Site icon Sanchika

కన్నుల బాసలు

[హిందీలో శ్రీమతి అనూరాధ మంగళ్ రచించిన ‘చక్షు స్పందన్’ అనే రచనని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ప్రకృతి సౌందర్యానికీ, చెలికాడి సాంగత్యానికీ కన్నులెలా స్పందిస్తాయో ఈ రచనలో రచయిత్రి వివరిస్తున్నారు.]

చక్షు స్పందన! అంటే నా కళ్ళ ఊసులు!

ఈ ‘కన్నుల బాసలు’ అనేది ఒక విచిత్రమైన స్థితి.

హృదయం ఏదైనా చెబితే అది కళ్లలో ప్రతిబింబిస్తుంది.

అందుకే కళ్ళు హృదయానికి అద్దం అని అంటారు. ఒకరి కళ్లను చదవడం ద్వారా వారి హృదయంలో ఏముందో తెలుసుకోవచ్చు. జీవితంలోని అన్ని బాధలు, సంతోషాలు – కళ్ళల్లో వ్యక్తమవుతాయి. కళ్ళు మనిషి మనసు గురించి చెబుతాయి. అందుకు పదాల అవసరం లేదు.

ప్రతి విషయానికీ కళ్లే సాక్ష్యం. హృదయానికి ఏదైనా అనిపించినప్పుడు, కళ్ళు మాట్లాడతాయి. కళ్ళే నిజాలకీ, అబద్ధాలకీ ప్రమాణం.

హృదయంలో దాగి ఉన్న కోరికలకు కళ్ళు దర్పణం పడతాయి. కళ్లు పైకెత్తి చూస్తే ప్రార్థన అవుతుందంటారు.

కళ్లు ఎరుపెక్కితే కోపం వచ్చినట్టు. కళ్ళు వాలుగా ఉంటే అదో స్టైల్ అవుతుంది. కళ్ళు దించితే, అది సిగ్గు!

కొందరి కళ్ళని చూడడం ఓ శిక్ష అవుతుంది.

ప్రతి భావోద్వేగానికి కళ్ళు నిర్వచనమవుతాయి.

ఋతుపవనాల గాలి హృదయాన్ని కదిలిస్తుంది. కళ్ళ మూల నుంచి బాష్పాలు జాలువారుతాయి. సయ్యాటలాడటానికి సిద్ధంగా ఉన్న లేత మొగ్గ అందాన్ని కళ్ళు చూస్తాయి. హృదయం ఆనందంతో పాడుతుంది.

పాత బిడారుని వీడిన కళ్ళు నవ్వుతాయి. విముక్తి పొందిన యవ్వనంలో, కొత్త అలలతో ప్రవహించడం నేర్చుకున్నాను.

హరివిల్లు రంగురంగుల చున్నీ ధరించి, తెల్లవారుజామున బంగారు కిరణాలలో స్నానం చేసి మళ్ళీ వచ్చింది. నా హృదయ సముద్రంలో అలలు నన్ను ఓ చోటుకి తీసుకెళ్లాయి. అక్కడ నా స్నేహితుడు ఉన్నాడు.

కళ్ళు వెతుకుతున్నాయి. ముత్యాల వంటి కళ్లకు, హృదయానికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. నా చుట్టూ కిరణాలు!

బంగారు లోకంలో, సువాసనలు వెదజల్లుతున్న చోటికి ఓ కిరణం ప్రవేశించింది. ఒకటి తరువాత ఒకటిగా కిరణాల సమూహమే చేరిందక్కడ.

ప్రతి రంగు అతనిని ప్రశ్నిస్తోంది – ‘ఈ అందాల భామ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు? ఉల్లాసభరితమైన కళ్ళతో, హృదయ స్పందనలతో ఎక్కడికి వెళ్తున్నావు?’ అని.

ఆ ప్రశ్నలకి, అతనేమో గానీ, నేను సిగ్గుపడ్డాను, బెదిరిన జింకలా తచ్చాడాను. కనురెప్పాలార్పుతూ కాలి బొటనవేలుతో మట్టిని తవ్వాను.

అధరాలు ఎరుపెక్కాయి, కళ్ళు వాలిపోయాయి. కలయికకి సంకేతాన్నిస్తున్నాడు ప్రియుడు. ఏమీ మాట్లాడలేకపోయాను, వదనంలో బిడియం! నోరు మూగబోయింది.

అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఇంతలో పూలల్లో ఏదో సవ్వడి!

కలల రాకుమారుడు కళ్ళెదురుగా ఉన్నాడు. కన్నులు కాంచిన స్వప్నం సాకారమయింది. గుండెల్లో దాగిన కోరిక ఒళ్ళు విరుచుకుంది, చక్షు స్పందన తీవ్రమైంది.

మేఘ మల్హర్ రాగానికి ప్రకృతి ఆనంద తాండవం చేసింది. అంతే, ‘వసంతం వచ్చింది, వసంతం వచ్చింది’ అంటూ హృదయ కమలం వికసించింది. మనసు ఉప్పొంగింది.

హిందీ మూలం: అనురాధ మంగళ్

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version