కాంచన శిఖరం-4

0
2

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[సొరంగంలోకి పరిగెత్తిన మేరు – తనకి కనిపించిన వస్తువు కోసం వెతుకుతాడు. కాసేపు వెతికాక, అతనికి కావల్సినది దొరుకుతుంది. అది ఓ స్త్రీ శిరస్సు. చాలా నేర్పుగా చెక్కిన అమ్మాయి ముఖమది. సొరంగం బయటకి వచ్చి దాన్ని శుభ్రం చేసి జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అంత అందమైన స్త్రీ మొఖం అప్పటివరకూ చూడలేదని అనుకుంటాడు. ఆమె ఎవరో ముని శాపం వల్ల శిల్పంగా మారిన అందాల యువతిలా అనిపిస్తుంది మేరుకి. అనైతికమైనా, ఆ అపురూప కళాకృతిని దాచుకుంటాడు మేరు. తన గదికి తీసుకెళ్ళి ఆ శిల్పానికి స్కెచ్ గీస్తాడు. ఆమె అందానికి అబ్బురపడతాడు. జి.వి. ఉంటే బాగుండేదని అనుకుంటాడు. జి.వి. పెళ్ళి చూపుల కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ఆ అందమైన చిత్రానికి అద్భుతమైన రంగులు వేస్తాడు. ఊహకందని సౌందర్యం మేరు మనసులో ముద్రితమైపోతుంది. నిద్ర లోకి జారుకున్న మేరుకి కలలో ఆమె కనబడుతుంది, అతనితో పాటు కృష్ణానదిలో జలకాలాడుతుంది. ఆమె ఎన్నో యుగాలుగా తనకి తెలుసని అనుకుంటాడు మేరు. ఆమెకి శిల్ప అని పేరు పెడతాడు. ఢిల్లీ నుంచి మేరు అక్క కవిత –  భర్త పిల్లలతో హైదరాబాద్ వస్తున్నట్టు కబురొస్తుంది. వాళ్ళ కోసం రకరకాల తినుబండారాలు చేసి ఉంచుతారు గంగ, రుక్కమ్మ. కవిత భర్త, పిల్లల వస్తారు. పిల్లలు రుక్కమ్మ గారి దగ్గర కథలు వింటారు. తమ్ముడికి పెళ్ళి చేయరా అని కవిత అమ్మానాన్నలని అడుగుతుంది. కవిత భర్త కృష్ణమూర్తి ఒక సంబంధం చెప్తాడు. మర్నాడు మేరు వస్తున్నాడనీ, అందరం అతడిని ఒప్పించి పెళ్ళిచూపులకి తీసుకువెళ్దాం అనుకుంటారు. మర్నాడు మేరు, గంగ, కవిత, కృష్ణమూర్తి కలిసి – పెళ్ళి చూపులకి నాగరాజు గారింటికి వెళ్ళాలని అనుకుంటారు. పెళ్ళిచూపులకి వీళ్ళు వెళ్ళిన సమయానికి పెళ్ళికూతురు ఇంకా ఆఫీసు నుంచి రాదు. కాసేపటికి ఆమె వస్తుంది. పరిచయాలవుతాయి. ఆమె పేరు శిల్ప అని విని మేరు విస్తుపోతాడు. పేరుతో, రూపం కూడా తన స్వప్న సుందరిలానే ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు మేరు. – ఇక చదవండి.]

అధ్యాయం 7

[dropcap]శి[/dropcap]ల్ప పనిచేస్తున్న బ్యాంకు ముందు, పార్కింగ్ ప్లేసులో శిల్ప కోసం ఎదురు చూస్తున్నాడు మేరు. అతను తన బైక్ ‘వైపర్’ మీద వాలి, ఒక పాదం బండి మీద ఉంచి, మరో పాదం నేల మీద ఉంచాడు. అతను వేసుకున్న గ్రీన్ కలర్ పోలో షర్ట్, బ్లూ జీన్స్‍లలో తాజాగా, అందంగా, హుందాగా కనిపిస్తున్నాడు. ఆ షర్ట్‌ని అమెరికా నుంచి తీసుకొచ్చి మేరు స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే ముందు అద్దం ముందు రెండు గంటలు నిలబడి తయారైన మేరు, క్యాజువల్ లుక్ కోసం రిహార్సల్ వేసుకొన్నాడు..

శిల్ప ఓ గంట ముందు ఇంటికి వెళ్ళడానికి తన పై అధికారి పర్మిషన్ తీసుకొని బ్యాంక్ బయటికి వస్తూ మేరుని చూసింది. దూరంగా డజన్ల కొద్ది పార్క్ చేయబడ్డ మోటార్ బైక్‌ల మధ్య ఉన్న మనిషి అతనొక్కడే.

చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి “హలో మేరు కాంచన గారు” అంటూ పలకరించింది.

మేరు కళ్ళు తప్పుకోలేకపోయాడు. తన స్వప్న సుందరి నడిచి వస్తునట్లు అనిపించింది. మెరూన్ రెడ్ కలర్ చీర, మెరూన్ పోల్కా డాట్స్ ఉన్న ఎల్లో కలర్ బ్లౌజ్ ధరించి ఉందామె. రోజంతా పని చేసి కొద్దిగా అలసినట్లు వున్నా, ప్రశాంతమైన చిరునవ్వు ఆమె ముఖంలోని ఆకర్షణని పెంచింది.

“మేరు అని పిలవండి చాలు, నన్ను అందరూ అలాగే పిలుస్తారు.”

“మీ పేరు చాలా అరుదైనది కదా.. ఇలాంటి పేరు ఎక్కడా వినలేదు” అంది.

అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు చెబుదామనుకొన్నాడు, కానీ అది సమయం కాదని ఊరుకొన్నాడు.

“మీకు నాతో పాటు బైక్ మీద రావడం ఇబ్బంది అయితే ఆటోలో వెళదాం..” అన్నాడు మేరు, బయల్దేరుదాం అని సూచిస్తూ.

“ఏం ఫరవాలేదు బైక్ మీద కూర్చుంటాను.. ఎక్కడికి తీసుకువెళుతున్నారు?”

“ముందుగా కాఫీ తాగుదాము, ఆ తరువాత ఏదైన పార్క్‌కు వెళ్ళి ఇద్దరం కబుర్లు చెప్పుకుందాము.”

“పార్క్ ఎక్కడండీ ఈ హైదరాబాద్ నగరంలో? ఇక్కడికి దగ్గరలోనే లుంబిని పార్క్ బాగుంటుంది. కాని విపరీతమైన జనాలు. ఇద్దరం తప్పిపోతాం..” అంది.

‘శిల్పా నువ్వు నాకు అరుదైన వరంలా లభించావు, నిన్ను పోగొట్టుకోలేను’ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అనుకొన్నాడు.

శిల్ప అతని చూపులను తప్పించుకుంటూ బైక్ మీద కూర్చుంది.

‘వైపర్ బైక్’ మీద – గజిబిజిగా రద్దీగా వున్న రోడ్డు మీద నుంచి, బిర్లా మందిరం వైపు వెళ్ళారు. ఎటువంటి థ్రిల్స్ ఆశించకుండా, బైక్‍ని పద్ధతిగా నడిపాడు. బిర్లామందిర్ చేరాక, ప్లానెటోరియం పక్కన ఉన్న కెఫటేరియాలో కూర్చున్నారు. హోటల్స్, సినిమాలు, షాపింగులు ఇలా ఎన్నో అంశాలు వాళ్ళిద్దరి మాటల్లో చోటు చేసుకొన్నాయి. అసలు విషయానికి వచ్చే ముందు  ఇవి  పలకరింపు కబుర్లని ఇద్దరికీ తెలుసు.

తరువాత వెళ్ళి, ప్లానెటోరియం దగ్గరలో వున్న ఎత్తైన పెద్ద రాయి పక్కన కూర్చున్నారిద్దరూ. అక్కడి నుంచి చూస్తుంటే హైదరాబాద్ సిటీ అంత లైట్లతో వెలిగిపోతూ కనబడుతోంది. చీకట్లని తొలగించుకొని నేల మీద నక్షత్రాలు పరచినట్లు తళుకు తళుకుమంటోంది. నెక్లెస్ రోడ్డు గురించి  ఏదో చెబుతోంది శిల్ప. ఆమె మాటలు వింటూ.. శిల్పకి ఇక అసలు విషయం చెప్పాలని అనుకొన్నాడు మేరు.

“శిల్ప నువ్వు నాకు నచ్చావు. మా ఇంట్లో అందరికీ కూడా” అన్నాడు.

“అవును, ఈ రోజు పొద్దున్న మీ అక్క కవిత నాతో మాట్లాడారు. నాక్కూడా ఇష్టమే”.

“అవునా, అయినా శిల్పా, నువ్వు నాకు ఎందుకంతగా నచ్చావో చెప్పనా?”

“అందులో ఆశ్చర్యం ఏముంది? మీరు నన్ను చూసినప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన ఇష్టంతోనే అర్థం అయింది. పైగా డిగ్రీ వుంది, చక్కటి బ్యాంకు ఉద్యోగం. మరి నన్ను కాదనుకోవడానికి రెండుసార్లు ఆలోచించాల్సి వుంటుంది..” అంది శిల్ప కొద్దిగా గొంతులో గర్వం తొణికిసలాడుతుండగా. దీన్ని ఊహించలేదు మేరు. తన ఆలోచనలను సర్దుకోడానికి కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు.

“అది కాదు శిల్ప, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అసలు మొదటిసారి నిన్ను చూసినప్పుడే చెప్దామని అనుకున్నాను. ఇంతకు ముందెప్పుడో నిన్ను చూసినట్టు నాకు బలంగా అనిపించింది.” అన్నాడు.

శిల్ప అతనికేసి చూడకుండా, కాళ్ళ దగ్గర ఉన్న గడ్డిని పీకుతోంది.

“శిల్పా, మనం ఇద్దరం ముందెప్పుడో కలిసినట్లుగా, ఏ జన్మలోనో కలిసినట్టుగా అనిపిస్తోంది.. బహుశ పూర్వ జన్మ సంబంధమేమో?” ఉద్వేగంతో గొంతు జీరపోగా అన్నాడు మేరు.

“సారీ అండీ, నాకిలాంటి భ్రమలు లేవు, నేను ప్రతీదీ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాను. ఊహల్లో కన్నా నేల మీద నిలబడడం నాకు ఇష్టం” అంది.

కరుకుగా నిక్కచ్చిగా వచ్చిన ఆమె సమాధానానికి మేరు కాస్త బాధపడ్డాడు. అయినా సరే తాను చెప్పదలచుకున్నది చెప్పాలనుకున్నాడు. శ్రీశైలం తవ్వకాలలో తనకి దొరికిన శిల్పం  తల గురించి, ఆ శిల్పం మొహంతో శిల్ప పోలికల గురించి, తన కల గురించి.. అంతా పూస గుచ్చినట్లు వివరించాడు.

అంతరాయం కలిగించకుండా శిల్ప అంతా ఓపికగా వింది.

“మేరు ఇదంతా నిజమా? చాలా ఆశ్చర్యంగా వుంది” అంది.

“నన్ను నమ్మంటం లేదా..?” అన్నాడు.

“ఎలా నమ్మమంటారు? మీకు ముందే చెప్పానా.. అది మీ అంతరంగ స్పందన.. కలలని నమ్మే మనిషిని కాను. ఈ పునర్జన్మ కథలు విన్నాను. కాని నాకు వాటి మీద ఎలాంటి నమ్మకాలు లేవు. నమ్మను కూడా.. సంబంధాలు లౌకికమైనవిగా, అర్థవంతమైనవిగా వుంటేనే అవి కలకాలం నిలబడతాయి.” అంది.

ఎలా ప్రతిస్పందించాలో మేరుకి అర్థం కాలేదు. “నీకు కలలు రావా శిల్పా?” అని నెమ్మదిగా అడిగాడు. “మనిషికి కలలు చాలా అవసరం. గిరిష్ కర్నాడ్ తాను రాసిన ఓ నాటకంలో ఏమంటాడో తెలుసా? ‘చీకట్లో లైట్లు లేకుండా నడవచ్చు కాని స్వప్నాలు లేకుండా మనిషి బతకలేడ’నీ”.

“ఈ గిరీష్ కర్నాడ్ ఎవరో నాకు తెలియదు. కాని నేను మాత్రం చీకట్లో లైట్లు లేని దారిలో నడవను. నిజం మేరు, నేను కూడా కలలు కంటాను. నా కలలు అభివృద్ధికి తగ్గట్టుగా వుంటాయి. నా ఉద్యోగంలో ఇంకా ఎలా ఎదగాలి? ఇంకా ప్రమోషన్స్ కోసం ఎలా పాటుపడాలి, ఇల్లు, పిల్లలు, సంసారం వాటి గురించి ఏం సమకూర్చుకోవాలి.. ఇవి ఇలాంటివే నా కలలు.” చెప్పింది శిల్ప.

“వీటిని కలలు అనరు శిల్పా, ఇవి కోరికలు”

“కావచ్చు. నా కోరికలే నా స్వప్నాలు.. నా స్వప్నాలకి మూలం, వాస్తవాలు. నేను మీ ఊహలకి ఆ శిల్పానికి కొద్దిగా దగ్గరగా వుండి వుండవచ్చు. కాని ‘రాజకుమారుడు వచ్చి గుర్రం మీద తీసుకువెళతాడు’ అనే కలలు కనే కష్టాల్లో వున్న ఆడపిల్లని కాదు” అని అంటున్నప్పుడు శిల్ప గొంతులో స్పష్టత, వింటూ వుండి పోయాడు మేరు.

“కానీ శిల్పా, వీటన్నింటికీ నా దగ్గర జవాబు వుంది. వచ్చి నేను వేసిన పెయింటింగ్  చూడు. నీకు ఆ శిల్పానికి ఎంత దగ్గర పోలికలున్నాయో? అది అచ్చం నీలాగే వుంది. ఇంతకు ముందు నిన్ను చూడలేదు కదా? మరి నీలాగే ఎలా గీయగలిగాను?”

“బహుశా యాదృచ్ఛికం కావచ్చు, దైవికం కావచ్చు. అయినా మీరు వేసిన ఆ శిల్ప సుందరి చిత్రాన్ని ఒక్కసారి చూడాలని వుంది” అంది శిల్ప.

“అబ్బా, నా భావాన్ని, నా ఊహల్ని, ఆనందాన్ని ఇలాంటి లౌకిక ప్రపంచపు పదాలతో తీసిపారెయ్యకు.” అన్నాడు మేరు శిల్ప మాటల్లోని అయిష్టత గ్రహిస్తూ.

“మేరు, మన తల్లితండ్రులతో మాట్లాడడానికన్నా ముందే మనం ఒక అభిప్రాయానికి రావాలి. మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను.. మన పెద్దలు పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టక ముందే అన్నీ ఆలోచించుకోవాలి. మేరు, నేను కిటికి ముందు కూర్చుని నోట్లు లెక్క పెట్టుకొనే బ్యాంకు ఉద్యోగిని. నాతో జీవితం సంతోషంగా గడపగలరా?” అంది.

మేరు శిల్ప చెయ్యి పట్టుకొన్నాడు. “ఇవన్నీ నాకు తెలియవు.. శిల్పా, నిన్నునా భార్యగా సంతోషపెట్టగలను. నువ్వు నాకు దేవుడిచ్చిన అరుదైన వరానివి.” అన్నాడు. అతని కళ్ళ నిండా ఆరాధన నిండిన చూపులకు చలించిపోయింది శిల్ప.

ఆమె తెల్లటి నాజూకైన వేళ్ళ మీద మేరు ముద్దుపెట్టుకొన్నాడు.

“ఇక్కడేనా?” అంటూ కొంటెగా అడిగింది.

“సరి అయిన సమయంలో సరి అయిన చోటు ఇది” అంటూ చేయి అందించాడు శిల్ప లేచి నిలబడడానికి.

“అంటే? కలల్లోనా?” అంది.

“ఇంక కలలెందుకు? నువ్వు ఎదురుగా వుండగా?” అన్నాడు.

అధ్యాయం 8

నెల రోజుల సెలవుల తరువాత హైదరాబాదు ఆఫీసుకి వచ్చిన మేరుకి ‘డా. టోనీ లెపంటో’ అనే ఓ అమెరికన్‌ని పరిచయం చేశారు. అతను పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉన్నాడు. బంగారు రంగులో ఒత్తైన జుత్తు, వంపు తిరిగిన ముఖం, పాశ్చాత్య రూపురేఖలతో ఉన్నాడతను. అతని వయసుని అంచనా వేయలేక పోయాడు మేరు. అతను వేసుకొన్న బ్లాక్ గ్రే మిక్స్ జీన్స్, టీ షర్ట్‌లలో కుర్రవాడిలా కనిపించాడు.

“హలో నా పేరు మేరు” అన్నాడు కరచాలనం కోసం చేయి చాస్తూ.

ఆప్యాయంగా చేయిని పట్టుకొని, స్నేహపూర్వకంగా ఊపాడు టోనీ.

“మేరు, మీ పేరు చాలా అరుదైనది.. నాకు తెలిసినంత వరకు.. మీ పేరు భారతదేశంలో ఉన్న ఒక పర్వతం పేరు కదూ” అన్నాడు.

ఒక అమెరికన్ నోటి నుంచి ఈ మాట వినడం మేరుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. అవునన్నట్లుగా మర్యాదగా తల ఊపాడు.

కొద్ది నిమిషాలు మాట్లాడిన తరువాత, టోనీ – టి.ఎ.ఆర్.ఎల్. నుంచి.. అంటే టెక్సస్ ఆర్కియాలజికల్ రీసర్చ్ లేబొరేటరీ నుంచి వచ్చాడని అర్థమైంది. అది ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ యొక్క బ్రాంచ్. ఆ లేబొరేటరీ – స్టేట్ ఆర్కియాలజి విభాగంలో రిజిస్టర్ వస్తువులు భద్రపరిచే విభాగం. అక్కడి నుంచి వచ్చాడు టోనీ.

“నేను నా పర్సనల్ పని మీద వచ్చాను. నా స్టూడెంటు ఒకరు భారతదేశం అమ్మాయిని వివాహం చేసుకొన్నాడు. అతను వస్తున్నప్పుడు అతనితో పాటు, నేను కూడా భారతదేశానికి రావడానికి ప్లాన్ చేసుకొన్నాను” అన్నాడు లెపంటో.

“మీరు దీనిని అఫిషియల్ టూర్ కింద ప్లాన్ చేసుకోవలసింది.. కొలాబరేటివ్ ప్రాజెక్ట్ కింద” అన్నాడు మేరు.

“అలా కుదరదు.. ఎందుకంటే నేను ఇప్పుడు టి.ఎ.ఆర్.ఎల్.లో లేను. నిజానికి నేను టీచింగ్ ఎసైన్మెంటు కోసం చాలాకాలం క్రిందట ఢిల్లీ వద్దామనుకున్నాను. అది ఒకప్పటి మీ  ఇంద్రప్రస్థ కదూ?” అన్నాడు.

“మీకు భారతదేశం గురించి చాలా విషయాలు తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది టోనీ” అన్నారు చారీ గారు.

మేరు వైపు తిరిగి, “మేరు, శ్రీశైలం ప్రాజెక్టు పనిని తాత్కాలికంగా ఆపేశాము. దాని గురించి ఇంకా వివరంగా మూలాలు వెదకాల్సి వుంది. రమణ ఇంకా లోతుగా వివరాలు సేకరిస్తున్నాడు. కాబట్టి కొద్ది నెలలు పట్టవచ్చు. నువ్వు హైదరాబాదు ఆఫీసులో వుండు. డేటా అంతా సేకరించేదాక..” అన్నారు చారీ గారు.

మేరుకి చాలా సంతోషం వేసింది. ఈలోగా శిల్ప ట్రాన్సఫర్ గురించి, మిగిలిన విషయాలు గురించి ప్రయత్నాలు చేసుకోవచ్చు అనుకొన్నాడు.

“అక్కడ దొరికిన కళాఖండాలన్నింటికి నెంబర్లు వేసావా? అవి దగ్గర దగ్గర నూటయాభై వుంటాయా?” అడిగారు చారీ.

“కాదండి, నూట ముప్పై రెండు వుంటాయి, మనం చేజిక్కించుకొన్నవి” – మేరు తనకి దొరికిన శిల్పాన్ని దాచి చెప్పాడు. ఏదైతే తన దగ్గర వుందో దాన్ని వదిలేశాడు.

“నేను శ్రీశైలం వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకోవాలి. ఆఫీసు కార్యకలాపాలన్నీ ముగించి, నా సామాన్లు అన్నీ వెనక్కి తెచ్చేసుకోవాలి” అన్నాడు మేరు. అలా అంటున్నప్పుడు అతనికి జి.వి. గుర్తుకు వచ్చారు. సరిగ్గా ఆరు నెలలకింద కలిసాడు.. కనీసం శుభలేఖకి కూడా జవాబు ఇవ్వలేదు.

“డాక్టర్ లెపంటో, మీరు మేరుతో మాట్లాడండి. శ్రీశైలం లేదా హంపీ వెళ్ళడానికి ప్లాన్ వేయడానికి అతను సహాయపడతాడు. మన ఆఫీసర్లు కొంత మంది తరచుగా అక్కడికి వెళ్ళివస్తూ వుంటారు..” అని చెప్పి చారీ గారు వారి లేచి నిలబడి డా. టోనికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు.

మేరు అతనిని తన గదికి తీసుకువెళ్ళాడు. “కూర్చోండి, డా. లెపెంటో” అంటూ కుర్చీ చూపించాడు.

“మేరు, నన్ను టోని అంటూ పిలవండి చాలు.. నాకు కూడా చాలా సులువుగా వుంటుంది. మీ పనిలోకి అడ్డం రాను గాని, లైబ్రరీ ఎటు వుందో చెబుతారా.. కొన్ని పేపర్లు చూడాలి. ఈ ప్రాజెక్టుకి సంబంధించినవి.” అన్నాడు.

“నేనే తీసుకువెళతాను అక్కడికి.. ఎంతో దూరంలో లేదు ఈ కారిడార్ చివరన వుంది..” అని అతనితో పాటు బయటకి వచ్చి నడుస్తూ, “అసలు మీకు ఇష్టమైన అంశం ఏమిటి?” అని అడిగాడు మేరు.

“నేను ఈజిప్షియాలజిస్టుని” చెప్పాడు టోనీ.

“ఓ, ఈజిప్ట్! హోవర్డ్ కార్టర్ గురించి నేను చదివాను, 1922లో టుటన్‌ఖమున్ సమాధిని కనుకొన్నది ఆయనే కదా?” తన గొంతులోని ఆత్రాన్ని దోచుకోలేక పోయాడు మేరు.

“ఖచ్చితమైన తేదీ చెప్పాలంటే నవంబరు 4. ఆ సమాధిని తవ్వడానికి కార్టర్, అతని అనుచరులకి కనీసం పదేళ్ళు పట్టింది. నా రీసర్స్ పని అంతా ఆనాటి సాంస్కృతిక వనరుల మీద..” చెప్పాడు టోనీ.

“మీరు ఎప్పుడైనా ఈజిప్టు వెళ్ళిరా?” అడిగాడు మేరు

“నేను డేటా సేకరించడానికి లక్సర్‍లో ఒక సంవత్సరంపైగా ఉన్నాను. అది చాలా అందమైన నగరం.. వాళ్ళ దేవుళ్ళు అమన్, తేబాస్ గౌరవార్థం నిర్మించిన కొత్త సామ్రాజ్యం అని అంటారు” చెప్పాడు టోనీ.

“చాలా ఆసక్తిగా వుంది వింటుంటే. ఒక అమాయక ప్రశ్న – అక్కడ ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి?” అడిగాడు మేరు.

“ఎన్నా? మీ భారతదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? అలాగే అక్కడ కూడా చిన్న పెద్ద కలిపి కొన్ని పిరమిడ్లు ఉన్నాయి.. ఎంతో పేరుపొందినవి ఉన్నాయి. కాని ‘టుటన్‌ఖమున్’ పిరమిడ్ మామూలుగా నిర్మించినది కాదు.. అది ఒక లోయలో ఉంది.”

“బహుశా దోపిడి నుంచి తప్పించుకోవడానికేమో?”

“అయివుండవచ్చు. కాని పిరమిడ్లు చాలా అద్భుతమైనవి. ఎన్నిసార్లు చూసిన మనల్ని అబ్బురపరుస్తూనే వుంటాయి. ఇప్పటికి చరిత్రలో మానవ నిర్మితమైన అతిపెద్ద కట్టడాలు అవే, నలభై వందల ఏళ్ళనాటివైనా!”

మేరు ఉత్సాహం, ఆసక్తి గమనించి లెపెంటో భౌగోళికంగా – వాటి నిర్మాణం, డిజైనులు, లోపల వున్న సొరంగాలు, అందులో వున్న గదుల గురించి వివరించాడు.

పిరమిడ్ యొక్క పనితనం గురించి చెబుతూ “వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే.. సూర్య కిరణాలు స్వర్గం నుంచి వెదజల్లుతున్నట్లు వుంటుంది.. ఇలాంటివి చూస్తుంటే వాళ్ళ సామ్రాజ్యం పట్ల ఈజిప్షియన్ల శ్రద్ధ, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి” అని వివరిస్తున్న టోని గొంతులో తీవ్రత; చరిత్ర పట్ల వున్న మమకారానికి, శ్రద్ధని చూసి మేరు చలించి పోయాడు.. అతను వాటిని వివరిస్తుంటే స్వయంగా ‘టుటన్‌ఖమున్’ సామ్రాజ్యంలో నాటి విశాలమైదానంలో విహరించినట్లు అనిపించింది మేరుకి.

“రాజ్యాధికారం చేపట్టినప్పటికి, టుటన్‌ఖమున్ తొమ్మిది సంవత్సరాలవాడు, కాని పందొమ్మిది సంవత్సరాలకే చనిపోయాడు. 1333 బి.సి. నుండి 1323 బి.సి.వరకు పది సంవత్సరాలే పరిపాలించాడు. పెళ్ళి అయ్యే నాటికి అతని భార్య అంఖేసేనమున్‌ వయస్సు పద్నాలుగు సంవత్సరాలు. వారికి కలిగిన సంతానమే ప్రసిద్ధిచెందిన రాణి నెఫర్టిటి” అంటూ వివరించాడు టోని మేరుకి.

“నాకు ఇన్ని వివరాలు ఈజిప్షియన్ చరిత్ర గురించి తెలియదు. చదువుకుంటున్నప్పుడు కోర్సులో ఒక భాగంగా, సింధు నాగరికతకు సమకాలీన నాగరికతగా వాళ్ళ యొక్క విలక్షణమైన సంస్కృతి సంప్రదాయాల గురించి, వాళ్ళ వింత ఆచారాలు, వాళ్ళ వివాహాల్లో గల విపరీత ధోరణులు గురించి చదువుకొన్నాము” చెప్పాడు మేరు.

“ప్రాచీనులది వాళ్ళకే ప్రత్యేకమైన దృష్టి. దానిని ఇప్పటి ఆధునిక, వైజ్ఞానిక విధానాలని అనుసరించి మనం విమర్శించలేము” చెప్పాడు టోనీ.

అతడో ప్రత్యక్ష సాక్షి, గొప్ప శాస్త్రవేత్త, అక్కడే వుండి పనిచేసి వచ్చాడు గాబట్టి.. అతని నుండి సరైన సమాచారం సేకరించాలని తలచాడు మేరు. “ఎన్ని మమ్మీలను భద్రపరిచారు?” అడిగాడు మేరు చాలా ఆసక్తిగా.

“మమ్మీలను తయారు చేసే ప్రక్రియ 70 రోజులు పడుతుంది. 40 రోజుల పాటు natron salt లో నానబెడతారు. మిగిలిన సమయాన్ని మరణించిన వ్యక్తి ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేయడానికి వినియోగిస్తారు” చెప్పాడు టోనీ.

“ఒబెలిస్క్ అంటే?”

“అవి రాతితో చేయబడిన వాసాలు. నాలుగు వైపులు నలుచదరంగా వున్న వాటిని పిరమిడ్‌కి కప్పుగా ఉపయోగిస్తారు. అవి మతపరమైన చిహ్నాలు. కొన్నిసార్లు వాటిని అస్వాభావికమైనవిగా పరిగణిస్తారు” చెప్పాడు టోనీ.

“కింగ్ టుటన్‌ఖమున్‌ని ఎలా భద్రపరిచారు?”

“అతని మమ్మీని తొమ్మిది అరలులో భద్రపరిచారు.. ముందు నాలుగు పేటికలుగా వుంటుంది. ఒక దాని తరువాత ఒకటిగా చెక్క ప్రేముతో, గ్రేనేట్ రాయితో చేయబడి ఉంటాయి. అవి మూడు పెద్ద శవపేటికలు, అన్నింటికన్నా ఆఖరుది పూర్తిగా బంగారంతో చేయబడి వుంటుంది. రాజుకి అంత్యక్రియకి వేసే బట్ట కూడా బంగారంతో చేయబడి వుంటుంది!”

“డా. లెపెంటో, ఇక్కడ పక్క భవనంలోనే పబ్లిక్ గార్డెన్‍లో మ్యూజియం వుంది, అక్కడ ఒక మమ్మీని భద్రపరిచారు కూడా..  కాని చాలా మందికి.. హైదరాబాదులో పుట్టి పెరిగిన వారికి కూడా ఈ విషయం తెలీదు. వాళ్ళకి తెలిసింది సాలార్జంగ్ మ్యూజియం ఒక్కటే” అన్నాడు మేరు.

“చాలామంది ప్రాచీనులకి మమ్మీలని చేసే ప్రక్రియ తెలుసు మేరు.. ఇంకొక్కటి గోవాలో కూడా భద్రపరచివుంది.. కాని పేరు చెప్పలేను” అన్నాడు టోనీ.

ఉన్నట్టుండి టోని లేచి నిలబడుతూ.. “ఇంక నేను బయలుదేరుతాను మేరు. సారీ, మీ ఆఫీస్ టైములో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు ఉన్నాను. మళ్ళీ మనం కలుసుకుందాము. మీ ఫోను నెంబరు నా దగ్గర వుంది” అన్నాడు.

“మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకొనే అవకాశం కలిగింది.. ఆఫీసులో పని కూడా లేదు. నెల రోజుల సెలవు తరువాత ఈ రోజే నేను ఆఫీసులో జాయిన్ అయ్యాను” చెప్పాడు మేరు.

“సెలవుల్లో ఎక్కడ గడిపారు?”

“నాకు ఈ మధ్యనే వివాహం జరిగింది.”

టోని శుభాకాంక్షలు తెలుపుతూ… . ‘బిగ్ గై’ అంటూ మేరుని కౌగిలించుకొన్నాడు.

అతను అభినందించిన పద్ధతికి.. మేరు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు.

వీడ్కోలు తీసుకుంటూ, “మేరు, ఇంకా ఆ కలల ప్రపంచంలోనే వున్నారా? లేక తేరుకున్నారా?” అని టోనీ అన్న మాటలతో మేరు ఆలోచనలకి జారుకున్నాడు.

కల..

మొదటి రాత్రి నాడు శిల్పని కూడా తన కలల ప్రపంచంలోకి తీసుకు వెళదామనుకొన్నాడు మేరు. శిల్ప అతని మెత్తని కౌగిలిని అంగీకరించింది కానీ,  కలల గురించి మాట్లాడానికి తిరస్కరించింది.

“మేరు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీ సుఖదుఃఖాలని సమానంగా పంచుకోవాలనుకుంటున్నాను.. మీ కలలని మీవిగానే వుండనివ్వండి..” అంటూ మృదువుగా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏది ఎలా వున్నా, శిల్పని తనదానిగా చేసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు.

టోని మాటలతో కదలిన జ్ఞాపకాలని వదిలించుకుంటూ మెల్లగా ఆఫీసు ఫైళ్ళలో నిమగ్నమవడానికి ప్రయత్నించాడు మేరు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here