కళ్యాణదుర్గం ఒక జ్ఞాపకం

2
2

[dropcap]“వి[/dropcap]వాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా
ఇయెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు”

మీరు ‘మాయాబజార్’ సినిమాని, అందులోని ఈ పాటని వెండి తెరపై చూసి ఉంటారు. నేను ఈ సినిమాని, ముఖ్యంగా ఈ పాటని సినిమా థియేటర్‍లో తెరపైనే కాకుండా ‘సురభి’ నాటక సమాజం వారి ‘మాయాబజార్’ నాటకంలో నా కళ్ళెదురుగా వేదికపై నడుస్తుండగా చూశాను.

ఇంకా తమాషా ఏమిటంటే, ఇవి రెండు కూడా కళ్యాణదుర్గంలోనే చూశాను.

సురభి వారి నాటకాల గూర్చి వివరంగా వ్రాస్తాను రాగల సంచికలలో.

***

ఈ వారం కళ్యాణదుర్గంలో నా బాల్యం తాలూకు జ్ఞాపకాలు కొన్ని మీతో పంచుకుంటాను.

కళ్యాణదుర్గం చాలా చిన్న ఊరు అప్పట్లో. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. ఆంధ్రబోజుడుగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య రక్షణ పరంగా – సైనిక కదలికల పరంగా వ్యూహాత్మక స్థానంగా ఉండేది ఈ ఊరు అని చరిత్ర చెబుతోంది. అంతే కాదు అప్పట్లో ఇది ఆర్థికంగా చాలా బలమైన సామంతరాజ్యం అని కూడా చరిత్రలో ఉంది. పాలెగాళ్ళు అనే వీరులు పాలించే వారట ఆ కాలంలో ఈ ఊరిని.

ఇదంతా ఇటీవల తెలుసుకున్నాను. నేను నా ఏడో ఏట కళ్యాణదుర్గంలో అడుగుపెట్టేనాటికి ఇంత చారిత్రక జ్ఞానం నాకేమి లేదులెండి.

గత చరిత్ర తాలూకు ప్రాభవాలు మాకు ఏమీ కనిపించలేదు నిజానికి ఆ ఊరిలో. కాకపోతే ఆ ఊరిపేరు చాలా బాగా అనిపించింది నాకు చిన్నప్పుడే. చందమామ కథల్లో ఉండే రాజుగారి రాజ్యం పేరులాగా ఉండటం వల్ల మొదటి సారి విన్నప్పుడే ఆ ఊరిపేరు నన్ను బాగా ఆకర్షించింది.

బహుశా వెదకి చూస్తే చుట్టు పక్కల ఉన్న కొండల మీద కోటలు గీటలు ఏమన్నా కనిపిస్తాయేమో. చిన్న వయసు కద నేను అలా ఎక్కడకి వెళ్ళలేదు.

కాకపోతే ఊరిలోపల రాళ్ళతో నిర్మించిన కోట గుమ్మంలాంటి రాతి నిర్మాణాలు, పెద్ద పెద్ద రాతి గోడలు కనిపించేవి. ఇలాంటి నిర్మాణాలు నాకు వరంగల్‌లో కూడా కనిపించాయి ఇటీవల.

సరే, చరిత్ర పక్కన పెట్టి మళ్ళి నా బాల్యానికి వస్తే, అంత చెప్పుకోదగ్గ ఊరేమీ కాదని మాత్రం ముందే ఒక్క మాటలో చెప్పగలను. కానీ నాదైన అనుభూతి నాది కాన అన్నట్టు కొన్ని చక్కటి జ్ఞాపకాలయితే ఉన్నాయి. అవి పంచుకొంటాను. ఎలాగు మొదలెట్టారు కాబట్టి చదివేయండి. మీకు నిరాశ మాత్రం కలగదు అది నా హామీ.

***

కళ్యాణదుర్గం అనగానే నాకు చప్పున గుర్తు వచ్చే అంశం ఆ ఊరి చెరువు.

ఆ ఊరిలో మంచి నీటి సమస్య బాగా ఉండేది. అప్పటికి స్వాత్రంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళవుతున్నా ఆ ఊర్లో ఒక మంచి నీళ్ళ టాంక్ కానీ, ఇంటింటికీ మంచినీటి కొళాయి గానీ లేకపోవటం ఇప్పుడు తలచుకుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. మరి ప్రభుత్వాలు ఏమి చేసేవో?

మా ఇంటికి దగ్గరగా ఓ పెద్ద గిలక బావి (చేద బావి) ఉండేది. అది అందరూ వాడుకోవచ్చన్న మాట. ఆ బావికి నాలుగు వైపులా గిలకలు (కప్పీలు) అమర్చి ఉండేవి. ఇంచుమించు ఒక్కో వైపు రెండేసి గిలకలు అమర్చి ఉండేవి. వెరసి ఏకకాలంలో ఎనిమిది మంది దాకా తాడు కట్టి నీళ్ళు చేదుకునే వీలు ఉండేది.

నిరంతరం నీళ్ళు చేదుకునే యజ్ఞం నడుస్తూ ఉండేది. కానీ ఉదయం అయిదు నుంచి తొమ్మిదింటి దాకా, సాయంత్రాలు దాదాపు ఏడు దాకా రద్దీ ఎక్కువ ఉండేది. ఎక్కడెక్కడి ఆడ, మగ వచ్చి కోలాహలంగా మాట్లాడుకుంటూ చేదవేసి నీళ్ళు తోడుకుంటూ కనిపించేవారు. ఇంచుమించు చీమల పుట్ట దగ్గర చీమలు ఎలా మూగి ఉంటాయో అలా ఈ బావి చుట్టూ జనాలు మూగి ఉండేవారు రద్దీ వేళల్లో.

మా ఇంటికి నౌకర్లు నీళ్ళు తెచ్చి పోసేవారు. తిప్పయ్య, నాగేంద్ర అని ఇద్దరు నౌకర్లు నిరంతరం ఈ యజ్ఞంలో తలమునకలై ఉండేవారు. ఈ తిప్పయ్యకి దాదాపు నలభై పైనే ఉంటుంది వయస్సు. గోచి పోసిన పంచె, ఖద్దరు జుబ్బా ధరించి, తెల్లటి జుత్తు, ఎప్పుడు మాసిన తెల్లటి గడ్డంతో కనిపించేవాడు. కాస్త పొట్టిగా మరీ లావు మరీ సన్నం కాని రూపంతో ఉండేవాడు. అతన్ని కదిపితే చాలు ఎన్నో కథలు చెప్పేవాడు, జీవితానుభవంతో పండిపోయిన అతని జ్ఞాపకాలు నిజంగా అబ్బురపరిచేవి అందరినీ.

దెయ్యాల కథలు చెప్పేవాడు ఎక్కువ. వాటిలో కొరివి దెయ్యాల కథలు స్పెషల్ అట్రాక్షన్. కాస్త అందంగా నదురుగా ఉండే యువకులు శ్మశానాల పక్కన వెళ్ళేటప్పుడు, కాస్త జాగ్రత్తగా ఉండకుంటే కామినీ పిశాచాలు ఇట్టే వచ్చి పట్టేసుకుంటాయని అతను తీర్మానం చేసేశాడు. అతని యవ్వనంలో కామినీ పిశాచాలతో అతను పడ్డ తిప్పలు అనే శీర్షిక కింద కొన్ని వందల గ్రంథాలు వ్రాయవచ్చు. అవన్నీ వింటుంటే మనం భయంతో నిలువెల్లా వణికి పోతాము.

కానీ మరీ అంత భయపడవలసిన పని లేదని, ఆ కామినీ పిశాచాల నుంచి తప్పించుకునేందుకు ఒక చిట్కా కూడా ఉందని ఉపశమన వాక్యాలు చెప్పేవాడు. అదేందయ్యా అంటే, నింపాదిగా తన జుబ్బా పక్క జేబు నుంచి ఒక ఫోటో తీసి చూపాడు ఒకసారి. అది ఆంజనేయస్వామి వారి ఫోటో. అది నెట్టేకల్ ఆంజనేయస్వామి వారి ఫోటో అని చెప్పాడు. ఎంత మంది ఆంజనేయస్వాములు ఉన్నా (అంటే అతని ఉద్దేశం ఎన్ని క్షేత్రాలలో ఆంజనేయస్వామి ఉన్నా కూడా అని) గుంతకల్‌కి దగ్గర ఉన్న కసాపురం (ఈ ఊరినే నెట్టేకల్ అని కూడా అంటారు) లో ఉన్న ఆంజనేయస్వామి చాలా పవర్‍ఫుల్ అని అతను బలంగా విశ్వసించేవాడు. ఈ కసాపురం ఆంజనేయస్వామి పేరు చెబితే ఇక కామినీ పిశాచాలు అడ్రస్ ఉండవనీ, వాటి గూర్చి భయపడవలసిన అవసరం లేనే లేదని ముక్తాయించాడు.

మా ఇంట్లో ఒక వాడుక మాట అమల్లో ఉంది. అదేంటంటే, ‘తిప్పయ్యా నీ మనసు మంచిది….’ అని చెప్పి చివర్లో దీర్ఘం తీయాలన్నమాట. నిజానికి తిప్పయ్య ఈ మాటల్ని చాలా నిజాయితీగా చెప్పినప్పటికీ మాకు పిల్లాటలాగా ఉండేది. నవ్వుకునేవారం.

ఈ వాడుక మాట పుట్టుక వెనుక ఒక కథ ఉంది.

మేము ఇంకా ఆ ఊరికి చేరకముందే ఈ తిప్పయ్య తన బిడ్డ పెళ్ళి నిర్వహించాడట. తక్కువ ఆర్థిక వనరులతో ఏదో చిన్న స్థాయిలో పెళ్ళి చేద్దామని అనుకున్నాడట. కానీ తీరా పెళ్ళి సమయానికి ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో అతిథులు వచ్చారట. ఏదో ఒక యాభై అరవై మందికి అని వండుకున్న వంటలు, లడ్లు వందలాది మంది వచ్చి తింటున్నా తరగిపోవటం లేదట. మూతలు తీసి, గిన్నెల్లో చేయి పెడితే అవి అక్షయపాత్రలా అన్నట్టు పదార్థాలు, లడ్లు వస్తూనే ఉన్నాయట.

అంతకు ముందే ఎవరో గురువు గారు ఈ తిప్పయ్యకి ఆశీర్వాదం ఇచ్చి తిప్పయ్యా! నీ మనసు మంచిది. దేనికీ కొదవ ఉండదు” అని తలపై చేయి పెట్టి పంపాడట.

యాదృచ్ఛికంగా పెళ్ళికి వచ్చిన అతిథులంతా కూడా ఇవే మాటలు పొల్లు పోకుండా చెప్పి వెళ్ళారట.

ఈ అనుభవం చెబుతున్నప్పుడు అతను సజలనేత్రుడవుతాడు. అతను నిలువెల్లా పులకించిపోతూ ఈ మాటలు చెబుతాడు. పిల్లతనం కావటం వల్ల అప్పట్లో ఈ మాటలకి నేను పెద్ద ప్రాముఖ్యతని ఇవ్వలేదు కానీ, గురుకృప ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవాల ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ తిప్పయ్యని అనేక సార్లు గుర్తు తెచ్చుకున్నాను.

You get what you deserve and not what you desire అన్న వాక్యాలని ఇక్కడ చెప్పాలి.

కర్మ ఫలం, పాపం, పుణ్యం అనే మాటలు మీకు వినటానికి చాదస్తంగా అనిపించినా, ఇక్కడ అవే చెప్పాలి నేను. పోనీ వేరే మాటల్లో చెపుతాను. ‘మనం చేసుకున్నదే మనకు దక్కుతుంది’.

ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా వీలయినంతవరకు మంచి పనులు మాత్రం చేస్తూ, వీలయినంతవరకు ఎదుటివానికి సాయపడుతూ ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఒక రోజు ఖచ్చితంగా ఊహించనంత మంచి జరుగుతుంది.

ఇలా ఎన్నయినా చెప్పవచ్చు ఈ తిప్పయ్య జీవితం నుంచి.

ఒక నిరక్షరాశ్యుడు, పెద్దగా నాగరికత తెలియని తిప్పయ్యని ఇప్పటికీ గుర్తుంచుకున్నానంటే కారణం అతని మంచితనం, బోళాతనమే అని చెప్పవచ్చు.

సరే, మళ్ళీ కళ్యాణదుర్గం మంచి నీళ్ళ బావి దగ్గరికి వద్దాం.

అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వచ్చిన ప్రధాన రహదారి ఒక మూడు రోడ్ల కూడలి దగ్గరకి వచ్చి చేరుతుంది. ఈ ‘T- జంక్షన్’లో ఎడమవైపు వెళితే కళ్యాణదుర్గం ఊరులోనికి వెళ్ళవచ్చు, కుడివైపు వెళితే రాయదుర్గం, బళ్ళారి వెళ్ళచ్చు.

ఈ విధంగా ఈ మూడు రోడ్ల కూడలి ఒక ప్రధాన లాండ్‌మార్క్.

మన రంగస్థలం అయిన బావి ఈ మూడు రోడ్ల కూడలికి దగ్గరలోనే ఉంటుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న కూడలిలో హోటళ్ళు, లాడ్జీలు వస్తాయి కద. అలాంటి వ్యాపార సంస్థల తాలూకు వ్యర్థ జలాలు ఈ బావిలో కలుస్తున్నాయి అని కొందరు ఒక అనుమానం వ్యక్తం చేయటం మొదలెట్టారు.ఆ నీళ్ళు త్రాగితే ఆరోగ్య సమస్యలు రావచ్చు అని అనుమానాలు వచ్చాయి. కానీ వేరే దారిలేక అందరూ ఆ నీళ్ళనే తీస్కువెళ్ళేవారు.

ఈ వదంతులకి ఊతం ఇస్తున్నట్టు, మా అమ్మకి నిరంతరం జ్వరంగా ఉండటం, వళ్ళునొప్పులు, మూత్రనాళంలో మంట తదితర ఇబ్బందులు తలెత్తాయి. అనారోగ్యం అన్నది ఎరుగని మనిషి ఈ విధంగా డీలా పడటంతో, మా అప్ప కంగారు పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఈ బావి నీళ్ళు త్రాగటం మానేద్దాం అని నిర్ణయం తీస్కున్నారు.

అప్పుడు ఒక బ్రాహ్మణ ఆవిడ రంగంలోకి వచ్చింది. ఆమె పేరు పార్వతమ్మ అని నాకు గుర్తుంది. కాదు కాదు సుభద్రమ్మ అని మా అక్కయ్య అంటున్నారు. సరే పేరేదైతేనేం, ఈవిడ వృత్తి రీత్యా వంటలావిడ. నడివయస్కురాలు, సన్నగా ఉంటారావిడ. దైన్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంటుంది ఆవిడవదనంలో.

కానీ ఈవిడని వంట చేయటానికి నియుక్తం చేసుకోలేదు మేము. ఎంత అనారోగ్యంగా ఉన్నా వంట చేయటం వేరే వాళ్ళకు అప్పజెప్పటం మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు. ఇంతకీ ఈ సుభద్రమ్మని ఎందుకు నియుక్తం చేసుకున్నామంటే, ప్రతి రోజూ ఊరి చివర ఉన్న చెరువుకి వెళ్ళి ఒక రెండు బిందెలు త్రాగు నీరు తీసుకుని రావటం ఆవిడ విధి.

పిల్లలకు ఇదొక ఆటవిడుపు అయింది. ఇది ఒక కొత్త వినోదం మాకు.

స్కూల్ లేని రోజు ఉదయాన్నే ఆవిడతో పాటు చెరువుకి వెళ్ళటం అనే ఒక కొత్త కార్యక్రమం మా షెడ్యూల్‌లో చేరింది. మరీ దగ్గరేం కాదు ఆ చెరువు. నాకు తెలిసి కనీసం ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఖచ్చితంగా. అంత దూరంనుంచి బిందెలతో నీళ్ళు తీసుకురావటం సామాన్యమైన విషయం కాదు, ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

నేను మా ఇద్దరు అక్కయ్యలు సుభద్ర, రుక్మిణీ వెళ్ళే వారం ఈ సుభద్రమ్మ గారితో కలిసి. మా సుభద్రక్క అప్పుడు ఆరోతరగతి, రుక్మిణక్క నాలుగోతరగతి చదివే వారు. మా పెద్దక్కయ్య రామలక్ష్మి ఆదోనిలో డిగ్రీ చేరింది.

ఆడపిల్లల వంటిపై నగలు ఉంటాయి కాబట్టి మాకు తోడుగా నాగేంద్ర అనే నౌకరుని పంపించేది మా అమ్మగారు. ఈ నాగేంద్ర తిప్పయ్యకి పూర్తి కాంట్రాస్ట్. ఇతను పాతిక సంవత్సరాల యువకుడు. పాంటు, షర్ట్ వేసుకుని చక్కగా షేవింగ్ చేసుకుని చూట్టానికి విద్యాధికుడిలా కనిపిస్తాడు. కానీ పదవతరగతి కూడా పాస్ కాకపోవటం వల్ల ఇలా ఉండిపోయాడనుకుంటా. అతని వేషభూషలు చూసి అతనిపై ఏర్పడ్డ అంచనాలు అతను నోరు తెరచి మాట్లాడటం మొదలెట్టగానే పటాపంచలు అవుతాయి. అతని మాటల్లో పల్లెటూరి యాస, విషయ పరిజ్ఞాన లేమి కొట్టవచ్చినట్టు కనిపించేవి.

సరే, ఇక చెరువుకి బయలు దేరుదాం. మా అక్కయ్యలు ఇద్దరు, నేను, వంటావిడ, మా అందరికీ రక్షకుడు నాగేంద్ర ఇలా అందరమూ ఒక బృందంలాగా చెరువుకి వెళ్ళేవారం. వాస్తవానికి వంటావిడకంటే నాగేంద్ర బలాఢ్యుడు. అనుకుంటే ఆ చెరువునీటిని మొత్తం తోడి తేగలిగే వాడు అనుకుంటా. కానీ ఆ రోజుల్లో ఉండే చాదస్తం కారణంగా, త్రాగు నీరు కేవలం వంటావిడ మాత్రమే తెచ్చేది.

ఈ చెరువు చుట్టూ చిన్నచిన్న కొండలూ గుట్టలతో ప్రకృతి చాలా బాగుండేది.

ఈ చెరువు వద్ద కొత్త క్రీడ ఒకటి ఆకళింపు చేసుకున్నాను. అది ఎలా నేర్చుకున్నాను, ఆ క్రీడ ఏమిటి అన్న విషయల గూర్చి చెప్పాలి మీకు ఇప్పుడు.

చిన్నవి పెద్దవి బోలెడు రాళ్ళు పడి ఉంటాయి ఆ చెరువు చుట్టూ. ఆ రాళ్ళలో నుంచి పల్చగా అరచేయి వెడల్పు ఉండే రాతి పలకలని ఏరుకుని తెచ్చేవాడు నాగేంద్ర.

వాటితో ఏమి చేస్తాడబ్బా, అని నేను అనుకుంటుండగానే, అతను చిన్నగా పరుగు లంకించుకున్నాడు ఓ రోజు. బౌలింగ్ చేయటానికి ముందు మీడియం పేస్ బౌలర్స్ రనప్ చేస్తూ బంతిని బౌల్ చేసినట్టు, అలా ఓ పదడుగులు పరితెత్తి, చెరువు నీరు సమీపించగానే, వ్యూహాత్మకంగా వంగుతూ, లాఘవంగా ఆ రాతి పలకని చెరువులోని నీటిపైకి నైపుణ్యంతో విసిరేవాడు.

ఇప్పుడా రాయి నీటిలో మునిగే బదులు, మొదట ఒక సారి నీటిని తాకి మళ్ళీ పైకి లేచి అర్ద వృత్తాకారంలో పయనించి మళ్ళీ నీటి ఉపరితలాన్ని తాకి, మళ్ళీ పైకి లేచి ప్రయాణిస్తుంది. ఇలా నీటిని తాకుతూ లేస్తూ అది చాలా దూరం పయనించి ఎక్కడో దూరంగా పడిపోయి నీటిలో మునిగేది.

సహజంగానే ఈ క్రీడ నన్ను అబ్బురపరచింది. నాగేంద్ర వంక హీరో వర్షిప్‌తో చూశాననుకుంటా.

‘నేర్చుకుంటావా?’ కనుబొమల్ని ఎగరేస్తూ ప్రశ్నించాడు

నా ఆమోదం అందుకున్న మీదట, తక్షణం అతను నన్ను శిష్యుడిగా స్వీకరించి ఆ విద్యలోని మెళకువలు నేర్పించాడు. ఆ విద్యలో ప్రధాన కీలకం పలచగా అరచేయి వెడల్పున్న రాతి పలకని ఎన్నుకోవడం. అత్యున్నత స్థాయిలో నిపుణత కలిగిన క్రీడాకారులు మాత్రం రాతి ముక్క ఆకారం, ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ఎలాంటి రాయినైనా ఈ విధంగా విసరగలరని, ప్రస్తుతం నాగేంద్ర ఉన్న స్థితిలో ఎలాంటి రాయినయినా అలా విసరగలడని, ఆ స్థాయికి చేరుకోవటానికి కొన్ని సంవత్సరాల కఠోర సాధన, ఏకాగ్రత అవసరమనీ, అందువల్ల నాలాంటి ప్రాథమిక సాధకులు మాత్రం పల్చటి చిన్న ఇటుకముక్కలాంటి రాతి ముక్కని ఎన్నుకోవటం ఉత్తమం అని నాకు ఆ విద్యలో ప్రాథమిక పాఠాలు నేర్పారు.

గురు ముఖతః ఈ విద్యలో ఓనమాలు దిద్దుకున్న నేను మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాను. అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయాను.

కానీ ఇలాంటి క్రీడలలో నాది ఎప్పటికీ ఫెయిల్యూర్ స్టోరీనే. చిల్లాకోడి (గిల్లీ దండ), కబడ్డీ, ఖోఖో, గల్లీ క్రికెట్, దాగుడు మూతలు తదితర క్రీడల్లో మనస్ఫూర్తిగా పాల్గొనేవాడిని కానీ రాణించలేక పోయేవాడిని.

మరిన్ని విశేషాలు వచ్చేవారం చెప్పుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here