[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]
[తవ్వకాల దగ్గర రెండు వారాలు గడిచిపోతాయి. దొరికిన వస్తువులన్నీ జాగ్రత్త చేసి, నెంబర్లు వేసి, మరింత పరిశోధన కోసం తన గదిలో పెట్టిస్తాడు మేరు. ఒకరోజు సాయంత్రం హైదరాబాదు నుంచి ఫోటోగ్రాఫర్ చంద్రం వస్తాడు. ఆఫీసులో బోరు కొట్టి సైట్‍కి వచ్చానని చెప్తాడు. మేరు శ్రీశైలం గురించి, కృష్ణానది గురించి ఏదో భావుకత్వంతో చెప్పబోతుంటే, తాను వచ్చింది తన మరదలి కోసమని చెప్తాడు చంద్రం. మాట్లాడుతూ నడుస్తుంటే చెంచి కనబడితే, ఆమెకి తెలియకుండా ఆమె ఫొటో తీస్తాడు చంద్రం. ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటాడు. మేరుకి చరిత్ర అంటే ఆసక్తి ఎలా కలిగిందో అడిగితే, చిన్నతనంలో వసుధా మేడం పాఠాలు చెప్పిన తీరు అంటూ ఆ కబుర్లు చెప్తాడు మేరు. మర్నాడు తవ్వకాలు జరుగుతున్న చోట ఓ సొరంగం బయటపడుతుంది. రాజన్నతో కల్సి చంద్రం, మేరు లోపలికి దిగుతారు. లోపల గోడలపై రంగురంగుల చిత్రాలు, వరుసగా ఒక పద్దతి ప్రకారంగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద బుట్టలు, వాటిల్లో పూల దండలు.. వాటిని తీసుకువెళుతున్న మనుషుల చిత్రాలుంటాయి. కొంత ముందుకు వెళ్ళాకా, ఆ సొరంగం మరో నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. అది ఓ ప్రాచీన ఆలయంలా అనిపిస్తుంది. అక్కడో పెట్టె లాంటిది ఉంటుంది. దాన్ని కాలనాళిక అని భావిస్తాడు మేరు. కాసేపటికి పైకి వచ్చి, చంద్రంతో కలిసి గదికి వెళ్తాడు మేరు. చంద్రాన్ని చూసిన జి.వి. జోక్ చేస్తే, సొరంగంలో భయపడి, ఇంకా ఆ భయంలోనే ఉన్న చంద్రం ఉడుక్కుంటాడు. మేరు తాను చూసిన సొరంగం, బావి స్కెచెస్ వేసుకుని నిద్రపోతాడు. ఉదయం తొమ్మిది గంటలకి తలుపు చప్పుడైతే లేచి వెళ్ళి తీస్తాడు మేరు. ఎదురుగా చంద్రం – ఎంతో ఫ్రెష్‍గా మెడలో కెమెరాతో కనబడతాడు. చారీ గారూ, మరో సీనియర్ ఆర్కియాలజిస్ట్ కృష్ణశాస్త్రి గారు సైట్‍కి వస్తున్నారన్న వారత వచ్చిందని చెప్తాడు చంద్రం. మేరు, చంద్రం సైట్‍కి వెళ్ళేసరికి అక్కడ చారి గారు, కృష్ణమూర్తి గారే కాకుండా ఇద్దరు కొత్తవాళ్ళు కనిపిస్తారు. వారు కేతకి, ప్రభాకర్ అనీ, వాళ్ళిద్దరూ డిపార్ట్‌మెంట్‍లో చేరిన కొత్త పరిశోధకులని, ఈ సైట్‍లో పని చేస్తారని చెప్పి, వాళ్ళకి మేరుని పరిచయం చేస్తారు చారిగారు. అందరూ నెమ్మదిగా సొరంగంలోకి దిగుతారు. వాళ్ల తలలకి ఉన్న ఫ్లాష్ లైట్ల వల్ల ఆ ప్రాంతమంతా వెలుగు నిండిపోతుంది. వాళ్ళు సొరంగాన్ని, బావిని, గోడల మీద చిత్రాలని జాగ్రత్తగా పరిశీలిస్తారు. చారి గారు, శాస్త్రి గారు ఆ నిర్మాణం ఆలయమా కాదా అని చర్చించుకుంటారు. మేరు చూసిన పెట్టెని కాలనాళిక అనుకుంటున్నాడని చారి గారు శాస్త్రి గారితో చెబుతారు. కేతకి గోడల మీద బొమ్మలని చూస్తూ అది మామూలు ఆలయం కాదని అంటుంది. దాని మీద ఉన్న గుర్తులు చైనా దేశపు డ్రాగన్‍లా ఉన్నాయని అంటారు శాస్త్రి. అది డ్రాగన్‍లా లేదని మయన్ నాగరికతకి చెమ్దిన చిహ్నంలా ఉందని అంటారు చారి. మెక్సికన్ పురాణాలకి చెందిన పక్షి సర్పం ఇక్కడెలా అని ఆశ్చర్యపోతాడు వాసు. దాని గురించి కేతకి మరింతగా వివరిస్తుంది. ఎపిగ్రాఫిస్ట్ నుంచి నోట్స్ వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుంటారు. మెల్లగా అందరూ బయటకి వచ్చేస్తారు. ఆ కాలనాళిక పైన నీ అభిప్రాయమేంటని వాసు మేరుని అడిగుతాడు. అలాంటిదాన్నే తాను మహాబలిపురం తవ్వకాలలో చూశానని, అప్పట్లో పరిశీలించడానికి సమయం సరిపోలేదని అంటాడు. అందరూ బయల్దేరుతారు. వాళ్ళకి వీడ్కోలు చెప్పిన మేరు – తన వైపు చూసి కేతకి నవ్వడం గమనిస్తాడు. బహుశా అది తన భ్రమ కూడా కావచ్చని అనుకుంటాడు. ఇంతలో అతనికి ఏదో గుర్తొస్తుంది. గబగబా సైట్‍లోకి పరుగుతీస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 5
[dropcap]బా[/dropcap]గా పరిచయమున్న దారి కాబట్టి సులువుగా చేరుకున్నాడు. సొరంగంలా వున్న ఆ ప్రదేశంలో చీకటిగా వుంది. అప్పటి వరకు వెలుగుతున్న ప్లాష్ లైట్లు ఆర్పేసి వున్నాయి. మేరు తల మీద వున్న ఫ్లాష్ బాండ్ లైటు తప్పించి అక్కడ అంతా చీకటి. మెల్లగా నడుస్తూ నిదానంగా పాదాలతో మట్టిని జరుపుతూ తాను ఇందాక చూసిన వస్తువు గురించి వెదక సాగాడు. శ్రద్ధగా వెయ్యి కళ్ళతో పరిశీలిస్తున్నాడు. కాలికి ఏదో వస్తువు తగిలింది. మోకాళ్ళ మీద వంగి తనకి దొరికిన వస్తువుని ఆత్రంగా తీసాడు. అది ఒక నెక్లెస్, ఎముకలతో చేసింది. చాలా నిరుత్సాహం అనిపించింది. దగ్గర్లో ఒక వెండి కాలి పట్టీ దొరికింది. దాని మీద అందమైన డిజైన్లు ఉన్నాయి. కాని అతను వెతికేవి వాటి కోసం కాదు. మట్టిని ఇంకొంచెం తవ్వాడు. తల మీద వున్న ప్లాష్ లైటు దాని మీద పడేలా వంగి చూసాడు.. ఆ కళాకృతి మట్టిలో సగం సగంగా కనిపించింది. మేరు మట్టిని సున్నితంగా తొలగించాడు. అది ఒక స్త్రీ శిరస్సు, చాలా నేర్పుగా చెక్కిన అమ్మాయి మొఖం.
మేరు ఊపిరి ఆగినట్లు అయింది. సున్నితంగా మోచెయ్యివరకు వున్న విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఏదో తెలియని ఉద్వేగం. ఆ విగ్రహం చాలా అందంగా వుంది. ఉలితో చెక్కిన రాతి శిల్పంలా లేదు. ఇంకేదో దానితో మలచబడి వుండవచ్చు. పోర్సలిన్ అనే నున్నటి రాతిపై చెక్కినట్లు గమనించాడు. తల ఒక్కటీ మిగిల్చి, కింద భాగాన్ని ధ్వంసం చేసినట్లుగా వుంది.
అతి జాగ్రత్తగా గుండెలకి హత్తుకొని, పైకి వచ్చి అతనున్న టెంటు వైపు నడిచాడు, పల్చటి బట్ట తీసుకొని శిల్పం ముఖం మీద వున్న మట్టిని సున్నితంగా తొలగించాడు. దాన్ని చేతిలో ఉంచుకుని మళ్ళీ చూశాడు. గొప్ప కళాకృతి. ఎవరు మలచారో? ఆ శిల్పి ఎవరై వుంటారు. ఆమె అతనికి మోడలా లేక అతని ఊహాసుందరా? వ్యక్తిగత ఆసక్తి వల్ల, ఉద్యోగ రీత్యా మేరు తరచు మ్యూజియమ్స్‌కి, ఆర్ట్ గాలరీలకి వెళుతుంటాడు. కాని ఇంతటి అందమైన స్త్రీ మొఖం చూడలేదు. ఏదో వింత, ఏదో తెలియని అద్భుతమైన ఆకర్షణ.
ఆ ముఖానికి తగ్గ అందమైన శరీరాన్ని, మేరు కళ్ళు మూసుకొని ఊహించసాగాడు. ఊహకే జగదేక సుందరిలా అనిపించింది. ఆ శిల్పికి బాగా పరిచయం వున్న వ్యక్తి అయివుండాలి. అతని ప్రేయసా లేక అతని ప్రేమని తిరస్కరించిన స్త్రీయా, లేక ఆస్థాన నర్తకా? తనకి దొరికిన వెండి పట్టీలు, ఈమె ధరించేదా? మేరు తన వేళ్ళను ఆమె కనుపాపలపై నుంచి పోనిస్తూ, ముక్కుపైకి తెచ్చాడు. పొడవాటి నాశిక కాదు కానీ సరైన కొలతలతో ఉంది, కొద్దిగా పైకి ఉంది. అందమైన పెదాలు, ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. అది ఓ శిల్పంలా కాక, ఎవరో ముని శాపం వల్ల శిల్పంగా మారిన అందాల యువతిలా అనిపించింది మేరుకి.
ఇది ఎప్పుడు చెక్కబడి వుంటుంది? వందల సంవత్సరాల నాటిదా లేక ఇంకా పురాతన కాలం నాటిదా? చారీ సాబ్‌ని అడిగి తన సందేహం తీర్చుకుందామనుకున్నాడు. అంతలోనే మనసు మార్చుకొన్నాడు. అది కేవలం ఓ కళాకృతి కాకూడదని భావించాడు. ఇలాంటి అపురూప కళాకృతులు దాచటం, అనైతికం అని తెలుసు, కాని అతను అనైతికంగా వుండడానికే సిద్ధపడ్డాడు. ఇలాంటి వందల కళాకృతులు వున్నాయి, అన్నింటికీ నెంబర్లు వేసి వున్నాయి. పరిశోధించవలసినవి వున్నాయి. అందులో ఇదొక్కటి అక్కడ లేకపోతే నష్టం ఏమీ లేదు అనుకొన్నాడు.
మేరు ఇంటికి వచ్చి తన బల్ల వద్ద కూర్చున్నాడు. స్కెచింగ్ పాడ్ తీసి పేపర్ మీద స్కెచ్ వెయ్యనారంభించాడు. మొఖం అవుట్‌లైన్ సులభంగా సింగిల్ స్ట్రోక్‌తో గీసాడు. పెన్సిల్ అలవోకగా గీతలు గీస్తోంది. ఓవెల్ షేపులో వున్న అందమైన మొఖం. చేతిలో వున్న పెన్సిల్‌తో – తీర్చిదిద్దినట్లు వున్న ముక్కును, నిండైన పెదవుల్ని బాదంకాయ ఆకారంలో వున్న పెద్ద పెద్ద కళ్ళని గీసాడు. అందమైన జుత్తు కోసం పెన్సిల్ అతని చేతులు నుంచి పరుగులు తీసింది. ప్రేమ పూర్వకంగా చేయి చాచి దూరంగా పెట్టుకొని చూసాడు.. మళ్ళీ చక్కటి కనుబొమ్మల మధ్యగా దిద్దాడు. ఎర్రటి బొట్టు ఆ చక్కటి కనురెప్పలు కొట్టుకుంటాయా అన్నట్లుగా అనిపిస్తోంది.
మేరు కిటికిలోంచి బయటకు చూశాడు. ఆ అందమైన శిల్పం తలని మెచ్చుకుంటూ, దాన్ని గీస్తూ ఎంత సమయం గడిపాడో గ్రహించలేదు. నిర్మలమైన ఆకాశంలో తళుకుమంటూ చుక్కలు. పశ్చిమానికి ఎగబాకుతూన్న చంద్రవంక. ఆరోజు చవితి. పౌర్ణమి తరువాతి నాలుగవ రోజు. భోజనం చెయ్యాలి, కానీ ఏమి వండుకోవాలనిపించలేదు. రాగానే బొమ్మ గీయడంలో నిమగ్నమై పోయాడు.. అదో చక్కటి అనుభూతి. ఎదురుగా వున్న రెండు అరటి పళ్ళు, కప్పు పాలు తీసుకొన్నాడు. మంచం మీద పడుకొని మళ్ళీ తను గీసిన అందమైన చిత్రం.. పూర్తిగా రూపుదిద్దుకొన్న ఆ చిత్రం చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. ‘ఇక్కడ జి. వి. ఉండవలసింది’ అనుకొన్నాడు. జి.వి. హైదరాబాద్ వెళ్ళాడు, పెళ్ళి కూతురి వేటలో.
‘రాతి నుంచి ఈ శిల్పం చెక్కడానికి అసలు ఆ శిల్పికి ఎన్ని రోజులు పట్టి వుంటుందో? ఆ భగవంతుడికే తెలియాలి’. ఆ శిల్పం గురించే మేరు ఆలోచనలు. తాను గీసిన బొమ్మకి రంగులు వేయాలి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
అతని ఊహల్లో ఎన్నో రంగులు మెదిలాయి. ఆ చిత్రానికి ‘బ్యాక్‌గ్రౌండ్’గా దంతం రంగు ఎంచుకొన్నాడు. మొఖంలో కళ రావడానికి, చెంపల్లో రంగు నిగార్చడానికి పింక్ కలర్‌ని లైట్‍గా స్ట్రోక్స్ ఇచ్చాడు.
కళ్ళకి, కనుపాపలకి కాఫీ బ్రౌన్ కలర్ కానీ జెట్ బ్లాక్ కాని నింపుదామనుకొన్నాడు. మళ్ళీ.. తేనె రంగు కనుపాపలు ఆమె బాదంకాయ ఆకారంలాంటి కళ్ళకి బాగా నప్పుతాయని, ఆ రంగే ఎంచుకున్నాడు. ఎర్రటి వైన్ రంగు ఎరుపు నిండైన పెదవుల మీద పరచుకొని ఇంకా వన్నె తెచ్చిందా పెదవులకి. జుత్తుకి బ్రౌన్ బ్లాక్ కలిపి స్ట్రోక్స్ ఇచ్చాడు. కేశాలకు బ్లాకిష్ బ్రౌన్ రంగు! రంగులు వేయడం పూర్తయ్యాకా.. అతను ఆ బొమ్మ మీద నుంచి తన దృష్టిని మరల్చుకోలేకపోయాడు. ఇంత దైవికమైన అందం ఎవరికుంటుంది. మానవ మాత్రులలో ఇలాంటి వాళ్ళు వుండడం అసంభవం.. ఆ ఊహకందని సౌదర్యం మేరు మనసులో ముద్రించుకుపోయింది.
మేరు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కలలో అత్యంత అద్భుత వనంలో సంచరిస్తున్నాడు. ఆమె వన కన్యలా కనిపించింది. మేరు కృష్ణవేణి నది నీలిజలాలలో ఈదుతున్నాడు, ఆమె జలకన్యలా వచ్చి కౌగిలించుకుంది. మేరు నారింజ రంగు ఆకాశంలో తేలికపాటి మబ్బులపై విహరిస్తున్నాడు, ఓ అప్సరసలా ఆమె దిగివచ్చింది.
ఒక్కసారిగా మెలుకువ వచ్చింది మేరుకి. తాను వేసిన చిత్రం తన గుండెల మీదే వుంది. తనకొచ్చిన అందమైన కలని జ్ఞాపకం చేసుకున్నాడు. తనకి ఆమె బాగా తెలుసుననిపించింది. నిజమే, ఆ వదనం చిరపరిచితం, సన్నిహితం! ఇదేం వింత కాదు. ఆమె వదనం ఎంత స్పష్టంగా ఉందంటే, ఎన్నో సంవత్సరాలుగా.. కాదు ఎన్నో యుగాలుగా పరిచయం ఉన్న ముఖంలా అనిపించింది.
ఎవరది? ఎవరామె? ఆమెకో పేరు పెట్టాలని మేరు అనుకున్నాడు. తనకి నచ్చిన పేర్లను గుర్తు చేసుకున్నాడు – కళ్యాణి, అపరంజి, సౌగంధిక, అమృతవర్షిణి, శిల్ప.. ఆఁ, ఆమెకి శిల్ప అనే పేరు బాగా నప్పుతుంది, ఎందుకంటే ఆమె దొరికిందే శిల్పంలో కదా! బల్ల మీద ఉన్న శిల్పాన్ని చూశాడు, తన ఛాతిపై ఉన్న కాగితంలోని బొమ్మని చూశాడు, నెమ్మదిగా దాన్ని సుతారంగా ముద్దాడాడు.
అధ్యాయం 6
ఢిల్లీ నుంచి కవిత వస్తోందన్న వార్త వినగానే రఘు, గంగల కన్నా ఎక్కువ సంతోషపడిపోతున్నారు రుక్కమ్మ. కవిత తన భర్త కృష్ణమూర్తి, కొడుకు కార్తీక్, కూతురు కరుణతో సెలవులకి వస్తోంది. కవిత మేరు కన్నా తొమ్మిదేళ్ళు పెద్దది.
గంగ వాళ్ళ రావడానికి నెల రోజుల ముందే, గంగ ఏర్పాట్లు మొదలుపెట్టింది. దసరా పండుగ కోసం పిల్లలకు బట్టలు, కవితకి మంచి చీర; ఇంకా వెళ్ళేడప్పుడు పెట్టడానికి మరో జత బట్టలు కొనిపెట్టేసి వుంచింది. ఇంక రుక్కమ్మగారు పిండి వంటల డబ్బాలు కిందికి దించారు. వాటి నిండా చక్కిలాలు, బొబ్బట్లు, రవ్వలడ్డులు ఇలా ఎన్నో మధ్యాహ్నం వేళ తినే చిరుతిళ్ళు.. వండి డబ్బాల్లో రెడీగా వుంచారు. మేరు కోసం విడిగా అన్ని పిండివంటలు తీసి దాచి పెట్టారు. ఆమెకు తెలుసు పిల్లలు వచ్చారంటే ఆ చేత్తో ఈ చేత్తో తింటారు, ఇంక మేరుకి ఏమి మిగలవు అనుకుంటూ దాచారు. షాపింగ్ పనులు వాయిదా వేసి, అల్లుడు కృష్ణతో షాపింగ్ చేద్దామనుకొన్నాడు రఘు.
వాళ్ళ రాకతో ‘పాంచజన్య’లో పండుగ మొదలైందనిపించింది. సంతోషం ఆ ఇంట్లో నిండి పోయింది. కవిత వస్తూనే తల్లిని కౌగలించుకుంది. రుక్కమ్మ గారి పాదాలకి నమస్కరించింది. మిగతా వారంతా కూడా ఆమెకి పాద నమస్కారం చేశారు. పలకరింపులతో అందరు ఇంట్లోకి వచ్చారు.
“మీరు కథలు చెబుతారట, మీకు చాలా కథలు తెలుసని అమ్మ చెప్పింది” ఆసక్తిగా అడిగాడు కార్తీక్ రుక్కమ్మ గారిని.
“తప్పకుండా చెబుతాను, కాని నువ్వు పండుగ పూట చక్కగా నేను చెప్పినట్లు వంటి నిండా నూనె రాసుకొని నలుగు పెట్టుంచుకొని తల స్నానం చెయ్యాలి. రాత్రి పడుకోబోయేముందు చక్కటి కథలు చెబుతాను. నీకు ఎలాంటి కథలు ఇష్టం? శమంతకమణి కథ తెలుసా..” అన్నారు రుక్కమ్మ.
“తెలుసు, మా అమ్మ చెప్పింది. నాకు భక్త ప్రహ్లాద కథ కావాలి. స్తంభం చీల్చుకొని సింహం రాజు వస్తాడు, ఉరుములు, మెరుపులతో స్తంభం కూలిపోతుంది.”
“సింహం రాజు కాదురా మొద్దూ.. ఆయన నరసింహ స్వామి..” కృష్ణమూర్తి కొడుకుని మందలిస్తూ అన్నాడు.
కరుణ ఇంకా అలవాటు పడలేదు, అమ్మమ్మ ఇంటికి. ఇంకా అమ్మ కొంగు పట్టుకొనే తిరుగుతుంది.
అందరూ మధ్యాహ్నం టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే, “ఎక్కడికైనా సరదాగా బయటికి వెళదాం” అన్నాడు రఘు.
“యాదగిరి గుట్ట వెళదాం, దారిలో వస్తూ అనుకొన్నాము నేనూ, కృష్ణ” అంది కవిత.
“పోని బాసర వెళదామా, అక్కడ కరుణకి అక్షరాభ్యాసం చేయిద్దాం, ఏమంటారు?” అంది గంగ.
“బాసరా? ఎక్కడుంది?”
“నిజామాబాద్‌కి చాలా దగ్గరలో. అక్కడ ప్రసిద్ధి చెందిన సరస్వతి ఆలయం వుంది. ఆ ఆలయం గోదావరి ఒడ్డునే వుంది. విగ్రహాన్ని వేద వ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతాయి. విగ్రహాన్ని ముతక ఇసుక, సున్నంలాంటి పదార్థాలతో చేశారట. ఇప్పటి వరకు ఎలా నిలబడి వుందోనన్నది రహస్యమే.. సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ సరస్వతి దేవి కటాక్షం కలుగుతుందని నమ్మకం.”
“పగటి పూట ప్రయాణమైతే నాకు అభ్యంతరం లేదు.. అయినా మేరు వస్తున్నాడుగా, వాడిని కూడా అడుగుదాం, వాడి ప్లాన్ ఏమిటో, అ ప్రకారంగానే వెళదాం” అంది కవిత.
“నాన్నగారూ, వాడి పెళ్ళి గురించి ఏమైనా ఆలోచించారా, వాడేం చిన్న పాపాయి కాదు. 27 ఏళ్ళు వచ్చాయి. మంచి ఉద్యోగం కూడా వుంది, నాలుగేళ్ళ నుంచి చేస్తున్నాడు. స్థిరపడ్డట్టే కదా..?” అంది కవిత.
“అలా అడుగు తల్లీ, మీ అమ్మానాన్నలకి చెప్పీ చెప్పీ విసిగిపోయాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో? బహుశ మేరు ఇష్టానికి వదిలేసారేమో? ఒక వేళ ఇతర కులం అమ్మాయిని చేసుకుంటే.. వీళ్ళేం చేస్తారో ఆ భగవంతుడికీ తెలియాలి . అయినా నేను అంతవరకు బ్రతికి వుంటానో లేదో..”
రుక్కమ్మ అంటున్న విధానానికి పకపకా నవ్వింది కవిత.
“ఈ విషయం నా పెళ్ళికి ముందు కూడా అన్నావు. అయినా అంత తొందరగా చనిపోతానంటే ఎలా? నీ ఆశీర్వాదం లేకుండా మేరు పెళ్ళి జరగదు. ఇంకో విషయం చెప్పనా? నా కొడుకు కార్తీక్‌కి మేరుకి పుట్టబోయే కూతుర్ని అడుగుదామనుకుంటున్నాను, ఇంక సంతోషమేనా..”
“వెటకారం వద్దమ్మా! నాకు భగవంతుడు దీర్ఘాయుష్షు ఇచ్చాడనేగా మీరిలా మాట్లాడుతున్నారు, ఇది ఆయన దయ. చూస్తూ వుండండి ఒక రోజు ఎండాకాలపు గాలిలా మాయమై పోతాను.”
“ఇలాంటి చావునే అందరూ కోరుకుంటారు. ఎవరు మాత్రం వేదనని అనుభవించాలనుకుంటారు?” అన్నాడు రఘు.
“మనం జీవితం గురించి మాట్లాడుకుటున్నాము, చావు కబుర్లు ఎందుకు” అంటూ కల్పించుకున్నాడు కృష్ణ.
“మేరు పెళ్ళి విషయాలు మాట్లాడుకుందాము. మా కజిన్ ఒకరు హైదరాబాదులో ఉన్నారండి, అతను రిటైర్డ్ అయ్యాక అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళకి ఒక్కగాను ఒక్క అమ్మాయి. ఆంధ్రా బ్యాంకులో పని చేస్తుంది. పెళ్ళి సంబంధాలు వెదుకుతున్నారు.. మేరు కోసం అయితే ఈ సంబంధం చాలా బాగుంటుంది.” చెప్పాడు కృష్ణ.
“అలాగే. మేరు ఎలాగో వస్తున్నాడు కదా అడుగుదాం.”
“వాడిని అడిగి ఏమి ప్రయోజనం వుండదు. మనమే వాడికి నచ్చచెప్పాలి. వాడు ఎంతసేపు తవ్వకాలు, కవిత్వం, చిత్రలేఖనం అంటూ కలల్లో విహరిస్తూ వుంటాడు” ఆవేదనగా అంది గంగ.
“అమ్మా, కలలే కదా కననీ ఏం నష్టం లేదు.. పెళ్ళి చేసుకుంటే కలలన్నీ కుదిరిపోతాయి..” అంటూ కవిత కృష్ణమూర్తి వైపు చూసింది.
“ఓ మంచి రోజు చూసి పెళ్ళి చూపులు ఏర్పాటు చేద్దాం.. లాంఛనాలు అవి పెట్టుకోకుండా యథాలాపంగా చూసి వద్దామా, అన్నట్లు చారిగారు ఫోను చేసారు. మేరు బహుశ రేపే ఇక్కడికి వస్తున్నాడు ఆఫీసు పని మీద” అన్నాడు రఘు.
ఆ మరుసటి రోజే మేరు వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కనిపించాడు, అందర్ని ఆప్యాయంగా పలుకరించి, అక్క బావ పిల్లల్ని చూసి సంబరపడి పోయాడు.
“అమ్మా ప్రసాదం ఇదిగో” అంటూ తను చెప్పిన ప్రసాదం ప్యాకెట్ ఆమె చేతిలో పెట్టాడు. తల్లి అందించిన టిఫిన్ తింటుంటే.. కవిత అంది “మేరూ, ఈసారి నీ పెళ్ళి వేడుక కోసం వస్తాం..”
“నేను రడీయే పెళ్ళి చేసుకోవడానికి, పెళ్ళి కూతుర్ని నీ పర్సులో పెట్టుకొని వస్తే రేపే పెళ్ళికి సిద్ధం..”
“అలాగే. ఆరోజు రేపే. అయితే పెళ్ళి కాదు, పెళ్ళిచూపులు.. అమ్మాయిని చూడ్డానికే రేపే వెళ్తున్నాం.”
“నిజంగానా? వద్దు కవితా. నాకు ఇలాంటివనీ నచ్చవు. కావాలంటే మీరందరూ వెళ్ళి చూసిరండి, మీకు నచ్చితే నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను..”
“అలాగే. అయినా ఇవన్నీ ఒక్క రోజులో జరిగే పనులు కావు. మాములుగా స్నేహపూర్వకంగా కలసివద్దాం, మనం పదేపదే వాళ్ళ దగ్గరకి వెళ్ళి కలవడం వాళ్ళకీ ఇబ్బందే కదా..?”
పద్ధతులు ఏర్పాట్లు గురించి చాలా సేపు చర్చించుకున్నారు. మేరు, గంగ, కవిత, కృష్ణమూర్తి కలిసి, సికింద్రాబాదులో వున్న ఆడపెళ్ళివారింటికి మర్నాడు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు.
ఆ రాత్రి మంచం మీద వాలినప్పుడు, ఎందుకో తెలియదు అతని శిల్ప సుందరి ముఖం ఒక్కసారి కళ్ళముందు కదిలింది. ఏదో తెలియని బాధ. గుండెల్ని మెలిపెట్టింది. వింతైన భావుకతా, ఆ అనుబంధం పట్ల ఆశ్చర్యం వేసింది మేరుకి.
***
నాగరాజు, వినీత అంతా సిద్ధం చేసుకొని, మేరు వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నారు. సాయంకాలం అయిదున్నర అయింది, మేరు వాళ్ళు ఆడపెళ్ళివాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. అందరిని సాదరంగా ఆహ్వానించారు, నాగరాజు, వినీత. “మా అమ్మాయి ఇంకా బ్యాంకు నుంచి రాలేదు” అని, బాధపడుతూ ‘సారీ’ చెప్పారు.
“ఫరవాలేదండీ. సాయంత్రం కార్యక్రమం కోసమైతే, నేను కూడా ఆఫీసుకు సెలవు పెట్టను” అన్నాడు మేరు.
మేరుతో అతని ఉద్యోగం గురించి మాట్లాడుతూ అతని వ్యక్తిత్వాన్ని పరిశీలించాడు నాగరాజు. వినీత వాళ్ళకి ఫలహారాలు అందించడంలో హడావిడి పడుతుంటే, కవిత స్నేహపూర్వకంగా ఆవిడతో పాటూ కలసిపోయి, టీ, టిఫిన్ అందించడంలో సహాయపడింది.
ఇంతలో గుమ్మంలోకి వచ్చిన కూతుర్ని చూసి “అదిగో అమ్మాయి వచ్చేసింది” అంటూ, ఊపిరి పీల్చుకుంది వినీత. అందరూ ఆమెవైపు చూసారు, ఆమె హాల్లోకి వచ్చి బిడియంగా నిల్చుంది.
మేరు ఆ అమ్మాయిని – జీవితంలో మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తున్నట్లు చూస్తూ వుండిపోయాడు.
అందరూ అలా చూస్తూ వుండడంతో సిగ్గుపడిపోయింది. గంధం రంగులో మెరిసిపోతున్న ఆ అమ్మాయి ముఖం సిగ్గుతో ఎర్రబడింది, తేనె రంగు కళ్ళు వాలిపోయాయి. ఉంగరాలు తిరిగిన జుత్తు సవరించుకుంటూ జడ ముందుకు వేసుకొని అల్లుకుంటూ వుండిపోయింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కృష్ణమూర్తి మెల్లగా దగ్గాడు.
“శిల్పా రా నీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇతనే మేరు. కృష్ణమూర్తి గారి బావమరిది” అంటూ నాగరాజు పరిచయం చేసాడు శిల్పకి.
‘శిల్ప, పేరు కూడా అదే, ఏమిటి విపరీత్యం, తన శిల్పసుందరే నడిచి వచ్చిందా’ అనుకున్నాడు మేరు, గుమ్మంలో నిలపడ్డప్పుడు ఆ అమ్మాయిని చూసి.. తన స్వప్న సుందరి ఎదురుగా నిల్చోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం మనసులో అనుకున్నాడు మేరు, ఆ అమ్మాయి పేరు శిల్ప అని తెలియగానే. అచ్చం తాను గీసిన బొమ్మే రక్తమాంసాలతో నడిచొచ్చినట్టుంది. తన కలలరాణి కళ్లెదురుగా కనిపిస్తుంటే చిత్రమైన పులకింతకి గురయ్యాడు మేరు.
శిల్ప మేరు వైపు చూసి అందమైన పలువరస తళుక్కుమనేల నవ్వింది.
నమ్మశక్యం కాని అనుభవంతో, మేరుకి సృహ తప్పిపడిపోయినట్లు అయింది.
(ఇంకా ఉంది)