Site icon Sanchika

కల్పిత బేతాళ కథ-7 చెప్పుడు మాటలు చేటే!

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చెర్చుకుని మౌనంగా శ్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా! అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మహీపాలా – భిండివాలము- అసి – కోదండము – భల్లాంతకము – నారాచకము – వజ్రము – ముష్టి – ముద్గరము – శూలము – ముసలము -భూసుండిక- ప్రాసము – ప్రకూర్మము – కప్పటము – కటారి – కాగరము – అయోదండము – కణయము – కుంతము – ఈటి – అంతలము – పరుశువు – తోమరము – చక్రము – పరిఘటము – పట్టిసము – వంకిణిక -సబళము – చిన్వి – సెలకట్టె – ఆశానిపాతము – శక్తి – గధ – బిండివాలము – ఘోరశరము – భూఘండి – వత్సదంతం – కర్మీరము – నఖరము – వెడదవాతియమ్ము వంటి పలు ఆయుధాలతో యుధ్ధం చేయగలిగే వీరుడివి అయిన నీ గురించి నాకు బాగా తెలుసు. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా  ‘చెప్పుడు మాటలు చేటే’ అనే జంతువుల కథ చెపుతాను విను” అని చెప్పసాగాడు.

***

అమరావతి నగర సమీపాన ఉన్న అరణ్యంలో, ఒక కోతి తను ఉన్న చెట్టు ముందునుండి అలా వెళుతున్న ఏనుగును చూసి “తాతా, ఏనుగు తాతా! ఆగు నీకో ముఖ్య రహస్యం చెప్పాలి, ఉదయం నుండి చూస్తున్నా నీ కోసం” అన్నాడు.

“ఏమిటి అంత రహస్యం మనమడా” అని తన తొండంతో కోతిని తన చెవి వద్దకు తీసుకున్నాడు.

 ఏనుగు చెవివద్ద గుస గుసలాడాడు కోతి.

“ఏమిటి గుడ్డివెధవ అలా అన్నాడా నన్ను, ఈ రోజే వాడి సంగతి తేలుస్తాను” అని  కోపంతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ఏనుగు.

వేగంగా గుర్రం దగ్గరకి వెళ్ళిన వెళ్ళిన కోతి “బాబాయ్ నీకో రహస్యం చెప్పాలి, నీ చెవి ఇలా పెట్టు” అన్నాడు.

ఆసక్తిగా అంతా విన్న గుర్రం తన చెవితో కోతి మూతిపైన ఒక్కటి ఇచ్చింది.

“అబ్బ మూతి పగిలింది” అన్నాడు కోతి.

“అరే దోమ కుడుతుంటే చెవి విదిల్చాను, అయినా నన్నుగుడ్డి వెధవా అంటాడా, ఈరోజే అటో ఇటో తేలిపోవాలి” అని గుర్రం వెళ్ళిపోయాడు.

నక్క దగ్గరకి వేగంగా పరుగులు తీస్తూ వెళ్ళిన కోతి “నక్కమామా, నీ చెవి ఇలా ఉంచు నీకో రహస్యం చెప్పాలి” అని చెవి వద్ద గుసగుసలాడాడు.

“అల్లుడు నీ సహాయానికి ధన్యవాదాలు, కాలు బెణికింది నెమ్మదిగా వెళతాను” అన్నాడు నక్క.

పరుగు పరుగున వెళ్ళి కోతి, నక్క భార్య చెవి వద్ద “అత్తా ఎంత ప్రమాదమో!” అని గుసగుసలాడాడు.

“వామ్మో ఓరి దేవుడో నేనేం చేతురో” అంటూ శోకాలు పెడుతూ ముక్కుచీది కోతిబావ మెహాన వేసింది.

“ఛీ ఛీ” అంటూ సెలయేటివద్ద ముఖం కడుక్కుని, ఈ దెబ్బతో అడవిలోని పలు జంతువులు గొడవపడి కొట్లాటకు దిగుతాయి అనుకుని తృప్తిగా నవ్వుకుంటూ చెట్టుపైకి చేరాడు కోతి.

తనకు ఎదురైన గుర్రాన్నిచూసిన ఏనుగు “ఏమయ్య  నేను ఏం తింటే నీకెందుకు, నేను రోజుకు ఆరు మూటల గడ్డి తింటానా?” అన్నాడు.

“ఏవయ్యో వయసులో పెద్దవాడివి మాటలు తూలక. నువ్వు ఆరు మూటలు తింటే నాకెందుకు మూడు సార్లు లద్దె వేస్తె నాకెందుకు, నీ గడ్డి నీదే, నా గడ్డి నాదే. ఐనా ఈ వయసులో నీకిదేం బుద్ధి? నేను ఉలవ కావాలని అందరిని అడుగుతున్నానా?” అన్నాడు గుర్రం.

“ఎవరు చెప్పింది? నీ గురించి నేను ఎప్పుడు ఎవరి దగ్గరా అనలేదే!” అన్నాడు ఆశ్యర్యంగా ఏనుగు.

“మరేంటి కోతి నీమీద నాకు అలా చెప్పాడే” అన్నాడు ఏనుగు.

“సరిపోయింది నువ్వు నన్ను అన్నావని వాడే నాకు చెప్పాడు” అన్నాడు గుర్రం.

“పదవాడి సంగతి తేలుద్దాం!” అని ఇరువురు సింహారాజు వద్దకు బయలు దేరారు.

“ఈత రాని దానివి వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళావే, నీకు అంతగా పీతలు తినాలి అనిపిస్తే నన్నడిగితే నేను తెచ్చి పెట్టేవాడినిగా! నీకేదైనా జరిగితే ఏమయ్యేను, సమయానికి కోతి వచ్చి నిన్ను కాపాడడు కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత ప్రమాదం జరిగేదో” అన్నాడు నక్క తన భార్యతో.

“ఏమిటి నేను వాగు దగ్గరకు వెళ్ళలేదే? నువ్వు బావిలో దూకావంట చావడానికి, అంత కష్టం ఏం వచ్చింది” అంది నక్కమ్మ.

“నేను చావడమేమిటే? నువ్వు వాగులో పడ్డావని నిన్ను కాపాడనని కోతిగాడు నాకు చెపితే!” అన్నాడు.

కోతి పెట్టిన తగవు అని విషయం అర్థమైన నక్కలజంట సింహరాజు దగ్గరకు బయలుదేరారు.

అలా నక్కల జంట, ఏనుగు, గుర్రం, కోతి ద్వారా తగవుపడిన మరికొన్ని జంతువులు, అంతా కలసి సింహారాజు వద్ద సమావేశమైనారు. కుందేలు వెళ్ళి కోతిబావను తీసుకువచ్చింది.

“నీకు ఇదేం బుద్ధి కోతి, అందరి చెవులవద్ద గుసగుసలాడి, అందరికి ఉన్నవి లేనివి కల్పించి తగవులు పెడుతున్నావు, చెప్పుడు మాటలు చేటు కలిగిస్తాయని తెలియదా” అన్నాడు సింహరాజు.

***

“విక్రమార్క మహరాజా! చెప్పుడు మాటలు ఎంతో ప్రమాదకరమైనవి. అలాంటి చెప్పుడు మాటలతో అడవిలోని తన సాటి జంతువులకు కోతి ఎందుకు తగవు పెట్టిందో దానిలోని మర్మం ఏమిటో తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా, కోతి చాలా తెలివైనది. చెప్పుడు మాటలు వినడం ఎంత ప్రమాదమో తెలియజేయడానికే నేను ఇలా చేసింది. మనకు ఎవరైనా ఇతరులపై తప్పుగా చెపితే విని విచారించి నిర్ధారించుకోవాలి. అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి, అంతే కాని చెప్పుడు మాటలు విని ఎదుటివారిని అపార్థం చేసుకోవడం ఎంత తప్పో అనుభవపూర్వకంగా తెలియజేయడానికే కోతి ఇలా చేసింది” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

Exit mobile version