం ధరించిన వారికి ఎల్లప్పుడూ విజయమే లభిస్తుంది. దాన్ని వెతికి తీసుకురమ్మని గజ ఈతగాళ్ళను ఆదేశించాడు. వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదు. కుశ మహారాజు ఆగ్రహంతో తన ఆభరణాన్ని అపహరించిన నాగరాజుని సంహరించటానికి గరుడాస్త్రం ఎక్కుపెట్టాడు. వెంటనే నీటిలో నుంచీ నాగరాజు ఒక నాగకన్యను వెంటబెట్టు కుని బయటకు వచ్చి నమస్కరించాడు.

“ప్రభూ! ఈమె నా చెల్లెలు కుముద్వతి. బంతి ఆడుకుంటూ ఎగసిపోగా దాని కోసం ఈమె చెయ్యి జాచగా మీ చైత్రాభరణం ఈమె చేతికి చిక్కింది. ఇదిగో! మీ నగ. దీనితో పాటు నా చెల్లెలిని కూడా స్వీకరించండి. మీ భార్య కావాలని చిరకాలం నుంచీ కుతూహలపడుతున్నది” అన్నాడు నాగరాజు. కుశమహారాజు ఆమెను పరిగ్రహించాడు.

కుశమహారాజుకి అతిథి అనే కుమారుడు జన్మించాడు. దుర్జయుడు అనే రాక్షసుడు ఇంద్రుడిపై దండెత్తి రాగా అయన కుశుడి సాయం అర్ధించాడు. దుర్జయుడితో జరిగిన పోరులో కుశుడు మరణించాడు. దుర్జయుడు కూడా మరణించాడు. మంత్రులు అతిథికి పట్టాభిషేకం చేశారు. తండ్రితాతల లాగ అతిథి వంటి ధర్మాత్ముడు లేదని పేరు పొందాడు. ఆశ్వమేధయాగం చేసి ఇంద్రాది దేవతలకు కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. అతిథి తర్వాత అతడి కొడుకు నిషధుడు కోసలదేశపు రాజు అయ్యాడు.

నిషధుడికి నళినాక్షుడు, అతడికి నభుడు జన్మించారు. నభుడి తర్వాత అతడి కొడుకు పుండరీకుడు ప్రభువు అయ్యాడు. పుండరీకుడికి క్షేమధన్వుడు, అతడికి దేవానీకుడు, దేవానీకుడికి అహీనగుడు, అతడి తర్వాత పారియాత్రుడు రాజ్యానికి వచ్చారు. ఇలా రఘువంశం తామరతంపరగా వర్ధిల్లింది.

ఇదీ కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్లుగా క్లుప్తంగా రఘువంశ చరిత్ర. ఇందులో కాళిదాసు చేసిన వర్ణనలు చాలా హృద్యంగా ఉంటాయి. దిలీపుడు నందినితో పాటు అడవులలో వెళుతుంటే ఇరువైపులా ఉన్న వృక్షాలే సేవకుల లాగా ఛత్రంపట్టి ఉన్నాయట. అజమహారాజు నిద్రపోతుంటే ఆయన ముఖ సౌందర్యం చూసి చంద్రుడు సిగ్గుపడి, వికాసం తగ్గి కుంగిపోతున్నాడట. ఇలాంటి మనోహరమైన వర్ణనలు చాలాచోట్ల ఉన్నాయి. రసానుభూతి పొందాలంటే కావ్యాన్ని ఆమూలాగ్రం చదవాలి.

(కోడిపుంజు తలపైన కుచ్చులాగా ఎర్రటిచర్మం ఉంటుంది. దాన్ని తురాయి అంటారు. కలికి అంటే అందమైన అని అర్థం. కలికి తురాయి అనే పదం అందమైన, మనోజ్ఞమైన అనే అర్థంతో వాడతారు.. కౌత్సుకుడికి గురువు నేర్పిన విద్యలు – నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు, ఆరు ధర్మశాస్త్రాలు.. మొత్తం పధ్నాలుగు విద్యలు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here