Site icon Sanchika

కంచికి చేరని కథ

[dropcap]క[/dropcap]థలన్నీ కంచికి చేరితే నేను రాసిన కథలు మాత్రం అక్కడ చోటు చాలదన్నట్లుగా ఇక్కడి మనుషుల మనసులను మెలిపెట్టి గాఢంగా పాతుకుని గుండెల్లో గూడు కట్టుకుంటాయి. అయితే కరోనా కాటుతో నా కథ ఇలా ముగుస్తుందని నేను కలలోనైనా అనుకోలేదు.

వేల కోట్ల అభిమానుల మనసులు దోచుకున్న నాకు ఘన నివాళులతో వీడ్కోలు చెబుతారనుకున్నాను. నా భౌతికకాయాన్ని నా అభిమానుల కడసారి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారనుకున్నాను. అభిమానుల దాకా ఎందుకు నా కడుపున పుట్టిన పిల్లలకు నా దేహాన్ని చూపించలేదు.. వారికి అప్పగించలేదు. నా ఆఖరి చూపు కోసం నా పిల్లలు నన్ను చూసే ఏర్పాటు ఏ దేశ ప్రభుత్వమూ చేయలేదు. నేను కలగన్న నా అంతిమ సంస్కారాలు నేననుకున్నట్టు జరగనే లేదు.

దళసరి ప్లాస్టిక్ సంచిలో నన్ను బిగించి మూట కట్టేశారు. అయితే నేను ఒంటరిని కాను.  నాలాగే మూట కట్టబడ్డ మృతదేహాలెన్నో ఈ ప్రపంచానికి అల్విదా పలుకుతూ నాతో పాటే వున్నాయి.

ఏదో కథలో నేను ‘మనిషి ఒంటరిగా వస్తాడు.. ఒంటరిగానే వెళ్లిపోతాడ’ని రాసిన గుర్తు. తప్పుగా రాసానని ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఇక్కడ ఇప్పుడు నాతో పాటు వందల మంది నాకు తోడుగా మూకుమ్మడి దహనానికి సిద్దంగా వున్నారు. మనిషి ఒంటరిగానే వెళ్ళిపోడని మనిషి ప్రకృతి చేతిలో కీలుబొమ్మని ఆఖరుసారిగా ఒకే ఒక్క కథ రాయాలని వుంది. ప్చ్.. సమయం మించిపోయింది.

నా కథలో ఒక నళిని పిచ్చిదయితే తన గుండె గూటిలో పదిల పరుచు కుంటానన్నాడు ఒక అభిమాని. నా కథలో ఒక ధీరజ ఒంటరిగా మిగిలితే తనతో జత కడతానన్నాడు మరో అభిమాని. నా కథలో ఒక సావిత్రి ఎయిడ్స్ బారిన పడితే తనను పెళ్ళాడతానన్నాడు ఓ వీరాభిమాని. ప్రతీ పాఠకుడు నా ప్రతీ కథలోనూ నన్నే కథానాయికగా ఊహించుకుంటాడు. ఆ కథానాయికతో మమేకమై పోతాడు.

నేను అరవయ్యో ఏడుకి దగ్గర పడ్డా పాతిక కథల సిల్వర్ జూబిలీ మాత్రమే చేసుకోగలిగాను. అదేమిటి అరవై వచ్చినా పాతిక కథలేనా అని నన్ను తక్కువ అంచనా వేయకండి. పదిహేనేళ్ళ పిల్లల నుండి తొంభై ఏళ్ళ వృద్దుల వరకూ అందరి ఆరాధ్య కథానాయికని నేనే.  చేసుకున్నది సిల్వర్ జూబిలీ అయితే యేమిటి అందరి మనసులలోనూ డైమండులా నిక్షిప్తమయిపోయాను. కొందరు కుర్రకారు హృదయాలను డైమండు లానే కోసేసాను కూడా. అయితే అది వారి బలహీనతే కాని అందులో నా తప్పేమీ లేదు.

నేను శృంగారం గురించి రాస్తే అల్లసానికి శిష్యరికం చేసానన్నారు.. సెక్స్ గురించి రాస్తే డాక్టరు సమరం వారసురాలినన్నారు.. నిర్భయంగా నిర్లజ్జగా బోల్డుగా రాస్తే కమలా దాసు కూతురినన్నారు.. కరుణాత్మక వ్యథలు రాస్తే కన్నీటి వెల్లువై ప్రవహించారు. అక్షరాలతో నేను చేసే స్వేచ్ఛా విహారానికి జోహార్లు పలికారు. నవరసాలొలికించే నవలా రాణినని ఆకాశానికేత్తేసారు. ఏదైనా సభలో నేనుంటానని తెలిస్తే వేలంవెర్రిగా నా అభిమానులంతా అక్కడికి చేరిపోతారు. అదొక సంబరం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాస్టిక్కులో పొట్లమై వున్నాను.. ఒక్కరూ వచ్చి కట్లు విప్పి నన్ను చూడరే..

క్వారంటీనులో వుండగా ఒక నర్సు జాలిగా నా వంక చూస్తూ అడిగింది.. బంగారు నగలతో వచ్చారేమని. పిచ్చిది నేను రావటమేమిటి… ఉన్నట్టుండి శ్వాస అందకపోతే అంబులెన్స్‌కి కాల్ చేస్తే అమాంతం నా ఆరోగ్య పూర్వాపరాలు తెలుసుకోకుండా తీసుకువచ్చి క్వారంటీనులో కరోనా బాధితుల మధ్య పెట్టేసారు. కాలం కలిసి రానప్పుడు తుమ్మినా దగ్గినా ఐసొలేట్ చేస్తున్న సమయంలో ఊపిరాడకపోవటం పెద్ద విషయమేగా మరి.. ఖర్మంటే ఏమిటో ఇదివరకే ఒక కథలో విపులంగా వివరించాను. ఇప్పుడది  స్వయంగా అనుభవిస్తున్నాను.

ఇంతవరకూ ఎన్నేళ్ళగానో ఆస్థమాతో కాపురం చేస్తున్నా ఇబ్బంది పడలేదు నేనెప్పుడూ. కాని ఇప్పుడు కరోనా ముంగిట్లోకి మారాక నా కథ అడ్డం తిరిగింది. నేను రాసిన కథల్లో ఏ కథ కరోనాను ఆకట్టుకుందో మరి.. కరోనా ఉప్పొంగే అభిమానంతో తనూ నా అభిమానినంటూ స్నేహం కోసం చేయి చాచింది.

బ్రతికేదే అభిమానుల ప్రేమాభిమానాల మీద. అభిమానిని చేతులు కలపటం నిషిద్దమని వారించలేను కదా. అక్కడితో ఆగిందా.. కౌగిలించుకుంది.. ముద్దాడింది.. ఏకంగా నాలో తను ఐక్యమైపోయింది.  దాని పెనుతుఫాను ప్రేమ తాకిడికి ఈ  తట్టుకోవటం కొంచం కష్టమే అయ్యింది. ఆ ప్రేమోద్వేగ ఉదృతానికి త్వరగానే వెంటిలేటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

వెంటిలేటరు పెట్టే ముందు నా ఒంటి మీది నగలన్నీ ఒలిచేసారు. నా జ్ఞాపకంగా నా చెల్లెలికిద్దామనుకున్న నా గాజులు, నా కోడలికిద్దామనుకున్న డైమండ్ దుద్దులు, నా ఆరో ప్రాణమైన మనుమరాలికి అనుకున్న నా మెడలో గొలుసు అన్నీ తీసేసుకున్నారు. అయినా అమరమైన నా అక్షరాల్లో నా జ్ఞాపకాలు వదిలాక ఈ భౌతికమైన వస్తువుల విలువ ఏపాటిది.

నన్ను మార్చురీలోకి మారుస్తుండగా మా వారి తొలికానుక ధగధగ మెరుస్తున్న నా ఒంటి రాయి డైమండ్ ముక్కు పుడక మీద ఒక ఆయమ్మ దృష్టి పడింది. నా మనసు విలవిలలాడింది. బిగుసుకుపోయిన ముక్కు నుండి బలవంతంగా లాగి  తీసుకుంది. అందుకు మాత్రం చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయనకు వాగ్దానం చేసాను అతని  తొలి కానుక నా వంటి మీద నుండి తీయనని అది నాతోటే దగ్ధం చేస్తానని. కాని ఇక్కడ నా గోడు వినేదెవరు..?

నా తలకొరివి పెట్టాల్సిన మా చిన్నోడు అమెరికా నుండి వచ్చే అవకాశం లేదు. ఆఖరుకి డిల్లీలో వున్న పెద్దోడికీ ఆఖరి చూపు దక్కనీయలేదు. నా నోట్లో తులసి తీర్థం గంగా జలం పోసినవాళ్ళు లేరు. ఏ వారసత్వ సంబంధం లేని ప్రభుత్వం నా అంత్యక్రియలు చేస్తోంది. శాస్త్రోత్కంగా అంతిమ సంస్కారం చేసే దిక్కు లేదు. నిజం చెప్పొద్దూ జీవితం మీద ఇంకా ఆశ చావని నాకు దింపుడుకళ్ళెంలో లేచి కూర్చుంటానేమోనని చిన్న ఆశ.

ఇన్ని కీర్తి ప్రతిష్ఠలతో ఇంత ఘనమైన బతుకు బతికి కనీసం జలాభిషేకానికి వేదమంత్రాలకు నోచుకోని చావైపోయింది. అసలు ఈ సమిష్టి దహనకాండ ఏమిటో..  అస్థిసంచయనానికి నా ఎముకల ఎరుక కూడా తెలియదు. కాశీలో నిమజ్జనానికి నాదంటూ ఏమీ దొరకదు. ప్రకృతి భీభత్సానికి మనిషి సృష్టించుకున్న శాస్త్రాలన్నీ పటాపంచలై పోయాయి. ప్చ్.. అతిభయంకర మృత్యువునిచ్చే కరోనా అద్భుత కథ ఒక్కటయినా రాయకుండా బూడిదయిపోతున్నానే అని మాత్రం దుఃఖిస్తున్నాను.

Exit mobile version