కాళిదాసు వాక్శుద్ధి

0
2

[dropcap]ఉ[/dropcap]జ్జయినిలో భోజరాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్న రోజులవి. ఉజ్జయినిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను భార్యతో కలసి ఒక చిన్న ఇంటిలో నివసించేవాడు. అతనికి ఒక చిరకాల వాంఛ ఉండేది. దివంగతుడైన తన తండ్రిగారి ఆబ్దీకం మహాకవి కాళిదాసు చేత జరిపించాలని. కాని అది తీరని కోరిక అని తెలుసు కాబట్టి ఏమీ చెయ్యలేక సతమతమయ్యేవాడు. రాజాస్థానంలో ఉన్న మహాకవి తనలాంటి పేదవాడి ఇంటికి వచ్చి ఆబ్దీకం చేస్తాడా అని నిరాశ పడేవాడు.

అనుకోకుండా ఒకరోజు అదృష్ట వశాత్తు ఈ పేద బ్రాహ్మణిడికి మహాకవి కాళి దాసు ఎదురు పడటం జరిగింది. ఆడబోయిన తీర్థం ఎదురైందన్నట్టు, ఆ బ్రాహ్మణుడు సంతోషించి, కాళిదాసుకి నమస్కారం చేసి పక్కన నిల్చున్నాడు. అప్పుడు కాళిదాసు అతని వైపు చూసి ఏం కావాలి అన్నట్టుగా తల ఊపాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కాళిదాసుకి మరలా నమస్కరించి, తన కోరిక తెలియజేసాడు…తన తండ్రిగారి ఆబ్దీకం జరిపించమని కోరాడు.

కాళిదాసు చిరునవ్వు నవ్వి, మీ తండ్రిగారి ఆబ్దీకం ఎప్పుడు అని అడిగాడు. ఫలానా రోజు అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా, కాళిదాసు, సరే ఆ రోజు అన్ని ఏర్పాట్లు చేసుకో, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళకి ఆబ్దీకం రోజు రానే వచ్చింది. ఆరోజు తెల్లవారు ఝామునే బ్రాహ్మణుడు అతని భార్య లేచి ఇల్లంతా పరిశుభ్రం చేసి, ఆబ్దీకానికి కావాల్సిన ఏర్పాట్లు, వంటలు అన్నీ చేసి కాళిదాసు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు… పుణ్యకాల సమయం దగ్గరికి వచ్చేస్తోంది. కాళిదాసు ఇంకా రావటం లేదని ఆ దంపతులు ఆందోళన చెందసాగారు.

చివరి క్షణంలో కాళిదాసు వారి ఇంటికి వచ్చాడు. వంట సిధ్దమయ్యిందా అని అడిగాడు. బ్రాహ్మణుడు సిధ్ధమే స్వామీ అని చెప్పాడు. వంట ఎవరు చేసారు అని కాళిదాసు అడిగాడు. నా భార్య చేసింది స్వామీ అతడు చెప్పగా, కాళిదాసు, వంట నువ్వు చెయ్యు అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహణుడు హడావిడిగా కొన్ని వంటలు చేసాడు. అప్పుడు కాళిదాసు మూడు పీటలు, మూడి విస్తర్లు వేసి, భోజనం వడ్డించమని చెప్తాడు. ఆ బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాలేదు, పూజా కార్యక్రమం, ఆబ్దీకానికి సంబందించిన తంతు ఏమీ జరపకుండా కాళిదాసు భోజనం వడ్డించమంటున్నాడే అని ఆశ్చర్యపోతూ, మరి కాళిదాసు చెప్పాడు కాబట్డి అతను చెప్పిన విధంగా చేసాడు.

అప్పుడు కాళిదాసు ఆ బ్రాహ్మణుడి తండ్రి, తాత, ముత్తాతల పేర్లు అడిగాడు. బ్రాహ్మణుడు వారి పేర్లు చెప్పాడు. వెంటనే కాళిదాసు ఆ ముగ్గురు దివంగతుల పేర్లు‌ ఉచ్చరించి, ఆవాహాయామి అని శ్లోకం చెప్పగనే….ఎప్పుడో చనిపోయిన ఆ ముగ్గురు అక్కడ ప్రత్యక్షమయ్యి, ఆ మూడు పీటల మీద కూర్చున్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆశ్చర్యంతో అవాక్కయ్యారు.

అప్పుడు కాళిదాసు ఇలా అన్నాడు, ఆబ్దీకం ఎందుకోసం చేస్తున్నావు, నీ పెద్దలకి భోజనం పెట్టాలనే కదా….ఇప్పుడు స్వయంగా వారే వచ్చారు….తొందరగా వడ్డించు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆనందంగా తన పెద్దలకు భోజనం పెట్టగా వారు తృప్తిగా భుజించి, వారిని దీవించి అంతర్ధానం అయ్యారు….. వాక్శుధ్ధితో పైలోకంలో ఉన్నవారికి భూలోకానికి రప్పించిన మహాకవి కాళిదాసుని ఆ బ్రాహ్మణ దంపతులు వేనోళ్ళ కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here