[శ్రీమతి షామీర్ జానకీదేవి గారి కథాసంపుటి ‘కంచి గరుడ సేవ’ పై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]శ్రీ[/dropcap]మతి షామీర్ జానకీదేవి రచించిన 30 చిన్న కథలతో రూపొందిన కథాసంపుటి ‘కంచి గరుడ సేవ’. వంశీ ఆర్ట్స్ థియేటర్స్, హైదరాబాద్ వారు ప్రచురించిన 11వ పుస్తకం ఇది. బ్యాంకు మేనేజర్‍గా పదవీ విరమణ చేసిన జానకీదేవి గారు – ఉద్యోగ విరమణ అనంతరం – ప్రధానంగా కరోనా కాలంలో వ్రాసిన కథలివి. అందువల్ల కరోనా సంబంధిత కథలే ఎక్కువ ఉన్నాయి ఈ సంపుటిలో. ఇది రచయిత్రి తొలి కథాసంపుటి.
ఈ పుస్తకంలోని చాలా కథలు ఒకటిన్నర, రెండు పేజీల నిడివితో ముగుస్తాయి. రచయిత్రి స్వీయ అనుభవాల నుండి, ఆమెకి ఎదురైన సంఘటనల నుండి, వ్యక్తుల నుండి ప్రేరణ పొంది అల్లిన కథలివి.
~
కరోనా ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. దాదాపు రెండేళ్ళపాటు అన్ని దేశాలను అతలాకుతలం చేసి, సర్దుమణిగింది. కరోనా కాలంలో.. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివాసముండే వారి మధ్య చెలరేగిన కలహాలు, అసమ్మతులు – ఆయా అపార్టుమెంట్ల ప్రెసిడెంట్లు/సెక్రటరీలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక్కొక్కరి సర్ది చెప్పలేక, ముందు జాగ్రత్తలు చర్యలు పాటించేలా చూసి, కరోనా సోకినవారు బయట తిరగకుండా హోం క్వారంటైన్‍లో ఉండేట్టు చూడడం వంటి బాధ్యతలను సెక్రటరీలు నిర్వహించారు. ‘కంచి గరుడ సేవ’ కథలో అటువంటి ఓ సెక్రటరీ మాధవరావు. తమ అపార్టుమెంటును ప్రక్షాళన చేయాలని ఆశించి, ఎవరి సహకారం దొరక్క భంగపడతాడు. ‘కంచి గరుడ సేవ’ అంటే ఏమిటో రచయిత్రి ఈ కథలో వివరించారు.
‘కరోనా కరుణించేనా’ కరోనా సోకిందేమోనని భయపడిన ఓ భర్త తన భార్య రాధని వెంటేసుకుని క్లినిక్‍కి వెళ్ళి, అక్కడి డాక్టర్ మామూలు జ్వరమే అని తేల్చడంతో ఊపిరి పీల్చుకుని ఇంటి ముఖం పడతాడు. ఈ మొత్తం ప్రయాణంలో ఖాళీగా ఉన్న నగర వీధులను చూసి, ఒకరి నొకరు తాకకుండా దూరంగా దూరంగా మసలుతున్న మనుషులను చూసి రాధలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.
కరోనా విపత్కర పరిస్థితులలో ‘బాధ్యత కొందరికేనా’ అని ప్రశ్నిస్తుంది విజయ. పెద్దగా చదువుకోని తన పనిమనిషి తలకెత్తుకున్న బాధ్యతను గుర్తించి, మరి చదువుకున్న వాళ్ళూ, విజ్ఞత ఉన్నవాళ్ళూ ఎందుకు ఆ బాధ్యతని వదిలించుకోవాలని చూస్తున్నారోనని తర్కిస్తుంది.
కరోనా సమయంలో ఇరుగుపొరుగువారు బయటకు రాక, భర్త ఆఫీసు పనులలో లీనమైపోతే తన మనసులోని భావాలను ఎవరితో చెప్పుకోలేక, ఈ కష్టకాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూసిన ఓ గృహిణీ వ్యథ “క’రోనా’”.
జీవితంలో ముఖ్యంగా, వైవాహిక జీవితంలో సర్దుకోవడం ఎంత కీలకమో ‘సర్దుబాటు’ కథ చెబుతుంది. తనలోని లోపాలను పట్టించుకోకుండా భర్తపై అభియోగాలు మోపి కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుందామనుకున్న కూతురికి ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి, ఆమె కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు.
పాతరోజుల్లో పనివాళ్ళకి డబ్బు అప్పుగా ఇచ్చి, తీర్చలేనివాళ్లతో బానిసలుగా పని చేయించుకునేవారట. ఇప్పుడు కరోనా కాలంలో పరిస్థితులు తారుమారయి, మన అవసరాల కోసం వాళ్ళకి డబ్బులిచ్చి లొంగిపోతున్నామని అంటుంది ‘అవసరం’ కథ.
సమస్యలూ దైవమే ఇస్తాడు, పరిష్కారమూ ఆయనే చూపిస్తాడంటుంది ‘సహకారం’ కథ. బ్యాంకు మేనేజరుగా తొలి తరం మహిళలు ఎదుర్కున్న వృత్తిపరమైన, కుటుంబపరమైన సమస్యలను ఈ కథ ప్రస్తావిస్తుంది. తోటి ఉద్యోగుల సహాకారం లభిస్తే ఉద్యోగంలోనూ, కుటుంబసభ్యుల సాయం లభించే గృహకార్యాలలోనూ నెగ్గుకురావచ్చని ఈ కథ చెబుతుంది.
సగటు భారత ఉద్యోగి కోరుకునే చిన్న సవరింపు ఏమిటో ‘ఉద్యోగం.. వరమా’ కథ చెబుతుంది. ఉద్యోగస్థులైన మహిళలకు ఆఫీసులో బాస్‍ల వల్ల ఎదురయ్యే పైకి కనబడని సమస్యని ‘అసూయ’ కథ చెబుతుంది.
పక్క వీధిలో ఉండే అన్నయ్య చనిపోతే, చూడ్డానికి రాకుండా, ఫేస్‍బుక్‌లో పెద్ద నివాళి రాసి, అశ్రుతర్పణం వదులుతాడు అతని కజిన్ బ్రదర్. మన బంధాల లాగే ఫేస్‍బుక్ కూడా అంతా అబద్ధమేనా అనుకుంటాడు గోపాల్, ‘బాంధవ్యాలు’ కథలో ప్రధాన పాత్రధారి.
పోగొట్టుకున్నది రాబట్టుకోడానికి ఎదుటివారికి నచ్చేలా మాట్లాడి పని సాధించుకోడం ఎందుకు ముఖ్యమో, ఎంత అవసరమో ‘ముఖస్తుతి’ కథ చెబుతుంది. పెన్షనర్ల ఖాతాలు చూసే ఓ బ్యాంకు ఉద్యోగిని ఎదుర్కున్న సమస్యలను ఈ కథ ప్రస్తావిస్తుంది.
కరోనా కాలంలో, ఆన్‍లైన్ చదువులు వచ్చాక, పిల్లలు ఎలా దారి తప్పుతున్నారో చెప్పిన కథ ‘కరోనా చదువులు’. ఆన్‍లైన్ క్లాసుల పేరిట చెవుల్లో ఇయర్‍ఫోన్స్ పెట్టుకుని గదిలో ఒక్కరే కూర్చుని ఉండే పిల్లలు మొబైల్‍లో/టాబ్‍లో ఏం చూస్తున్నారో తెలుసుకోడం అంత సులువు కాదు. తల్లిదండ్రులో/పెద్దలో ఆ గదిలోకి వెళ్తే గబుక్కున స్క్రీన్ మార్చేసే పిల్లల తెలివితేటలను ఏమనగలం?
మనుషులు ఎంత కాలిక్యులేటెడ్‍గా మారిపోతున్నారో ‘బంధాలు విలువైనవా’ కథ చెబుతుంది. ఈ కథలో రేణుక ఎదుర్కున్న సంఘటనలు మనుషులలో ధనం పట్ల పెరిగిపోతున్న విపరీతమైన ఆశని వ్యక్తం చేస్తాయి.
వాట్సప్ మెసేజులను పూర్తిగా చదవకుండా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, అపార్థం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ‘వాట్సప్ వదంతులు’ కథ చెబుతుంది. సందర్భానుసారంగా ఈ కథలో రచయిత్రి అలనాటి ‘కలెక్టర్ జానకి’ సినిమాలో వదంతి ఒకరి నుంచి ఒకరికి చేరుతూ, కొద్దిగా కొద్దిగా స్వరూపాన్ని మార్చుకుంటూ, మొదట చెప్పినవారి వద్దకే ఎలా వచ్చిందో చెప్పడం బావుంది.
మనిషి ఏదైనా సాధించాలంటే, ప్రేరణినిచ్చేవారే కాకుండా, నిరుత్సాహపరిచే వారూ ఉండాలనీ, అప్పుడే రెట్టింపు పట్టుదల రాణించి అనుకున్నది సాధించగలమని చెప్తుంది ‘సాధనమున పనులు’ కథ చెబుతుంది.
మారుతున్న కాలంతో పాటు మన పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరాన్ని ‘రివర్స్’ కథ సూచిస్తుంది.
కరోనా కాలంలో ఆన్‍లైన్ చదువుల పేరుతో రకరకాల డివైజ్‍లు ఉపయోగించడానికి అలవాటు పడిన పిల్లలు – పలు యాప్‍లకు, ఓటిటిలకి బానిసలవుతున్నారని చెప్పిన కథ ‘ఆన్‍లైన్ శాపం’. అయితే కరోనా అనంతర పరిస్థితులలో, నేడు కూడా, పిల్లలు మొబైల్/టాబ్‍లకు అతుక్కుపోతూ కంటి చూపుకి నష్టం చేసుకోడమే కాకుండా, విజ్ఞానానికి దూరమవుతూ, పక్కదారులు పట్టడం కొనసాగటం బాధగా అనిపిస్తుంది.
తల్లికి బంగారు గాజులు చేయించి, ఆమె చేతికి తొడిగి, దేవుడి మొక్కు తీర్చుకున్నట్టు భావించిన కూతురి కథ ‘కానుక’.
~
ఈ కథలేవీ ప్రత్యేకంగా సందేశాలీయవు. మనం తోటివారితో ఎలా నడుచుకుంటే బాగుంటుందో, తోటివారు మన పట్ల ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో చెప్తాయి. సంఘజీవనంలోని నియమాలను పాటిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో చెప్తాయి. అలా లేకపోతే, ఎన్ని ఇబ్బందులెదురవుతాయో సూచిస్తాయి. మొత్తం మీద వర్తమాన సమాజపు తీరుతెన్నులపై వ్యాఖ్యానంగా ఈ కథలను పరిగణించవచ్చు.
***
రచన: షామీర్ జానకీదేవి
ప్రచురణ: వంశీ ఆర్ట్స్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 100
వెల: ₹ 100.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అచ్చంగా తెలుగు బుక్స్,
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
రచయిత్రి: ఫోన్: 9394611037
ఆన్‍లైన్‍లో:
https://books.acchamgatelugu.com/products/kanchi-garuda-seva?sku_id=50013810