యువభారతి వారి ‘కంకంటి కవితా వైభవం’ – పరిచయం

0
3

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

కంకంటి కవితా వైభవం

[dropcap]ప్ర[/dropcap]బంధం అనే మాటకు సంస్కృతంలో కవిత్వం అని అర్థం. కానీ తెలుగులో ఒక విధమైన కావ్య ప్రక్రియను ప్రబంధం అంటాము. ఏకనాయకమై, శృంగారవీరరస ప్రధానమై, కమనీయ వర్ణనాత్మకమై, వర్తిల్లే కావ్యం తెలుగులో ప్రబంధం అనిపించుకుంటుంది. పురాణాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి వస్తున్నప్పుడు, శ్రీనాథుడు నైషధాన్ని కవిత్రయం వారు చూపిన మార్గంలో తెనిగించి ఈ ప్రబంధ ప్రక్రియకు నారు పోసినాడు. పెద్దన, తిమ్మన, భట్టుమూర్తి, సూరన – ఈ ప్రబంధ వల్లరికి నీరుపోసి దోహదం చేసి, నిత్య కవితా సౌరభాలను గుబాళించే ప్రబంధాలను అందించారు. రెండు శతాబ్దాలపాటు ఈ ప్రబంధాలు ఒయ్యారాలు ఒలుకుతుంటే, కంకంటి పాపరాజు మళ్ళీ పురాణ రచనకు పూనుకున్నాడు.

కంకంటి పాపరాజు పదిహేడవ శతాబ్దికి చెందిన మహాకవి. నెల్లూరు మండలం లోని ‘ప్రళయ కావేరి’ ఆయన నివాస స్థానం. ఆయన ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంబ సూత్రుడు. శ్రీవత్స సగోత్రుడు. సరసమాంబా అప్పయామాత్యుల పుత్రుడు. మదన గోపాలస్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. వివిధ విద్వజ్జన పరివేష్టితుడు. రాజయోగ సామ్రాజ్య లక్ష్మీ విలాస ధురంధరుడు. స్తవనీయ నయకళా యుగంధరుడు. అగణిత గణితశాస్త్ర రత్నాకరుడు. ‘విష్ణుమాయా విలాసం’ అనే విశిష్ట యక్ష గానం, ‘ఉత్తర రామాయణం’ అనే ఉత్తమ ప్రబంధం పాపరాజు గారు మనకు ప్రసాదించిన రెండు చక్కని గ్రంథాలు.

ఈ ఉత్తర రామాయణం పురాణమైనా, దీనిలో ప్రబంధం అనడానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అలా పురాణ రచనకు ప్రబంధ వర్ణనలను పులిమి, ఆయన ఒక కొత్త పుంతను తొక్కినాడు.17 వ శతాబ్దపు ప్రజా జీవితం లీలగా కనిపిస్తుందీ కావ్యంలో. సుందరమైన పడబంధాలకు, శ్రవణ సుఖదమైన సమాసాలకు, ధారాశుద్ధి కలిగిన పద్యాలకు, ఈ కావ్యం కాణాచి.

ఈ కావ్యం లోని కొన్ని పద్యాలను ఏరి, వాటిలోని కవితా సౌందర్యాన్ని విప్పి చెప్పి, పాపరాజు హృదయాన్ని ఆవిష్కరించిన వారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ‘కరుణశ్రీ’ గారు విద్వత్కవులు. మధుర మంజులములైన లలితా పదాలలో మహానీయార్థాన్ని ప్రతిపాదించగల ప్రతిభామూర్తులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ వంటి కావ్యాలను, కళ్యాణ కాదంబరి వంటి వచన కృతులను, కల్యాణ కల్పవల్లి వంటి సత్కవితా సంకలనాలను అందించిన రస హృదయులు. బాలలకు వాఙ్మయ సృష్టి చేసిన సరళ స్వాంతులు. సహృదయ హృదయాహ్లాదకరంగా ఉపన్యసించగల వాగ్మి వతంసులు. మా యువభారతి వేదికపై తెలుగు రామాయణాలను గూర్చి, నాయని సుబ్బారావు గారిని గూర్చి ఆయన చేసిన ఉపన్యాసాలు వారి సద్విమర్శనకు చక్కని నిదర్శనాలు.

కంకంటి పాపరాజు కవితా వైభవాన్ని సరళ సుందర రీతిలో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వివరించిన ఈ పుస్తకాన్ని క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%95%E0%B0%82%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here