Site icon Sanchika

కాంచన శిఖరం-5

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[పెళ్ళి నిశ్చయమయ్యాకా, ఒకరోజు సాయంత్రం బయటకి వెళ్దామని – శిల్ప పని చేసే బ్యాంకు వద్దకి వెళ్తాడు మేరు. ఒక గంట పర్మిషన్ తీసుకుని బయటకి వస్తుంది శిల్ప. పార్కింగ్‍లో డజన్ల కొద్దీ స్కూటర్ల మధ్య తన కోసం ఎదురు చూస్తున్న మేరుని – ‘హలో మేరు కాంచన గారు’ – అంటూ పలకరిస్తుంది. మేరు అని పిలవండి చాలు అంటాడు. తనకా పేరు ఎందుకు పెట్టారో చెబ్దామని అనుకుంటాడు, కానీ అది సమయం కాదని ఊరుకుంటాడు. తనతో పాటు బైక్ మీద రావడం ఇబ్బందైతే, ఆటోలో వెళ్దాం అంటాడు. ఇబ్బందేం లేదు, బైక్ మీద వస్తానని చెబుతుంది శిల్ప. బిర్లామందిర్ వెళతారిద్దరూ. ప్లానెటోరియం పక్కన ఉన్న కెఫెటేరియాలో కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటారు. అయితే అసలు విషయానికి వచ్చే ముందు  అవి పలకరింపు కబుర్లని ఇద్దరికీ తెలుసు. తరువాత వెళ్ళి, ప్లానెటోరియం దగ్గరలో వున్న ఎత్తైన పెద్ద రాయి పక్కన కూర్చుంటారిద్దరూ. ఆమె తనకి, ఇంట్లో అందరికీ నచ్చిందని చెప్తాడు మేరు. తనకీ ఇష్టమేననీ, పొద్దున్నే మీ అక్క కవిత నాతో మాట్లాడారు అని చెప్తుంది. తనకి శిల్ప ఎందుకంతగా నచ్చిందో చెప్పబోతాడు మేరు. అందం, డిగ్రీ, బ్యాంకు ఉద్యోగం ఉన్నాయి కాబట్టి తాను ఎవరికైనా నచ్చుతాను అని అంటుంది శిల్ప. అది కాదని చెప్పి, తనకీ శిల్పకీ జన్మజన్మల బంధం ఉన్నట్టు తాను భావిస్తున్నాని అంటాడు మేరు. తనకి అలాంటి భ్రమలు లేవంటుంది శిల్ప. శ్రీశైలం తవ్వకాలలో తనకి దొరికిన శిల్పం తల గురించి, ఆ శిల్పం మొహంతో శిల్ప పోలికల గురించి, తన కల గురించి.. అంతా పూస గుచ్చినట్లు వివరిస్తాడు మేరు. తాను ఇవన్నీ నమ్మలేనంటుంది శిల్ప. తాను అతని ఊహలకి ఆ శిల్పానికి కొద్దిగా దగ్గరగా వుండి వుండవచ్చు కానీ, ఊహల్లో బతికే అమ్మాయిని కాను అంటుంది.  తను గీసిన ఆ శిల్పం బొమ్మని చూపిస్తానంటాడు మేరు. తాను కిటికి ముందు కూర్చుని నోట్లు లెక్క పెట్టుకొనే బ్యాంకు ఉద్యోగిననీ, తనతో జీవితం సంతోషంగా గడపగలరా అని మేరుని ప్రశ్నిస్తుంది. ఔనన్నట్టుగా ఆమె చేయందుకుంటాడు మేరు. పెళ్ళికి నెల రోజులు సెలవు పెట్టిన మేరు, ఆఫీసుకు రాగానే ‘డా. టోనీ లెపంటో’ అనే అమెరికన్‍ని పరిచయం చేస్తారు. అతను పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉంటాడు. తన పేరు చెప్పగానే, మీ దేశంలోని ఒక గొప్ప పర్వతం పేరు కదా అంటాడు టోనీ. అతను టెక్సస్ ఆర్కియాలజికల్ రీసర్చ్ లేబొరేటరీ నుంచి వచ్చాడని తెలుస్తుంది. శ్రీశైలం పని తాత్కాలికంగా ఆపేశామని, రమణ మరిన్ని వివరాలు సేకరించేదాకా, మేరుని హైదరాబాదు ఆఫీసులోనే ఉండమని చెప్తారు చారీగారు. శ్రీశైలం సైట్‍లో దొరికిన కళాఖండాలన్నింటికీ నెంబర్లు వేశావా, అవి సుమారు నూటయాభై ఉంటాయా అని అడుగుతారు. తాను దాచిన శిల్పాని విడిచి, 132 ఉన్నాయని చెప్తాడు మేరు. టోనీని మేరుతో మాట్లాడమని, శ్రీశైలం లేదా హంపీ వెళ్ళడానికి ప్లాన్ వేయడానికి మేరు సాయం చేస్తాడని చెప్పి చారీగారు వెళ్ళిపోతారు. టోనీని తన గదికి తీసుకువెళ్తాడు మేరు. వాళ్ళిద్దరూ ఈజిప్టు నాగరికత గురించి, పిరమిడ్‍ల గురించి, రాజుల గురించి చర్చించుకుంటారు. కాసేపయ్యాకా తాను వెళ్తాలని బయల్దేరుతాడు టోనీ. మాటల్లో తనకి ఈ మధ్యే వివాహం అయిందని మేరు చెబితే అభినందనలు చెప్తాడు టోనీ. ఇంకా ఆ కలల ప్రపంచంలోనే ఉన్నారా, తేరుకున్నారా అని టోనీ అడిగిన ప్రశ్నకు శిల్ప గుర్తుకు వస్తుంది. తొలిరేయి నాడు తన కల గురించి చెప్పబోతే, శిల్ప సున్నితంగా వారించిన సంగతి జ్ఞప్తికి వస్తుంది. ఆమె జ్ఞాపకాలను తొలగించుకుంటూ, ఆఫీసు ఫైళ్ల మీద దృష్టి పెడతాడు మేరు. – ఇక చదవండి.]

అధ్యాయం 9

[dropcap]“శి[/dropcap]ల్పా, నేను ఆఫీసు పని మీద హంపి వెళుతున్నాను. నువ్వు కూడా రాకూడదు” అడిగాడు మేరు శిల్పని, తన ఉత్సాహాన్ని దాచుకుంటూ.

“కుదరదు మేరు, బ్యాంకులో చాలా పని వుంది. ఆడిటర్స్ వచ్చారు, ఈ సమయంలో పని వదిలేసి రాలేను. ఏమి అనుకోకు” అంది. “అయినా పాడుపడిపోయిన ప్రదేశాలు, శిథిలమైన నిర్మాణాలు చూడడానికి నాకు అంత ఉత్సాహం లేదు” చెప్పింది కాస్త సంకోచంగా.

శిల్ప మాటలకి మేరు చాలా నిరుత్సాహపడ్డాడు.

“పాడుపడిపోయిన, శిధిలమైన అని ఒక్క మాటతో అంతటి చరిత్ర తుడిచిపెట్టేయకు.. ఓ గొప్ప నాగరికతకి అది సాంస్కృతిక కేంద్రం! అటు ఆంధ్రులకు ఇటు కన్నడిగులకు గర్వకారణం తెలుసా?” అన్నాడు మేరు.

“ఒకప్పుడు కావచ్చు. ఇప్పుడు కాదుగా. అయినా మేరు, శిధిలాలు అన్న మాట వాస్తవం. అవి పూర్వ వైభవాన్ని చాటి చెబుతాయి. అప్పటి కాల పరిస్థితులను తెలుసుకోవాలనుకునే  ఉత్సాహం, ఆసక్తి వున్న నీలాంటి వాళ్ళకి ఆ శిధిలాలు పనికొస్తాయి. కానీ నాలాంటి వాళ్ళకి చరిత్ర అంటే తేదీలూ, సంఘటనలు మాత్రమే..”

“శిల్పా నువ్వు అలా అనుకుంటావేగాని నిజంగా నువ్వు ఇష్టంగా చూస్తే అప్పుడనిపిస్తుంది చరిత్రకి ఒక అర్థం వుందని.. అది మన భవిష్యత్తుకి పునాది కూడా అవుతుంది.. నువ్వు వాటిని చూడలేదు కాబట్టి అలా అనుకుంటున్నావు.. ఒక్కసారి నా దృష్టితో వాటిని చూడు. అప్పుడు నువ్వే నా కన్నా ఎక్కువగా ఇష్టపడతావు! ఇప్పటికీ ఆ పట్టణం దేవాలయాలకి ప్రసిద్ధి చెందినది. ఎంతో మంది టూరిస్టులు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ ఉన్న రామాలయాన్ని, విరూపాక్ష ఆలయాన్ని సందర్శిస్తారు.”

“నువ్వంతగా చెబుతున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. కాని ఇప్పుడు కాదు” అంది శిల్ప మేరు నిరుత్సాహాన్ని పోగొడుతూ.

శిల్ప కోడలిగా ఆ ఇంట్లో అందరి మన్ననలు పొందింది. మేరు తల్లి గంగమ్మకి కోడలు అంటే చాలా ఇష్టం. రుక్కమ్మగారికి సరేసరి, పొరపాటున కూడా వంట ఇంటికి రానిచ్చేది కాదు. అసలు ఆవిడకి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ స్వతంత్రంగా బ్రతికే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే శిల్పని ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది.. ఆ కాలం నాటి ఆడవాళ్ళ కష్టాలు, అణిచివేత గురించి చెబుతూ ఉండేది.. ఇలా శిల్ప అటు తల్లితండ్రుల, ఇటు అత్తమామల ప్రేమ అనురాగాలతో హాయిగా గడిపేస్తుంది.

శిల్ప సమాధానపరిచినా మేరుకి ఎక్కడో అసంతృప్తి. తాను పిలిచినప్పుడు రాకుండా ఎప్పుడో వస్తాననడం తనని సంతృప్తి పరచడం కోసమే.. ఎందుకో ఇద్దరి మధ్య సరైన అవగాహన కుదరటం లేదు. అయినా శిల్ప తనని ఎప్పటికైన తప్పకుండా అర్థం చేసుకుంటుందని నమ్మకం. తను ఎప్పుడు శిల్ప సుందరి విషయం, దానికి ఆమెకి గల పోలికలు గురించి చెప్పినా పెద్దగా ఆసక్తి చూపించదు. కాని భుజం మీద వాలిపోయి అతని మాటలు వింటూ వుంటుంది.

హంపీ ప్రయాణం డా. టోనీ లెపంటో గురించే ఏర్పాటు చేయబడింది. మేరుకు టోనీ అంటే చాలా ఇష్టం. అతడు చరిత్ర సంస్కృతుల పట్ల విషయ పరిజ్ఞానం గల వ్యక్తి.. నిజానికి ఈ ప్రయాణానికి పురిగొల్పింది రమణ. శ్రీశైలం సైట్‍ తవ్వకాలలో కనిపెట్టిన ‘మెట్ల బావి’ వద్ద లభించిన శాసనాన్ని పోల్చేందుకు హంపీకి బయల్దేరదీశాడు. ఆ ప్రాజెక్టుకి లీడర్ మేరుయే కాబట్టి, ఈ ట్రిప్‌కి రాగలిగాడు.

హంపీ ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో ఉంది. అది విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. కృష్ణదేవరాయల పరిపాలనలో ఈ నగరం వైభవం గురించి కవులు, చరిత్రకారులు ఎంతగానో ప్రశంసించారు. భారతదేశ చరిత్రలో అది ఒక స్వర్ణయుగం. ఆ యుగంలో ముత్యాలు, పగడాలను రాశులుగా పోసి బజారులో అమ్మేవారుట. పాడి పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉండేదట. రాజుల ప్రేమాభిమానాలతో ప్రజలు సుఖసంతోషాలతో తులతూగేవారట.

ఇప్పటికి అక్కడి పచ్చటి పొలాలు, పైర్లు చూస్తే ఆ భూమి సారవంతమైనదని అర్థమవుతుంది. చుట్టూ ఎత్తైన దుర్భేద్యమైన కొండలు. అవి ఆ రాజ్యానికి ప్రకృతి సహజంగా ఏర్పడిన దుర్గంగా నిలబడి ఉన్నాయి.

జీపు తుంగభద్ర రిజర్వాయర్ దగ్గర నుంచి వెళుతోంది.. తుంగభద్ర రిజర్వాయర్ చాలా పెద్దది. హోస్పేట నుంచి గుండ్రంగా వంపు తిరిగిన దారి కొండల క్రింద భాగానికి చేరుకుంటుంది. కనుచూపు మేర వున్న పెద్ద పెద్ద కొండలు ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయి. వాటిని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సహజసిద్ధమైన ఆ కొండలు ఎవరో తీరిగ్గా నిర్మించిన నిర్మాణాల్లా అనిపిస్తాయి.

“ఆ దూరంగా కనిపిస్తున్న భవనాలు ఏమిటి?” ఉత్సుకతతో అడిగాడు టోని.

“అది ‘కన్నడ విశ్వ విద్యాలయం’. కన్నడ భాష అధ్యయనం కోసం ప్రభుత్వం నిర్మించింది” చెప్పాడు రమణ.

“కన్నడ లేక కర్నాటక?” అడిగాడు టోని.. రెండు వేరు వేరునా లేక ఒకటేనా అనే ఉద్దేశంతో.

“కర్నాటకలో మాట్లాడే భాష కన్నడ. ఆంధ్రప్రదేశ్‍లో తెలుగు, తమిళనాడులో తమిళం. ఈ కన్నడ విశ్వవిద్యాలయం రాష్ట్ర భాషని, సంస్కృతిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.”

“ఇది విభిన్న సంస్కృతుల పరిమళం.. అందుకే నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం” అన్నాడు ఎంతో ఇష్టంగా అభిమానంగా డా. టోనీ లెపెంటో.

“అమెరికా కూడా విభిన్న సంస్కృతులు కల దేశమేగా”

“నిజమే. కానీ బహుళ జాతీయులు వలస రావడం వల్ల మా దేశంలో ఆ వైవిధ్యం! ఇక్కడ అలా కాదు. విభిన్న సంస్కృతులు ఇక్కడే పుట్టి పెరిగాయి. అందుకే ప్రతీ సంస్కృతి సముదాయం. విశిష్టమైనది, ఆసక్తికరమైనది.”

గవర్నమెంటు గెస్టుహౌస్ చేరుకునే సరికి రాత్రి పదకొండు గంటలు అయింది. స్నానాలు చేసి, తేలికగా భోజనం చేసి, ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. రమణ ముందుగానే గదులు రిజర్వు చేసి వుంచాడు.

***

“గుడ్ మార్నింగ్” అంటూ టోనీ పలకరింపుతో మర్నాడు ఉదయం మేరు నిద్ర లేచాడు. అప్పటికే  ఆ రోజు ప్రయాణానికి టోనీ పూర్తిగా సిద్ధం అయిపోయాడు. షార్ట్స్, కాన్వాస్ టి షర్టు, మెడలో కెమరాతో.. ఓ టూరిస్ట్‌లా ఉన్నాడతను.

“తుంగభద్రానది దాక నడిచి వెళ్ళాను.. తుంగభద్ర పేరు కరక్టేనా? అప్పటికే కొందరు స్నానాలు కూడా చేస్తున్నారు” చెప్పాడు టోని.

“ఆ ప్రదేశాన్నే ‘చక్ర తీర్థ’ అంటారు. ఈ రోజు ‘నిండు పౌర్ణమి’. అందునా కార్తీక పౌర్ణమి. చాలా విశిష్టమైన రోజు. భారతీయులకి ఇది చాల పవిత్రమైన రోజు. ఈ రోజు నదిలో స్నానం చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు.” అన్నాడు మేరు.

“నిజంగా? అయితే నేను తప్పకుండా ఈతకొట్టాల్సిందే. అది కుదరకపోతే ఒక్క మునక అయిన మునగాలి” అన్నాడు టోని.

ముగ్గురు జీపు ఎక్కేరు. జీపు చాలా ఇరుకు సందుల వెంట వెళుతుంటే రమణ దారి చెబుతున్నాడు. మేరు రమణ చాలా ఆలయాలు చూపించారు టోనికి. విరూపాక్ష దేవాలయం, హజారా రామ దేవాలయం, కృష్ణ దేవాలయం! నిజానికి అక్కడ హిందువులకి పవిత్రమైన అందరు దేవుళ్ళు కొలువై ఉన్నారనే చెప్పాలి. చూస్తున్న కొద్దీ అబ్బుర పడిపోయాడు టోని. పెద్ద పెద్ద గ్రానైట్ రాతి గోడలు, కళాఖండాలు గల ముఖద్వారాలు, వాటి మీద చెక్కబడిన పనితనం.. ప్రకృతి సహజంగా, సున్నితంగా కొండల మధ్యలో చిన్న దేవాలయంగా మలచబడ్డాయి.

“ఓహ్, ఏమిటది? పాక్షికంగా ధ్వంసం చేయబడినా, ఎంత ఆందంగా వుందీ శిల్పం!”

“ఇది ఏకశిలా గణపతి, ఇలాంటివి ఇంకా రెండు వున్నాయి – కడలేకాలు గణేశ, సాసివేకాలు గణేశ విగ్రహలు. వీటిని విజయనగర రాజులు నిర్మించారు. 14వ శతాబ్దంలో పొరుగు రాజ్యాల ముస్లిం పాలకులు దండెత్తి వచ్చి, వీటిని ధ్వంసం చేశారు”

“చాలా బాధగా వుంది, ఎందుకంత మూర్ఖత్వం? మరి ఈ కోతి ఏమిటి? దీని చుట్టూతా వున్న డిజైన్లు ఏమిటి?” అడిగాడు టోని.

“ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామిని ‘యంత్రోద్ధారక’ అని పిలుస్తారు. ఆయన మంత్రబద్ధమైన స్వస్తిక్ చిహ్నంలో వుండి నగరాన్ని  దుష్టశక్తులనుండి ఎల్లవేళలా కాపాడుతాడని నమ్మకం.”

జీపు ఆగింది. కొన్ని శిలలను అధ్యయనం చేయాలని రమణ వెళ్ళిపోయాడు. టోని, మేరు ఇద్దరు నడుద్దామని అనుకున్నారు.

ఇద్దరూ నడుస్తూ – తాము తవ్వకాలలో సేకరించిన పురాతన వస్తువుల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, పురాతత్వశాస్త్రం గురించి చర్చించుకుంటూ ముందుకు సాగారు. మేరు విజయనగర సామ్రాజ్యం యొక్క ‘స్థల పురాణా’న్ని వివరిస్తూ ఈ విజయ నగర సామ్రాజ్య స్థాపనకు మూల కారణాలు సోదరులు హక్క, బుక్కరాయల గురించి చెప్పాడు.

“మీరు ఇప్పటికి వారిని తలచుకుంటూ, సజీవంగా ఉంచుతున్నందుకు చాలా సంతోషం” అన్నాడు టోని.

టోని తను రెండు నెలలు భారతదేశంలో ఎక్కడ ఎక్కడ పర్యటించేది వివరించాడు.. ముందుగా జైపూర్, ఉజ్జయిని, ఆగ్రా ఉత్తర భారతదేశం చూసాక దక్షిణంలో వున్న రామేశ్వరం కన్యాకుమారి చూడాలనుకున్నట్లు చెప్పాడు. అతడు భారతదేశం రాకముందే చాలా విషయాలు సేకరించుకొని వచ్చాడు. భారతదేశంలో తన పర్యటన జ్ఞాపికలుగా కొన్ని ప్రాచీన కళాఖండాలను కొనిపెట్టమని కూడా అడిగాడు.

“ఈ యాంటిక్స్ మీద నాకు అంత అవగాహన లేదు, నా స్నేహితుడు, జి.వి.ని అడుగుతాను. అతనికి ఇలాంటి వాటి మీద చాలా ఆసక్తి. కాని అతనిని కలసి చాలా రోజులైయింది. హైదరాబాదు వెళ్ళగానే అతనిని కలవాడనికి ప్రయత్నిస్తాను” అన్నాడు మేరు.

చాలా తొందరగా రోజు గడిచిపోయింది. రాత్రి భోజనాలు అయ్యాక రమణ, టోని లాంజ్‌లో తీరిగ్గా కూర్చుని రాజకీయాలు, సినిమాల గురించి చర్చించుకొన్నారు. మేరు తన గదికి వెళ్ళిపోయాడు,  ఆఫీసు ఫైల్ నొకదాన్ని జాగ్రత్తగా చూశాడు. తరువాత తనకి నచ్చిన కవితా సంకలనం తీసి చదవడం మొదలుపెట్టాడు. పేజీలు తిప్పుతూంటే.. అతని కళ్ళు అక్షరాల వెంట పరుగులు దీసాయి.

Our two souls therefore, which are one,

Though I must go, endure not yet

A breach, but an expansion,

Like gold to airy thinness beat.

John Donne ఎప్పుడో రాసిన ఆధిభౌతిక గీతాలు చాలా సొగసైనవి. ఎప్పుడు చదివినా మనసుకి హాయిగా అనిపిస్తుంది.

మేరు ఆలోచనలు తన స్వప్నసుందరి ‘శిల్ప’ వైపు మళ్ళాయి. తన భార్య శిల్ప ఎందుకు తేడా ఉంది? ఈ పోలిక కేవలం శారీరక లక్షణాల వరకేనా? ఇంకో శిల్ప ఎవరైనా వుందా? ఆమె నా గురించి ఎదురు చూస్తోందా? ఏదో ఒక రోజు నేను ఆమెని కలుసుకుంటానా?

చదువుతున్న పుస్తకాన్ని మూసి, మేరు గెస్ట్ హౌస్ నుండి బయటికి వచ్చాడు.. కొద్దిదూరం నడిచి నది ఒడ్డుకి చేరుకొన్నాడు. వెన్నెల ధారలు నదిలో పడి అలలపై నృత్యం చేస్తున్నట్లుగా వున్నాయి. పరవశంగా తల ఎత్తి ఆకాశం వైపు చూసాడు. తెల్లటి మబ్బులు, నీలి సముద్రంలో తేలియాడుతున్న ద్వీపాల్లా వున్నాయి. ఆ అందమైన దృశ్యం నుంచి తన కళ్ళని తిప్పుకోలేక పోయాడు. అలాగే నిలుచుని వెన్నెల అందాన్ని తనివితీరా అనుభవిస్తూ వుండిపోయాడు. చల్లగా వీస్తున్న గాలి ఎందుకో అతన్ని వణికించింది. మనసులో ఏదో తెలియని వింత అనుభూతి! వెనక్కి తిరిగి తన గదికి వెళ్ళిపోదామనుకొన్నాడు.

వెనక్కి తిరగ్గానే ఏదో ఆకారం నడిచి రావడం గమనించాడు. అది ఓ మనిషిది. ఒక స్త్రీ తనకి దగ్గరగా వస్తూ కనిపించింది. వెన్నులో నుంచి చలి పుట్టి ఒక్కసారి ఒణికించింది. ఆమె సమీపిస్తుంటే కాలి గజ్జల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. దయ్యమా? భ్రమా? ఆమె మరింత దగ్గరగా వచ్చింది. ఆమె భయంకరి కాదు, ఓ సుకుమారి!

“మేరు..” అన్నది.

సృహ తప్పినట్లు అయింది మేరుకి.

“నన్ను గుర్తుపట్టలేదా? నేను కేతకిని, నేను ప్రభాకర్ నిన్ను శ్రీశైలం ప్రాజెక్టులో కలిసాం కదా!” అందామె.

“ఇంత రాత్రి వేళలో ఇక్కడికి ఎలా వచ్చావు?” అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని అడిగాడు మేరు.

“నేను, మావారు ఇక్కడే గెస్టు హౌస్‌లో వున్నాం” చెప్పింది.

తేలిగ్గా ఊపిరి పీల్చుకొన్నాడు మేరు..

(ఇంకా ఉంది)

Exit mobile version