Site icon Sanchika

కాంచన శిఖరం-9

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[మధురమైన సంగీతం వినబడుతూ ఉంటుంది. మేరు నడుస్తుంటాడు. దూరం నుంచి కాలిమువ్వల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంటుంది. ఏదో పారవశ్యంలో నడుస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాడు మేరు. దూరంగా కొండ మీద ఒక కోట కనిపిస్తుంది. ఆ కోటలోకి అడుగుపెడతాడు, అతడు చేరిన చోటు నర్తనశాల. అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. అక్కడి శిల్పాలు విభిన్న నాట్య భంగిమల్లో ఉంటాయి. ఇంతకుముందు దాకా వినిపించిన రాగం కాకుండా, ఇప్పుడు మరో రాగం వినిపిస్తుంది. అక్కడికి ఇంకా మహారాజు, రాణిగారు రాకపోయినా – ఒక నర్తకి వచ్చి వేదికపై నర్తిస్తుంది. అ ఆమెతో వచ్చిన నాట్యకత్తెలందరూ నాట్యం మొదలుపెడతారు. మేరు ఆ నృత్యాన్ని, గానాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రధాన నర్తకి మేరుకి దగ్గరగా వస్తుంది. ఆమెని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆమె కేతకి. ఈలోపు రాజు వచ్చి సింహాసనంపై కూర్చుంటాడు. నాట్యాన్ని మెచ్చుకుంటాడు. ఆ రాజు ఎవరా అని చూస్తాడు మేరు. ఆశ్చర్యం. ఆ రాజు ఎవరో కాదు.. మేరునే. ఇంతలో నాట్యం చేసేటప్పుడు వేసుకునే దుస్తులు ధరించి అక్కడ శిల్ప ప్రత్యక్షమవుతుంది. ఆమె కూడా గొప్పగా నాట్యం చేస్తుంది. కాసేపయ్యాకా, శిల్ప వచ్చి మేరుని కౌగిలించుకుంటుంది – త్రుళ్ళిపడి నిద్ర లేస్తాడు మేరు. ఇదంతా అతని కల. అతని నిద్రమత్తు వదిలిపోతుంది. పక్కన శిల్ప, బాబు హాయిగా నిద్రపోతుంటారు. ఆ కల గురించి ఆలోచిస్తాడు మేరు. పూర్వజన్మలో తాను రాజా? మరి రాణి ఎవరు? కేతకినా లేక శిల్పనా? అసలు ఈ కల ఏంటి అనుకుంటాడు. నిన్నంతా కేతకి గురించే ఎక్కువగా ఆలోచించాను కాబట్టి ఆమె కలలోకి వచ్చుంటుంది అనుకుంటాడు. తన కల గురించి శిల్పకి చెప్పాలా వద్దా అనుకుంటాడు. మర్నాడు ఆఫీసులో చంద్రం కలుస్తాడు. తన పెళ్ళికి రాలేదేమని మేరుని అడుగుతాడు. తాను ఆ సమయంలో హంపీలో టోనీ లెపంటోతో ఉన్నానని చెప్తాడు మేరు. తర్వాత పెటర్నిటీ లీవులో ఉన్నానని అంటాడు. తండ్రి అయినందుకు అభినందిస్తాడు చంద్రం. నీ భార్య శైలజ ఎలా ఉంది అని మేరు అడిగితే, తాను శైలజను పెళ్ళి చేసుకోలేదని గీత అని వేరే అమ్మాయిని చేసుకున్నానని చెప్పి, అందుకు కారణం జాతకాలని, గీత పూర్వజన్మలో కూడా తన భార్యనని జ్యోతిషులు చెప్పారని వివరిస్తాడు. తన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకుంటాడు మేరు. నాడీ జ్యోతిష్కుల వద్ద ప్రయత్నిద్దామని అంటాడు. నీకు తెలిసినవాళ్ళుంటే చెప్పు, వెళ్దామని అంటాడు మేరు. సూర్యకి పాకడం వస్తుంది. ఇల్లాంత తెగ తిరుగుతుంటాడు. ఒకచోట కుదురుగా ఉండడు. మేరు కొడుకుని ఆడిస్తూంటే, కాసేపు ఆడుకుని బాబు అక్కడే నేల మీద నిద్రపోతాడు. శిల్ప వచ్చి బాబుని మంచం మీద పడుకోబెడుతుంది. ఉన్నట్టుండి ఆమెకో విషయం గుర్తుకొస్తుంది. తనకి వచ్చిన విచిత్రమైన కల గురించి మేరుకి చెప్తుంది. ఆ కలలో ఆమె రాజనర్తకి. రాజాస్థానంలో నాట్యం చేస్తూ ఉందట. రాజు ఎవరో కాదు, మేరూనే అట. ఇంకో నర్తకి తనతో పోటీ పడి నాట్యం చేసిందట! ఆమె ఎవరో తెలుసా అని అడుగుతాడు మేరు. తనకెలా తెలుస్తుంది అంటుంది శిల్ప. తనకి వచ్చిన కల లాంటిదే శిల్పకి కూడా రావడం మేరుకి ఆశ్చర్యం కలిగిస్తుంది. తప్పకుండా నాడీ జ్యోతిష్యుడిని కలవాలని అనుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 16

[dropcap]“రా[/dropcap]బర్ట్ క్రిస్టన్ అనే వ్యక్తి పురాతన వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ యు.ఎస్‍.లో ఉన్న జె.ఎఫ్.కె ఎయిర్‌పోర్టులో దొరికిపోయాడు. దొరికిన ఆ విగ్రహాలు భారతదేశానికి చెందినవని, అవి 13వ శతాబ్దానికి చెందినవని అధికారులు వాటిని సీజ్ చేసారు. వాటిల్లో దేవతా విగ్రహాలైన విష్ణువు, గణేష్. మరికొన్ని నాట్యం చేస్తూనే విగ్రహాలు ఉన్నాయి. వాటి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో యాభైవేల డాలర్లు వుండవచ్చని అంచనా. రాబర్ట్ క్రిస్టన్ తన తప్పుని ఒప్పుకొన్నాడు. పైగా ఈ స్మగర్ల ముఠా జాతీయ అంతర్జాతీయంగా విస్తరించి ఉందనీ తెలిపాడు. కస్టమ్స్ ఆఫీసర్లు భారతదేశ వైఖరిని తప్పుపట్టారు – కట్టుదిట్టమైన భద్రతచర్యలు లోపించాయని.”

ఈ వార్తని చారీగారు మేరుతోనూ, ఇతర సిబ్బంది దగ్గర ప్రస్తావించి, కళాఖండల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు.

“శ్రీశైలం సైట్‍లో మన పని ముగిసింది కదా. మనం సేకరించిన కళాఖండాలని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.”

“మనం తవ్విన బైటికి తగిన వస్తువులన్నీ మరోసారి చూసుకొన్నాకే భద్రమైన ప్రదేశంలో ఉంచాము సార్. వాటన్నింటికీ ఇన్‌చార్జ్‌గా జి.వి. ఉన్నాడు. కాని అతను లాంగ్ లీవ్‍లో ఉన్నాడు” అన్నాడు మేరు.

అతడి మాటలకి అడ్డువస్తూ.. “వెళ్ళేముందు అతను బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికీ అప్పచెప్పకపోతే కనీసం తాళంచెవి అయినా ఇచ్చాడా? ముందు అర్జంటుగా అతని సెలవుని రద్దుచెయ్యండి. అతని కాంటాక్టు నెంబరుకి ఫోన్ చెయ్యండి. లేకపోతే పోలీసులకి చెప్పి తాళం విరక్కొట్టాల్సి ఉంటుంది. మీలో ఎవరికైనా అతని గురించి తెలుసా?” ఆత్రుతగా అడిగారు చారిగారు.

కొందరు నిశ్చలంగా ఉండిపోయారు. కొందరు తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపారు.

“సార్, అక్కడ దొరికిన విగ్రహాలు శ్రీశైలం సైటులోనివై ఉండవచ్చని మీకు ఏమైనా అనుమానంగా ఉందా?” రమణ అడిగాడు చారీగారిని.

“వాళ్ళు ప్రత్యేకించి శ్రీశైలంవి అని చెప్పలేదుగాని, ‘ఆంధ్రప్రదేశ్ నుంచి’ అని తెలిసింది. మనం ఇప్పటికే నలభై సైట్లని గుర్తించి తవ్వకాలు జరిపాము. ఇంకా చాలా పరిశోధించవలసినవి ఉన్నాయి.”.

“తవ్వకాలలో దొరికినవి చాలా వరకు విజయనగర సామ్రాజ్య కాలం నాటివి సార్, మనం భద్రపరచిన వాటిల్లో చాలావరకు పల్లవ, చోళ రాజుల కాలం నాటివి. ఇవి నెల్లూరికి ప్రాంతంలో దొరికినవి. ఇంక జైన, బౌద్ధ జ్ఞాపికలు నాగార్జునసాగర్ దగ్గర దొరికినవి. అవన్నీ ఆ కాలం నాటి వ్యవహారశైలికి ప్రతీకలు.”

“కాని ఆర్కియాలజీ డిపార్టుమెంట్ – దొరికిన వస్తువుల మీదే ఆధారపడకూడదు. అక్కడ వున్న మట్టి, రాళ్ళు, లోహపు వస్తువులు, వ్రాతప్రతులులతో పాటు చాలా విషయాలు పరిగణనలోకి వస్తాయి. వీటన్నింటితోటే చరిత్రని కనుగొనడానికి ఆధారాలు మొదలు అవుతాయి” అన్నారు చారిగారు.

“సార్ మనం చరిత్రని నిర్మిస్తున్నాము? ఎందుకు పునర్నిర్మిస్తున్నాము? చరిత్రకి సబంధించిన వివరాలు, ఆధారాలు మన దగ్గర భద్రపరచి లేవా?”

“ఇది అయామకపు ప్రశ్న! చరిత్రకి అంతం లేదు. మన దగ్గర వున్నదల్లా చరిత్ర వాటికి సంబంధించిన కాలం. నాటి సంఘటనలని చాలా రకాలుగా రచించారు. చాలా సార్లు ఏదో ఒక దానిమీద అభిప్రాయానికి వచ్చీ వీటినే నమ్ముతూ వచ్చారు. రచనలే సరైన ఆధారాలు అనుకొన్నారు. కొందరు కొన్నిసార్లు వీటిని పొరపాటుగా,  పక్షపాతంతో అన్వయిస్తారు. కాని మన ఆర్కియాలజి డిపార్టుమెంటు వాళ్ళం వ్రాతప్రతుల కన్నా ఆధారాలే చరిత్రకి ముఖ్యమన్నది నిరూపించాం. మన తవ్వకాలలో దొరికిన పురావస్తువులు, కళాఖండాలు భద్రపరచి చరిత్రని తిరగతోడి ఆధారాలను సమీకరించడమే మన కర్తవ్యం. ఇంక ఇవాల్టికి ఈ చర్చలు ఆపేద్దాం.. చెయ్యవలసింది చాలా వుంది” చెప్పారు చారిగారు.

మేరుతో “నువ్వు జి.వి. ఫైల్‌ని ఒకసారి పరిశీలించు. ఆ తరువాత అతను ఎన్ని రోజుల సెలవులో వున్నాడో, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో, కనుక్కొని నాకు చెప్పు” అన్నారు చారిగారు.

“తప్పకుండా కనుకుంటాను సార్. సార్ ఇంకో చిన్న విషయం. మీరు మెరైన్ ఆర్కియాలజీ గురించి రిఫర్ చేయమన్నారు కదా. వాటిని రిఫర్ చేసి వాటిలో నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా రాసుకొన్నాను మీరు వాటిని చూస్తారా?”   అడిగాడు మేరు.

“వాటి గురించి రేపు మాట్లాడుకుందాము” అంటూ చారి గారు వెళ్ళిపోయారు.

***

అప్పటి దాకా ఆ గదిలో లేని చంద్రం ఒక్కసారిగా ప్రత్యక్షమై, వెనక నుంచి భుజం తట్టేసరికి ఉలిక్కి పడ్డాడు మేరు. మేరుని పక్కకి తీసుకెళ్ళాడు చంద్రం.

మేరుకి దగ్గరగా జరిగి, “మేరూ నీకో రహస్యం చెప్పాలి” అన్నాడు.

“ఏమైంది? ఏమిటా రహస్యం? మాములుగా నీ గొంతు చాలా పెద్దది ఏ విషయానైనా “లౌడ్ స్పీకర్‌తో’ చెప్పినట్టు చెబుతావు. ఇంత మెల్లగా గుసగుసగా మాట్లాడుతుంటే నమ్మలేక పోతున్నాను చంద్రం” అన్నాడు మేరు చంద్రాన్ని చూస్తూ.

మేరు వేళాకోళాన్ని పట్టించుకోకుండా, “చారీగారు జి.వి.మీద ఎన్‌క్వయిరీ చేస్తున్నట్లు విన్నాను. నీకు తెలుసా జి.వి. ఎక్కడున్నాడో? అతనిని నేను చిత్తూరులో చూసాను. కేతకిని పెళ్ళిచేసుకొన్నాడు. గుర్తుందా ఆ అమ్మాయి? రిసెర్చ్ స్కాలర్‌గా కిష్టమూర్తితో వచ్చింది శ్రీశైలం తవ్వకాల సైట్‌కి. అప్పుడు చెప్పింది కదా పురాణాల మీదో దేశం మీదో రిసెర్చి చేస్తున్నట్లు.” అన్నాడు చంద్రం.

చంద్రం అలా చెబుతుంటే మేరు మూగబోయాడు – తాను అనుకొన్నది నిజమయ్యేసరికి! అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకొన్నారు? అసలు జి.వి.ని ఎలా ఇష్టపడింది? దేనిని లెక్కచేయని మనిషి జి.వి. అలాంటి వ్యక్తితో ప్రేమా, పెళ్ళి! ఇదేలా సాధ్యం – అనుకున్నాడు.

“నువ్వు నమ్మటం లేదు కదూ? ఎందుకలా నా వైపు అపనమ్మకంగా చూస్తున్నావు? నన్ను నమ్ము మేరూ.. తప్పుడు వార్తలు చెప్పడం లేదు.. నేను జి.వి.ని కలిసాను. అతను కేతకిని తన భార్య అంటూ పరిచయం చేసాడు. ఇప్పటికైనా, నమ్ముతావా? ఇంకో విషయం కేతకి నన్ను గుర్తుపట్టినట్లు లేదు” అన్నాడు చంద్రం.

“సరే చంద్రం. నమ్మకం కుదరక కాదు. అసలు జి.వి. పెళ్ళి విషయం అంత రహస్యంగా ఎందుకుంచినట్లు? ఆఫీసుకి కూడా రావటం లేదు. అసలు ఏ విషయం కూడా చెప్పలేదు..”

“అందుకే నీకు అన్ని చెప్పింది. జి.వి. గురించి నీకు జాగ్రత్తలు చెబుదామని. ఇంకో విషయం తెలుసా? ఆ రోజు సాయంకాలం, మీ స్నేహితుడు, ఆ ఫారినర్.. నువ్వు హంపీ వెళ్ళావు కదా..”

“ఆ టోని లెపెంటో”

“అవును అతను ఇంకో కొద్దిమంది స్నేహితులు, జి.వి. కలిసి డ్రింక్ తాగుతూ కనిపించారు హోటల్లో..”

“అయితే..”

“నాకు జి.వి మీద ఎందుకో అనుమానం. స్మగ్లింగ్లో అతని ప్రమేయం ఉందనిపిస్తోంది. చారి గారు అందుకనే అతని గురించి అంతగా ఆరాలు తీస్తున్నారు” అన్నాడు చంద్రం స్థిరంగా.

చంద్రం వెళ్ళిన చాలా సేపటిదాక చంద్రం చెప్పిన విషయాలు జీర్ణించుకోలేకపోయాడు మేరు. అయినా ఎక్కడో ఏదో లింకు వుందేమో అని అనిపిస్తోంది. చంద్రం చెప్పిన విషయాలు నిజం కావచ్చు కాని అదే పూర్తిగా నిజమని నమ్మడం ఏలా ఏది ఏమైనా సరైన ఆధారాలు దొరికితేగాని జి.వి. గురించి అసలైన విషయం బయటికి రాదు.

అధ్యాయం 17

నాడీ జోతిష్యుడి అపాయింట్‌మెంట్ సాధించడానికి చంద్రానికి నెలరోజులు పట్టింది. వేలిముద్ర ఇచ్చి కూర్చున్నారు. నాడీ జ్యోతిష్యం గురించి తనకి తెలిసినదంతా మేరుకి చెప్పసాగాడు చంద్రం.

“ఈ నాడీ జోతిష్యం చాలా పురాతనమైనది. వేల సంవత్సరాల నాటిది అంటుంటారు. ఈ శాస్త్రం మొత్తం తాళపత్ర గ్రంథాల మీద రాయబడిందనీ, వాటిని వైదీశ్వరన్ కోవెలలో భద్రపరచారని అంటుంటారు.”

ఆ తాళపత్రాలను రచించిన తమిళభాష కూడా ప్రాచీనమైనదని, దాన్ని వళ్ళువర్ కమ్యూనిటీ వాళ్ళు చదవగలిగారని అంటూ, చంద్రం మరికొన్ని వివరాలు చెప్పాడు.

వేలిముద్ర తీసుకున్న వ్యక్తి అరగంట తరువాత భయటికి వచ్చి మేరుని “మీ దగ్గర పుట్టిన తేదీ చెప్పగలరా?” అని అడిగాడు.

“ఎందుకూ?” సందేహంగా అడిగాడు మేరు ఆ వ్యక్తిని.

“లేకపోయినా ఫరవాలేదు వుంటే ఇంకా మంచిది, తొందరగా వెదకవచ్చు” అన్నాడు. మేరు పుట్టిన తేది చెప్పగానే అది నోటు చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు.

“ఒక వేలి ముద్రకి ఎన్నో కాండాలు (అధ్యాయాలు) వుంటాయి.. వాటన్నింటిని సరిచూసుకోవడానికి ఆరు గ్రంథాలు తిరగేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ తాటాకుల మీద వుంటాయి.”

“కాని తాటాకులని ఇన్ని వేల సంవత్సరాలు ఎలా భద్రపరచగలరో కదా చంద్రం?”

“దానికీ ఏదో ప్రత్యేకమైన పద్ధతి వుండే వుంటుంది. మనం మనకి దొరికిన కళాఖండాలని ఎలా భద్రపరుస్తున్నామో అలాగే ఇవి కూడా. దశాబ్దాల తరబడి నిక్షిప్తమై వుంటున్నాయి, కాల పరీక్షని తట్టుకుంటున్నాయి.”

తాను అడగదలచుకున్న ప్రశ్నలను మరోసారి సమీక్షించుకున్నాడు మేరు.  అక్కడ చాలా మంది అసహనంగా ఎదురుచూస్తున్నారు – వాళ్ళ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని.

కొద్దిసేపు అయ్యాక మేరుని లోపలికి రమ్మంటూ పిలిచాడు. లోపలికి వెళ్ళగానే పద్మాసనంలో కూర్చున్న ఆచార్యుడు (Vadhyar) కనిపించారు. నుదిటిమీద విభూతి రేఖలు వాటి మధ్యలో పెద్ద కుంకుమ బొట్టుతో చాలా ప్రశాంతంగా ఉన్నారాయన. ఆ గది అంతా కర్పూర పరిమళంతో నిండిపోయి వుంది. అతనిని చూస్తుంటే దైవాంశసంభూతుడా లేక మహాపండితుడా ఎలా అనుకోవాలో అర్థం కాలేదు మేరుకి.

ఆయనకి దగ్గరగా మఠం వేసుకొని కూర్చున్నాడు మేరు.

“నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సమాధానంగా అవును కాదు అంటూ అంతవరకే చెప్పాలి అర్ధమైందా?” గంభీరంగా అన్నారాయన. “నీ పేరు – మ, మి, ము, మే.. అనే అక్షరాలలో ఒకదానితో మొదలవుతుంది. అవునా?”

“అవును” అన్నాడు మేరు.

“మీ తండ్రిగారి పేరు ఒక హిందూ సాధువు పేరు కదూ?”

“అవును”

“రాఘవేంద్ర?”

“అవును”

“మీ అమ్మగారిది ఓ పవిత్ర నది పేరు. గంగ. అవునా?”

“అవును”

“నీ పేరు మేరుకాంచన, నీవు ఆదివారం నాడు జన్మించావు. నీవు జన్మించినది తూర్పుదిక్కు ప్రదేశంలో. తమిళ నెల ‘ఆది’, సంవత్సరం ‘తారణ’, ఆ రోజు మిధున లగ్నం, మృగశిర నక్షత్రం..”

ఆయన అలా చెప్పుకు పోతూ ఉంటే, మేరు నమ్మలేక పోయాడు.. తాను ఎవరో తెలియక పోయినా, తన పేరు, తల్లిపేరు, తండ్రిపేరు, జన్మ నక్షత్రాలు, పుట్టిన స్థలం, లగ్నం ఓ అపరిచితుడు చెప్పడం. చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

మేరు ప్రతిస్పందనని పట్టించుకోకుండా ఆయన మేరు కెరీర్ గురించి, వివాహం గురించి చెబుతూనే వున్నారు.

“నీకొక కొడుకు వున్నాడు. వాడి పేరు సూర్యగవానుడికి సంబంధించింది. సూర్య.. ఈ అబ్బాయికి త్వరలోనే చెల్లెలు పుడుతుంది” అని చెప్పారు.

పరిస్థితిని అర్థం చేసుకోడానికి మేరు కాస్త సమయం తీసుకున్నాడు. అతనిలో ఏవో వింత భావాలు కలుగుతున్నాయి.

“అయ్యా, నాదొక ప్రశ్న. నా పూర్వ జన్మ గురించి చెప్పగలరా?” అడిగాడు మేరు.

ఆచార్యులు తాళపత్రంలో నుంచి ఇంకో కాండం తీసారు.

“ఇటువంటి వివరాలకు అగస్త్య నాడి చూడాలి” అంటూ తాళపత్రాన్నీ తిరగవేస్తూ ఒక పదినిమిషాల సమయం తీసుకొన్నారు.

ఆ పది నిమిషాల సమయంలో ఏదో తెలియని ఉద్వేగానికి లోనయ్యాడు మేరు.

“నీది పూర్వ జన్మలో రాచరిక కుటుంబం. నువ్వో చిన్న రాజ్యానికి అధిపతివి. నీకు గుప్తనిధులంటే ఆసక్తి. రహస్య స్థలాను గుర్తించి నిధులను కనుక్కోవడంలో చాలా చురుకుగా పనిచేసేవాడివి. కాని ఎందుకో చిన్న వయసులోనే, నీ కోరిక తీరకుండానే హఠాత్తుగా చనిపోయావు.. దానికీ ఈ జన్మలో ఆర్కియాలజిస్ట్ అవడానికి సంబంధం ఉంది.”

“మరి పూర్వజన్మలో నా భార్య.. రాణియా?” అడిగాడు మేరు కూతుహలంగా.

“అది కనుక్కోవాలంటే ఇంకో కాండము తెరచి పరిశీలించవలసి వుంటుంది.. కాని నీ రాశిచక్రం ప్రకారం పూర్వజన్మలో నీకు చాలా మంది భార్యలు వుండేవారని తెలుస్తోంది. అప్పటి ఆచారం ప్రకారం అది తప్పు కాదు. వారిలో ఒక స్త్రీ – తన ప్రేమని కించపరిచినందుకు నిన్ను శపించింది. అందుకే నువ్వు ఈ జన్మలో చీకటిలోకి దేనికోసమో వెదుకుంటున్నావు. నువ్వు ప్రాయశ్చత్తం చేసుకుంటేనే నీకు శాంతి, ప్రేమ దొరుకుంది.”

“ప్రాయశ్చితం అంటే ఏమిటి?” మేరు గొంతు వణికింది.

“దానిని శాంతి పరిహారం అంటారు.. దీనికి ఎంత ఖర్చు అవుతుందో లేక్కెవెయ్యాలి. చేయించాలంటే అదనంగా నువ్వు డబ్బుకట్టాలి, నువ్వు మళ్ళీ రావలసి వుంటుంది” చెప్పారాయన.

ఇంకో శిష్యుడు ఆయన తమిళంలో చెప్పిందంతా రికార్డు చేసి ఒక కేసెట్టు, నోటుబుక్ రెండు మేరు చేతికి ఇచ్చాడు. రెండూ తీసుకుని భయటపడ్డాడు మేరు. మేరు భయటికి రాగానే ఇంకొకరు లోపలికి వెళ్ళారు. బయట వరండాలో చంద్రం మేరు కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో చాలామంది వెళ్ళిపోయారు.

“మేరు, ఏం చెప్పారు, నీకు నమ్మకం కుదిరిందా?” మేరు బయటికి రాగానే అడిగాడు చంద్రం.

“చాలా బాగా చెప్పారు, నాకు నమ్మకం కుదిరింది. అయినా ఇంకా నా పూర్వజన్మ వివరాలు తెలుసుకోవాలి.”

“మేరు, నీకో విషయం చెప్పనా, ఎంతటి మహోత్తమైన జ్యోతిష్యుడైనా నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పలేడు.. కొంత వరకే అందులో నిజానిజాలు వుంటాయి, నువ్వు ‘రాశిచక్రం’ తీసుకొని వెళితే వాళ్ళో రకంగా చెబుతారు. నువ్వు ఈ శాస్త్రాన్ని నమ్ముతున్నావు కాబట్టి చెప్పినంత వరకు విను, అంతే దాన్నే నమ్ముకొని మనసు పాడుచేసుకోకు. దానిలోవున్న మంచి విషయాలు నీకు జరిగినవి వాటినే నమ్మి ఆనందంగా వుండు. మరి నేను జాతకాన్ని నమ్మబట్టే కదా గీత అనే చక్కటి అమ్మాయి దొరికింది” అంటూ చిలిపిగా కన్నుగీటాడు చంద్రం.

(ఇంకా ఉంది)

Exit mobile version