[ఈ కథలోని సన్నివేశాలూ, పాత్రలు కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు. – రచయిత.]
[dropcap]బు[/dropcap]జ్జిబాబుకు పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఏమీ లోటు లేదు. బుజ్జిబాబు అనాకారి కాదు. పెద్ద అందగాడు కాకపోయినా ఓ పిసరంత అందగాడే!
అయితే అతను ఏ అమ్మాయి నైనా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం విషయంలో అతనికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. అది సమస్య కాదు ధర్మసందేహం. ధర్మసందేహమూ కాదు. అనుమానం. అనుమానము కూడా కాదు.. ఆవకాయ జాడీలో అరటిపండు లాంటి ఆదోరకమైన సమస్య.
సరే ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ రోజు ఉదయం బుజ్జిబాబు ఆయాసపడుతూ తన గురువు త్రిలోకచంద్రంగారి ఇంటికి వచ్చాడు. విషయం అంతా ఆయనకు చెప్పి అక్కడున్న గ్లాసుడు నీళ్ళు గబగబా తాగేశాడు.
శిష్యుడు సమస్యకు సంబంధించిన విషయం అంతా విన్న గురువుగారు పకపకా నవ్వేశారు.
“ఒరేయ్ బుజ్జిబాబు.. ప్రపంచంలో అందరూ నీలాగే ఆలోచిస్తే ఈ సృష్టి చక్రం తిరగదురా. నీది అనవసరపు భయం. పనికిరాని ఆందోళన. ఏదైనా సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇట్లాగే ఉంటుంది. మరీ ఇంత పిరికితనం పనికిరాదు సుమీ. సరే.. వచ్చి.. ‘గురువుగారు ఈ విషయంలో మీ సలహా ఇవ్వండి..నాకు ధైర్యం చెప్పండి’.. అని అడిగావు కనుక నాకు తోచిన సలహా ఇవ్వాలి. కానీ నీ మనసును బట్టి నీకు సలహా ఇవ్వకూడదు. ప్రాక్టికల్‌గా చూపించాలి. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. సరే బయలుదేరు మనం ఇద్దరం నా మోపెడ్ మీద నాలుగు చోట్లకి వెళ్ళాలి..” అంటూ శిష్యుడు బుజ్జిబాబుని వెనుక సీటు మీద కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ బయలుదేరారు.. గురువు త్రిలోకచంద్రo గారు.
శిష్యుడిని ముందుగా తన అన్నగారు కొడుకు చక్రి ఇంటికి తీసుకెళ్లారు.
చక్రి ఇద్దర్నీ లోపలకు ఆహ్వానించి కూర్చోమని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. వెంటనే తన భార్య మండోదరిని బయటకు పిలిచి.. “వచ్చిన వాళ్లను పలకరించడం నీకు చాతకాదా.. బుద్ధి జ్ఞానం లేదా.. గడ్డి తింటున్నావా?? మంచి నీళ్లు ఇవ్వడం తెలియదా” అంటూ గట్టిగా అరిచాడు. ఆమె భయపడి ప్రశాంతంగా తల కిందకు దించి మౌనంగా ఉండిపోయింది. చక్రి మళ్లీ ఆమెను తిట్టడం మొదలెట్టాడు..
“ఆ మౌనం ఏమిటి.. కాపురం చేయడం రాకపోతే ఎందులో అయినా దూకి చావు.. ఛీ ఎదవ పెళ్ళాం.. ఎదవ పెళ్లి చేసుకున్నాను..” అంటూ చెడమడ నోటికి వచ్చినట్టు అలా ఊరంతా వినబడేలా తిడుతూనే ఉన్నాడు. పొలికేకలు పెట్టాడు. ఆమె ఏడుస్తూ భర్త కొడతాడేమో అని భయపడి వంటింట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టేసుకుంది. చక్రి పరుగున వెళ్ళి తన బూటుకాలితో ఆ తలుపుని గట్టిగా తన్నాడు. నిమిషంలో ఆ ఇల్లంతా భయంకర యుద్ధభూమిలా మారిపోయింది. బుజ్జిబాబు అంతా గమనిస్తూ బెంబేలెత్తి పోయాడు.
బుజ్జిబాబు భయపడిపోయి లేచి మంచినీళ్లు కూడా తాగకుండా బయటకు వెళ్ళిపోయాడు. త్రిలోకచంద్రం గారు తన అన్నగారి కొడుకు చక్రిని సముదాయించి వేరే పనిమీద ఇటు వెళ్తున్నామని మళ్ళీ వచ్చేటప్పుడు ఆగుతామని చెప్పి తను కూడా బయటకు వచ్చేశారు.
బుజ్జిబాబు గురువుగారిని చూసి లోపల జరిగిన సంఘటనకు గుండెలు బాదుకుంటుడగా..
“ఆగరా.. ఆగాగు.. కంగారు పడిపోకు. ప్రాక్టికల్ అని చెప్పాను కదా సీన్లు ఇలాగే ఉంటాయి”.. అని చెప్పి అతడిని పక్క వీధిలో ఉన్న తన తమ్ముడుగారి అబ్బాయి చలం ఇంటికి తీసుకుని వెళ్లారు.
చలం ఇద్దరిని ఆహ్వానించి లోపలకు తీసుకెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టాడు. అంతే.. లోపల నుండి అతని భార్య కైకమ్మ బయటకు వచ్చింది. వస్తూనే..
“మీరు అసలు మనిషి జన్మ ఎత్తలేదు. సోఫాలు నిన్ననే క్లీనింగ్ చేయించాము కదా. వాట్ల మీద ఎందుకు కూర్చోబెట్టారు. అవి పోతే మా అమ్మగారు అస్తమానం పంపించలేరు కదా. కొంచెం జ్ఞానం తెలుసుకుని బ్రతకండి.. వెధవ బ్రతుకు.. బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే.. ఛీ ఛీ” అంటూ.. వచ్చిన వాళ్ళను కూడా పలకరించకుండా విసురుగా లోపలికి వెళ్ళిపోయిoది, అక్కడున్న కుర్చీని తన్నుకుంటూ! దాంతో చలం చాలా చిన్న బుచ్చుకుని కళ్ళవెంట నీళ్ళు పెట్టుకున్నాడు తన పెదనాన్నని చూసి.
త్రిలోకచంద్రం.. చలానికి నాలుగు మంచి మాటలు చెప్పి.. “కంగారుపడకు. అంతా బాగుంటుందిలే.. పక్కనే ఉన్న మునిసిపల్ ఆఫీస్‌కు వచ్చామురా.. ఆ పని చూసుకొని.. అలా వెళ్లిపోతాము” అంటూ బయటపడ్డారు.. శిష్యునితో సహా.
“చూసావురా బుజ్జిబాబు.. ఇంతకుముందు మనం చూసిన కేసుకి ఈ కేసు రివర్స్!!!..” అంటూ బుజ్జి బాబు వైపు చూశారు.
బుజ్జిబాబు తల పట్టుకుని ఓ చెట్టు మొదల నీరసంగా కూర్చుండిపోయాడు.
“ఛీ ఛీ అలా పిరికిపడకురా. ఇక్కడితో ఇంటర్మిషన్ అయ్యింది. ఇంకా సగం స్టోరీ నీకు చూపించాలిరా” అంటూ అతడిని మోపెడ్ వెనుక కూర్చుండ బెట్టుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీహరి కాలనీకి తీసుకువెళ్ళారు. అది తన కొలీగ్ సూర్యారావుగారి అమ్మాయి శకుంతల ఇల్లు.
“బుజ్జిబాబు ఇది మూడవ జంట ఇల్లు రా. ఇంత వరకు నువ్వు ఒక గుండెతోనే ఉన్నావు. కానీ ఇప్పుడు రెండు గుండెలు నీకు ఉండాలి. అర్థం కాలే. కాసేపు ఆగు. రీలు తిరగడం మొదలవుతుంది..” అంటూ భయపడుతున్న శిష్యుడిని బలవంతంగా లోపలకి లాగారు.
లోపల శకుంతల ఆమె భర్త దుష్యంత్.. ఉన్నారు అనేకన్నా ఇద్దరు భయంకర రాక్షసులు ఉన్నారు అనడం సబబు.
వాళ్ళిద్దరూ తమ గదిలో అటూ ఇటు నిలబడి.. స్వచ్ఛమైన బూతులు తిట్టుకుంటూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒకరిమీద ఒకరు గిరాటేసికుంటున్నారు. తగ్గేదే లే..అన్నట్టు రెండు శివంగుల్లా భీకర యుద్ధం చేసుకుంటున్నారు. ఈ భూప్రపంచంతో వాళ్లు ఇద్దరకు సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఎవరు గెలుస్తారు అన్న ఆత్రుత మాత్రమే అక్కడ రాజ్యమేలుతోంది.
బుజ్జిబాబు..అంతా చూసి పిచ్చి ఎక్కిన వాడిలా అరవాలి అనుకున్నాడు. పక్కనే ఉన్న గురువు గారు అతని నోరు మూసి రెక్క పట్టుకుని బయటకు లాక్కు వచ్చేశారు.
“గురువుగారు.. బాబోయ్ ఇది ఇల్లా కురుక్షేత్రమా? ఈ భార్యభర్తలు మనుషులు కాదండి. ఆ ఇద్దరు పిశాచుల్లా కనిపిస్తున్నారు నాకు. ఈ సీన్ చూశాక.. నాకు నిజంగా ఉరిపోసుకుని చచ్చిపోవాలని ఉంది. మానవుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? భర్తకు బుద్ధి లేదు భార్యకు బుద్ధి లేదు. ఈ జంటను చూస్తే ఎవరికి పెళ్లి చేసుకోవాలి అనిపించదు.. కాబోయే భర్త అంటే భార్యకి కాబోయే భార్య అంటే భర్తకి ముందుగానే అసహ్యం ఏర్పడిపోతుంది. గురువు గారు మీ ప్రాక్టికల్ ప్రయోగం చాలుగానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేయండి” అన్నాడు తల పట్టుకొని బుజ్జిబాబు.
“క్లైమాక్సు చూడందే సినిమా పూర్తయినట్టు ఎలా అవుతుంది రా!? అదిగో ఆ వాటర్ ట్యాంక్ పక్కన కనిపిస్తుందే అదే నా మేనకోడలు సీత ఇల్లు. ఆమె భర్త రాము..” అంటూ అక్కడకు తీసుకుని వెళ్లారు తన శిష్యుడిని.. గురువు త్రిలోకచంద్రంగారు అతి బలవంతంగా.
తన సొంత మేనమామ వస్తున్నట్టు సీత చూసిన వెంటనే పరుగున లోపలికి వెళ్లి భర్తతో సహా చెంబుడు నీళ్ళతో తిరిగొచ్చింది. ఇద్దరూ కలిసి ఆయన కాళ్లు కడిగారు. ప్రేమగా లోపలకి తీసుకు వెళ్లి బొంతలాంటి పరుపు మీద కూర్చోబెట్టి పరుగు పరుగున మళ్లీ లోపలికెళ్ళి ఫలహారాలు తెచ్చి ఆయన ముందు ఒక ప్లేటు పెట్టారు.. కొంచెం దూరంలో కూర్చున్న బుజ్జిబాబుకి మరో ప్లేటు అందించారు. సీత మేనమామకు కాళ్ళు నొక్కడం మొదలు పెట్టింది.. రాము విసనకర్రతో విసరడం మొదలు పెట్టాడు.
ఇదంతా చూస్తున్న బుజ్జిబాబు స్వర్గలోకంలో ఉన్నామా.. అన్న అనుభూతితో కనురెప్ప వేయటం మర్చిపోయాడు. ‘ఈ భార్యాభర్తలు ఇద్దరూ చాలా అమాయకుల్లా ఉన్నారు ఏంటి చెప్మా..’..అంటూ గుటక కూడా వేయటం మర్చిపోయాడు.
త్రిలోకచంద్రం గారు.. ఆ భార్యాభర్తలు ఇద్దరనీ దగ్గరకు తీసుకుని.. “మీరిద్దరూ కొంచెం గడుసుగా మారాలర్ర.. లేకుంటే ఈ మాయల మరాఠీ ప్రపంచంలో బ్రతకలేరు. మీ మంచితనం లోకువగా తీసుకునే వాళ్లే ఎక్కువ. సరే మిమ్ములనిద్దరినీ ఆ భగవంతుడే కాపాడతాడులే” అంటూ వాళ్ళిద్దరికీ చెరో వంద రూపాయలు దాంతో పాటు తను కూడా తీసుకు వచ్చిన స్వీటు ప్యాకెట్ కూడా ఇచ్చి దీవించారు.
ఆ తర్వాత ఆయన బుజ్జిబాబుని వాళ్ళిద్దరికీ చూపిస్తూ.. “అన్నట్టు చెప్పడం మరిచాను ఈ అబ్బాయి నా శిష్యుడు బుజ్జిబాబు. పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. వీడి సమస్య ఏమిటి అంటే.. వచ్చే భార్య ఏ మనస్తత్వం కలిగినది వస్తుందో అని భయపడి పోతున్నాడు. అది అనుమానమో, భయంకర పెనుభూతమో తెలియని అవస్థలో ఉన్నాడు.
చెప్పాలంటే అతను అలా అనుమానపడటం సహజమే. ఎందుకు అంటే నేటి కాపురాలు చాలా మటుకు మూణ్ణాళ్ళ ముచ్చటగానే ఉన్నాయి కదా. మాట్లాడితే విడాకులు. మగవాడికి భయంలేదు.. ఆడదానికి అంతకన్నా భయంలేదు.. ఈ కారణం చేతనే ఇతనికి పెళ్లి మీద చిరాకు, అసహ్యం కలగడానికి కారణం అయ్యింది. ఆ విషయమే నాకు చెప్పాడు ఈరోజు ఉదయం వచ్చి.
సరే నేను.. వీడికి ప్రాక్టికల్ పద్ధతిలో ధైర్యం చెప్పడం కోసం.. మూడు కుటుంబాల తీరుతెన్నులు చూపించి చివరగా మీ ఇంటికి తీసుకువచ్చాను. మీ ఇద్దరి ప్రవర్తన కూడా వీడికి ఓ లెసన్‌లా ఉపయోగిస్తుంది..”.. చెప్పటం ఆపి ఆ భార్యభర్తల వైపు చూశారు త్రిలోకచంద్రం గారు.
వాళ్ళిద్దరూ అమాయకుల్లా ఏమీ అర్థం కానట్టు చూస్తుండిపోయారు.
ఈసారి త్రిలోకచంద్రం.. శిష్యుడు బుజ్జిబాబు వైపు చూసి.. ఇలా అన్నారు.
“బుజ్జిబాబు.. ఇదిరా వీళ్ళ వరస. మగవాడు ఇంత అమాయకంగా ఉన్నా కాపురానికి అదీ కష్టమే.!.. రాముని చూడు ఎర్రివాడిలా ఎలా దిక్కులు చూస్తున్నాడో.. ఇలాంటివాడు రేపొద్దున ఏదైనా సమస్య వస్తే పెళ్లాన్ని కూడా రక్షించుకోలేడు. ప్రపంచ జ్ఞానం తెలియకుండా ఎలాగో బ్రతికేస్తున్నారు. ఇదొక విచిత్రమైన సంసారం.. ‘వెళ్లొస్తాను’ అని చెప్పిన వీళ్లకు అర్థం కాదు.. అంత అమాయకులు అన్న మాట వీళ్ళు. భర్త భార్య దొందు దొందే..ఇక మన పని పూర్తయింది నడు..”.. అంటూ ఆ భార్యాభర్త లిద్దరికీ వెళ్తున్నట్టు చెప్పి బయటకు వచ్చారు.. గురుశిష్యులు.
“ఇప్పుడు చెప్పరా బుజ్జిబాబు.. ఈ నాలుగు జంటలను బట్టి నీకు ఏమి అర్థమైంది..?”
కొంచెం దూరంగా ఉన్న పార్కులో సిమెంట్ బల్ల మీద శిష్యుడిని కూర్చోబెట్టి తను పక్కగా కూర్చుని ప్రశాం తంగా అడిగారు.. శిష్యుడు బుజ్జిబాబుని గురువు త్రిలోకచంద్ర గారు.
“ఏమీ అర్థం కాలేదు గురువుగారు ఇంకా భయం పెరిగింది.. పెళ్లి గిల్లీ వద్దు.. క్యాన్సిల్ చేసేస్తాను.”
“కంగారు పడకురా. ఒక ఆడది పరాయి మగవాడిని నమ్ముకొని పరాయి ఇంటికి కాపురానికి ఎందుకు వస్తుంది. అతను ప్రేమ పంచుతాడని. తన కోరికలు, ఆశలు తీరుస్తాడని. కానీ మగవాడు అనబడే భర్త.. దేశ కాలమాన పరిస్థితులను బట్టి భార్య పట్ల తన ధర్మం పరిపూర్ణంగా నిర్వర్తించ లేకపోతున్నాడు. నూటికి 90 భార్యభర్తల సమస్యలకు ఇదే కారణం.. ఆశలు తీర్చపోయినా కనీసం ప్రేమ అయినా పంచాలి కదా.. అందులో కూడా ఫెయిల్ అవుతున్నాడు.
కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నీ భార్య ఏ రకపు వ్యక్తిత్వం కలది వచ్చినా.. ఆమెను.. చాలా ప్రేమగా..చూసుకో అలాగైతే ఏ సమస్య ఉండదు.. సరేనా”.. ముగించాడు గురువు త్రిలోకచంద్రంగారు.
“సరే గురువుగారు.. ఈ మాట చెప్పడానికి ఇన్ని భయంకర సన్నివేశాలు ఎందుకు చూపించారు. ఒక చోట భర్త దుర్మార్గుడు, మరొక చోట భార్య దుర్మార్గపుది, వేరొక చోట భార్యాభర్తలిద్దరూ రాక్షసులు.. చిట్టచివరి భార్యాభర్తలిద్దరూ అమాయకపు అప్పడం ముక్కలు ఏతావాతా ఈ ప్రాక్టికల్ సంఘటన లను బట్టి నాకు పెసరబద్దంత ఉపయోగం కలగ లేదు.
మీ ఇంటికాడే ఉదయమే ‘భార్యను ప్రేమగా చూసుకోరా చాలు..’ అని..చెప్తే సరిపోతుంది కదా..” కాస్త చిరాగ్గానే అన్నాడు బుజ్జిబాబు.
“ఒరేయ్ బుజ్జిబాబు ఇక్కడే పప్పుదాకలో కాలు వేస్తున్నావు. జాగ్రత్తగా నీ ఇంద్రియాలన్ని నీ అదుపులో పెట్టుకుని విను..
మొదటి జంటను బట్టి భర్త ప్రశాంతంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా ఈ పాయింట్” అంటూ నొక్కి చెప్పారు.
“ఇక రెండవ జంటను బట్టి.. అక్కడ కూడా భర్త ప్రశాంతంగానే ఉండాలి అని తెలుసుకోవాలి. ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా..” అంటూ మళ్లీ మళ్లీ నొక్కి చెప్పారు.
“తర్వాత మూడవ జంటను బట్టి కూడా భర్త మాత్రమే ప్రశాంతంగా ఉండాలి.. అలా ఉండి భార్య ప్రవర్తన మీద విజయం సాధించవచ్చు.. అని ఖచ్చితంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి. చేసుకున్నావు కదా.. ఇక చివరగా నాలుగవ జంటను బట్టి భర్త తెలివితేటలు పెంచుకుంటూ ఇక్కడ కూడా భర్త అనబడే శాల్తీ చాలా ప్రశాంతంగానే ఉండవలసిన అవసరం ఉంది రా.. ఉంది..” అంటూ మరింత గట్టిగా నొక్కి చెప్పారు.
“తలపోటు వస్తోంది కదూ. ఇప్పటికైనా గీతాసారం లాంటి ఈ ‘కాపుర సారం’..మొత్తం మగవాళ్ల బుర్రలకు అర్థమైతే.. ముఖ్యంగా నీ బుర్రకు అర్థం అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవురా. కాపురాలు హాయిగా సాగిపోతాయి. కోర్టులకు సగం బాధ తగ్గిపోతుంది.. అప్పుడు ఈ జగమంతా ‘మరో బృందావనం’ అయిపోతుందిరా. ఒరేయ్ అలాగని భార్యలకు భర్తలు భయపడుతూ తలవంచుకొని ఉండమని చెప్పినట్టు కాదు. ఈ సమాజానికి నేను ఏదో బ్యాడ్ సందేశం ఇస్తున్నట్టు అర్థం చేసుకోకు. దాంపత్యబంధం ముందుకు వెళ్లడానికి నేను చెప్పిన కలియుగ గీతాసారం అర్థం చేసుకుని భర్త బ్యాలెన్స్‌గా, ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు, బంగారు పళ్లానికైనా గోడ చేరువు కావాలి అన్నట్టు చాలా తెలివి తేటలతో భార్యలకు తగిన గౌరవం ఇస్తూ నడుచుకుంటేనే ఇప్పుడు కాపురాలు నిలబడతాయి. లేదంటే అంతే ఈవేళ పెళ్లి రేపు విడాకులు.” చెప్పడం ఆపి సిమెంట్ బల్ల మీద నుండి పైకి లేచారు గురువు త్రిలోకచంద్రంగారు.
బుజ్జిబాబు తన బుర్ర విదిలించాడు. గురువు గారు నొక్కి నొక్కి నొక్కి చెప్పిన చివరి మాటలను బట్టి ఏదో విద్యుత్ ప్రవాహం అతని బుర్రలో ప్రవేశించి నట్టయ్యింది. అతని బుర్రలో మట్టి అంతా దూరంగా గిరాటు వేసినట్టు హాయిగా ఉంది ఇప్పుడతనికి. పెళ్లి మీద భయం పోయి ధైర్యం కొండంతగా పెరిగింది.
“బాగా అర్థమయింది గురువుగారు.. మీకు పాదాభివందనం. కుటుంబానికి కెప్టెన్ భర్త కనక.. ఏ సమస్య వచ్చినా దానికి కారణం భర్త మాత్రమే..!.. బాగా అర్థమయ్యేలా లెసన్ చెప్పారు.. అందుకనే కదా గురువుగారు మిమ్మల్ని పది సంవత్సరాల నుండి వదలడం లేదు. ఇప్పుడు నాకు భయం పూర్తిగా పోయింది గురువుగారు. మీరు నా మీద ఉపయోగించిన ఈ ప్రాక్టికల్ విధానం నా బుర్రకు బాగా పనిచేసింది ఇక ఇప్పుడు నేను భయం వీడి పెళ్లి చేసేసుకుంటాను గురువుగారు. భయం పూర్తిగా పోయింది.”.. అంటూ బుజ్జిబాబు హుషారుగా మోపెడ్ తనే స్టార్ట్ చేశాడు. ఈసారి శిష్యుని వెనుకగ కూర్చొని గురువు త్రిలోకచంద్రoగారు గుండె నిండా హాయిగా ఊపిరి తీసి వదిలారు.
మోపెడ్ వేగంగా ముందుకు దూసుకుపోతుంది.