Site icon Sanchika

కల్పిత బేతాళ కథ-19 దాన మహిమ

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు శ్మశానంలో ప్రవేసించి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా శ్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో అలసట తెలియకుండా – గర్వం లేకుండా ఎలా జీవించాలి, గర్వం లేకుండా దానం ఎలా చేయాలి అనే విషయాన్ని వివరిస్తూ కథలా తెలియజేయి. తెలిసి చెప్పక పోయివో మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా! దానం అనేది ఇలలో మహోన్నతమైనది. చతుర్విధ దానాలు అంటే మరణ భయంతో ఉన్నవానికి అభయం యివ్వడం, వ్యాధిగ్రస్థునకు సరియైన చికిత్స చేయించడం, విద్యాదానం, అన్నదానం వంటివి. ప్రత్యుపకారం ఆశించకుండా చేసే దానాన్నిసాత్విక దానం అని, తిరిగి ఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానం అని, తృణీకార భావంతో చేసే దానాన్ని తామస దానం అని అంటారు. దానం చేసే వారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకు ఉన్నదంతా దానం యిచ్చేవాడు దాత. తన వద్ద ఉన్నదంతా యిచ్చి యింకా యివ్వలేకపోయానే అని బాధపడేవారిని ఉదారుడు అనీ, తన వద్ద లేకున్నా యితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని వదాన్యుడు అంటారు.

దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

కన్యాదానం: వివాహంలో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానంగా కూడా పేరుగాంచింది.

పురాణాలలో దానం ప్రస్తావన ఉంది.

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

అటువంటి గర్విష్ఠి దాత కథ చెపుతాను. విను బేతాళా..”

***

భువనగిరి రాజ్యాన్నిచంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ – దానం స్వీకరించేవారి పొగడ్తలకు పొంగి గర్విష్ఠిగా మారాడు. ఒకరోజు తన మంత్రి సుబుద్ధితో “మంత్రివర్యా, నేడు నాలా దానం చేసేవారు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా?” అన్నాడు.

“ప్రభూ శ్రద్ధయా దేయం దానం. శ్రద్ధతో యివ్వాలి. హ్రియా దేయం – గర్వంతోకాక అణుకువతో దానం యివ్వాలి. శ్రీయా దేయం – ఈ దానం వలన నేనేమి కోల్పోను అనుకొవాలి. అశ్రద్ధయా దేయం – అశ్రద్ధతతో దానం చేయరాదు అని పెద్దలు చెపుతారు. ఈ రోజు మీకు అటువంటి దానం చేసే వారిని చూపిస్తాను” అని మంత్రి రాజుని బయలదేరదీశాడు. రాజుగారు, మంత్రి మారువేషాలలో గుర్రాలపై బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసాక నాలుగు రహదారులు కలిసే చోట ఓ పెద్ద చెట్టుకింద ఆకలితో దాహంతో ఆగారు.

అదే చెట్టు కింద కూర్చొని ఉన్న వృద్ధుడు తన వద్ద గంపలోని గుగ్గిళ్ళు ఆకులో పెట్టి రాజు మంత్రికి యిస్తూ రెండు ముంతల చల్లటి మంచినీరు వారికి అందించి “ఆరగించండి బాటసారులు, మీలాంటి వారి ఆకలి తీర్చడం కోసమే నేను ఈ ఉచిత సేవ చేస్తున్నా” అన్నాడు. ఆకలి, దాహం తీరిన రాజుగారు “తాతా నీవు పేదవాడిలా ఉన్నావు, యిలా దానం చేయడానికి నీకు ధనం ఎలా వస్తుంది?” అన్నాడు.

”అయ్య మా ఉరిలో వారం వారం సంత జరుగుతుంది. అక్కడ యాచన చేయగా వచ్చిన ధనాన్ని యిలా సద్వినియోగం చేసుకుంటాను” అన్నాడు. ఆ యాచకుని దానగుణం చూసిన రాజు గర్వం అణగిపోయి అతనికి కొంత ధనం యిచ్చి రాజధాని వస్తుండగా, ఓ భిక్షగాడు తను తింటున్న అన్నాన్ని కొంత తన దగ్గరకు వచ్చిన కుక్కకు పెట్టడం చూసి రాజు “మంత్రివర్యా మీరు చెప్పింది నిజమే కుడి చేతితో చేసేదానం ఎడమచేతికి కూడా తెలియకూడదు, దానం ఎప్పుడూ మూడో వ్యక్తి తెలియకూడదు. దానం డాంబికానికి కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను” అన్నాడు చంద్రసేనుడు.

***

కథ పూర్తయి, విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.

Exit mobile version