Site icon Sanchika

కాంచన శిఖరం-8

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[హంపీ అనుభవాలు, అక్కడ కేతకిని కలవడం, వదలని ఆమె ఆలోచనలు సంశయాలతో మానసికంగా అలసిపోయి హైదరాబాదు తిరిగి వస్తాడు మేరు. శిల్పకి నెలలు నిండుతాయి. బాబు పుడతాడని గట్టిగా నమ్ముతుంది. ఒకరోజు కడప నుంచి చంద్రం మేనమామ సుబ్బన్న – మేరుని కలవడానికి ఆఫీసుకు వస్తారు. తను వాళ్ళ ఊరిలో హెడ్‍మాస్టర్‍ని అనీ, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉందని చెప్తారు. తాను ఒక పుస్తకం గురించి సమాచారం సేకరిస్తున్నాననీ, మిమ్మల్ని కలిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చంద్రం పంపించాడని చెప్తారు. ఆయన తీసుకువచ్చిన ఫోటో ఆల్బమ్ చూపిస్తారు. అందులో 108 ఆలయాల ఫోటోలు ఉంటాయి. వీటి గురించి మా డిపార్టుమెంటు వాళ్ళకి తెలుసా అని మేరు అడిగితే తెలుసంటారాయన. ఆ దేవాలయాలను నిర్మించిన రాజు గురించి చెప్తారు. ఆ గుళ్ళని తెరిపించి పూజలు జరిపించే అవకాశం ఏమైన ఉందేమోనని అడుగుతారు. తాను ప్రచురించే పుస్తకం వర్గీకరణలో సాయం కావాలని అంటారు. తనకు వీలైన సాయం చేస్తానని చెప్తాడు మేరు. సుబ్బన్న వెళ్ళిపోతారు. సెలవులో వెళ్ళిన చారీ గారు తిరిగి వస్తారు. మేరుని పలకరిస్తారు. గుజరాత్ తీరంలో ఒక ప్రాజెక్టు వచ్చిందని చెప్తారు. శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు అడుగుతారు. తాను అడిగిన వివరాలన్నిటో ఒక ఫైల్ సిద్ధం చేయమని, మర్నాడు దాని గురించి మాట్లాడుదామని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. శిల్పని ప్రసవం కోసం నర్సింగ్‍హోంలో చేరుస్తారు. పుట్టబోయే బాబుకి శిల్ప – సూర్య అని పేరు నిర్ణయించిన సంగతి, ఆడపిల్ల పుడితే, మేరుని పేరు పెట్టమన్న సంగతి గుర్తొస్తుంది మేరుకి. కాసేపటికి శిల్పకి మగపిల్లవాడు పుడతాడు. శిల్ప అలసిపోయినట్టు కనిపించినా, ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఈ సంగతి అందరికీ చెప్పాలి అని బయల్దేరుతాడు మేరు. – ఇక చదవండి.]

అధ్యాయం 14

[dropcap]మ[/dropcap]ధురమైన సంగీతం ఆకుపచ్చని దోవలనిండా పరచుకుంది. కాలిమువ్వల చప్పుడు, ఘల్లు ఘల్లుమంటూ మృదు మధురంగా దూరం నుంచి సన్నగా వినిపిస్తోంది లయబద్ధంగా.. మేరు నడుస్తూ ఉన్నాడు సంగీతాన్ని వెదుకుంటూ. హృదయాన్ని తాకుతూ మరొక లోకానికి తీసుకువెళ్లే ఆ సంగీతం ఒక మత్తులో పడేసింది.. మత్తులో మునిగిపోతూ ఏదో తెలియని వింత లోకానికి ప్రయాణంలా సాగిపోతోంది. చిన్న చిన్న పొదల నిండా గులాబీరంగు పూలు.. చిట్టి చిట్టి గడ్డిపూలు, ఆకుపచ్చని చెట్లు, చెట్లని అల్లుకొనే తీగెలు మొత్తం మీద ఓ పచ్చని, ఆకుపచ్చని ప్రకృతి అతనిని ఆహ్వానించింది.. మధురమైన సంగీతం ఇప్పుడు స్పష్టంగా ధగధగా వినబడుతుంది, అడవి పిట్టల కూతలు, పలకరింపుల స్వరాలు.. ఇవన్నీ వింటూ మేరు నడుస్తున్నాడు. ఆకాశానంటే చెట్లమధ్యలో నుంచి నిర్మలాకాశం కనిపిస్తోంది.

దూరంగా కొండ మీద పురాతనమైన కోట కనిపించింది. కోటని చూడగానే మేరు సందిగ్ధంలో పడిపోయాడు.. తను ఇక్కడికి ఎలా వచ్చాడనుకుంటూ.. కాని అతన్ని ఇంత దూరం లాక్కొచ్చింది మధురమైన సంగీతమే.. అంతవరకూ వింటున్న పాట ప్రకృతిలో లీనమైపోతూ ఎక్కడికి వెళ్తోందో తెలియలేదు. పురాతనమైన కోటలోకి అడుగుపెట్టగానే గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు.. శక్తి వచ్చినట్టనిపించింది. శరీరం చాలా తేలికగా ఉన్నట్టు, సులువుగా గాల్లో తేలి కోటలోకి వచ్చినట్లు అనిపించింది. కోటలోకొచ్చాక తెలిసింది తాను సరిగ్గా నర్తనశాల లోన అడుగుపెట్టినట్లు. తన కళ్ళని తానే నమ్మలేక పోయాడు. ఆ నర్తనశాల అంతా ఆకుపచ్చని తీగలతో, సువాసనలు వెదజల్లే పూలతో అలంకరించబడి ఉంది. నర్తనశాల మంటపంలో ప్రతీ స్తంభం ఒక కళాఖండంలా వుంది. వాటి మీద చెక్కిన శిల్పాలు అన్నీ విభిన్న నాట్య భంగిమలతో ఉన్నాయి.

అతన్ని ఇక్కడికి తీసుకువచ్చిన ఏదో తెలియని వింత రాగం, ఇప్పుడు బాగా పరిచయం వున్న రాగంలా అనిపిస్తోంది. అది మోహన రాగమా.. లేక అమృతవర్షిణియా.. ఇవేవీ కాకుండా ఓ కొత్త రాగం వినబడుతోంది. హృదయాన్ని తాకుతూ.. నాగస్వరానికి సంబంధించిన గానంలా అనిపించింది… అవును.. పున్నాగ వరాళి. అవును పాముల వాడూ ఊదే నాగస్వరం అది. అది గానంలో మిళితమై అద్భుతంగా వినిపిస్తోంది ఓ కొత్త రాగంలా. ఇంతలో ఘల్లు ఘల్లుమని గజ్జల చప్పుడుతో ప్రత్యక్షమయ్యారు నర్తకీమణులు. కానీ వీళ్ళు రాకముందే వేదిక మీద నాట్యానికి సిద్ధంగా ఉందో నర్తకి. ముందు మేరు ఆ నర్తకిని గుర్తు పట్టలేదు. ఎవరీమే? అనుకొన్నాడు.. అసలు ఎవరి కోసం నాట్యం చేస్తోంది?  అద్భుతమైన సింహాసనాలు ఆ రోజు ఖాళీగా ఉన్నాయి. రాజుగారు లేరు, మహారాణి లేదు.  ఈమే ఆస్థాన నర్తకి కాదా? శరీరానికి అతుక్కుపోయిన వస్త్రధారణ, ఆమె నాట్యభంగిమలకి హుందాతనాన్నిచ్చింది. ఆమె నృత్యం మొదలు పెట్టింది. అది సర్ప నృత్యం. ఆమె రెండు చేతులనీ పడగలా చేసింది. పాములా ఊగిపోతూ శరీరంలో ప్రతీ అవయవాన్నీ కదలిస్తూ మెలికలు తిరుతూ నృత్యం చేస్తోంది. ఆమెతో పాటూ ఉన్న వారంతా కూడా పాములా మెలికలు తిరుగుతూ కదులుతూ నృత్యం చేస్తున్నారు. నాట్యంతో పాటుగా వినిపిస్తున్న సంగీతం హృదయాన్ని తాకుతోంది. పారవశ్యంతో సంగీతాన్నీ నృత్యాన్నీ ఆస్వాదిస్తూ ఉండిపోయాడు మేరు.

నాట్యం చేస్తున్న నర్తకి, నర్తిస్తూ మేరుకి దగ్గరగా వచ్చింది. పాము పడగలా పెట్టుకొనే చేతులు వేగంగా కదులుతున్నాయి. కళ్ళూ, శరీరం మెరుస్తూన్నాయి. ఆమె దగ్గరవుతున్న కొద్దీ ఆమె రూపం స్పష్టంగా కనిపించింది.

ఆమె.. తను ‘కేతకి’. ఛామనఛాయ రంగు.. ఒంటికి హత్తుకునే డేన్స్ డ్రస్. పొందికగా అమరిన వక్షస్థలం. నల్లటి పెద్ద పెద్ద కళ్ళు, పల్చటి పెదవులు. అవును ఈమే కేతకీ. ఇంతలో ఎవరో వస్తున్నట్లు పెద్దగా సందడి.. వెనకాల భటులు తోడు రాగా రాజు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు.. నాట్యాన్నీ అభినందిస్తూ, ఆ రాజు ఎవరా అని చూశాడు మేరు. ఆశ్చర్యం! ఆ రాజు ఎవరో కాదు. తానే.. మహారాజు వేషంలో సింహసనం మీద కూర్చున్నాడు!

నృత్యం సాగుతుంది. కేతకి వాద్యాలకి అణుగుణంగా నాట్యం చేస్తోంది.. ఇంతలో అక్కడ నాట్యం చేస్తూ శిల్ప కూడా కనబడింది. కేతకి వేసుకొనేలాంటి దుస్తులలోనే! కాని శిల్పవి తేనె రంగు కళ్ళు, విల్లంబుల్లా తీర్చిదిద్దినట్లు వున్న కనుబొమ్మలు! కనుబొమ్మలు కదలిస్తూ అద్భుతంగా నాట్యం చేస్తోంది శిల్ప. మరి కేతకి ఏమైంది అనుకుంటూ చుట్టూతా చూశాడు మేరు. మహారాణి సింహాసనం మీద కూర్చుంది కేతకి. అంతవరకూ పున్నాగ వరళిలో నాట్యం అభినయిస్తున్న శిల్ప మోహనరాగంతో నాట్యం చేయడం మొదలు పెట్టింది. శిల్ప చాలా చక్కగా, మెరుపులా నాట్యం చేస్తోంది. మృదువైన సంగీతంతో నాట్యం చేస్తూ చేస్తూ మేరుకు దగ్గరగా వచ్చి..  ఒక్కసారిగా మేరుని కౌగిలించుకుంది శిల్ప.

త్రుళ్ళిపడి లేచాడు మేరు. ఆ తియ్యటి కల ఇంకా వెంటాడుతున్నట్లు ఉంది. మెలుకువ వచ్చినా, కలైనా ఇంకా అయోమయంగా అనిపించింది. నిద్రలో కూడా మేరు చెయ్యి పట్టుకొని ఉన్న శిల్పని చూడగానే కల యొక్క మత్తు వీగిపోయింది. నిశ్చింతంగా తన చేయి పట్టుకొని నిద్రపోతున్న శిల్పని చూసి నిట్టూర్చాడు మేరు. సున్నితంగా నిద్రాభంగం కలుగకుండా శిల్ప చేయిని తన చేతులలోనుంచి విడిపించుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు. ‘సూర్య’ తలగడ నానుకొని నిద్రపోతున్నాడు.

మళ్ళీ తన కొచ్చిన కల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మేరు. అసలు ఈ కలకి అర్థం ఏమిటి? ఏదైనా పూర్వ జన్మ నన్ను వెంటాడుతోందా.. పూర్వజన్మలో తను రాజా? అయితే రాణి ఎవరు? శిల్పనా లేక కేతకియా? ఒకరు రాజనర్తకి.. ఒకసారి కేతకి నర్తకిలా కనిపించింది, మరోసారి రాణిలాగా! కాని శిల్పని నాట్యం చేస్తూంటే స్పష్టంగా చూసాడు.. అసలు ఈ కలలు ఏమిటి?

‘నిన్నంతా కేతకి గురించి ఎక్కువ ఆలోచించాను. అందువల్లా? దీని గురించి శిల్పతో మాట్లాడాలా వద్దా’ ఇలా సాగాయి మేరు ఆలోచనలు. ఇంక నిద్రపట్టలేదు మేరుకి.

అప్పటికే సమయం ఉదయం ఐదు గంటలవుతోంది. సూర్య లేచి, నాన్న కేసి చూసి, నవ్వాడు. నెమ్మదిగా సూర్యని ఎత్తుకుని, పక్కకి తీసుకెళ్ళాడు మేరు, కాసేపయినా శిల్పని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలని.

అధ్యాయం 15

హైదరాబాదులో వున్న ఆర్కియాలజీ ఆఫీసు యథావిధిగా బిజీగా వుంది. సీట్లలో కూర్చుని పనిచేసుకుంటున్నారు. కొంతమంది పైకీ క్రిందకీ దిగుతూ ఫైల్స్ అటూ ఇటూ అందించడంలో నిమగ్నమై వున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు తరువాత మళ్ళీ అంతే ముఖ్యమైన ప్రాజెక్టు ఏదీ మేరుకి రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తాత్కాలికంగా వాయిదా పడింది. అక్కడ జరిగిన తవ్వకాలని చూస్తే అదో పెద్ద దిగుడు బావిలా కనిపిస్తుంది. నాలుగు వైపుల నుంచి మెట్లు నిర్మించారు. కనిపెట్టి తవ్విన సొరంగ మార్గం కొంతవరకు వెళ్ళి ఆగిపోయింది. అక్కడి ఆఖరు కాబట్టి.. అందులో దొరికిన కళాఖండాలన్నీ ఇప్పటికే ఒక చోట చేర్చారు.. వాటిని ఇంకా గుర్తించవలసి వుంది.. వాటి మీద విస్తృతమైన పరిశోధన జరగవలసి కూడా వుంది. అక్కడ దొరికిన నాణెం మాత్రం విజయనగర కాలం నాటిదని గుర్తింపబడింది. దేవాలయం యొక్క నిర్మాణం వాటిమీద వున్న శిల్ప చాతుర్యం గాంధార కళని పోలివున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో దొరికిన ప్రతీ శిల్పము, ప్రతీ కళాఖండము, అపురూపమైనవి. తాను దాచుకొన్న ‘శిల్ప’ యొక్క విగ్రహంలో శృంగారం కన్నా సౌందర్యమే ఎక్కువగా కనిపిస్తుందనుకున్నాడు మేరు. శ్రీశైలం ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ‘ఇక మీదట ఈ ఆగిపోయిన ప్రాజెక్టు గురించి ఆలోచించడం మానేయ్యాలి. ఇప్పుడు ఆలోచించవలిందంతా మేరైన్ ఆర్కియాలజి నుంచి..’ అనుకొన్నాడు మేరు – దానికి కావలసిన సమాచారం అంతా లైబ్రరీలో వచ్చిన పుస్తకాల ద్వారా నోట్సు సిద్ధం చేసుకుంటూ. గుజరాత్ ప్రాజెక్టుకి వెళ్ళబోయేముందు అన్ని సిద్ధంగా వుంచుకోవాలనుకున్నాడు ప్రమాణానికి సిద్ధం అవుతూ మేరు.

“హాయ్ మేరూ” అంటూ చనువుగా లోపలికి వచ్చాడు చంద్రం. “ఎలా వున్నావ్ మేరూ?” అంటూ కుర్చీ లాక్కుని కూర్చుంటూ, “నా పెళ్ళికి వస్తావనుకున్నాను. రాలేదేం? అసలు శుభలేఖ అయినా అందిందా?” అంటూ గబగబ ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నాడు చంద్రం.

చంద్రాన్ని చూసి చాలా ఆనందించాడు మేరు. “నిన్ను చూసి చాలా కాలం అయింది చంద్రం, ముందు కంగ్రాట్స్. పెళ్ళికి రావాలనుకున్నాను. కాని ఆ సమయానికి నేను హంపీలో ‘టోనీ లెపంటో’తో ఉన్నాను. ఆ తరువాత ఆ పెటర్నటీ లీవ్..” అన్నాడు.

“అరె, తండ్రివి కూడా అయ్యావన్న మాట” అన్నాడు చంద్రం సంతోషంగా ఎప్పటిలాగే పెద్ద గొంతుతో.

చంద్రం అంతే, ఏ విషయం చెప్పిన పెద్దగొంతుతో చెబుతాడు. అదొకటే మేరుకు నచ్చదు. చాలా ఇబ్బందిగా వుంటుంది. “మెల్లగా, ప్రతిదానికి ఎందుకలా పెద్దగా మాట్లాడుతావు? సరే గాని ముందు నీ భార్య శైలజ ఎలా ఉందో చెప్పు.”

“శైలజా..? నా భార్య శైలజ కాదు. నేను పెళ్ళి చేసుకుంది గీతని.. అంటే కనీసం శుభలేఖని విప్పి కూడా చూడలేదన్న మాట..” నిష్ఠురంగా అన్నాడు చంద్రం.

కొద్దిసేపు ఏం మాట్లాడలేదు మేరు. “న్యాయంగా అయితే నువ్వు శైలజని అదే మీ మేనమామ కూతుర్ని కదా చేసుకోవాలి” అన్నాడు.

“నిజమే ఒప్పుకుంటాను.. కాని కారణాలు ఏమైనప్పటికీ ఆ ప్రేమ పెళ్ళిదాకా రాలేదు. ఈలోగా మా వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అప్పుడే ఈ గీత అనే అమ్మాయి వాళ్ళకి అన్ని విధాలా నచ్చింది. మా ఇద్దరి జాతకాలు కూడా సరిపోయాయి. నీకు ఇంకో విషయం తెలుసా, ఈ గీత పూర్వజన్మలో కూడా నా భార్యనేనట.. ఆమెతో నాకు అదృష్టం కూడా కలిసి వస్తుందన్నారు”.

ఈ మాటలు వింటున్న మేరుకి ఆలోచనలు మళ్ళీ పూర్వజన్మ మీదకి మళ్ళాయి.. ‘నేను కూడా ఈ పూర్వజన్మ గురించి తెలుసుకుంటాను’ అనుకుంటూ.. “చంద్రా అసలు ఈ జాతకాలు, పూర్వజన్మల గురించి వివరించడాలు నిజంగా నమ్మొచ్చా?” అని అడిగాడు.

“తప్పకుండా. ఇవన్నీ మన నమ్మకాల్ని బట్టి వుంటాయి. అంతే కాకుండా చెప్పే వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానం మీద ఆధారపడి వుంటుంది. నాకు తెలిసినంత వరకు సైన్స్‌కు, జ్యోతిష్య శాస్త్రానికి మధ్య చర్చ వుంటూనే ఉంది. నీకు ఇంకో విషయం తెలుసా.. జరుగుతాయని చెప్పిన సంఘటనలు జరిగిన ఉదంతాలు ఎన్నో చెప్పగలను” అన్నాడు.

“జరుగుతాయని చెప్పి జరగని ఉదంతాలు నేనూ చాలానే చెప్పగలను” అన్నాడు మేరు.

“కానీ, మేరు, వీటన్నింటికీ నమ్మకం ప్రధానం. నీకో ఉదాహరణ చెబుతాను. ఇద్దరు వ్యక్తులు వున్నారనుకో, అందులో ఒకడికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది, ఇంకొకడికి లేదు అనుకుందాం. వాళ్ళ ఇద్దర్ని ఏ. బి. లు అనుకుందాము, వీళ్ళిద్దరూ ప్రముఖ జ్యోతిష్యుడి దగ్గరకి వెళ్ళారు – పుణ్యక్షేత్రాలకి వెళ్లడానికి మూహూర్తం అడగడానికి. ఏ అనే వాడు జ్యోతిష్యుడు పెట్టిన మూహూర్త ప్రకారం బయలుదేరాడు. బి అనేవాడు అసలు మూహూర్తాన్ని పట్టించుకోకుండా దానికి వ్యతిరేకంగా బయలుదేరాడు. ఏం జరిగిందో తెలుసా..? ఏ అనేవాడిని దోపిడి దొంగలు దోచుకున్నారు; బి అనేవాడికి అనుకోకుండా ఓ కుండ నిండా బంగారం దొరికింది”.

“తమాషాగా వుందే. మరి ఈ విషయంలో జ్యోతిష్యుడు చెప్పిందేమిటి?” అడిగాడు మేరు ఆశ్చర్యంతో.

“జోతిష్యుడు చెప్పిందేమిటంటే.. ఏ అనేవాడికి యమగండం ఉంది. కానీ బయల్దేరిన సుముహూర్తం వలన చావుని తప్పించుకొని ఏదో కొద్దిపాటి దెబ్బలు, ధన నష్టంతో బయటపడ్డాడు” చెప్పాడు చంద్రం.

“మరి బి సంగతేమిటి?”

“బి అనేవాడికి ఆ ముహూర్తం వలన చాలా పెద్ద నిధి దొరకవలసి ఉంది, కాని అతను పట్టించుకోకుండా బయలుదేరడం వలన కొద్ది బంగారంతో నిండిన కుండ మాత్రమే దొరికింది” అన్నాడు చంద్రం.

“తర్కం బాగానే ఉంది. కాని చంద్రం, జ్యోతిష్యులు – పుట్టిన సమయం మీద ఆధారపడతారు. మరి పుట్టినప్పుడు నమోదు చేసిన సరైనదో కాదో ఎవరికి తెలుస్తుంది? అలాంటప్పుడు ఈ జాతకాల్ని నమ్మేదెలా?” అన్నాడు మేరు.

“మేరూ, నాడీ జ్యోతిష్కుల గురించి ఎప్పుడైనా విన్నావా? వాళ్ళకి జన్మ స్థలం, జన్మ నక్షత్రం వంటి వివరాలేం అక్కరలేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరకి వెళ్ళు. బొటనవేలి ముద్ర ఉంటే చాలు” చెప్పాడు చంద్రం.

“నిజంగానా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు చంద్రం. నాకు వెళ్ళాలని ఉంది”

“తప్పకుండా. అపాయింట్‍మెంట్ ఫిక్స్ చేసి, నిన్ను తీసుకువెళ్తాను. అయినా మా మామయ్య సుబ్బన్న కూడా జోస్యం చెప్పగలడు. అతనిని కలువు. నేను వచ్చి చాలా సేపు అయింది. నువ్వు చేస్తున్న పనికి అడ్డువచ్చినట్లు ఉన్నా. ఈసారి గీతను తీసుకొని మీ ఇంటికి వస్తాను” అంటూ కుర్చీ లోంచి లేచి నిలబడి, “వుంటాను మళ్ళీ కలుద్దాం” అంటూ వెళ్ళిపోయాడు.

చంద్రం వెళ్ళిపోగానే ఆ నాడి జ్యోతిష్యుడి గురించి ఆలోచించాడు మేరు. ‘అతని దగ్గరకి వెళితే నేను వెతకబోయే వాటికి సమాధానాలు తెలుస్తాయా.. నేను అనుకొన్నట్లుగా నేను మహారాజునేనా? అయితే నా రాణి ఎవరు? శిల్పా? లేక కేతకియా? నా కలలరాణి శిల్పని ఈ జన్మలో కలుస్తానా? నా గురించి ఆమె ఎదురు చూస్తుంటుందా’.

ఇలా ఆలోచిస్తూనే మెరైన్ ఆర్కియాలజీ పుస్తకాన్ని తిరగవేస్తున్నాడు మేరు.

***

సూర్య ఎదుగుతున్నాడు.. పాకడం నేర్చుకొన్నాడు. ఇల్లంతా పాకుతూ తిరుగుతూంటాడు. వాడ్ని చూస్తూంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది.. నిల్చుంటే చాలు కాళ్ళ పట్టుకొని నిలబడ్డానికి ప్రయత్నిస్తాడు. ఎత్తుకొన్నా సరే ఒక దగ్గర ఉండడు. వెంటనే చేతుల్లోంచి క్రిందికి దూకడానికి ప్రయత్నిస్తాడు.. ఒక చోట కుదురుగా ఉండదు.. మెరుస్తున్న కళ్ళు, గుండ్రటి పాలబుగ్గలతో, ముద్దుల మూటగట్టే సూర్యుని చూడడానికి రెండు కళ్ళు చాలవు. మేరుకి సూర్య అంటే చాలా ఇష్టం. మేరు అమ్మనాన్నా కవితని చూడడానికి వెళ్ళారు. శిల్పకి సహాయంగా మేరు సూర్యతో ఎక్కువగా గడపుతున్నాడు. ఆడుకొని, ఆడుకొని అలసిపోయి, అలా నేల మీదే నిద్రపోయాడు సూర్య.

‘అయ్యో పాలైన తాగకుండా ఎలా నిద్రపోయాడో’ అనుకుని సూర్యని ఒడిలోకి తీసుకొని వాడి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది శిల్ప. మంచం మీద పడుకోబెట్టింది. అంత పెద్ద మంచం మీద వాడి కోసం స్థలం ఉంచినా సరే, వాడు పాక్కుంటూ, నిద్రలో దొర్చి దొర్చి ఇద్దర్ని ప్రక్కకి తోసేసి, విశాలంగా తనొక్కడే అయినట్లు పడుకుంటాడు. వాడ్ని చూసి ఇద్దరు నవ్వుకుంటారు.

“చూసావా శిల్పా, వీడు మనిద్దరి జాగా అంతా వాడికే కావాలి అన్నట్లు పడుకుంటున్నాడు.. వీడి కోసమైనా – వాడు దొర్లి పోకుండా వుండడానికైనా – మనమిద్దరం దగ్గర దగ్గరగా పడుకోవాలి. అవునా?” కొంటెగా అడిగాడు మేరు..

శిల్ప ఏం జవాబు చెప్పలేదు. శిల్ప లేత గోధుమ రంగు నైటీ వేసుకుంది. ఆ స్లీవ్‌లెస్ నైటీలో ఆమె తెల్లని పొడవైన చేతులు మెరుస్తున్నాయి. బాబుకి ఇంకా పాలు ఇస్తుండం వల్ల నిండుగా బిగుతుగా ఉన్న వక్షస్థలం కవ్విస్తూ కనిపించింది.

తననే చూస్తూనే మేరు చూపులను కనిపెట్టిన శిల్ప “ఏయ్! క్యా బాత్ హై” అంది కొంటెగా, మంచం మీద మేరుకి దగ్గరగా పడుకుంటూ.

మేరు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొన్నాడు. “అందమైన అమ్మాయీ, బంగారు కొండ, నువ్వు నా అదృష్టదేవతవి తెలుసా” అన్నాడు గుసగుసగా, తమకంగా ఆమె చెవిలో. తన ముక్కుతో ఆమె బుగ్గలని రాస్తూ.. మంచి మూడ్ లోకి వెళ్ళిపోయాడు మేరు.

ఏదో గుర్తుకొచ్చిన దానిలా.. “ఉండు మేరూ, నీకో గమ్మతైన విషయం చెప్పాలి..” అంది మేరు బిగికౌగిలి నుంచి తప్పించుకొని. దిండుని ఆనుకుని, తన ముఖాన్ని అరచేతుల్లో ఉంచుకుని ఏదో చెప్పబోయింది.

“అదేం కుదురదు” అంటూ, “ఇంతకన్నా మంచి విషయం నాకీ ప్రపంచంలో ఏది ఉండదు” అన్నాడు మేరు గోముగా.. ఇంకా దగ్గరగా జరుగుతూ హత్తుకుపోతూ.

“అబ్బ, ఉండు మేరు.. నాకో విచిత్రమైన కల వచ్చింది. నీకు చెప్పడం కోసం ఎదరు చూస్తున్నాను.. వినవూ ప్లీజ్” అంటూ బ్రతిమాలింది.

మేరుని పట్టించుకోకుండా చెప్పడం మొదలు పెట్టింది. “మేరూ, నేను రాజనర్తకినట. రాజుగారి విశాలమైన ఆస్థానంలో నృత్యం చేస్తున్నానట.. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా, ఆ మహారాజు ఎవరో కాదు నువ్వే” అంది కిలకిలా నవ్వుతూ.

మేరు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఇది తనని వెంటాడుతున్న కల. ఇదెలా సంభవం. ఒకే కలని ఇద్దరం ఒక్కలాగే కనడం సాధ్యమా.. ఆలోచిస్తున్న మేరుని కుదిపింది శిల్ప “వింటున్నావా” అంటూ.

“వింటున్నాను చెప్పు. శిల్పా, నువ్వు ఒకర్తివే నాట్యం చేస్తున్నావా? ఇంకెవరైనా వున్నారా?” అడిగాడు.

నేనొక్కదాన్నే కాదు. నాతోపాటు చాలా మంది నాట్యం చేస్తున్నారు. కాని.. ఇంకొక నర్తకి నన్ను గెలవాలని నాతో పోటీపడి నాట్యం చేస్తోంది..” చెప్పింది.

“ఎవరు?” అన్నాడు చాలా ఆసక్తిగా.

“ఏమో నాకెలా తెలుస్తుంది? అయినా అది కల కదా. చెప్పాలనిపించింది. చెప్పాను. ఎందుకంటే ఈ కల గమ్మత్తుగా ఉంది కనక.. తెలుసాండీ మహారాజు గారూ” అంటూ మేరు గడ్డం మీద ముద్దు పెట్టుకుంది.

‘నిజంగా నేను మహారాజునా? ఇది నన్ను పూర్వజన్మ వైపుకి తీసుకువెళుతుందా.. శిల్ప రాజనర్తకా? నేను ఆమెని ప్రేమించానా.. మరి కేతకి ఎవరు? ఎంత కాలం ఈ స్వప్నాలతో జీవించడం, ఎందుకీ తపన.. దేని కోసం నా అన్వేషణ? ఈసారి తప్పకుండా నాడీ జ్యోతిష్యుడికి కలవాలి’ అనుకున్నాడు మేరు.

ఆ రాత్రి మేరుకి నిద్ర దూరం అయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version