Site icon Sanchika

కల్పిత బేతాళ కథ-3 దొంగల గస్తీ

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు  చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించాడు. బేతాళుడు “రాజా విక్రమార్కా – రమ్యక, రుమళిక, ద్వారక, సింహాళ, కైవల్య, మలయ, అశ్వభద్ర, కేతు, గోభి, మాల్యవంత, పుష్కర, వృషభ, రైవత, నిమ్నొచన, నియోమ్యమ, పారవారా, చౌరవశ్రిత, మాల్యద్రి వంటి అష్టద్వీపాలలో పేరు పొందిన నీ నుండి ఓ సందేహం తీర్చుకోవలనుకుంటున్నాను. నాకు చాలా కాలంగా ఉన్న సందేహాన్ని కథారూపంగా ‘దొంగల గస్తీ’ పేరుతో నీకు ప్రయాణ అలసట తెలియకుండా చెపుతాను విను..” అంటూ కథ చెప్పసాగాడు.

అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, అతని రాజ్య శివార్లలోని గ్రామాలలో తరచు దొంగతనాలు జరగడంతో అక్కడి ప్రజలు మహరాజును కలసి తమ బాధలు విన్నవించారు. మహరాజు ఎందరు భటులను వినియోగించినా, అక్కడ జరిగే దొంగతనాలు ఆపలేకపోయాడు.

ఒకరోజు శివయ్య అనే యువకుడు రాజు గారిని కలసి “మహరాజా, మన రాజ్య శివారు ప్రాంతాలలో జరిగే దొంగతనాలు అరికట్టడానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది” అని వివరించాడు. మరుదినం, ఆ శివారు గ్రామ ప్రాంతాలలో దండోరా వేస్తూ, “ఇందుమూలంగా తెలియజేయడమేమనగా దొంగతనం చేస్తూ దొరికిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరికి మరణశిక్ష విధించబడుతుంది. దొంగతనానికి పాల్పడేవాడు తనతో పాటు తన వారందరిని కోల్పోతాడు. కనుక ఈ శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే వచ్చే పౌర్ణమి నాడు రాజసభలో గతంలో దొంగతనాలు చేసినవారు లొంగిపోతే, వారికి క్షమాభిక్ష పెడుతూ రాజుగారు రాజభటుల ఉద్యోగం యిస్తారు. అలా వారి ఊరిలోనే రాత్రులు కావలి కాసే బాధ్యత వారికి అప్పగింపబడుతుందహో..” అని ప్రకటించారు.

అది విన్న ప్రజలు దొంగల గస్తీ ఏమిటి అని ఆశ్చర్యపోయారు.

దొంగతనం చేసే వారి కుటుంబ సభ్యులంతా “మీరు దొంగతనం చేస్తూ పట్టుబడితే మా అందరి ప్రాణాలు పోతాయి. కనుక మీరు పౌర్ణమిరోజు రాజు గారి ఎదుట లొంగిపోయి, వారు యిచ్చే రాజభటుని ఉద్యోగం స్వీకరించి, హాయిగా దర్జాగా ఠీవిగా బ్రతకవచ్చు. ఇలా దొంగతనం చేస్తూ అనుక్షణం భయంతో జీవించడం నరకంగా ఉంటుంది” అని పోరుపెట్టారు. చేసేది లేక కుటుంబ సభ్యుల ఒత్తిడితో, దొంగలు అందరు రాజుగారి సభలో పౌర్ణమి రోజు లొంగిపోయారు.

అలా లొంగిపోయిన దొంగలు అందరికి చెరసాల శిక్ష విధించిన రాజు, వారి కుటుంబంలో ఒకరికి వారి అర్హతను బట్టి ఉద్యోగం యిచ్చాడు.

కథ చెప్పడం ఆపిన బేతాళుడు.. “రాజా విక్రమార్కా! చంద్రసేన మహరాజు ఆడిన మాట తప్పి, లొంగిపోయిన దొంగలను చెరసాలలో బంధించాడు. చెప్పినదానికి విరుధ్ధంగా దొంగల కుటుంబ సభ్యులకు రాజ ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ ఉద్యోగమేదో లొంగిపోయిన దొంగలకే ఇవ్వచ్చుకదా! ఈ నా ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పక పోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు

అందుకు విక్రమార్కుడు “బేతాళా చంద్రసేన మహారాజు ఎంతో ముందుచూపు కలిగినవాడు. తన ప్రకటన ప్రకారం దొంగలను క్షమించి వారందరికి ఉద్యోగాలు ఇస్తే, అది చూసి ముందుకాలంలో మరెందరో దొంగలుగా మారే అవకాశం ఉంది. మనం రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని ఎప్పుడూ గౌరవించాలి. ఎంతటివారైనా చట్టం ముందు సమానులే. తప్పుచేసిన వారిని శిక్షించాలి, అలా శిక్ష అనుభవించి, పశ్చాతాపపడి, మార్పు చెందుతారు. చంద్రసేనరాజు, దొంగల కుటుంబ సభ్యులలో అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కలిగించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. అలా తప్పు చేసిన దొంగలకు శిక్ష విధించి, తప్పుడు పనులకు పాల్పడే వారిని పరోక్షంగా హెచ్చరించాడు. ఇలా చంద్రసేనుడు తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదే” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ బేతాళుడు అదృశ్యమైయ్యడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు మరలా వెనుతిరిగాడు.

Exit mobile version