[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా స్మశానం చేరి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.
“మహీపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! విక్రమార్క మహరాజా, నీవు సకల కళావల్లభుడవయిన నీవు ఈ లోకంలో ఎంతో పేరుపొందావు. అమరులు, సిధ్ధులు, సాధ్యులు, గరుడలు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, విధ్యాధరులు, భూత, ప్రేత, పిశాచ గణములు, రుద్రులు, మునిగణాలు, ఉరుగులు, తుహిషితులు, దైత్యులు, భాస్వరులు, గుహ్యకులు, ఈ లోకంలోని నరులు నీ గుణగణాలను ధైర్యసాహసాలు, దానగుణశీలత గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అంతటి ఘనుడవు అయిన నీకు మనం వెళ్లేదారిలో ప్రయాణ అలసట తెలియకుండా ‘నిజమైన సంగీత ప్రేమికులు’ అనే కథ చెపుతాను విను.”
***
భువనగిరిని రాజ్యాన్ని పాలించే గుణశేఖరునికి కళల పట్ల అమిత అభిమానం. ప్రతి సంవత్సరం మూడు రోజులు జరిగే సంక్రాంతి వేడుకల్లో పలు కళాకారులు తమ తమ కళలలోని ప్రావీణ్యతను ప్రదర్శించి రాజుగారి మెప్పు పొంది ఆయన ఇచ్చే బహుమతులు స్వీకరించి వెళ్ళేవారు.
ఎప్పటిలా ఆ సంవత్సరం సంక్రాంతి వేడుకలలో ఎందరో కవి గాయకులు పాల్లొన్నారు. పోటాపోటీగా సాగే ఆ సంగీత గాయకుల గానానికీ సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆనంద పరవశులై తాళానికి అనుగుణంగా తల ఆడించసాగారు. అది చూసి అసలు సంగీత పరిజ్ఞానం లేనివారు కూడా తమ తలలు ఇష్టానుసారంగా ఊపసాగారు. ఆ సంగీత సభలో ఉన్నవారు ఒకరు తల అటుపక్కకి ఊపితే మరొకరు తమ తలను ఇటు పక్కకు ఊపసాగారు. సంగీత సభలోని వారు ఆనందించి తల ఊపినట్లు లేదు, పూనకం వచ్చినట్లు ఊగిపోసాగారు. స్వతహాగా సంగీత విద్వాంసుడు అయిన రాజుగారికి సభలోని వారు సంగీతాన్ని ఆస్వాదిస్తూ తలలు ఊపినట్లు లేకపోవడంతో చిరాకు పెట్టింది. తన మంత్రితో ఈ తలలు ఊపే విషయంలో తన అసహనాన్ని తెలియజేసాడు రాజు.
మరుదినం సంగీత సభ ప్రారంభంలో, “సభాసదులారా, సంగీతప్రేమికులారా, ఈనాటి సంగీత సభలో ఎవరైనా తల ఊపితే వారి తల తెగవేయబడుతుంది. ఇది రాజాజ్ఞ” అన్నాడు మంత్రి. ఆ రోజు సంగీత సభలోని శ్రోతలు చాలావరకు వెళ్ళిపోయారు.
సంగీత సభ ప్రారంభమైన కొద్దిసేపటికి సభలో శ్రోతలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయకుని గానానికి అనుగుణంగా తలలు ఆడించసాగారు.
సభానంతరం రాజుగారు ఆ శ్రోతలను సత్కరించాడు.
***
“విక్రమార్క మహరాజా, మంత్రి తలలు ఊపితే మరణశిక్ష అన్నప్పటికి మహరాజు ఆ ముగ్గురు శ్రోతలను ఎందుకు సత్కరించాడు? తెలిసి సమాధానం చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు బేతాళుడు.
“బేతాళా, మంత్రి ప్రకటించిన మరణశిక్షకు భయపడకుండా ఆ శ్రోతలు సభలోని సంగీత ప్రతిభకు తన్మయానందం పొంది ఆ గానానికి అనుగుణంగా తలలు ఊపారు. వీరే నిజమైన సంగీత ప్రేమికులు. అది చూసి ఆనందించిన మహరాజు ఆ ముగ్గురిని సత్కరించాడు” అన్నాడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.