కాల్పనిక సాహిత్యంలో ధర్మసూక్ష్మాలు

    13
    4

    [box type=’note’ fontsize=’16’] సాహిత్య ప్రధానోద్దేశం ధర్మాన్ని సామాన్యులకు వీలయినంత సరళంగా సులభంగా అర్థమయ్యే రీతిలో చేరువ చేయటం. కానీ ధర్మాన్ని ఎద్దేవా చేయటం, చులకన చేయటం తప్ప ధర్మం గురించి అవగాహన లేని రచనల విలువను ఎలా నిర్ణయించటం అనే సందేహానికి తార్కికమైన సందేశం ఇస్తున్నారు శ్రీవల్లీ రాధిక ‘కాల్పనిక సాహిత్యంలో ధర్మ సూక్ష్మాలు’ వ్యాసంలో. [/box]

    కాల్పనిక సాహిత్యంలో ధర్మాన్ని చెప్తే అది చిన్నపిల్లల నీతికథగా అనిపించడము, ధర్మసూక్ష్మాలని చెప్పే ప్రయత్నం చేసినపుడు మాత్రం అది గొప్ప రచనగా పరిగణించబడడము మనం సాధారణంగా చూస్తూ ఉంటాము.

    ఉదాహరణకి “అబద్దం ఆడకూడదు” అనే నియమాన్ని తీసుకుందాం. ఆ నియమాన్ని ఇతివృత్తంగా తీసుకున్న రచయిత అబద్ధం ఆడిన ఒక వ్యక్తికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగా కల్పన చేస్తూ ఒక కథ రాస్తే అది చాలా మామూలు కథ, పాత కథ అనేవారు ఎక్కువగా ఉంటారు. అలా కాక అబద్దం ఆడరాదు అన్న నియమం వున్న వ్యక్తికి ఒక ధర్మసంకటాన్ని, ‘ఇక్కడ అబద్దం ఆడడమే సబబు’ అనిపించే ఒక పరిస్థితిని కల్పిస్తే, ఇక ఆ తర్వాత కథ ఎలా ముగిసింది అనే విషయంలో కూడా సంబంధం లేకుండా ఆ కథ స్థాయి పెరుగుతుంది. ‘అబద్ధం ఆడడమే సబబు’ అనిపించే పరిస్థితి అంటే – నిజం చెప్తే ఒక అమాయకుడు అన్యాయంగా చచ్చిపోతాడు లేదా ఒక అభాగ్యురాలికి గొప్ప అన్యాయం జరుగుతుంది – ఇటువంటి సన్నివేశాలు. అలాంటి ఒక పరిస్థితిని కథలో కల్పించాక రచయిత దానికి మూడు విధాలైన ముగింపులని ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి తన ధర్మాన్నే అంటిపెట్టుకుని అన్యాయం జరగడానికి కారణమయ్యాడు – ఇది మొదటిరకం. ఈ రకమైన ముగింపు సాధారణంగా ఇటువంటి కథలు వ్రాసే యే రచయితా ఇవ్వరు. అందుకు కారణం యేమిటో తర్వాత చెప్పుకుందాం. కథలోని పాత్ర అప్పటివరకూ తాను పాటిస్తున్న ధర్మాన్ని పక్కకి పెట్టి ఆ అన్యాయం జరగకుండా ఆపడం రెండవ రకం ముగింపు. చాలా కథలు ఇలాగే ముగుస్తాయి. గొప్ప కథలు అనీ అనిపించుకుంటాయి. ఇక రచయిత సూటిగా ఏదో ఒక మార్గాన్ని సమర్థించకుండా ఆ సంఘర్షణలో చిక్కుకున్న పాత్రని అలాగే వదిలేయడం మూడోరకం ముగింపు. ఇదీ “గొప్ప” కథే. నిజానికి రచయిత తన భావాలు పాఠకుల మీద “రుద్దకుండా” పాఠకుల నిర్ణయానికే వదిలేశాడు కనుక కొందరి దృష్టిలో ఇది మరీ గొప్ప కథ.

    ఈ పైన చెప్పిన విషయానికి కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. ధర్మసూక్ష్మాన్ని ఇతివృత్తంగా చేసుకున్న కథల కంటే ధర్మాన్ని ఇతివృత్తంగా చేసుకున్న కథలు కొన్ని గొప్పవిగా పరిగణించబడి ఉండవచ్చు. అది ఆయా రచయితల ప్రతిభ మీద ఆధారపడి వుంటుంది. ఒక గొప్ప రచయిత తన కథనంతో ఎటువంటి ఇతివృత్తాన్ని అయినా గొప్పగా మలచగలడు కదా! అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఒకే స్థాయి ప్రతిభ వున్న ఇద్దరు రచయితలు ఈ రెండు రకాల ఇతివృత్తాలను తీసుకుని కథలు వ్రాసినపుడు సాధారణంగా దేనికి ఎక్కువ విలువ వస్తున్నది అన్న విషయాన్ని లేదా ఒకే రచయిత ఇటువంటి రెండు కథలు వ్రాసినపుడు యేది గొప్ప కథ అనిపించుకుంటున్నది అన్న విషయాన్ని.

    ధర్మం గురించి చెప్పే కథ కన్నా ధర్మసూక్ష్మం గురించి చెప్పాలనుకునే కథ సాహిత్యపరంగా ఎక్కువ స్థాయి కథ అనిపించుకోవడానికి కారణాన్ని సులభంగానే ఊహించవచ్చు. కథలో ఒక సంఘర్షణ వుండడాన్ని కథకి ముఖ్య లక్షణంగా చాలామంది భావిస్తారనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ ఈ రెండు కథావస్తువులనీ పోల్చి చూసినపుడు రెండవదానిలో ఒక వైరుధ్యం అనేది మొదటే సహజసిద్ధంగా వస్తువులో భాగంగా ఇమిడి వుంది కనుక అది కథకి కొంత బలాన్ని ఇస్తుంది. అందుకే అది పై స్థాయి కథ అనిపిస్తుంది.

    అయితే ఇక్కడ మరొక ప్రశ్న రావాలి. వస్తువులోనే ఒక వైరుధ్యం, సంఘర్షణ ఇమిడివుండడం వలన కథకి వచ్చే ఒకానొక బలాన్ని రచయితకి ఆపాదించవచ్చునా అని. ఎందుకంటే సూటిగా వున్న విషయాన్ని కథగా వ్రాసి మెప్పించాలన్నపుడు కథకి కావలసిన సంఘర్షణని రచయిత కల్పించాలి. అందుకు భిన్నంగా వస్తువే వైరుధ్యంతో మిళితమైనది అయివుంటే కథలో సంఘర్షణ అనేది అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. కాబట్టి ధర్మాన్ని చెప్పే కథల కన్నా ధర్మసూక్ష్మాన్ని చెప్పే కథలకు కావలసినది తక్కువ రచనా ప్రతిభ అనుకోవాలేమో! ఇది ఆలోచించవలసిన విషయం. సరే, దీనిని అలా ప్రక్కన పెడితే, ధర్మసూక్ష్మాన్ని కథాంశంగా ఎంచుకున్నపుడు కథకి సగం బలం వస్తువు నుంచే వస్తోంది కనుక రచయిత ప్రతిభ వస్తువుని ఎంచుకోవడంలోనే ఉందని అనుకోవచ్చు. అపుడు (ఆ “ఎంచుకోవడం”కి వున్న ప్రాముఖ్యము దృష్ట్యా) అసలు ధర్మసూక్ష్మాన్ని కథాంశంగా ఎంచుకుంటున్న రచయితలు దానిని ఏ ఉద్దేశ్యంతో యే అవగాహనతో ఎంచుకుంటున్నారు అనే విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలించవలసి వస్తుంది.

    పాఠకుడికి ఒకానొక ఉద్వేగాన్ని విభ్రాంతిని కలుగజేయడానికా! ధర్మం అనుకుంటున్న దానిలో కొన్ని లొసుగులు లోపాలు వున్నాయనీ, కనుక ధర్మం కొన్ని పరిస్థితులలో పనికిరాదనీ చెప్పడానికా! పాటించ వలసిన రెండు ధర్మాల మధ్య ఘర్షణ ఏర్పడినపుడు మనిషి కర్తవ్యం యేమిటి అన్న విషయాన్ని చర్చించేందుకా! – ఎందుకు ఈ రకమైన కథా వస్తువుని రచయితలు ఎంచుకుంటారు అని పరిశీలిస్తే ఎక్కువ భాగం కథలు మొదటి రెండు రకాలకీ చెందినవిగా మనకి అర్థమవుతాయి. నిజానికి వీటిలో మూడవ విషయం మాత్రమే ధర్మసూక్ష్మం అనే విషయం యొక్క నిజమైన అర్థానికి కొంత దగ్గరగా వుంది. అయితే అది కూడా ధర్మసూక్ష్మం అనే విషయానికి సంబంధించి పూర్తి అవగాహన కాదు.

    “ధర్మసూక్ష్మం అంటే రెండు ధర్మాల మధ్య ఘర్షణ వస్తే ఏది ఎంచుకోవాలో చెప్పడం” అని అంత సులభంగా నిర్వచించలేము. అది చాలా లోతైన విషయం. నిజానికి ఈ సులభమైన నిర్వచనం నుంచి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా దాని లోతు మనకి కొంతవరకూ తెలుస్తుంది. ధర్మసూక్ష్మం గురించి మాట్లాడాలంటే ఎన్నో అర్హతలు ఉండాలని అర్థమవుతుంది. రెండు ధర్మాల మధ్య ఘర్షణ అంటున్నామంటే ఆ రెండు ధర్మాలూ స్పష్టంగా సంపూర్ణంగా తెలిసి వుండాలి అనేది మొదటి అర్హత. అలా రెండు ధర్మాలకీ ప్రాముఖ్యతనిస్తున్న పాత్ర యొక్క ఘర్షణని రచయిత చిత్రించాలనుకుంటున్నారు కాబట్టి ఆ ధర్మాలు పాటించేవారి ఆలోచనాధోరణి ఎలా వుంటుంది, వారు ఎప్పుడు అలాంటి విషయాలలో తికమక పడతారు, ఎప్పుడు దానిని ఘర్షణగా తీసుకుంటారు అనేది కూడా రచయితకి తెలిసి వుండాలి. ఎందుకంటే ఒకపనిని చేయని వారికి ఉండేటన్ని తికమకలు ఆ పనిని చేసేవారికి ఉండవు. నిత్యమూ ఒక పనిని ఆచరించేవారు అందులో వచ్చే చిన్న చిన్న వైరుధ్యాలని అప్రయత్నంగా అతిసులభంగా పరిష్కరించేసుకుంటారు. అసలు దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించరు. రెండు విషయాలకి ఘర్షణ వచ్చినపుడు దేనిని వదిలేయాలో దేనిని నిలబెట్టుకోవాలో వారికి సందేహమే లేకుండా తెలిసిపోతుంది. ఆ ధర్మాల గురించి పూర్తిగా తెలియని వారికీ వాటిని ఎప్పుడూ ఆచరించని వారికీ వచ్చే చిన్నా చితకా సందేహాలు పాటించే వారికి అసలు రానే రావు. కాబట్టి రెండు ధర్మాల పట్ల గౌరవం వుండి వాటిని ఆచరిస్తున్న ఒక పాత్రని రచయిత సృష్టించినపుడు ఆ పాత్రకి నిజంగా సందేహం ఎప్పుడు వస్తుందనే విషయంలో అవగాహన లేకుండా అల్పమైన విషయాలకు అధికమైన సంఘర్షణ చూపిస్తే, అది అసహజంగా వుంటుంది.

    ఇక మూడవ విషయం ఏమిటంటే ఈ ధర్మపరీక్షలు అనేవి అందరికీ రావు. వచ్చినా ఒకేరకంగా రావు. ఎవరి స్థాయిని బట్టి వారికి వస్తాయి. నిజమే చెప్తాం అన్న నియమం లేని వాడికీ, లేదా ‘ఇవాల్టి నుంచి నిజం చెప్తాం’ అని ఇప్పుడే అరక్షణం క్రింద నిర్ణయించుకున్నవాడికీ హరిశ్చంద్రుడికి వచ్చినన్ని పరీక్షలు వచ్చేయవు. హరిశ్చంద్రుడి స్థాయిలో వున్న వాడికి పరీక్ష వచ్చినపుడు ఏం చేయాలో వాడికి తెలుస్తుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడవడమూ జరుగుతుంది. ఆ స్థాయి రాని వాడికి అసలు ఆ పరీక్ష పెట్టదు ధర్మం. అది మనం సూక్ష్మమైన పరిశీలనతో మాత్రమే అర్థం చేసుకోగల రహస్యం. ఆ రహస్యం తెలిసినపుడు మాత్రమే ధర్మసూక్ష్మం అన్న విషయాన్ని కథాంశంగా ఎంచుకోవడం సబబు.

    “ఆ స్థాయి రాని వాడికి అసలు పరీక్ష పెట్టదు ధర్మం.” అన్న వ్యాఖ్యని నిరూపించడం కష్టం కనుక అందరూ ఒప్పుకోకపోవచ్చు. అయితే మాట వరసకి స్థాయి రాని వాడికి కూడా పరీక్ష వస్తుందని అనుకుందాం. అప్పుడేమవుతుంది? వాడు పరీక్షలో తప్పుతాడు. అపుడు “ఒకడు పరీక్షకి సరిగా సిద్ధం కాలేదు. పరీక్షలో తప్పాడు.” అని కథ వ్రాయడం అవసరమా అన్నది ఒక ప్రశ్న. అయితే చిత్రమేమిటంటే “ధర్మసూక్ష్మం’ చెప్పాలనుకుని వ్రాసే కథలు అలా కూడా వుండవు. అవి పరీక్షలో తప్పాడు అని కూడా చెప్పవు. అతడు రాసిన తప్పు సమాధానమే సరి అయినది అని సూచిస్తున్నట్లుగా ముగుస్తాయి. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే, అందుకు రెండు కారణాలు కనిపిస్తాయి. అసలు సరైన సమాధానం ఏమిటి? అన్న దాని మీద రచయితకి అవగాహన లేకపోవడం ఒక కారణం. అసలు ధర్మం అంటే, ఆ వ్యవస్థ మీదే ,గౌరవం లేకపోవడం రెండవ కారణం.

    పైన చెప్పినట్లు రచయిత యే రెండు ధర్మాలకి మధ్య ఘర్షణ చూపదలచుకున్నాడో ఆ రెండు ధర్మాల గురించి పూర్తి అవగాహన లేనపుడు, ఎటువంటి పరిస్థితులలో ధర్మాచరణకి ప్రాముఖ్యతనిచ్చేవాడు సంఘర్షణకి గురి అవుతాడు, అలాటి ఘర్షణని ఎదుర్కున్నపుడు – ధర్మం తెలిసినవాడిగా, ధర్మాన్ని నమ్మినవాడిగా, దానిని ఆచరించాలనుకుంటున్న వాడిగా వాడి ఆలోచన ఎలా సాగే అవకాశం వుంది అన్న విషయాల పట్ల రచయితకు స్పష్టత లేకపోయినపుడు లేదా ధర్మం పట్ల గౌరవం లేనపుడు మాత్రమే ధర్మసూక్ష్మాన్ని చెప్తున్నట్లు భ్రమింప చేస్తూ ధర్మవ్యతిరేకమైన విషయాలని ప్రస్తావించడం జరుగుతుంది.

    ఇటువంటి కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఈ వ్యాసంలో ఆ కథల పేర్లను ప్రస్తావించుకోవడం కంటే ఆ కథలలో సామాన్యంగా కనబడే లక్షణాలను చెప్పుకోవడం బాగుంటుంది. ఇక్కడ ‘ధర్మం’ అనేమాట స్థూలంగా వాడబడినప్పటికీ, నిజానికి విలువ, నియమం, సంప్రదాయం అన్న అర్థాలలో కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయాలు, లక్షణాలు వర్తిస్తాయి.

    1. ఇటువంటి కథలలో ప్రధానంగా కనబడే లక్షణమేమిటంటే – రెండు విలువల/ధర్మాల మధ్య ఘర్షణని చెప్తున్నట్లుగా కథ వ్రాసినప్పటికీ వాటిలో ఒకటి నిజంగా విలువ/ధర్మం అయివుండదు. లేదా చాలా అల్పమయిన విలువ/ధర్మం అయి వుంటుంది. లేదా ఆ పాత్రకి సంబంధం లేనటువంటి, ఆ పాత్ర పరిధిలోకి రానటువంటి ధర్మం అయి వుంటుంది. ఒక నిజమైన విలువకీ, మరొక విలువలా భ్రమింప చేసే విషయానికీ లంకె వేసి ఈ రెండిటిలో ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితిని పాత్రలకు కల్పించి చివరికి ధర్మం కంటే అధర్మం(అల్పధర్మం) ఆశ్రయించదగినదని నిరూపిస్తూ ఇటువంటి కథలు ముగుస్తాయి.
    2. ఘర్షణ ఏర్పడే రెండు అంశాలలో ఒకటి శాస్త్రం చెప్పిన ధర్మం లేదా ఒక సాంప్రదాయికమైన విలువ అయివుంటుంది, రెండవది పాత్ర ఉద్వేగాలకీ మనసుకీ సంబంధించిన అంశం అయివుంటుంది. ఇటువంటి కథలన్నిటిలోనూ వందకి వంద శాతమూ రెండవదాని కోసం మొదటిదాన్ని వదిలేయడమే సమంజసమని తీర్మానించబడుతుంది. ఒక్క కథలో కూడా మొదటిదాని కోసం రెండవదాన్ని వదిలేయడానికి సమర్ధన కనిపించదు. కనుకనే ఇటువంటి కథల యొక్క నిబద్ధత ప్రశ్నార్థకమవుతుంది.
    3. ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు ఇటువంటి కథలలో పాత్రచిత్రణా, పాత్రలు ఎదుర్కునే ఘర్షణా కూడా చాలా కృతకంగా వుంటాయి. ఆ ఘర్షణ మొదటి విలువ కంటే రెండో విలువ ఆచరణీయమని చెప్పేందుకే కల్పించబడినదన్న విషయం, జీవితంలో నిజంగా ధర్మాన్ని నమ్మి ఆచరించే వ్యక్తులకి అటువంటి ఘర్షణ రాకనేపోవచ్చునన్న విషయం నిశితంగా చదివే పాఠకులకి సులభంగా అర్థమయిపోతూనే వుంటుంది.
    4. ధర్మాన్ని నమ్మి ఆచరించడానికి కావలసిన ఎరుక వేరు. ఇటువంటి కథలలోని పాత్రలు ప్రదర్శించే తెలివి వేరు. ధర్మాచరణకు కావలసినది పాండిత్యం కాదు సంస్కారం. ఆ ప్రాథమిక విషయాన్ని ఈ కథలు విస్మరిస్తాయి. మనం సమాజంలో గమనిస్తూనే ఉంటాము. పాండిత్యం మాత్రమే వున్న పెద్దలు “ఏది ధర్మం! అదా! ఇదా!” అని ఆలోచనలో పడిన కొన్ని సందర్భాలలో, దానిని ఒక చిక్కుముడిగా భావించి గింజుకుంటున్న సమయాలలో చిన్నపిల్లలు, పెద్దగా పాండిత్యం లేనివారు ఆ ముడిని టక్కున విప్పుతారు. “ఇదే కదా!” అంటూ. నిజజీవితంలో శాస్త్రానికీ ధర్మాచరణకీ లోబడి నడిచేవారిపై బాహ్య పరిస్థితులకి వుండే ప్రభావం చాలా తక్కువ. కాబట్టి అవి వారికి కలిగించే తికమకా తక్కువే. “బయట పరిస్థితి ఎలా ఉన్నదన్నది కాదు మనం ఏం చేస్తామన్నది ముఖ్యం. మన బుద్ధి మన ఆలోచన ఎలా సాగుతాయన్నది ముఖ్యం. మనకి ఏమి జరిగిందన్నది కాదు మనం ఏమి చేస్తామన్నది ముఖ్యం.” వంటి విషయాలు వారికి స్పష్టంగా తెలిసి వుంటాయి. దానిని అంతే స్పష్టంగా విప్పిచెప్పే తెలివితేటలు అందరికీ ఉండకపోవచ్చు కానీ తెలివితో పాండిత్యంతో సంబంధం లేని ఆ ‘ఎరుక’ వారికి ఉంటుంది. అయితే ఇటువంటి కథలలో ఆ ‘ఎరుక’ కి అసలు ఉనికే ఉండదు. అలాంటిదొకటి ఉంటుందన్న అవగాహన రచయితకి లేనేలేదని స్పష్టంగా తెలిసేలా ఉంటుంది కథాశిల్పం. నిజజీవితానికి భిన్నంగా ఇటువంటి కథలలో ప్రభావమూ ప్రాముఖ్యమూ అంతా బాహ్యపరిస్థితులదే అయివుంటుంది. కథ నడిచేదే ఒకానొక పరిస్థితి చుట్టూ అయినపుడు, కథకి ఆధారం ఆ పరిస్థితే అయినపుడు మరి సహజంగా అదే జరుగుతుంది కదా! ఏ ఒక్క కథని పరిశీలించినా ఆ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.

    ఉదాహరణకి ఒక కథలో ఒక కోడలు వుంటుంది. మంచిది. మామగారిని చక్కగా చూసుకుంటూ వుంటుంది. అయితే చిత్రకారుడైన ఆ మామగారికి, ప్రాణాంతకమైన జబ్బుతో ఇంకొద్ది రోజులలో మరణించబోయే వాడికి, ఒక తీరని కోరిక వుంటుంది. ఒక గర్భవతి నగ్న చిత్రాన్ని చిత్రించాలని. ఆయనకి ఆ చిత్రానికి మోడల్గా వ్యవహరించేందుకు ఎవరూ దొరకకపోవడంతో ఆయన ఆ కోరిక తీరకుండానే తన జీవితలక్ష్యం చేరుకోకుండానే మరణిస్తానేమో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ బాధ నుంచి ఆయన్ని తప్పించేందుకు కోడలు మోడల్‌గా వ్యవహరిస్తుంది. పరపురుషుడి ముందు నగ్నంగా నిలబడరాదన్న తన ధర్మాన్ని మరొక “గొప్ప” ధర్మం కోసం వదిలేసి తన గొప్పతనాన్ని పెంచుకున్నానని ఆనందపడుతుంది. తన నిర్ణయాన్ని తర్కంతో వాదనతో సమర్థించుకుంటుంది.

    పైన చెప్పుకున్న లక్షణాలన్నిటినీ ఈ కథలో గమనించవచ్చు. ఇటువంటి కథలు పాఠకులకి ఒకానొక విభ్రాంతిని మాత్రమే కలిగిస్తాయి కానీ ధర్మం యొక్క రహస్యాన్నీ తత్త్వాన్నీ విప్పిచెప్పవు.

    ఒక కథ వ్రాయడం ద్వారా తాను సాధించదలచుకున్న ప్రయోజనం పట్ల రచయితకు స్పష్టత లేనపుడే ఇలా జరుగుతుంది. వ్యాసం మొదట్లో ఇటువంటి కథలకు మూడు రకాలైన ముగింపులు వుండే అవకాశం వుందని చెప్తూ మొదటిరకం ముగింపుని ఏ రచయితా ఇవ్వరు అన్నాను. కారణమేమిటో తర్వాత చెప్తానన్నాను. కారణం ఇదే. ధర్మం విషయంలో ఉండవలసిన ప్రాథమికమైన ఎరుక పట్ల అవగాహన లేకుండా, దానికి కథలో స్థానమే కల్పించకుండా, ధర్మసూక్ష్మాన్ని చెప్తున్నామని భ్రమించడమే.

    రచయితలలో రెండు రకాల వారు వుంటారు. కథలో ప్రస్తావిస్తున్న ధర్మాలు విలువల పట్ల గౌరవము విశ్వాసము లేదు అనేవారు మొదటిరకం. ఉంది అనేవారు రెండవరకం.

    మొదటి రకం వారు ఇటువంటి కథ వ్రాసినపుడు, ధర్మం మీద గౌరవము విశ్వాసము లేకుండా ఆ ధర్మాన్ని ఖండించడం కోసమే కథని అల్లినపుడు – దానిని ధర్మసూక్ష్మాన్ని చెప్పే కథగా పరిగణించకూడదు. ధర్మాన్ని ఖండించే కథని వారు అసలు ఈ పద్ధతిలో వ్రాయనూ కూడదు. ఎందుకంటే రచయిత ఏదైనా ఒక ధర్మం(విలువ)లో దోషం వుందని భావిస్తే నేరుగా దానిలోని దోషాన్ని అర్థం చేయడం సముచితంగా వుంటుంది కానీ ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కష్టమవుతుందని భ్రమ కలిగించే ఒకానొక మెలికని కథలో కల్పించి తద్వారా ఆ ధర్మం/విలువ ఆచరణీయం కాదని వ్యాఖ్యానించడం మంచి కథ యొక్క లక్షణం కాదు కనుక.

    ఇక కథలో ప్రస్తావిస్తున్న ధర్మాన్ని/విలువని నమ్ముతున్నామని అంటూ (అనుకుంటూ) వ్రాసే రచయితలు – వీరు నిజంగా ధర్మం పట్ల నమ్మకం వుండి దానిలోని సూక్ష్మాన్ని చెప్పేందుకే కథ వ్రాస్తే, అప్పుడు కూడా కథ ఇలా రాకూడదు. ధర్మం యొక్క ప్రాధాన్యాన్ని సమర్థించేందుకే కథ వ్రాస్తే నిజంగా ధర్మసూక్ష్మాన్ని వివరించి చెప్పేందుకే కథ వ్రాస్తే అది ఎలా వుండాలి?

    “ఒక ధర్మాన్ని గట్టిగా పట్టుకుని త్రికరణ శుద్ధిగా సాధన చేస్తే ఆ సాధనలో పరాకాష్టకి చేరితే అప్పుడు వాడికి ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలిసి పోతుంది.” అని చెప్పేదిగా వుండాలి. “నిజంగా నువ్వు నిలబెట్టుకోవాలి అని గట్టిగా సంకల్పించుకుని అందుకు తగిన సాధన చేస్తే ఎన్ని వైరుధ్యపరిస్థితులు వచ్చినప్పటికీ దానిని నువ్వు నిలబెట్టుకోగలవు” అని చెప్పేదిగా వుండాలి. ఆ శక్తి, ఆ స్పురణ ఎలా కలుగుతుందో అర్థం చేసేదిగా కథనం నడవాలి.

    లేకపోతే ఆ కథలకు ప్రయోజనమూ లేదు, గౌరవమూ వుండదు. కనుక ధర్మాన్ని విశ్వసిస్తున్నామని, ధర్మాచరణని ఆదర్శంగా చెప్పే ఉద్దేశ్యంతోనే ధర్మసూక్ష్మాన్ని కథాంశంగా ఎంచుకుంటున్నామని భావించే రచయితలు ఆ కథలకి తాము ఆశించిన ప్రయోజనాన్నీ గౌరవాన్నీ సాధించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here