కాజాల్లాంటి బాజాలు-47: కళ్ళతో కొలతలు..

6
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య అస్సలు బైటకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడంతో ఖాళీ యెక్కువైపోయింది. కాలం గడవడానికి ఎప్పటెప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్న ఫ్రెండ్స్‌కి ఫోన్ చెయ్యడం మొదలెట్టేను. అలాగ చేసిన ఫ్రెండ్స్‌లో సరోజ ఒకరు. అదీ, నేనూ ఒకే లొకాలిటీలో వుండేవాళ్లం. స్కూల్‌కి, కాలేజీకి కలిసి వెళ్ళి వచ్చేవాళ్ళం. “ఏమే, ఒసే..” అని పిలుచుకునే అలాంటి ఫ్రెండ్స్‌తో మాట్లాడడం భలే వుంటుంది. నిన్న అలా మాట్లాడుతుంటే ఆ రోజుల్లో మేము చేసిన ఘనకార్యం ఒకటి గుర్తొచ్చింది. దానిని తల్చుకుని, తల్చుకుని ఫోనులో అలా గట్టిగా నవ్వుకుంటూనే వున్నాం. ఇంతకీ మేము చేసిన ఆ ఘనకార్యం యేమిటంటే….

ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలయ్యాక కాలేజీలో చేరేవరకూ అంతా ఖాళీయే. తోచట్లేదంటూ మా అమ్మగారిని బాగా విసిగించేదాన్ని. అలాంటప్పుడు ఉషా కంపెనీవాళ్ళు మా వీధి కవతల వున్న యాజులుగారింటి కారు షెడ్డులో కుట్టు నేర్పించడానికి ఒక సెంటర్ లాంటిది పెట్టేరు. అంతే, మా అమ్మగారు నన్ను తీసికెళ్ళి అందులో పడేసేరు. నాతోపాటే సరోజ కూడా చేరింది అందులో..

ఇంక చూస్కోండీ.. మధ్యాహ్నం రెండు నుంచీ నాలుగుదాకా కుట్టు నేర్పే క్లాసులు. కట్ చెయ్యడం, కుట్టడం అన్నీ బాగా చెప్పేవారు. అసలే మా యిద్దరికీ ఆవేశం యెక్కువ. వాళ్ళు చెప్పినదానికన్నా ఎక్కువ చేసేసి, గొప్పగా పొగిడించుకోవాలని మేమిద్దరం ఇంట్లో పొద్దున్న పూట కూడా ఆ కుట్టుపని మీదే వుండేవాళ్లం. అప్పటికింకా మిషన్ కొనలేదు. అయినా సరే, కుట్టాలనుకున్నది గట్టికుట్టుతో చేత్తో కుట్టేసి, మధ్యాహ్నం కలిసినప్పుడు ఒకరి కొకరం చూపించుకునేవాళ్లం. బనీన్లూ, జుబ్బాలూ, గౌన్లూ, జాకెట్లూ లాంటివన్నీ మహా హుషారుగా నేర్చేసుకుంటున్నాం. ఈ కుట్టుపని నేర్చుకోవడం కోసం నాలుగు వీధుల అవతలున్న చిన్న బట్టలకొట్టు కెళ్ళి ఇద్దరం రెండురకాల పువ్వులప్రింటులున్న గుడ్డలు ఒక్కొక్కరం రెండేసి మీటర్లు కొని తెచ్చుకున్నాం. మోడల్స్ అన్నీ ఆ గుడ్డమీదే కట్ చేసి దాచుకునేవాళ్ళం. అవన్నీ చిన్న చిన్నగా బొమ్మలకి కుట్టినట్టు వుండేవి.

మామీద మాకు మహా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇలా చిన్న చిన్న మోడల్స్ కుట్టడం కాదు, మేము కుట్టినవి కట్టుకునేవాళ్ళ కెవరికైనా కుట్టాలీ అనుకున్నాము. అంతే. ఆ ప్రయోగం ఎవరిమీద చెయ్యాలా అని ఆలోచిస్తే వెంఠనే గుర్తొచ్చింది మా వంటమ్మాయి. మా వంటావిడ ఏదో ఊరు వెడుతూ వెనక్కి వచ్చేదాకా వాళ్ళమ్మాయిని వంటకి పంపిస్తోంది. ఆ అమ్మాయిని చూసి మాకు చాలా జాలి వేసేది. మా యీడే వున్న ఆ అమ్మాయి మాలాగా చక్కగా చదువుకోకుండా పాపం ఇలా వంట చేయాల్సొస్తోందని తెగ బాధ పడిపోయేవాళ్లం. అందులోనూ పాపం ఆ అమ్మాయికి బట్టలు కూడా ఎక్కువ లేవు. అందుకే యేమైనా సరే ఆ అమ్మాయికి జాకెట్టు కుట్టి ఇవ్వాలనుకున్నాను నేను. సరోజ కూడా నాకు వత్తాసు పలికింది.

మా అమ్మగారిని బతిమాలుకుని ఒక జాకెట్టుగుడ్డ సంపాదించేను. అంతా బానేవుంది. మరి కొలతలెలా తెలుస్తాయీ అనుకుంటూ ఆదిజాకెట్టు అడుగుదామనుకున్నాను. హు.. మళ్ళీ మామీద మాకే నమ్మకం లేదా అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తూనే వున్నాం కదా. సన్నగా, ఎముకలు కనిపిస్తూ వుంటుంది. ఆ మాత్రం కొలతలు కళ్లతో తీసుకోలేమా అనుకున్నాం. అంతే.. ఇంక విజృంభించేసేం. ఇద్దరం కూర్చుని కళ్ళతో తీసుకున్న కొలతలతో జాకెట్టు కట్ చేసేసి, కుట్టు సెంటర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మిషన్ మీద జాకెట్టు కుట్టేసేం. చేతికుట్టు, బటన్స్ కుట్టడానికి ఇంకోరోజు పట్టింది. రెండురోజుల్లో జాకెట్టు కుట్టేసిన మా ప్రావీణ్యానికి మమ్మల్ని మేమే మెచ్చేసుకున్నాం. మహా ఉత్సాహంగా మా ఇంటికొచ్చి ఆ అమ్మాయికి ఆ జాకెట్టు ఇచ్చి మర్నాడు వేసుకువచ్చి చూపించమన్నాం. పాపం, ముందు మొహమాటపడింది. ఆఖరికి మా బలవంతం మీద తీసుకుంది.

మర్నాడు ఆ అమ్మాయి వచ్చేసమయానికి మా లొకాలిటీలోనే వుండి మాతోపాటే చదువుకునే వాణిని కూడా మా ఇంటికి రమ్మని పిలిచేం. ఈ వాణీ కూడా మా స్కూలే కానీ అన్నింటికీ మేం యెడ్డేమంటే తను తెడ్డేమనేది. మేమిలా కుట్టుక్లాసులకి వెడుతున్నాం అని చెపితే మమ్మల్ని జాలిగా చూస్తూ, “మీరెప్పటికి మారతారే. ఇప్పుడు చక్కగా టైపూ, షార్ట్‌హాండూ నేర్చుకుంటే రేప్పొద్దున్న ఏదైనా ఉద్యోగానికి పనికొస్తుంది కానీ యింకా అమ్మమ్మల్లా కుట్లు కుట్టుకుంటూ కూర్చుంటారా..” అనేసింది. అందుకే దాన్ని పిలిచి, మేం కుట్టిన జాకెట్టు చూపించి మా పనితనాన్నీ, దయార్ద్ర హృదయాన్నీ ప్రదర్శిద్దామనుకున్నాం.

ఆ సీను గురించి నేనూ, సరోజా ఎన్నెన్నో ఊహించేసుకున్నాం. ఆ అమ్మాయి వస్తూనే తను కట్టుకున్న జాకెట్టు చూపించి మా కాళ్లకి దండాలు పెట్టేస్తున్నట్టు, “అబ్బెబ్బే..ఒద్దొద్దు..” అంటూ మేం సినిమాల్లో త్యాగమూర్తుల్లా ఆ పిల్ల భుజాలు పట్టుకుని లేవదీస్తున్నట్టు సినిమా వేసేసుకున్నాం. మా విశాలహృదయాన్ని ఆ అమ్మాయి పొగుడుతుంటే మేం జ్ఞానమూర్తుల్లా చిరునవ్వు ఎలా నవ్వాలో ప్రాక్టీసు చేసుకున్నాం.

ఇంత ఆత్రంగా ఆ అమ్మాయికోసం మేం ముగ్గురం ఎదురుచూస్తుంటే మా ఆశలన్నీ వమ్ము చేస్తూ ఆరోజు మా యింటికి ఆ అమ్మాయి బదులు వాళ్లమ్మ వచ్చింది. ఆవిడ వస్తూనే మావంక ఆదోలా చూస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మాకు ఆతృత ఆగటంలేదు. ఒకళ్ళకొకళ్ళం ధైర్యం తెచ్చుకుని వంటింట్లోకెళ్ళి “మీ అమ్మాయి రాలేదేం..” అని వాకబు చేసేం. ఆవిడ అటూ ఇటూ చూసి, మా అమ్మగారు చూడడంలేదని నిర్ధారణ చేసుకుని తనతో తెచ్చుకున్న సంచీలోంచి ఒక కాగితంలో చుట్టిన గుడ్దలమూటలాంటిదాన్ని తీసి నా చేతిలో పెట్టింది. గబగబా కాగితం విప్పి చూస్తే నిన్న ఇచ్చిన జాకెట్టు చేతులకి చేతులూ, వీపుకి వీపూ అలా ఏ భాగానికాభాగం అడ్దదిడ్దంగా కత్తిరించేసి వున్నాయి. తెల్లబోయిన మా మొహాలు చూసి ఆవిడ “ ఏమనుకోకండి అమ్మాయిగారూ, ఆ జాకెట్టు మీరిచ్చేరని ఎంతో సంతోషంగా బలవంతంగా యెక్కించేసుకుంది. బొత్తిగా పదేళ్ళ పిల్ల వేసుకునే జాకెట్ కదండమ్మా. మా పిల్లకి ఎలా పడుతుందీ! ఆ మాత్రం తెలియొద్దూ దానికీ! తీరా విప్పుదామని చూస్తే ఎంతకీ రాలేదు. చేతుల దగ్గరా, మెడదగ్గరా బ్లేడుతో కోస్తే కానీ రాలేదు.” అంది అపరాధం చేసినట్టు.

“బ్లేడా!” అంటున్న నన్ను చూసి, “అవునమ్మాయిగారూ, మా ఇంట్లో కత్తెర లేదుగా. అందుకే మా తమ్ముడు వాడే బ్లేడుతో బట్ట కత్తిరించాల్సొచ్చింది.” మా ముగ్గురికీ నోట మాట రాలేదు.

ముందుగా తేరుకున్న వాణి “పదేళ్ళపిల్ల వేసుకునే జాకెట్ అంటోందావిడ.. మీరు కొలతలు సరిగా తీసుకోలేదేంటే..” అనడిగింది.

నాకు పౌరుషంలాంటిది వచ్చింది. “ఎందుకు తీసుకోలేదు! మేం కళ్ళతోనే కొలతలు తీసుకున్నాం..” అన్నాను గొప్పగా.

ఆ మాట విన్న వాణి “కళ్లతో తీసుకున్నారా కొలతలూ…”అంటూ పడీ పడీ నవ్వడమే కాకుండా మేం కళ్ళతో కొలతలు తీసుకుని జాకెట్లు కుట్టేంత గొప్పవాళ్లమని కనపడ్ద వాళ్లందరికీ చెప్పేసింది. ఇంకక్కణ్ణించి ఎవరు కనపడినా మమ్మల్ని చూసి “కళ్లతో కొలతలు తీసుకునేది మీరేనా!” అనడిగేవారు. కొత్తలో కాస్త కోపంగా అనిపించినా తర్వాత విషయం తల్చుకుని మేమూ నవ్వుకునేవాళ్లం.

అలాగ ఫోనులో మేం ఆ రోజుల్లో ఆ కుట్టు సెంటర్‌లో మా అనుభవాలన్నీ గుర్తు చేసుకుని ఎంతసేపో నవ్వుకున్నాం. చిన్నప్పటి సంగతులు యిలా గుర్తుంచేసుకుంటే బలే బాగుంటుంది కదా!..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here