కల్పిత బేతాళ కథ-12 ఐదు సూక్తులు

0
3

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! అమిత సాహాస పరాక్రమవంతుడవు. ఇతిహాసం, ఆగమం, కావ్యం, అలంకారం, నాటకం, గాయకత్వం, కవిత్వం, కామ శాస్త్రం, దురోదరం, దేశభాషా లిపి పరిజ్ఞానం, లిపికర్మం, వాచకం, అవధానం, సర్వశాస్త్రం, శాకునం, సాముద్రికం, రత్నశాస్త్రం, రథాశ్వగజకౌశలం, మల్లశాస్త్రం, సూదకర్మం, దోహదం, గంధవాదం, ధాతువాదం, ఖనివాధం, రసవాధం, జలవాదం, అగ్నిస్తంభం, ఖడ్గస్తంభం, జలస్తంభం, వాక్సంభం, వయస్త్సంభం, వశ్యం, ఆకర్షణం, మోహనం, విద్వేషణం, ఉఛ్ఛాటనం, మారణం, కాలవచనం, పరకాయప్రవేశం, పాదుకాసిధ్ధి, వాక్సిధ్ధి, ఘటికాసిధ్ధి, ఐంద్రజాలకం, అంజనం, దృష్టివంచనం, స్వరవంచనం, మణిమంత్రౌషదాది సిధ్ధి, చోరకర్మం,  చిత్రక్రియ, లోహక్రియ, అశ్మక్రియ, మృత్క్రియ, దారుక్రియ, వేణుక్రియ, అంబరక్రియ, అదృశ్యకరణం, దూతీకరణం, మృగయ, వాణిజ్యం, పాశుపాల్యం, కృషి, ఆసవకర్మం, ప్రాణిద్యూతకౌశలం వంటి అరువదినాలుగు కళా విశారదుడవు అయిన నీకు అలసట తెలియకుండా ‘ఐదు సూక్తులు’ అనే కథ చెపుతాను విను” అని కథ చెప్పసాగాడు బేతాళుడు.

***

భద్రగిరిని వీరసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి సుబుద్ది.

ఒకరోజు రాజుగారి సభలో ప్రవేశించిన ఇరువురు యువకులు “జయము జయము ప్రభువులకు. మహరాజా మా తండ్రిగారు మరణిస్తూ ఐదు సూక్తులు చెప్పారు. ఆయన మరణానంతరం మేము ఆస్తి సమంగా పంచుకోగలిగినా, మేము ఈ ఐదు సూక్తుల అర్థం తెలుసుకోలేకపోయాము” అన్నారు.

“ఏమిటి ఆ ఐదు సూక్తులు?” అన్నాడు మంత్రి సుబుద్ది.

“మంత్రివర్యా, మెదటి సూక్తి అమ్మకు అన్నం పెట్టవద్దు. రెండో సూక్తి అప్పు ఇచ్చి అడగవద్దు. మూడవ సూక్తి తీరిక సమయాల్లో ఉదయం జూదం ఆటతో గడపాలి. నాలుగో సూక్తి మధ్యాహ్నం స్త్రీల సంభాషణలతో గడపాలి. ఐదవ సూక్తి రాత్రులు దొంగతనంతో కాలక్షేపం చేయాలి – అన్నవే ఐదు సూక్తులు” అన్నారు ఆ యువకులు.

***

కథ పూర్తి చేసిన బేతాళుడు, “విక్రమార్కమహరాజా ఈ ఐదు సూక్తుల మర్మమేమిటి? సమాధానం నీకు తెలిసీ చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా, చనిపోయిన ఆ యువకుల తండ్రి చాలా ముందుచూపు కలిగినవాడు. ప్రతివారు వృద్ధాప్యంలో పలు రుగ్మతలకు లోనుకావడంతో పాటు, చీటికిమాటికి చిరాకుపడటం, కోపగించుకోవడంతో పాటు బాల్యానుభూతికిలోనౌతారు. వయసులో సుఖాలతో, సంపాదన ఆరాటంలో మునిగినవారు వృద్ధాప్యంలో చిన్నపిల్లల్లా అన్ని తినాలని కోరుకుంటారు. అందుకే మెదటి సూక్తిలో తల్లికి అన్నం పెట్టద్దు అంటే వృధ్ధులను తమకు కావలసినంత ఆహరం వారినే వడ్డించుకు తినమని అర్థం.

రెండో సూక్తి అప్పుఇచ్చి అడగవద్దు అంటే, అడగకుండా అప్పు తీర్చేవారికే అప్పు ఇవ్వమని అర్థం.

మూడవ సూక్తి తీరిక సమయాల్లో ఉదయం జూదం ఆటతో గడపడం అంటే, జూదం వలన ధర్మరాజు తన సర్వస్వం కోల్పోయాడని ఆయన చరిత్ర కలిగిన మహభారతాన్ని ఉదయం చదవమని అర్థం.

నాలుగో సూక్తి స్త్రీలతో కాలక్షేపం చేయడమంటే, సీతాదేవిని చెరపట్టిన రావణుడు ఎలా మరణించాడో తెలిపే రామాయణాన్ని చదవమని అర్థం.

ఐదో సూక్తి రాత్రులు దొంగతనంతో కాలక్షేపం చేయడం అంటే నవనీతచోరుడు, రాధామానసచోరుడు అయిన శ్రీకృష్ణుని విశేషాలతో ఉన్న భాగవతం రాత్రులు చదవమని అర్థం. ఇదే ఐదు సూక్తుల మర్మం” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here