[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు శ్మశానంలో ప్రవేశించి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా శ్మశానం నుండి బయలుదేరాడు.
“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘తెలిసి వచ్చిన తప్పు’ అనే కథ చెపుతాను విను.” అంటూ కథ చెప్పసాగాడు బేతాళుడు.
***
భువనగిరి అనే ఊరిలో పేరమ్మ అనే వితంతువు తన కుమారుడు అప్పయ్య, కోడలు ఈశ్వరితో కలసి నివసిస్తూ ఉండేది. ఇరుగుపొరుగు వారి మాటలు విని ఈశ్వరి తన అత్తగారితో ఎప్పుడూ తగవు పడుతూ ఉండేది. ఊరి వెలుపల ఆశ్రమంలోని సదానందస్వామీజిని దర్శించుకున్నఈశ్వరి “స్వామీ మా అత్తగారి పోరు భరింపలేకుండా ఉన్నాను. ఎలాగైనా ఆమె త్వరగా మరణించే మార్గం చెప్పండి” అని వేడుకుంది. ఆమె అమాయకత్వానికి జాలిపడిన సదానందుడు “దాని కేముంది? నేటినుండి నువ్వు మీ అత్తగారిని కన్నతల్లి కన్నా మిన్నగా అపురూపంగా ఆరునెలల పాటు చూసుకోవాలి. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. అందుకు నేను ఇక్కడ పూజ చేస్తాను వెళ్ళిరా!” అన్నాడు. సదానందుని సలహ మేరకు తన అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. కోడలిలో వచ్చిన మార్పు చూసిన పేరమ్మ ఈశ్వరి పట్ల ఆప్యాయంగా ఉండసాగింది. అత్తగారు తనను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూడటంతో మనసు మారిన ఈశ్వరి ఆరో నెల ప్రారంభం కావడంతో ఆందోళనతో సదానందుని ఆశ్రమానికి పరుగు లాంటి నడకతో వెళ్ళి “స్వామి మన్నించండి, ఇరుగుపొరుగు వారి మాటలు విని తల్లి వంటి అత్తగారిని అపార్థం చేసుకున్నాను. అందుకే ఆమె మరణించాలి అని తప్పుడు కోరిక కోరుకున్నాను. నా తప్పు తెలిసి వచ్చింది. నాకు కనువిప్పు అయింది. మన్నించండి. నన్ను బిడ్డలా చూసుకునే నా అత్తగారికి ఎటువంటి ఆపద రాకూడదు. దయచేసి నన్ను క్షమించి మా అత్తగారిని తమరే కాపాడాలి” అని వేడుకుంది.
***
కథ చెప్పడం పూర్తి చేసిన బేతాళుడు, “విక్రమార్క మహారాజా, తన అత్తగారి మరణం కోరుకున్న ఈశ్వరి అలా మారిపోవడానికి గల కారణం ఏమిటి? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు.
“బేతాళా! నువ్వు చెప్పిన కథలోనే సమాధానం ఉంది. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో తెలియజేయడానికి సదానందుడు ఈశ్వరికి మొదట అలా చెప్పాడు. వారి యిద్దరిలోనూ అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమానురాగాలు వెల్లడి కావడానికే సదానందుడు ఆరునెలల సమయం చెప్పాడు. అయినా ఎక్కడ అయినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మంత్రాలన్ని మానవుల హితానికే, ప్రేమ అనురాగాల విలువ అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఈశ్వరి. అలా మారిన ఆమె తన ముందు జీవితంలో ఎన్నడు చెప్పుడు మాటలకు స్ధానం కలిగించదు” అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమై మరలా చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.