[dropcap]క[/dropcap]నకాలు లేస్తూనే తడిక సందుల నుంచి లేలేత ఎండ పొడ తారట్లాడటం కనిపించి ఉలిక్కిపడ్డట్టుగా లేచింది. జుట్టు సవరించుకొని ఒళ్లు విరుచుకుంటూ తడిక కంతల్లో నుంచి ‘గాటి’ వైపు చూసింది. గాడిద కనపించలేదు. ముకుందం లేచి వనానికి తోలుకపోయినట్టునుకొని, లేచి గోడకున్న అద్దం ముందుకు నడిచింది. “నూకాలు” అని పిలుస్తూ బయటకి వచ్చింది.
“వస్తి” అంటూ సందు నుంచి గబగబా బయటికి వచ్చి పైట చెంగుకు చెయ్యి తూడుచుకూంటూ ఎదురుగ నిలబడ్డది నూకాలు. దాని వయసు ఇప్పుడు మలిపొద్దుది కాని, దాని ఒంటి నిగారింపూ, ఆ పొందికా, ఇప్పుడూ చూడాలనిపిస్తది. దాని వయసున ఎండరెందర్ని ఊరించి, ఉసురు పొసుకుందో తెలవదు. కానీ ఇప్పడైతే ‘మనస్సున’ ముచ్చటేసింది. అలవోకగా దాని పాత స్వరూపం మనసున నిలిచి ముచ్చటగా అనిపిస్తది. వస్తుతః ముచ్చటైన మనిషి కూడా.
“నూకాలు వాడుకలోళ్లు కల్లగొంచకపోయినరా” అని అడిగింది.
“ఆ” అని ఆగి, “ఇగో, మన పెద్ద తండా కమిలి రెండు దినాల నుండి రావటం లేదు” అంది.
“కబురెట్టకపోయావా? అది ఎటైనా ఊళ్ళపొంటిపోయినా మనకు తెలపకుండాపోదు”.
“ఏ కబురూ లేక ఈడికి రాక ఏమైందో కూస్త జాడ తెలుసుకో, అది పూర మనమనిషి” అంటూ పాక బయట దాకా నడిచి వంగి ఉన్న వేప చెట్టు మండన ఉన్న పుల్ల ఒకటి విరిచి నోట్లో వేసుకొని జారు వైపు అడుగు వేసి అటూ ఇటూ పార చూసి, వెనక్కి తిరిగి, తడికెల్లోకి పోయింది. అది ముస్తాబయి బయటికొచ్చే సరికి పొద్దు బారెడు పైకి ఎక్కింది. అప్పుడే కమ్మరి సంగయ్య పాకలోకి వస్తూ కనపడ్డడు. ‘పొద్దుటే వీడికేమయింది ఆరాటంగా వస్తుండు’ అనుకొన్న కనకాలు ఎదురెళ్ళి “ఏంది సంగన్న పొద్దులే పాకేపు పడ్డవు, సద్ది కల్లు గిట్ట కావాల్నా” అని అడిగింది.
అక్కడే ఆగిన సంగయ్య “అది కాదే కనకాలూ పొగాకు మండె తిరగేసే తరుణం వచ్చింది. రేపటికి ఓ అరబింకి కల్లు మడ్డి అక్కరపడ్డుద్ది. ఆ ముచ్చట చెప్పిపోదామని వచ్చిన” అన్నాడు బుర్రగోక్కుటూ. ‘ఇది పూర పుక్కటి బేరమే’ అనుకొని “అట్టనే ఉంచుత, రేపు మా పటేల పోరడ్ని తోలు” అనగానే సంతోషంగా ఎన్కి మళ్ళిండు సంగయ్య.
ఇంతలో వనం నుంచి కల్లు పటవలు రావటం, వాటిని లోపలికి సర్ది చేయటం పూర్తయ్యే సరికి మద్దేనేల దాటింది. ఆరామ్‌గా ఇంత తిని బయటకొచ్చి పాకన కూర్చునేటప్పుడు కమిలి సంగతి గుర్తు కొచ్చి కనకాలు కేకేసింది. నూకాలును. కమిలి కనురుకే అనుకొని “ఆ తెలిసింది తండా నుంచి భూక్యా ఇంతకు ముందు వస్తే పూర్తి వివరం కనుకున్న. కమిలి ఇప్పుడు సబ్ జైల్‌న ఉందట. ఎక్సైజ్ వాండ్లు పట్టుకొని కోర్టుకప్పగిస్తే, అక్కడ మూడు నెలల జైలు, రెండొందల జరిమానా ఎసిండ్రట. ఇంకా ఏందేందో జరిగిందని చిత్రంగా చెప్పిండు” అంది.
“అరే ఈ సంగతి నాకు తెలిస్తే ఆచ్చకారీ అమీన్‌తో చెప్పి ఇడిపిద్దును కదా! అట్టెట్ట చేసింది.” అంటుండగా నూకాలు చెప్పసాగింది.
“అది వనంలో చాటుగ కాపు సారా కాస్తుంటే సారా జవాను ఓబులెశుగాడొచ్చి పట్టుకొన్నడట. అది లగెత్తజుతే పట్టుకొని చాటుకు లాక్కపోయి, రొమ్ము మీద చెయ్యేసి ‘నాతో గుడిసెలోకొస్తే నేనున్నంత కాలం సారా కాసుకోవచ్చు’ అని వాటేసుకొని ముద్దెట్టకుండట. అది గుడిసె దాకా తీసుకుపోయి వాడ్ని ఆడున్న కట్టెలతో ఒళ్లు పులిసేదాకా బాదిందట. వాడు ఇంక ఇద్దరిని తీసుకొచ్చి దీని బెల్లం పానకం అంతా పారబోసి కాసిన సారా పట్టుకొని కోర్టుకు అప్ప చెప్ఫిండట. సారా జవాన్ని కొట్టినందుకూ, సారా కాసినందుకూ శిక్ష వేసిందట కోర్టు.”
“ఇదేం న్యాయం స్వామి? ఆడదాన్ని అప్పనంగా పట్టుకుంటే నేరం కాదా? ఆడికే శిక్ష లేదా? వాళ్ళకో న్యాయమూ? మాకో న్యాయమూనా? చెప్పు దొర” అని మొక్కేసిందట. అయినా మాట్లాడలేదట దొర.
“వాడి మాట ముచ్చట లేక, నాకేంమో ఖైదున ఏస్తిరి. ఇట్లుంటదా న్యాయం అని ఏడ్సి మొత్తుకున్నా సమాధానం లేదట. ఇది మంచి, చెడు అని నోరు ఇప్పినోడు లేరట. అది మాత్రం జైల్లోనే ఉంది” అని ఆగింది.
“అంత మంచి పోరివి. అట్ట చేసిన్రా. లోక తీరు ఇంత చెడ్డదా.” అని కనకాలు చాలా చికాకు పడ్డది. దాని కళ్ళలో నీటి బొట్టులున్నయి. ‘ఓ బులేశుగాడి నౌకరి ఊడిందాకా నాకు నిద్ర పట్టదు’ అనుకుని రుసరుస లాడింది.
‘పేద వాడి కోపం పెదవికి చేటు’ అంటారు పెద్దలు.