Site icon Sanchika

కంచికెళ్ళిన కొత్తకథ

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘కంచికెళ్ళిన కొత్తకథ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కి[/dropcap]క్కిరిసిన బతుకు సూపర్ మార్కెట్లో
కొనుగోలుదారులమే మనందరం

ఎంచుకుని గమనించుకుని
కార్టులో వేసేసుకుంటున్న ప్రతిదానికీ
మూల్యం చెల్లించాల్సిందే పక్కాగా
డిస్కౌంట్‌లు ఉండవు అన్నింటికీ
సేల్ ఆఫర్లు అగుపడవు అన్నిసార్లు

అవకాశాలు
ఆసరా ఇచ్చాయి కదా అని
అర్హతలను దాటిన అంగలేసి
ఆత్యాశతో..
అవసరాన్ని మించి కొంటూ
ఆకట్టుకున్నదాన్నల్లా..
ఎగబడి బుట్టలో వేసేసుకుంటూ
అందరినీ అటూఇటూ తోసేస్తూ
దర్పంగా బిల్లింగ్ దగ్గరకెళ్ళిపోతాం

ఏదో తగిలి జేబు చిరిగిందా..?
యశస్సు చిల్లరై నేలజారిపోతుంది
బతుకు బందరు బస్టాండైపోతుంది

ఇంకేదో జరిగి కర్మే కాలిందా..??
కాలం పర్సు
ఆమాంతంగా ఖాళీ అయిపోయి
ఆయుష్షు రొక్కం
హటాత్తుగా నిండుకుంటుంది

అంతే..!
కంచికెళ్ళిపోయిన కథల్లో
కొత్తదొకటి యాడ్ అవుతుంది
కొంతకాలం ఫ్రెష్‌గా చెప్పుకునేటందుకు

Exit mobile version