Site icon Sanchika

కనబడుతలేరు

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కనబడుతలేరు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]లిసినోల్లు లేరు
వాళ్ళను సూసినోల్లు లేరు
ఎక్కడున్నరో ఏమైపోయిండ్రో

కొలిమి పాడుబడింది
సుత్తె పట్కారు మూలబడింది
కొడవండ్లు సాటేసేటోల్లు లేరు

దాతి మొద్దు చెదలు వట్టింది
చేబాడ్సే సిలుం వట్టింది
నాగండ్లు చెక్కెటోల్లు లేరు

కుంపటి బూజు వట్టింది
పట్టెడ పాచి వట్టింది
కమ్మకు దిమ్మె పెట్టెటోల్లు లేరు

సారె ఇరిగిపోయింది
వాము కూలిపోయింది
కుండలు చేసేటోల్లు లేరు

మగ్గం ఖండమైంది
రాట్నం ముక్కలైంది
చిన్న పంచె నేసేటోల్లు లేరు

ఏం చెప్పమంటవు
ఎన్నని చెప్పమంటవు
మచ్చుకు కొన్ని సాలదా

చేతినిండ పనిలేక
కడుపు నిండ తిండి లేక
ఎటో ఎల్లిపోయిండ్రు

వాళ్ళను దల్సుకొని
దుఃఖం దిగమింగి
ఊరు ఊరంత బెంగ టీలింది

ఈ నగిషీలు యాన్నో
కాటగల్సిపోయిండ్రు
కనిపిస్తే జర సెప్పుండ్రి

Exit mobile version