[dropcap]ని[/dropcap]జానికి ఎకాఎకిన కళ్యాణదుర్గం తాలూకు జ్ఞాపకాలు వ్రాద్దామని శ్రీకారం చుట్టాను. కానీ మా అవ్వ చేయి విరగటం గూర్చి వ్రాస్తూ ఉంటే, ఆర్థోపెడీషియన్లు ఆ తర్వాత రుమటాలజిస్టులు అంటూ టాపిక్ డైవర్ట్ అయిపోయి, రుమటాయిడ్ ఆర్థరయిటీస్ గూర్చి ఒక ఎపిసోడ్ వ్రాసేశాను.
సరే ఇప్పుడు కళ్యాణదుర్గం గూర్చి వ్రాద్దామంటే, ఇదిగో మళ్ళీ ఇంకొన్ని విషయాలు గుర్తు వస్తున్నాయి. వ్రాసేస్తాను. చదవండి.
నా ఆరో ఏట, కళ్యాణదుర్గంకి వెళ్ళటానికి ముందు, కమలాపురం నుంచి వచ్చిన పిమ్మట కొన్ని నెలలు కడపలో ఉండినాము కదా. ఈ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ జ్ఞాపకాలన్నమాట. ఇవి సరదాగా ఉంటాయి తప్పిచ్చి, ఇందులో గొప్ప మలుపులు, ట్విస్టులు, కొసమెరుపులు ఏమీ ఉండవు.
పుస్తకాలతో అనుబంధం:
ఆరేడేళ్ళ వయసులోనే నేను చందమామ కథలు బాగా చదివేవాడిని.
మా అన్నయ్య శ్రద్ధగా పాత చందమామ పుస్తకాలు ఒక కొన్నింటిని కలిపి చక్కగా బైండ్ చేయించి ఉంచేవారు. వాటిని చూస్తూ ఆ బొమ్మల్లో మైమరచిపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోయే వాడిని.
శంకర్, చిత్రల చిత్రాలు. కవర్ పేజిపై వడ్దాది పాపయ్య గారి ముఖ చిత్రాలు అదో లోకం.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, బేతాళ కథల పేజీ తెరచినప్పుడల్లా ఒక విధమైన భీతి కలిగేది. పట్టువదలని విక్రమార్కుడి బొమ్మ ఇప్పటికీ బాగా గుర్తే. ఆయన చేతిలో కరవాలం, మెలి తిరిగి ఉన్న ఆయన బూట్లలాంటి పాదరక్షలు, ఆయన మొహం పై నిర్భీతి, కోరమీసం, గౌనులాంటి వస్త్ర ధారణ, లెగ్గిన్ లాంటి పైజామా, ఆయన భుజం పై చింపిరి జుట్టేసుకుని ఉన్న ఒక నిర్భాగ్యుడి శవం, చుట్టూ ఎటు చూసినా పిశాచాలు, గుడ్ల గూబలు, కంప చెట్లు, భీతిగొలిపేలాంటి ఒక వృక్షం, జర జర ప్రాకుతూ వస్తున్న నల్లటి సర్పం. అబ్బ! ఇప్పుడంటే తీరిగ్గా వర్ణిస్తున్నాను కానీ ఆ రోజుల్లో ఆ పేజి వేగంగా తిరగేసి, మళ్ళీ ఒక కన్ను కొద్దిగా మూసి, ఇంకో కన్ను సగం తెరచి, పేజి మళ్ళీ వెనక్కి తిప్పి ఆ పేజిలో ఉన్న కాస్త కథ చదివి మళ్ళీ రెండో పేజికి వచ్చేవాడిని.
ముందరపేజీలో కొన్ని లైన్లు యథాప్రకారం ప్రతీ సంచికలో వచ్చేవి.
ఆ మొదటి పేజీలో యథావిధిగా ఉండే ఈ ఉపోద్ఘాతం తరువాత ఓ నాలుగయిదు వాక్యాలు ఆ వారం తాలూకు కథ మొదలవుతుంది. ఆ వాక్యాలు చదవకుంటే కథ మిస్ అవుతాము. ఆ పేజీ తిరగేయ్యాలంటే భయం. ఇలా చచ్చేచావయ్యేది ఈ బేతాళ కథని చదవాలంటే.
పోనీలే పెద్దలు కదా, ఏవయినా సహాయం చేస్తారేమోనని అడిగితే, ఈ వయసులో బేతాళ కథలు చదివినా నీకు అర్థం కావు, మిగతా కథలు చదవటమో, బొమ్మలు చూసి పక్కన పెట్టేయటమో చేయి అని ఒక సలహా ఇచ్చేవారు ఉచితంగా.
నేనంటే ఏమనుకుంటున్నారు వీరు అని చెప్పి, ధైర్యంగా ఆ పేజి కెళ్ళిపోయి, ఆ కథా భాగాన్ని చదివి, మిగతా కథని ఇక ఫాలో అయిపోయేవాడిని.
ఇంత కష్టపడి కథ చదివాక, కథ చదివామా అయిపోయిందా అన్నట్టు ఉండదు. మళ్ళీ చివర్లో బేతాళుడు రంగంలోకి వస్తాడు.
బేతాళుడీ కథ చెప్పి, “రాజా ఈ కథలో దొంగ ఎందుకు నవ్వాడు, సోమనాథుడే నిర్దోషి అని తేలాక కూడా, రాజు అతనిని ఎందుకు శిక్షించాడు….” అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు వేసి, “సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది” అని ఒక నిబంధన పెడతాడు.
పాపం ఆ పిచ్చి రాజు, తన అలసట కూడా మరచిపోయి, ఆ ప్రశ్నలను చాలా సీరియస్‌గా తీస్కుని, తన తెలివితేటలన్నీ ఉపయోగించి, ఆ ప్రశ్నలన్నింటికీ సరయిన సమాధానం చెప్పేస్తాడు.
ఇంతా చేస్తే ఆ రాజుకి ఏమయినా సుఖం ఉందా? లేదు.
రాజుకీ విధంగా మౌనభంగం కల్గగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మనం దిగ్భ్రాంతులమవుతాము ఈ పరిణామంతో.
ఇదంతా ఇలా ఉండగా ఈ కథ చివర్లో (కల్పితం) అని వ్రాసి ఫలానా రచయిత వ్రాసిన కథని ఆధారంగా చేసుకుని ఈ నెల బేతాళకథని ప్రచురించడం జరిగింది అని వ్రాసేవారు.
ఈ కల్పితం వ్యవహారం ఏమిటి అని పెద్దలను అడిగితే మా పెద్దక్కయ్య రామలక్ష్మి చెప్పింది. భట్టీ విక్రమార్క కథలు అనేవి నిజానికి అసలైనవని, కానీ ఇక్కడ ఎవరైనా వ్రాసి పంపిన కథని వారు వాడుకుని ఇలా సంవాదం సృష్టించి ప్రచురిస్తారని.
అప్పుడు నేను అడిగిన ప్రశ్న విని ఆవిడ గుడ్లు వెళ్ళబెట్టారు. ఆరేళ్ళ పిల్లవాడు అలా అడుగుతాడని ఆవిడ ఊహించలేదు.
ఇంతకూ నేనడిగిన ప్రశ్నలోని భావం ఏమిటంటే, “మరి మనం ఇలా ఏదో ఒక కథ వ్రాసి, ఆ విక్రమార్క బేతాళ సంవాదాన్ని కూడా మనమే సృష్టించి వ్రాయాలా, లేదా కథలోని లోతైన ఘర్షణని బట్టి తార్కికంగా ఆలోచించి వారే ఆ సంవాదాన్ని తయారు చేసుకుంటారా? ఏదో ఒక కథ వ్రాసి పంపినట్టు పంపాలా, లేదా బేతాళకథలకై నేను వ్రాస్తున్న కల్పిత కథ అని వ్రాసి పంపాలా?” అని అడిగాను. పదాలు ఇవే కాదులెండి. నా భావమైతే ఇదే. ఆమె ఏమీ సమాధానం చెప్పలేక నా వంక అనుమానంగా చూస్తుండిపోయారు కాసేపు, ఆ శవంలోని బేతాళుడు చెట్టెక్కకుండా వెరైటీగా నన్నేమైనా పూనాడా అని కూడా ఆ రోజు ఆమెకి అనుమానం వచ్చి ఉంటుంది బహుశా.
నాకు ఆ రోజుల్లో చందమామలో తరచు కనిపించే రచయితల పేర్లు – వసుంధర/జొన్నలగడ్డ రామలక్ష్మీ, మల్లాది వెంకటకృష్ణ మూర్తి, ఉమ్మెత్తల యజ్ఞరామయ్య.
వనపర్తికి చెందిన ఈ ఉమ్మెత్తల యజ్ఞరామయ్య గారితో మాకు ఇటీవల బంధుత్వం కలవడం ఒక విశేషం. ఈ జీవన పయనంలో ఇలాంటివి ఎన్నో గమ్మత్తులు.
చందమామలో చివరి అయిదారు పేజీలలో పాఠకులు పాల్గొనేలాగా రకరకాల శీర్షికలు ఉండేవి. రెండు పూర్తి పేజీలలో ఎదురెదురుగా ఫుల్ పేజీ నలుపు తెలుపు ఫోటోలు ఉండేవి. ఈ రెండింటికి సంబంధం ఉండేది కాదు కానీ, వీటిని సమన్వయపరుస్తూ మనం ఓ రెండు వాక్యాలు వ్రాయాలన్న మాట. మా అక్కయ్యలు, అన్నయ్య ఆ ఫోటోలకి వ్యాఖ్యలు ఏవి వ్రాయాలని తెగ చర్చించేవారు. వారు ఎప్పుడూ పంపింది లేదు కానీ వారి చర్చోపచర్చల వల్ల నాకు భాషా జ్ఞానం అయితే వృద్ధి చెందింది అని చెప్పవచ్చు.
రంగనాయకమ్మ గారి ‘స్వీట్ హోం’ నవలలో అనుకుంటా బుచ్చిబాబు అనే పాత్ర, చందమామ వారి ఈ శీర్షికకి వ్యాఖ్య వ్రాయాలని తీవ్రంగా ప్రయత్నించి చివరికి – ‘అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది’ అని ప్రకటించి చందమామ మూసేస్తాడు. ఈ కామెడీ సీన్ బాగా పండింది. ‘స్వీట్ హోం’ నవలంతా హాస్యభరితంగా ఉంటుంది. అర్థం అవకున్నా ‘స్వీట్ హోం’ చదివేవాణ్ణి అప్పుడప్పుడు. అది ఆంధ్రప్రభలో ధారావాహికగా వచ్చేది ఆ రోజుల్లో.
ఆ రోజుల్లోనే మా ఇంట్లో యువ మాసపత్రిక, ఆంధ్రప్రభ మాసపత్రిక కూడా ఉండేవి. యువ మాసపత్రిక ముఖచిత్రాలుగా వడ్డాది పాపయ్య గారి వర్ణ చిత్రాలు గొప్ప ఆకర్షణ ఆ రోజుల్లో.
ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన ధారావాహికలని కత్తిరించి వాటిని బైండ్ చేయించటం ఒక ఉద్యమంలాగా ఉండేది మా ఇంట్లో ఆ రోజుల్లో. ఆ పుస్తకాలన్నీ ఏమైపోయాయో.
ఆ రోజుల్లో నాకు అలా బాగా గుర్తుండిపోయింది (ఒక ధారావాహికని కత్తిరించి బైండ్ చేయించిన పుస్తకం అన్న మాట) కొలిపాక రమామణి అనే రచయిత్రి గారు వ్రాసిన ‘ఏటిఒడ్డున నీటి పూలు’ అనే పుస్తకరూపం దాల్చిన ధారావాహిక. బాపు గారు చక్కగా బొమ్మలు వేసేవారు. ఒక్కోసారి డబల్ కలర్‌లో బొమ్మలు వేసేవారు, అంటే రాయల్ బ్లూ కానీ, రెడ్ కలర్ గానీ వాడేవారు నలుపు రంగుతో పాటు.
ఏటి ఒడ్డు ఏమిటో మళ్ళీ నీటి పూలు ఏమిటో నాకు అర్థం అయ్యేది కాదు ఆ శీర్షిక చూసి. ఆ రోజుల్లోనే ‘సశేషం’ అనే పదం తెలుసుకున్నాను తొలిసారిగా. ప్రతి సీరియల్ చివర ‘సశేషం’ అని వ్రాసేవారు. సీరియల్ మొదటి పేజిలో ‘జరిగిన కథ’ అని అప్పటిదాకా జరిగిన కథని క్లుప్తంగా వ్రాసేవారు.
జరిగిన కథ అన్నది వాడుకభాషలో చిన్నపిల్లాడినయిన నాకే అర్థమయ్యేలా ఉంది, కానీ ఈ ‘సశేషం’ ఏమిటో అర్థం అయ్యేది కాదు. అదేమని అడిగితే, కథ ఇంకా అయిపోలేదు అని అర్థం అని చెప్పారు అక్కయ్యలు.
అలా ఎందుకు వ్రాయటం చక్కగా ఇంకా ఉంది అని వ్రాయవచ్చు కద అని అడిగేవాడిని. ‘ఆ బయల్దేరాడమ్మా మరో గిడుగు రామమూర్తి పంతులు’ అని నవ్వేసేవారు.
ఆ తరువాత ఓ ఆరేడేళ్ళకి ఆంధ్రభూమి సంపాదకులు సికరాజు గారు చక్కగా ‘ఇంకా ఉంది’ అని వ్రాసే సంప్రదాయానికి తెర ఎత్తారు.
నేనిష్టపడ్డ సినిమా పాట:
ఆ రోజుల్లో నేను రేడియోలో వచ్చేపాటలని శ్రద్ధగా వినేవాడినట. నాకు ఒకటి మాత్రం గుర్తుంది.
‘భూకైలాస్’ సినిమా లోని పాట ‘దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో’ అనేపాట మొత్తం పాడగలిగేవాణ్ణి. ఆ పాట ఎప్పుడొచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యంతం వినేవాడిని.
రేడియోలో ఆ పాట వస్తే ఇంట్లో పెద్ద సంచలనం రేగేది ఆ రోజుల్లో. రేడియోలో ఆ పాట వచ్చినప్పుడల్లా నేను ఎక్కడ ఆడుకుంటున్నా నన్ను కేకేసి పిలిచి మరీ వినిపించేవారు. అది మిస్ అయితే నేను ఏడిచేసేవాడిని.
ఆ రోజుల్లోనే నేను తొలిసారి సినిమా చూడటం తటస్థించింది. కాకపోతే అది ‘భూకైలాస్’ కాదు.
కృష్ణగారి మీద అభిమానం:
నటశేఖర, సూపర్ స్టార్ నిర్మించి నటించిన ‘అల్లూరి సీతారామరాజు’. నా ఊహ తెలిసి అర్థం చేసుకుంటూ నేను చూసిన మొదటి సినిమా అది.
ఆ సినిమాకి వెళుతుండగా మా సుభద్రక్కయ్య పొరపాటున రిక్షా లోంచి జారిపడింది. తను ఎంతో ఇష్టపడి తొడుక్కున్న కొత్త లంగా మోకాళ్ళ దగ్గర చినిగిపోవటమేకాదు, బురద అంటింది. తనకు మోకాళ్ళు లైట్‌గా దోక్కుపోయాయి కూడా. అయినా మేము విజయవంతంగా కడప రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న వెంకటేశ్వరా థియేటర్‌లో ఆడుతున్న ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకి వెళ్ళాం.
అంతే. నేను సూపర్ స్టార్ కృష్ణగారి వీరాభిమాని అయిపోయాను ఆ రోజు నుండి. నాకు ఇంకెవర్ని చూసినా నచ్చేవారు కాదు. అంతే కాదు, కృష్ణ గారు వేరే పాత్రలు వేసినా నచ్చేది కాదు. అంతగా ముద్రించుకుపోయింది నా మనోఫలకంపై ఈ సినిమా.
అదే టాకీస్ లో ఆ తర్వాత కృష్టంరాజుగారు నటించిన ‘కృష్ణవేణి’ చూసినట్టు గుర్తు. చెప్పాను కద నాకింకేమీ నచ్చటం మానేశాయని. కృష్ట గారి మీద అభిమానం ఈ నాటికి కొనసాగుతోంది.
మొదటి క్యారంబోర్డ్:
ఆ రోజుల్లో నన్ను బాగా కదిలించిన ఒక విషయం ఒకటుంది. కొత్తగా పెద్ద క్యారం బోర్డ్ కొన్నాం ఆ రోజుల్లో.
ఆ క్యారం బోర్డ్ మా ఇంట్లోకి రావటం వెనుక ఒక కథ ఉంది. మా అన్నయ్య అప్పాజీ గారు డిగ్రీ చదివేవారు అప్పట్లో. ఆ రోజుల్లో ఆయన వద్ద సైకిల్ ఉండేది. ఆయనకి చాలా మంచి స్నేహితులు ఉండేవారు. వారిలో చాలామంది ఇప్పటికీ ఆయనతో టచ్‌లో ఉన్నారు. సిరిధాన్యాల గూర్చి అవగాహన కల్పిస్తున్న ఖాదర్ వలీ గారి సోదరుడు ఖాసీం గారు మా అన్నయ్యకి బాగా కావాల్సిన దగ్గరి మిత్రుడు.
సరే, టాపిక్ నుంచి డైవర్ట్ అయి మళ్ళీ పక్కకు వెళుతున్నాను.
ఒకరోజు మా అన్నయ్య సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వస్తుండగా దారిలో ఓ డెబ్భైయో, ఎనభయ్యో రూపాయలు దొరికాయి. దాని యజమానికై ఎంత అన్వేషించినా కనపడలేదు. ఇంకేం చేద్దాం ఇంటికి తీసుకువచ్చాడు. ఎన్నో విచికిత్సలు తర్జనభర్జనల అనంతరం, ఆ డబ్బుని వెచ్చించి ఒక చక్కటి క్యారంబోర్డ్ కొనుక్కొచ్చారు.
మేము ఆ ఒక్క రాత్రే దానిపై ఆడుకుంది. ఆ రాత్రి ఓ చిత్రం జరిగింది.
మా ఇంట్లో స్టోర్ రూంలో, వడ్ల మూటలు పేర్చి ఉండేవి ఆ రోజుల్లో. ఆ రాత్రి పడుకునే ముందు, ఆడుకున్నంతసేపు ఆడుకుని ఈ క్యారంబోర్డుని వడ్లమూటలకి ఆన్చి మేము మేడ మీదకెళ్ళి పడుకున్నాం. ఇంతలో కింద స్టోర్ రూంలో రెండు పిల్లులు గలాట పడి, ఒకదానిమీద ఇంకొటి దూకుతూ గెంతుతూ హడావుడి సృష్టించి, ఈ గందరగోళంలో వడ్ల మూటలని జార్చాయి. చార్ ధాం యాత్రలలో కొండశిఖరాలు జారిపడ్డట్టు ఈ వడ్లమూటలు క్యారంబోర్డ్‌పై పడి అది ఎందుకు పనికిరానంత చిన్నచిన్నముక్కలయిపోయింది.
మరుసటి రోజు మా అమ్మగారు గట్టిగా ఒక్కటే చెప్పారు. పరుల సొమ్ము వెచ్చించి ఈ క్యారం బోర్డ్ కొనటం వల్ల ఇలా అయింది అని. పరుల సొమ్ము పాము వంటిది అని గట్టిగా చెప్పారు.
మా అన్నయ్యకూడా గట్టిగా లెంపలేసుకుని మరుసటి రోజు గుడికెళ్ళి చేతనయినంతకాడికి హుండీలో అపరాధరుసుము లాగా వేసి వచ్చారు.
ఆ తరువాత ఒకట్రెండు సార్లు చిన్న చిన్న మొత్తాలు నాకు దొరికినా, తక్షణమే దగ్గరలో ఉన్న భిక్షకులకి గానీ, ఏదైనా దగ్గర్లోని గుడిలోని హుండీలో గానీ వేసి, ఓ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని, ‘ఈ డబ్బుని అసలు యజమానికి ఎలాగైనా చేర్చేటట్టు చూడు దేవా’ అని ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను.
ఇదండి మా మొదటి క్యారంబోర్డ్ కథ.
సినిమా బండ్లు:
ఆ రోజుల్లో ఇంటిముందు సినిమా బండ్లు వెళ్ళేవి. సైకిల్ రిక్షాకి గూడు లాగా ఏర్పాటు చేసి అందులో గ్రాంఫోన్ రికార్డ్ పెట్టి స్పీకర్లలో పెద్ద ఎత్తున పాటలు వినిపించేలా ఏర్పాటు చేసేవారు. ఓ అయిదారు సినిమా బండ్లు ఒక్క సారిగా వచ్చేవి. వాటి వెంబడి పరిగెత్తుకుంటూ వెళితే మనకు కరపత్రాలు కూడా ఇచ్చేవారు.
నాకు బాగా గుర్తున్న కరపత్రం ‘చందన’ అన్న సినిమాది.
(ఇంకా ఉంది)