కాంచన శిఖరం-1

1
2

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

అధ్యాయం 1

[dropcap]శు[/dropcap]భే శోభనమూహూర్తే శ్వేత వరాహకల్పే

వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే,

జంబూద్వీపే, భరత వర్షే భరత ఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే

….

చంధోబద్ధమైన సంకల్పం చెబుతున్నప్పుడు ‘మేరు’ ఒళ్ళంతా పులకరించింది.. ఎన్నో జ్ఞాపకాలు మనసునిండా మెదిలాయి.

‘ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. గంభీరంగా ఎత్తైన కొండలు, శ్రీశైలం కొండలు, ఋషుల పాదాలతో పునీతమైనవి అంటారు.. అందుకేనేమో ఇక్కడ నిల్చుంటే చాలు ఏదో అతీతమైన శక్తి, నరనరాలలో ప్రవేశించి మనసుని ఉత్తేజపరుస్తుంది.. ఈ పవిత్ర స్థలంలో నిలబడి ఏది కోరుకున్నా ఫలిస్తుందంటారు.. దైవబలం, ఆశీర్వాద మహిమే అనుకుంటా, నేను ఈ రోజు ఇక్కడకి రావడానికి కారణం..’ భక్తితో ఆనందంతో అనుకొన్నాడు మేరు.

శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధిలో నిలబడ్డ మేరు.. అక్కడి ప్రశాంత వాతావరణంలో భావోద్వేగానికి లోనయ్యాడు.. నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి – ‘అసలు శ్రీశైల శిఖర దర్శనంతో పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయ’ని. విశాలమైన ఆకుపచ్చని కొండలు, ఎత్తుగా ఠీవిగా నిలబడి ఆకాశాన్ని అందుకున్నట్లుగా నిల్చున్నాయి. కృష్ణవేణి నిండుగా కదులుతూ కొండలని చుట్టుకొని పారుతోంది. ఉరుకులు పరుగుల కృష్ణమ్మను.. బంధీ చేసిందా డామ్.. మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి రెండు దశాబ్దాల కాలం పట్టింది. ఎన్నో చిన్న చిన్న పల్లెటూళ్ళు, నిశ్శబ్దంగా ఇందులో కలసిపోయాయి. కృష్ణవేణి నది పురాణకాలం నాటిది అంటారు. జల దేవత అని కూడా అంటుంటారు. ఈ నదిలో ఒకసారి స్నానం చేస్తే చాలు, పాపాలన్నింటి నుంచి విమోచనం కలిగి మనసు శరీరం పవిత్రం అయిపోతుందని ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతో వచ్చే ఏన్నో కోట్లమంది భక్తుల నమ్మకాలని నెరవేర్చే చల్లని తల్లి కృష్ణవేణి నది.

చల్లటి గాలితో పాటుగా తేలివచ్చే సుప్రభాతంతో పాటుగా ఆలయంలోకి ప్రవేశిస్తున్న మేరు మనసు భక్తితో పులకించి పోయింది. హైదరాబాదు వదిలి రావడం ఇదే మొదటిసారి. ఆర్కియాలజిస్టుగా స్టేట్ గవర్నమెంటు డిపార్టుమెంటులో నాలుగేళ్ళ క్రితం ఉద్యోగంలో చేరాడు. పోస్టు గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసాడు. పి.జి. అయిపోగానే ఉద్యోగం రావడంతో వెంటనే చేరిపోయాడు.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, అతనికింకా చాలా జ్ఞాపకం.. బాస్ వెంకటాచారి గారి దగ్గర పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుంటున్నప్పుడు, ఆయన అన్న మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూ.. “ఇంత చిన్న వయసులో ఈ వృత్తిని ఏలా ఎన్నుకొన్నావు?” అని అడిగారు. “ఇది నాకు ఇష్టమైన ‘సబ్జెక్ట్’.. అందుకే ఏమాత్రం సంకోచం లేకుండా ఇందులోకి రాగలిగాను” ఆత్మ విశ్వాసంతో సమాధానం చెప్పాడు మేరు.

“నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను.. ఈ కాలం వాళ్ళంతా ఇది ‘లాస్ట్ రిసార్ట్’ కింద భావిస్తారు.. ఇంజనీరింగ్, మెడికల్, ఆఖరికి అగ్రికల్చర్లోను సీటు రాకపోతే ఇందులో చేరడం అంటే, విధిలేక ప్రమాదవశాత్తు వచ్చి చేరినట్లు భావిస్తారు.. కాని అతి పురాతనమైన, ఎంతో విలువైన ఈ ఆర్కియాలజీ.. అసలు మానవ చరిత్రకే ప్రాణం అంటాను. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం.. ఈ కాలంలో నువ్వు పురావస్తుశాఖని ఎన్నుకొన్నావే.. చాలా ఆనందంగా ఉంది..” అన్నారు నవ్వుతూ.

“అవునండి అందరూ ఇలాగే ఆశ్చర్యపోతారు.. కాని నాకు ఎందుకో చిన్నప్పటి నుండి, ముఖ్యంగా స్కూలు రోజుల నుండి, చరిత్ర అంటే చాలా ఇష్టం. అందులోను మన దేశ చరిత్ర.. వాటి ఆచార వ్యవహారాలు సంప్రదాయాల మీద మక్కువ పెంచుకొన్నాను. బహుశా ఆ కారణంగా నేను ఈ ఆర్కియాలజీని ఎన్నుకొని వుండవచ్చు.”

“కాని మేరు, ఇక్కడ నెలల తరబడి పనులు జరగుతాయి. ఒక పని కోసం ఏళ్ళ తరబడి కూడా శ్రమించాల్సి వస్తుంది.. ఏ చిన్న ఆధారం దొరికినా అది మహత్తరమైన వస్తువుగా దాన్ని పట్టుకుని మరుగున పడిపోయిన చారిత్రక ఆధారాలు వెదుకుతూ వెళ్ళిపోవాలి.. ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కూడా కలుగుతాయి..” చారి గారు చెప్పిన ప్రతీ మాట శ్రద్ధగా విన్నాడు.. అతనిలో ఆత్మవిశ్వాసం, చెదరిపోలేదు..

చారీ గారంటే మేరుకు చాలా అభిమానం… ఆయనొక నడుస్తున్న విజ్ఞాన నిధిలా కనిపిస్తారు. ఆయనకి తెలియని విషయాలు లేవు.. పురావస్తు తవ్వకాల గురించి ఎన్నో విషయాలు అడిగి తీసుకొన్నాడు.. ఆయన దగ్గర పని చేయడమంటే విజ్ఞానం పొందడమే.. అని మేరు భావించేవాడు.

కొద్ది నెలలలోనే చారీ గారితో, తండ్రితో ఏర్పడ్డ అనుబంధం లాంటి ఏర్పడింది. ఇద్దరు కలిసి ఎన్నో ప్రదేశాలకి, తవ్వకాలు జరుగుతున్న వాటి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన దృష్టి చాలా నిశితంగా పనిచేసేది. ‘నాకైతే అతని కన్ను డేగకన్నులా అనిపించేది. ఏ మూల ఏ చిన్న ఆధారం కూడా, ఆయన దృష్టి నుంచి తప్పించుకొనేది కాదు.. ఎన్ని మైళ్ళ దూరంలో అయినా సరే’ అనుకున్నాడు మేరు.

‘ఆర్కియాలజిస్టు’ ఏ చిన్న ఆధారం వదలకూడదనే వారు. తవ్వకాలలో ఏది దొరికినా, ఆఖరికి చిన్న గుండి, పూస.. అవే ఒక్కోసారి చరిత్రకి పెద్ద పెద్ద ఆధారలవుతాయి. చారీ గారితో ఇంకో ఉన్నతమైన, మేరుని ఆకర్షించిన లక్షణం ఆయన స్కెచింగ్.. ఒక పద్ధతి ప్రకారం గీసుకొన్న గీతలు, ప్రతి చిన్న విషయం లెటర్ పేడ్ మీద చక్కటి బొమ్మలతో వివరంగా రాసుకొనేవారు.. ఇవన్నీ నేర్చుకుంటే చక్కని ఉత్సాహం పెల్లుబుకేది.. చారీ గారి ప్రతీ కదలిక ప్రతీ విషయం నేర్చుకోదగ్గవిగా ఉండేవి.

“సార్ కొబ్బరి కాయ, పువ్వులు కావాలండి, ఇక్కడ మీ చెప్పుడు వదిలేయండి.” అంటూ ఓ చిన్న కుర్రవాడు మేరు చేతిలో పూలు, కొబ్బరికాయ, అగరబత్తి అన్నింటితో బుట్ట చేతిలో పెట్టాడు. వాడి పలకరింపు, చేతిలో బుట్ట చూసి ఉలిక్కిపడ్డాడు మేరు. పాత జ్ఞాపకంతో ఆలోచిస్తూ, రెండు కిలోమీటర్లు దూరం నడుస్తూ వచ్చేసాడు. కుర్రవాడిచ్చిన బుట్ట తీసుకొని దేవాలయం వైపు నడిచాడు.

ఎప్పుడైతే శ్రీశైలంలో పోస్టింగ్ వచ్చిందని తెలిసిందో.. మేరు నాయనమ్మ.. “మేరూ, ఉద్యోగంలో చేరే ముందు ఆ మల్లికార్జునుని దర్శించుకో.. నీకు అంతా శుభం జరుగుతుంది.. పూర్వ జన్మలో చేసుకొన్న పాపాలన్నీ ఆ ఈశ్వర దర్శనంతో కడుక్కుపోతాయంటారు..” అంటూ మరీ చెప్పింది.

ఆవిడ మేరు సొంత నాయనమ్మ కాదు.. ఆవిడ మేరు తల్లికి మేనత్త.. విధవరాలు.. ఆ కాలం నాటి ఆచారవ్యవహారాల ప్రకారం… అప్పటి కాలంలో విధవరాళ్ళు తల మీద జుట్టు వుంచుకొనేవారు కాదు.. ఆవిడ భర్తని, పిల్లల్ని, ఆస్తులని పోగొట్టుకుంది.. కాని ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు.. ఆమె అసలు పేరు రుక్మిణి.. అంతా రుక్కమ్మా అంటారు.. యాభైఏళ్ళ క్రితం భర్తతో పాటుగా పేరుని పోగొట్టుకొని రుక్కమ్మగా మిగిలిపోయింది.

మేరుకి రుక్కమ్మగారే, ‘మేరు’ అన్న పేరు పెట్టారు. మేరు పుట్టినప్పుడు రఘు, గంగలు ఎన్నో పేర్లు అనుకొన్నారు. ఏ ఒక్కటి నచ్చలేదు. కాని రుక్కమ్మగారు మేరుని ముద్దు చేస్తూ ‘బంగారు కొండా’ అంటూ పిలిచేది. దానిని సంస్కతంలో ‘మేరు కాంచన’ అంటారు. పురాణ కాలం నాటి బంగారు పర్వతం.. ఎందుకో ఆ పేరు పెట్టాలనుకొన్నాడు రఘు తన కొడుకుకి. ఆ పేరే నామకరణంలో రాయించాడు.. ‘మేరు కాంచన’ అని. అందరూ ‘మేరు’ అంటూ పిలుస్తారు.

మల్లికార్జున – భ్రమరాంబికల ఆలయంలోకి అడుగుపెట్టాడు మేరు. అక్కడ సాక్షాత్తు ఈశ్వరుడే జ్యోతిర్లింగంలో వుంటాడని ప్రసిద్ధి.

ఎంతో భక్తి శ్రద్ధలతో మేరు శివలింగం మీద పాలు పోసి నీళ్ళతో కడిగి పూలు పెట్టి స్వామి వారిని సేవించుకొన్నాడు స్వయంగా. భక్తితో శివలింగాన్ని స్పర్శిస్తుంటే మేరు ఒళ్ళు జలదరించింది.

‘వైష్ణవ దేవాలయంలో భక్తులకి గర్భగుడిలోకి ప్రవేశం వుండదు. కాని ఈశ్వరుని గుడిలో నేరుగా భక్తులకి ప్రవేశం వుంటుంది..’

మేరుకి తిరుపతి వెళ్ళిన అనుభవం గుర్తుకొచ్చింది. ‘కొన్ని గంటలు క్యూలో నిలబడి, తొక్కిసలాటతో, అలసటతో కూడిన దైవదర్శనం కలుగుతుంది.. కళ్ళారా దేవుడుని చూద్దామంటే కుదరదు.. ఎంతో దూరం నుంచి వచ్చి దైవదర్శనం చేసుకుందామంటే తనివి తీరా దర్శనం కూడా దొరకదు’ అనుకొన్నాడు. ఈశ్వరునికి మరోసారి మనసారా నమస్కరిస్తూ.. గర్భగుడిలో నుంచి బయటికి వస్తూ అనుకొన్నాడు. ‘గర్భగుడి అంటే ఏమిటి? తల్లి గర్భమా? లేక అక్కడ ఉండడం ఒక భధ్రతా! లేక దైవత్వమే అమ్మ గర్భంలో నిండిపోయిందా?’ తనలో తాను చర్చించుకుంటూ.. పూల బుట్ట ఇచ్చిన కుర్రవాడి కోసం ఎదురు చూసాడు.

ఒక వృద్ధుడు, వయోభారంతో వున్నవాడు.. అతి కష్టం మీద మెట్లెక్కుతూ కనిపించాడు. ఎందుకో అతనిని చూడగానే ఏదో అద్వితీయమైన భావన! అభిమానంతోనే మేరు అతని పాదాలకి నమస్కరించాడు.

“ఆ ఈశ్వరుడు నిన్ను ఆశీర్వదించుగాక” అంటూ తల మీద చేయి వేసాడు ఆప్యాయంగా..

“ఆ.. స్వామి మీరు ఒంటరిగా ఇన్ని మెట్లు ఎక్కి వస్తున్నారు.. తోడు ఎవరు లేరా” అంటూ ప్రశ్నించాడు మేరు.

“నేనే ఒక శిష్యుడిని ఈశ్వరుని సన్నిధిలో.. ఆ శివ లీలలు అర్థం చేసుకోవడంలో.. ఇంకా శిష్యులు ఎందుకు నాయనా..”

“అసలు మీరెవరు స్వామిజీ, ఎక్కడుంటారు.. నేను మిమ్మల్ని తీసుకువెళతాను..” అన్నాడు ఆప్యాయంగా మేరు.

“ఇల్లు వాకిలి లేనివాడిని.. ద్వాదశ లింగాలు దర్శించాలని.. ఈశ్వరుని అన్వేషిస్తూ తిరుగుతున్నాను. అదే నా జీవిత ధ్యేయం కూడా..”

“అంటే సౌరాష్ట్రం దగ్గర నుంచి రామేశ్వరం దాకా.. దర్శిస్తారా..”

“అవును నాయన.. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క శక్తి వుంది. ఈ శ్రీశైల క్షేత్రానికి చాలా మహిమ ఉంది. నీకు వీలుంటే నా దగ్గరకు రా.. నిన్ను నీవు తెలుసుకుందువు గాని..”

“మీరెక్కడుంటారో సెలవిస్తే?” అడిగాడు మేరు.

చిరునవ్వుతో “ఇంకెక్కడ నాయనా అదిగో – ఆ కొండలలోనే” అంటూ ముందుకు సాగిపోయాడు.

వెళ్తున్న ఆ ముసలాయనని చూస్తూ – ‘అసలు ఆ కొండలు ఎలా ఎక్కగలడు? అతనికి భోజనం ఎవరు పెడతారో?’ అనుకున్నాడు మేరు.

ఇలా ఆ వృద్ధుని గురించి ఆలోచిస్తున్న మేరుని.. “ఏయ్ మేరు? ఎలా వున్నావ్?” అంటూ భుజంమీద చేయి వేసి పలకరించాడు జి.వి. “ఎవరిని వెదుకుతున్నావ్?” అన్నాడు.

జి.వి. అంటే గుడిపాటి వీర వెంకట సత్యనారాయణ. అందరూ జి.వి. అంటారు. హైదరాబాదు బ్రాంచిలో పనిచేస్తున్నాడు..!

“హైదరాబాదు నుంచి ఒక గ్రూప్ వచ్చింది. ఇంక పని మొదలు పెడతారనుకుంటా.. నేను ఈ రోజు సాయంకాలమే హైదరాబాదుకు వచ్చాను.. చారీగారు వాళ్ళు వచ్చారని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సామాన్లు ఏవి ఎక్కడ పెట్టావ్, అందాక నా రూముకి వచ్చేయి.. తరువాత ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవచ్చు” అంటూ జి.వి. మేరుని ఆహ్వానించాడు.

అతని అభిమానానికి, ఆహ్వానానికి మేరుకి హాయిగా అనిపించింది. వేరే దారి లేక రిలాక్స్‌డ్‌గా అనిపించింది. ఇద్దరు కలసి బైక్ మీద దేవాలయం నుంచి తవ్వకాల ప్రాజెక్టు దగ్గరికి బయలుదేరారు.

అధ్యాయం 2

ఇద్దరూ ఆలయానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న తవ్వకాల ప్రాంతం దగ్గరికి చేరుకున్నారు. అది చాలా చిన్న పల్లెటూరు. అప్పటికే అక్కడ జనం గుమికూడారు, ఏం జరుగుతుందో చూడడానికి..

“ఆ ఒక్క పల్లెటూరే కృష్ణ ప్రాజెక్టులో కలిసిపోకుండా మిగిలిపోయింది. రామిరెడ్డి పొలంలో బంగారు నాణేలు దొరికాయనే సంగతి, ఎవరో రహస్యంగా జిల్లా కలెక్టర్‌కి చెప్పారు. పొలంలో పనిచేసే పాలేరు మల్లయ్య ముందు చూసాడు.. బంగారు నాణేలని.”

చారీగారితో సహా అందరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు.. మేరూని కూడా రమ్మన్నారు చారీగారు. ఫోటోగ్రాఫర్ చంద్రశేఖర్, ఎపిగ్రాపిస్టు రమణ కూడా వీళ్ళతో పాటూ వచ్చారు. చంద్రశేఖర్ కెమెరా అద్దాలను సరిచేసుకుంటున్నాడు. తవ్వకాలలో లభించే కళాఖండాల విలువ తెలిసిన అధికారి అతను. రమణ, చారీ గారి వెంట ఉండి కలెక్టర్ జరుపుతున్న విచారణలో పాలుపంచుకుంటున్నారు.

పొలం యజమాని రామిరెడ్డి, పాలేరు మల్లయ్య అందరూ కలెక్టర్‌కి ఎదురుగా నిలబడ్డారు. మల్లయ్య భార్య గౌరమ్మ కూడా వచ్చింది. ఇంకా ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు. కూడా వచ్చారు.

“మల్లయ్యా, నీకు నాణేలు ఎక్కడ దొరికాయి?” అడిగాడు కలెక్టర్.

ఎక్కడైతే తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడ చూపించాడు.. ఆ ప్రదేశమంతా అడ్డదిడ్డంగా తవ్వినట్లుగా వుంది. తెల్ల సున్నం, మట్టి కుప్పలు గుట్టలుగా పడి ఉన్నాయి. రెండు పెద్ద బండరాళ్లను తొలగించడంతో, అక్కడ చిన్న గుంతలా ఏర్పడి మట్టిలో చిన్న చిన్న తెల్లని, బూడిద రంగు రాళ్ళూ రప్పలూ కనబడుతున్నాయి.

“మల్లయ్యా, ఈ నాణేలు, పూసలు ఎప్పుడు దొరికాయి? అవి బయటపడి ఉన్నాయా.. ఇలాగే ఈ కుండతో పాటుగా దొరికాయా?” అడిగాడు.

“లేదండీ, ఈ పూసలని, ఓ పగిలిన చేతిగాజు ముక్కలని పది రోజుల క్రితం చూసాను” అన్నాడు.

ఇంతలో గౌరమ్మ “లేదండీ సారు.. ఇవి నెల రోజుల క్రితం దొరికాయి” అంది నిజాయితీగా.

“నువ్వు ఊరుకో. నిన్నెవరు అడిగారు?” కసిరాడు మల్లయ్య భార్యని గొంతు తగ్గించి.

చారి గౌరమ్మకి దగ్గరగా వచ్చారు.. గౌరమ్మ దగ్గర నుంచి సున్నితంగా మరిన్ని విషయాలు సేకరించడానికి.

గౌరమ్మ మల్లయ్యలు రామిరెడ్డి పొలంలో పని చేసుకుంటుంటే అవి దొరికాయి. వాటిని ముందు చూసింది గౌరమ్మే. అందుకే ప్రేక్షక పాత్ర వహించకుండా, ముందుకొచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకుంది.

“అయితే గౌరమ్మ ఇవి ఎప్పుడు దొరికాయి చెప్పు?” అన్నారు చారిగారు.

“నెల రోజుల క్రితం దొరికాయండి. అది పున్నమి నాడు సారు. సాయంత్రం, పొలంలో పనిచేసుకొని ఇంటికి మల్లిపోతుంటే అప్పుడు దొరికాయండి” అంది వినయంగా.

“మరి అవి దొరికినట్లు ఎవరికి చెప్పావు?”

“ఎవరికి చెప్పలేదండి ముందు వాటిని చూడగానే భయం వేసింది. ఆశ్చర్యపోయాం. ఇక్కడ ఏదో నిధి వుందనుకొని గునపాలు తెచ్చాము తవ్వి తియ్యడానికి. మాకు సహాయంగా జంగయ్య కూడా వచ్చాడు.”

“జంగయ్య ఎవరూ?”

“మా చిన్నన్న కొడుకు” అన్నాడు మల్లయ్య..

“మరి జంగయ్య ఎక్కడ కనిపించలేదు” అడిగారు.

“పాము కరిచి చనిపోయాడు సార్” అన్నాడు బాధగా.

“ఎలా, ఎప్పుడు, ఎక్కడ? అడిగాడు కలెక్టర్.

వాళ్ళ మాటలకి అడ్డువస్తూ “వీళ్ళ కథలు నమ్మకండి సార్.. ఏవో రెండు నాణేలు దొరికి వుంటాయి. దానిని చూసి నిధి అని అనుకొని వుంటారు. లంకె బిందెలు దొరుకుతాయని ఆశపడి తవ్వి వుంటారు..” అంటూ వాళ్ళ మాటలని తేలిగ్గా కొట్టి పారేసాడు రామిరెడ్డి. “అసలా జంగయ్యకు పాము కరవడం, ఎక్కడో జరిగి వుంటుంది. వాళ్ళు ఇక్కడ జరిగిందని కల్పించి చెబుతారు” అన్నాడు.

మేరుకి దగ్గరగా నిల్చున రాము అనే పాలేరు ముందుకొచ్చి, “నేను చూసానండి, జంగయ్య నీలంగా అయిపోయాడండీ, నురగలు కూడా వచ్చాయి” అన్నాడు అక్కడ జరిగిందాన్ని కళ్ళకి కట్టినట్లు వివరిస్తూ. అంతా విన్న కలెక్టర్, “ఏది ఏమైనా, ఏం జరిగినా మాకు మీరు ముందుగా చెప్పాలి” అంటూ నెమ్మదిగా మందలించాడు. కలెక్టర్ ఆ పొలం దగ్గర నుంచి తవ్వకాల దగ్గరకి వచ్చాడు..

తవ్వకాలలో దొరికిన రాతి పలక మీద వున్న లిపిని పోటోలు తీస్తున్నారు చంద్రశేఖర్. అక్కడ దొరికిన పనిముట్లని పరీక్షిస్తున్నాడు రమణ. మేరు వెంకటాచారి గారితో పాటూ వెంట వెంట నడుస్తూ ఆయన చెబుతున్న పాయింట్లను శ్రద్ధగా రాసుకుంటున్నాడు.

శ్రద్ధగా నోట్సు రాస్తున్న మేరుతో చారి అన్నారు – “మేరూ, ఇంక ఈ తవ్వకాల సైట్ దగ్గర బాధ్యత అంతా నీదే. ఇక్కడ ప్రతి చిన్న రాయికి కూడా ఒక కథ ఉంటుంది.. తవ్వకాలు చాలా నిర్లక్ష్యంగా, నెలల తరబడి తవ్వటం వలన ఇంతకాలం తీసుకుంది.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు. ఇక ముందు ఇలా జరగకుండా చూద్దాం..”

“అలాగేనండి మీకు ఎప్పటి కప్పుడు సమాచారం, అందిస్తూనే వుంటాను” ఆన్నాడు మేరు ఉత్సాహంగా.

ఆ ప్రదేశం అంతా ఫెన్సింగ్ వైర్‌తో కట్టి వుంది. రెండు గ్రూపుల వాళ్ళు టెంట్లు వేసుకోని ఉన్నారు పని మొదలు పెట్టడానికి..

భోజనాల సమయానికి అంతా అలసిపోయారు. మేరుకి చాలా ఆనందంగా ఉంది.

తన మీద పెట్టిన బాధ్యతనంతా సక్రమంగా నిర్వహించాలని అనుకుంటూ మనసులో తీర్మానించుకొన్నాడు. తలచుకుంటే ఏదో గొప్పవాడ్ని అయిపోయినట్లు, హీరో అయిపోయినట్లు అనిపిస్తోందనికి. ఈ గొప్ప అవకాశం దొరికినందుకు.. అది కాక ఇలాంటి రహస్యాలను చేధించే ‘సైట్’ తనకే దొరికినందుకు గర్వంగా కూడా వుంది.

మేరు పది మంది పనివాళ్ళని ఏర్పాటు చేసాడు. పని నెమ్మదిగా సాగుతోంది. ఆ ప్రదేశమంతో గునపాల చప్పుళ్ళు, మనుషుల మాటలతో ప్రతిధ్వనిస్తోంది. రోజుకి రెండు మూడు అడుగులు తవ్వటం.. దాని గురించిన విస్తారమైన సేకరణ, నోట్స్ తయారు చేసుకోవడం.. వాటిని పరిశీలించడం.. మళ్ళీ తవ్వకాలు మొదలు పెట్టడం ఇలా సాగుతోంది.. చెంచి, రంగమ్మ తవ్వి పోసిన మట్టిని, రాళ్ళని యేనాలోకి ఎత్తి పారబోస్తున్నారు. చెంచి రాజన్న భార్య చాలా చక్కటిది.. యవ్వనం ఆరోగ్యం కలబోసుకొని మిసమిస లాడుతుంటుంది. పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలు కలిపి కుట్టిన జాకెట్టు.. ముందు భాగాన్ని కప్పినా.. వెనక వీపుని రెండు తాళ్ళతో బంధించింది. చక్కటి శరీర సౌష్టవం..

‘లంబాడి జాతి యువతి అందం ముందు ఏ మిస్ ఇండియాలు పనికి రారు’ అనుకున్నాడు మేరు చెంచిని చూస్తూ. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటే.. అసలు మొదట్లో నమ్మలేక పోయాడు.

తవ్వకాలు జరుగుతున్న దగ్గరగా వచ్చాడు.. వంగి చూద్దామనుకున్నాడు ఎంత లోతుగా తవ్వకం జరిగిందనో.. అక్కడ పని చేస్తున్న రాజన్నతో ఏదో అవబోతుండగా.. “సార్ ఇక్కడికి రాకండి, తవ్వుతున్నప్పుడు రాతి పలకలు ఎగిరి పడతాయి. అవి కంటికి తగిలాయంటే చాలా ప్రమాదం” అని కేక వేస్తూ.. తవ్వకాల దగ్గర నుంచి పైకి వస్తూ “సార్, నాగు పాము నిధిని కాపలా కాస్తుండట కదా.. ఆ పామే జంగయ్యను చంపిందని అందరూ అనుకుంటున్నారు” అన్నాడు, పెద్ద రహస్యం కనిపెట్టిన వాడిలా. అతని మాటలకి నవ్వు వచ్చినా.. ఆ మాత్రం భయం వుండాలి.. అనుకుంటూ.. “ముందు నీ పని నువ్వు చెయ్యి” అన్నాడు మేరు. ఇతనికి అసలు పని కన్నా ఇలాంటి వాటి మీద శ్రద్ధ అనుకున్నాడు. అయితే ఇలాంటి కథలు తాను కూడా చిన్నప్పుడు విన్నాడు.

నాయనమ్మ రుక్కమ్మ చెప్పిన కథ ఇప్పటికీ జ్ఞాపకం.. రుక్కమ్మ గారి ఊరు శిరుగుప్ప, శుద్ధ పల్లెటూరు. తుంగభద్రానది ఒడ్డున వుండేది.. ఆ ఊళ్ళో పెద్ద నిధి వుందని.. దాని ‘నాగప్ప’ అనే నాగు పాము కాపలా కాస్తుందనీ.. దానిని అక్కడ వున్న దేవాలయంలో వుండే సాధువుకి తప్పించి ఎవరికీ కనబడదని చెప్పుకునేవారు.

నాగప్ప పడగ మీద మరకతమణి వుండేదట.. అది పుట్టలో నుంచి పైకి వచ్చేటప్పుడు గ్రామం అంత వెలుతురుమయం అయిపోయేదట.. అయితే ఆ నాగు పాము ఎప్పుడో గాని బయటకు వచ్చేది కాదట.. బయటికి వస్తే.. రాజసం ఉట్టిపడేలా జరజరా పాక్కుంటూ, దేవాలయంలో వున్న సాధువు దగ్గరకి వచ్చేదట.. తల మీద మీరకతమణిని శివలింగం మీద వుంచి.. తుంగభద్ర నదిలో స్నానం చేసి, శివలింగం చుట్టూ ప్రదర్శనలు చేసి మళ్ళీ తలమీద ఆ మణిని పెట్టుకొని వెళ్ళిపోయేదట..

రుక్కమ్మ గారు ఈ కథ ఎప్పుడూ చెప్పినా.. కళ్ళకి కట్టినట్లు హవభావాలతో చెప్పేది. పాము ఎలా వచ్చేదో, ఎలా బుసలు కొడుతుందో యాక్షనుతో సహ వివరించేది. అక్క గీత భయంతో ఏడ్చేది. ఏడుస్తున్న గీతని బుజ్జగించి ఒడిలోకి తీసుకొని జోకొట్టి నిద్ర బుచ్చేది. కాని అప్పుడు చిన్నప్పుడు మేరుకి ఎన్నో సందేహాలు.. అసలు ఆ సాధువు ఎవరు? ఊర్లో వుండకుండా ఆ పాడు పడిపోయిన దేవాలయంలోనే ఎందుకుంటాడు? నాగుపాము పడగ వీడి మణి అక్కడ పెట్టినప్పుడు సాధువు ఎందుకు తీసుకోడు.. ఇలాంటివి ఎన్నో అనుమానాలు.. తండ్రి రఘు, తల్లి గంగ దగ్గర తన సందేహాలు బయట పెట్టేవాడు. వాళ్ళు వాళ్ళకి తోచిన సమాధానాలు చెప్పేవారు.

“ఆ పాము గురించి నాకు తెలియదు. దానిని చూసినట్టు మా అమ్మ కూడా ఒట్టేసి చెప్పేది. అసలు పూర్వకాలంలో సంపదలు దాచుకోవడానికి ఇప్పటిలా బ్యాంకుల లాంటివి వుండేవి కాదు.. వాటిని భూమిలోనో, ఇంటి గోడలలోనో దాచిపెట్టి గుర్తులు పెట్టుకునేవారు. వారు చనిపోయినా, ప్రకృతి వైపరీత్యం వల్ల గ్రామాలు వరదల్లో కొట్టుకు పోయినా, భూకంపాలు వచ్చినా, ఇలాంటి నిధులు అనుకోకుండా, ఎన్నో సంవత్సరాల తరువాత ఇంకొకరికి దొరకవచ్చు.. వాటినే లంకె బిందెలు అని వాళ్ళు భావిస్తారు.. ఈ లంకె బిందెలని, పాము చుట్టుకుని కాపలా కాస్తుందని తరతరాల నమ్మకం..” చెప్పాడు రఘు.

మేరుకి నిధి మీద ఆశ లేదు, కానీ చిన్నప్పుడు ఎంతో కోరిక వుండేది, పడగ నెత్తిన పెట్టుకున్న ఆ నాగు పాముని చూడాలని, దాని మీద ఎక్కి సప్తసముద్రాలు దాటాలని.. పాల సముద్రంలో శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని, అతని పాదాలు వత్తుతూ వున్న లక్ష్మీదేవిని చూడాలని. అవన్నీ పసితనంలో ఆలోచనలు.. ఊహలు.. వయసు వచ్చాక తెలుస్తుంది.. అలాంటివన్నీ కల్పిత కథలని.

“భోజనానికి రండి సారూ..” అంటూ చెంచి పిలవగానే జ్ఞాపకాల్లో నుంచి బయటపడ్డాడు మేరు. తనలో తాను నవ్వుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here