కాంతారా – ఒక సంచలనం

14
2

[dropcap]ఈ[/dropcap] వ్యాసం ప్రధానోద్దేశం ‘కాంతారా’ చిత్రాన్ని విశ్లేషించడం. దాంతో పాటుగా ఒక చలన చిత్రం సూపర్ హిట్ కావాలి అంటే ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉంటుందా అన్న విషయాన్ని చర్చించడం.

ఒక చలన చిత్రం సూపర్ హిట్ కావాలంటే 100% గారంటీడ్ ఫార్ములా ఏదైనా ఉందా?

అవును ఉంది. అదే ఈ వ్యాసంలో నేను చెప్పబోతున్నాను.

మొదట చరిత్ర సృష్టించిన కొన్ని చిత్రాలగూర్చి మాట్లాడుకుందాం.

లవకుశ” (1963)

26 సెంటర్లలో విడుదల అయి, విడుదలైన ప్రతి సెంటర్ లోనూ వందరోజులు, 18 సెంటర్లలో 150 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ‘లవకుశ’ చిత్రం కొన్ని సెంటర్లలో నిరవధికంగా 75 వారాలు ఆడి చరిత్ర సృష్టించింది, ఆ రికార్డ్ ఇప్పటికీ పదిలంగా ఉంది. ఏ చలన చిత్రం కూడా ఈ రికార్డుని బ్రేక్ చేయలేక పోయింది.(ఆధారం వికీపీడియా)

దాసరి నారాయణ రావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, అప్పటి రూపాయి మారకం విలువని లెక్కలోకి తీసుకుంటే, ‘లవకుశ’ సాధించిన వసూళ్ళని రాబోయే వందల సంవత్సరాలలో కూడా ఏ చిత్రం సాధించలేదు అన్నారు.

జై సంతోషిమాత (1975): ‘షోలే’ సునామి ఉన్నప్పటికీ, రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన ఒక చిన్న చిత్రం గూర్చి మీకు తెలుసా?

ఆ చిత్రం పేరు ‘జై సంతోషిమాత’. ఈ చిత్రంలో అప్పటికే రిటైర్మెంట్‌కి సిద్ధంగా ఉన్న భరత్ భూషణ్ అనే సీనియర్ నటుడు తప్ప పేరున్న నటీనటులు గానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎవ్వరూ లేరు.

జై సంతోషిమాత చిత్ర నిర్మాణ వ్యయం 25 లక్షలు మాత్రమే. ఈ చిత్రం సాధించిన వసూళ్ళు దాదాపు 5 కోట్లు.

ఆ రోజుల్లో గ్రాము బంగారు ధర 250 రూపాయలు మాత్రమే.

శంకరాభరణం (1980): కేవలం పదకొండు లక్షల బడ్జెట్‌తో నిర్మింపబడ్డ శంకరాభరణం సృష్టించిన రికార్డులు ఎన్నో ఎన్నెన్నో. తెలుగు పాటలు అలాగే ఉంచేసి డబ్బింగ్ చేయబడ్డా కూడా ఎర్నాకుళం కేరళలో 200 రోజులు ఆడింది. స్వర్ణకమలం పొందింది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.

శివ (1989): కేవలం 75 లక్షల పెట్టుబడితో తీయబడ్డ ‘శివ’ సృష్టించిన రికార్డులు మీకు తెలుసు. దర్శకుడు పూర్తిగా కొత్తవాడు. ఆర్జీవికి అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా అనుభవం లేదు మరి.

అమ్మోరు (1995): కేవలం 1.8 కోట్ల పెట్టుబడితో తీయబడిన ఈ చిత్రం సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. గ్రాఫిక్స్‌ని అత్యధిక వ్యయప్రయాసలకోర్చి ఉపయోగించిన తొలి భారతీయ చలన చిత్రంగా కూడా ఈ సినిమాకి ఒక రికార్డ్ ఉంది.

గ్రాఫిక్స్‌ని ఉపయోగిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందనే భ్రమ కూడా చాలామందికి కలిగించింది ఈ చిత్రం. ఆ భ్రమలని పటాపంచలు చేస్తూ అదే నిర్మాత నిర్మించిన ‘అంజి’ అట్టర్ ఫ్లాప్ అయిందనే విషయం కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

అరుంధతి (2009): ఆ తరువాత ఇదే నిర్మాత నిర్మించిన ‘అరుంధతి’ కేవలం 13.5 కోట్లు వ్యయంతో నిర్మింపబడి, డెబ్బై కోట్లకి పైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. అఫ్‌కోర్స్ ఇందులో గ్రాఫిక్స్‌ని కూడా ధారాళంగా ఉపయోగించారు.

బిచ్చగాడు (2016): మలయాళంలో నిర్మింపబడి తెలుగులోకి డబ్ చేయబడిన ‘బిచ్చగాడు’ నిర్మాణ వ్యయం తెలుసా? కేవలం యాభై లక్షలు మాత్రమే. కానీ బిచ్చగాడు సాధించిన కలెక్షన్స్ అన్ని భాషలలో కలిపి దాదాపు 20 కోట్లు.

హ్రిదయం (2022): మోహన్ లాల్ తనయుడు నటించిన ‘హ్రిదయం’ మలయాళం చిత్రం నిర్మాణ వ్యయం కేవలం 6 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అది సాధించిన బిజినెస్ 54 కోట్లు.

కశ్మీర్ ఫైల్స్ (2022): అదే విధంగా నిన్న మొన్న విడుదల కలెక్షన్స్ విషయంలో కొత్త చరిత్ర సృష్టించిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్ర నిర్మాణ వ్యయం తెలుసా? కేవలం 15 కోట్లు. అది సాధించిన బిజినెస్ విలువ 350 కోట్లు

ఈ లెక్కలన్నీ ఎందుకు చెబుతున్నాను అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాను. ఒక సినిమా విజయం సాధించాలంటే ఏమి చేయాలి? అని ప్రతి నిర్మాత తీవ్రంగా ఆలోచిస్తునే ఉంటారు.

ఇందుకు గాను కొందరు ఫార్ములా అని పట్టుకుని మూసలో సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు.

ఇంకొందరు వేరే భాషలో హిట్ అయిన సినిమాలని తీసుకుని రిస్క్ లేకుండా తీస్తున్నాం అని అనుకుంటూ, మన నేటివిటీకి నప్పని సినిమాలని, ఇటు డబ్బింగ్ చేయటమో, రీమేక్ చేయటమో చేస్తూ ఉంటారు.

అక్కడ మద్రాసు పట్టణం కనిపిస్తు ఉంటుంది, “ఇదిగో ఎల్.బీ.నగర్‌కి వచ్చాను” అంటుంటాయి ఇటువంటి డబ్బింగ్ చిత్రాలలో పాత్రలు.

అడవిరాముడు వంటి మమూలు ఫార్ములా చిత్రాలు విజయవంతం అవలేదా అని మీరు అడగవచ్చు. నేను చెప్పదలచుకున్నది అదే. ఫార్ముల చిత్రాల సక్సెస్ రేట్ చాలా తక్కువ. వంద చిత్రాలు తీస్తే, ఎక్కడో ఒకటో అరో హిట్ కావచ్చు. ‘అడవిరాముడు’, ‘ప్రేమాభిషేకం’ లాగా ఇటీవలి ‘బాహుబలి’ ‘ట్రిపుల్ ఆర్’ లాగా హిట్ అయి ఉండవచ్చు గాక. వాటి విజయరహస్యం కానీ , ఫలానా ఫార్ములా వల్ల కానీ హిట్ అయిందని ఎవరైనా చెప్పగలరా? ఆయనే ఉంటే అని అదేదో సామెత చెప్పినట్టు, అలాంటి ఫార్ములానే ఉంటే అన్నీ హిట్ అయ్యేవి కద.

నేను పరిశీలించినంత మేరకు ఒక చలన చిత్రం విజయవంతం అయ్యేటందుకు నా వద్ద ఒక రహస్యం ఉంది. అదేంటో చివర్లో చెబుతాను.

ఇక కాంతారా చలన చిత్రం గూర్చి ఒక విశ్లేషణ:

కేవలం పదహారు కోట్ల వ్యయంతో నిర్మింపబడ్డ ‘కాంతారా’ చిత్రం రెండొందల కోట్ల మైలు రాయి దిశగా దూసుకుపోతోంది.

ఈ విశ్లేషణ కాంతారా చలన చిత్రం చూసేసిన వారి కోసం మాత్రమే సుమా. అందుకే కథ వ్రాయటం లేదు.

ఈ సినిమా గూర్చి, ఈ సినిమాలోని మంచి మంచి అంశాల గూర్చి అందరూ వ్రాసేశారు. కాబట్టి ఆ విషయాల గూర్చి కూడా ఎక్కువగా నేను వ్రాయబోవటం లేదు.

నేను మొదటి చూపులోనే ఈ చిత్రంతో ప్రేమలో పడ్డాను అంటే అతిశయోక్తి కాదు.

ప్రేమికుల స్థితి గూర్చి కవులు రచయితలు ఇలా చెబుతారు. “నిదురలేయంగానే మొదటి ఆలోచన తమ భాగస్వామి గూర్చి వస్తుందట, అలాగే తాము మెలకువగా ఉన్నంత సేపు అదే ఆలోచన ఉంటుందట, నిదురే రాదట, అథవా నిద్ర వచ్చినా నిదురించబోయే ముందు చివరి ఆలోచన భాగస్వామి గూర్చే ఉంటుందట. ఇక నిద్రలో కలలన్నీ తన గూర్చే ఉంటాయట”

ఈ లెక్క ప్రకారం తీస్కుంటే, నేను ఖచ్చితంగా కాంతారా సినిమాతో ప్రేమలో పడ్డాను. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి వెళ్ళాలి వెళ్ళాలి అని తపన పడ్డాను. తీరా వెళ్లివచ్చాక, నా ఆలోచనలన్నీఈ సినిమా గూర్చే. నిజంగా చెపుతున్నాను. కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా ఆ కోలం కళాకారుడే నా కళ్ళ ముందు. ఇంకా చెప్పాలి అంటే నా చెవుల్లో ‘వరాహ రూపం, దైవ వరీష్టం’ పాట మారు మ్రోగుతూనే ఉంది. కాస్త తీరిక దొరికినప్పుడల్లా ఈ సినిమా తాలూకు టీజర్లు, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, సినిమా తాలుకు క్లైమాక్స్ దృశ్యం (ఇది యూట్యూబ్‌లో ఉంది, ఎవరో సెల్ ఫోన్‌తో తీసి పెట్టారు), ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ పాటని చూస్తూనే ఉన్నాను.

మా ఆవిడ కాస్త భయపడ్డది కూడా. “పోనీ ఇంకోసారి ఈ సినిమా చూసి వచ్చేయండి. ఇదేంటి ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా ఆ సినిమానే తలచుకుంటూ ఉన్నారు, మామూలు లోకంలోకి వచ్చేయండి, ఏదో భయంగా ఉంది” అంటోంది.

అలా ఉంది నా పరిస్థితి.

ఈ సినిమాలో మొదటి ముఫై నిముషాలు, చివరి ఇరవై నిముషాలు మినహాయిస్తే మిగతా అంతా చాలా నత్త నడక నడుస్తుంది. మనకు అసలు సంబంధం లేని నేటివిటి. పరిచయంలేని మొహాలు. ఈ చిత్రం తాలూకు హవా నడుస్తుండగానే, దాన్ని కాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కేవలం రెండే రెండు వారాలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో వదిలారు. ఈ విషయాన్ని రిషబ్ షేట్టి సభాముఖంగా చెప్పారు కూడా. ఈ హడావుడి డబ్బింగ్ కారణంగా కోలం కట్టిన పాత్ర తాలూకు మాటల్ని కన్నడంలో అలాగే ఉంచేశారు. నిజానికి ఇవి చాలా కీలకమైన మాటలు. తెలుగులో ఉంటే కథ చాలా మందికి ఇంకా సులభంగా అర్థం అయ్యేవి.

సినిమాలో బోర్డులు కన్నడంలో ఉన్నాయి.

ఇంటర్వెల్ అయిపోయి దాదాపు అరగంట గడిచిన తరువాత కూడా కథలో ఎక్కడా కీలకమైన మలుపు లేదు. బోర్ కొట్టించే విధంగా ఆ గిరిజన గ్రామం, ఫారెస్ట్ ఆఫీసర్ క్రౌర్యం, శివ (రిషబ్ షెట్టి) అల్లరి చేష్టలు, అతని మిత్రుల ఆగడాలు, హాస్యం ఇలాగే సాగిపోతుంది. గురువ మరణం వరకు కూడా కథలో ఎక్కడా కూడా కీలకమైన కుదుపు రాదు.

ఈ సినిమాలో ఎడిటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా మెరుగులు దిద్ది ఉండవచ్చు. అప్పుడు మధ్యలో ఆ బోర్ కొట్టే గంట పాచ్‌ని కూడా చాలా ఆసక్తికరంగా మలచి ఉండవచ్చు.

పద్దెనిమిదో శతాబ్దంలో రాజుగారి ఎపిసోడ్, ఆ తర్వాత 1970లో రాజవంశీకుడి ఆగడాలు ఇవి అలాగే ఉంచవచ్చు. కానీ 1990 లలో వచ్చే శివ పాత్రని ఇంట్రడ్యూస్ చేసే సందర్భంగా ఇంకొంచెం మెళకువతో వ్యవహరించి ఉండవచ్చు దర్శకుడు.

శివ పాత్రని జైల్లో ఊచల వెనుక కూర్చుని ఉన్నట్టు ప్రారంభ దృశ్యం చూపి, అమాయకంగా “దొర నన్ను విడిపిస్తాడో లేదో” అని అనుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్టు చూపించి ఉండాల్సింది.

అతను ఆలోచనల్లో కూరుకుపోతాడు. అప్పుడు ఫ్లాష్‌బాక్ ప్రారంభం అవుతుంది.

ఆ ఫ్లాష్‌బాక్‌లో దున్నలపోటీ. అక్కడి నుంచి ఫ్లాష్‌బాక్‌ని స్టార్ట్ చేసి ఉండాల్సింది. ఉంటే, ప్రేక్షకులకి ఏదో మెలిక ఉందే ఈ కథలో అని లీనమయ్యేవాడు.

దున్నలపోటీలో శివని నిజమైన విజేతగా అభినందిస్తూ అతని మెడలో మెడల్ తగిలించి, అతనికి సారా బాటిళ్ళని ఇచ్చి పంపిన తర్వాత దేవేంద్ర, తన అనుచరుల వంక తిరిగి “ఒరే నా చేతుల మీద నీళ్ళు వేయండిరా, ఆ కుక్కని తాకాను” అన్నవిధంగా మలచి ఉంటే అతనిలోని విలనిజం ప్రేక్షకులకి తెలిసేది. శివ మాత్రం అతన్ని అమాయకంగా నెరనమ్ముతాడు. అతని మాటల్ని నమ్ముతూ గుడ్డిగా పాటిస్తూ ఉంటాడు.

ఊరికి దొరగా వ్యవహరించే రాజవంశీకుడైన జమీందార్ దేవేంద్ర (అచ్యుత్ కుమార్) పాత్రలోని చెడు కోణం చివర్లో చూపే బదులు పై విధంగా స్క్రిప్ట్ ని తయారు చేసుకుని ఉండవచ్చు.

ఈ కారణంగా శివ పాత్ర మీద ప్రేక్షకులకి సానుభూతి ఏర్పడి, తమకి తెలిసిన రహస్యాన్ని శివకి తెలియజేయాలి అని తపన పడతాడు ప్రేక్షకుడు. ఆ విధంగా తమకి సస్పెన్స్ తెలుసు, పాత్రలకి ఆ విషయం తెలియదు అన్న భావన ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేటట్టు చేస్తుంది.

నూటికి నూరు శాతం ప్రేక్షకులు, క్లైమాక్స్ బాగుంది అంటున్నారు , లేదా చివరి పదిహేను నిమిషాలు బాగుంది అంటున్నారు, దానితో పాటుగా మధ్యలో బాగా స్లో అయింది అని కూడా అంటున్నారు. అలా ఫీల్ అవటానికి కారణం, ఇంటర్వెల్ తర్వాత అరగంట అయ్యాక కూడా కథలో మెలిక ఏదీ పడలేదు, కాన్ఫ్లిక్ట్ లేదు. అప్పుడప్పుడూ వచ్చే ఫారెస్ట్ ఆఫీసర్ తాలూకు ఆగడాలు కథలోని కీలక ఘర్షణ కింద లెక్కలోకి తీసుకోడు ప్రేక్షకుడు. ఎందుకంటే ఆ పాత్ర చెడ్డవాని పాత్ర అని ప్రేక్షకుడికి దర్శకుడు తెలియజేసే ప్రయత్నం చేసేశాడు కాబట్టి. చెడ్డవాడు చెడ్డగా ఉండటంలో వింత లేదు. ఇంతకూ అసలు విషయం ఏమిటి, ఎస్ వాట్ నెక్స్ట్ అన్న అసహనం ప్రేక్షకులలో కనిపిస్తుంది చాలా సేపు. ఇదొక్కటే ఈ చిత్రంలో ప్రధాన లోపం. చిన్న చిన్న లోపాలు మొదటే చెప్పేశాను.

మరి ఇన్ని లోపాలున్నా కూడా ఈ చలన చిత్రం ఎందుకు ఇంత ప్రజాదరణ పొందింది?

అక్కడికే వస్తున్నాను.

హిట్ ఫార్ములా గూర్చి చెబుతాను ఇక్కడ:

నిర్మాతలు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛని ఇస్తేనే ఇలాంటి చక్కటి సినిమాలు వస్తాయి.

సినీ నిర్మాతల గూర్చి ఇక్కడ కాస్త చెప్పుకోవాలి. మాయాబజార్ తదితర చిత్రాల రోజులని ప్రస్తావిస్తూ చాలా మంది నిర్మాతలకి సినీరంగం మీద పూర్తి ఇష్టం ఉంటే కానీ మంచి సినిమాలు రావు అని చెపుతారు. ఇది పూర్తిగా వాస్తవం. ఇందుకు రామానాయుడు గారు, వీబీ రాజేంద్రప్రసాద్, రామోజీరావు యష్ చోప్రా లాంటి వారిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సినిమా హిట్ అయితే ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి, ఇది కాదనలేని సత్యం. కానీ కేవలం లాభాపేక్షతో, సినీ రంగాన్ని వ్యాపారంగా భావించి నిర్మాణరంగంలోకి వచ్చే నిర్మాతల కారణంగా సినిమాలలో క్వాలిటీ పడిపోయింది అనేది కాదనలేని సత్యం.

ఒక వేళ సినీనిర్మాణాన్ని వ్యాపారంగా భావించినా కూడా, సరయిన దర్శకుడిని ఎన్నుకోవడంలో వారు తమ వ్యాపార దక్షత చూపించాలి. అంటే బోలెడు హిట్స్ ఉన్న దర్శకుడిని తీస్కుని మాకు ఖచ్చితంగా హిట్ సినిమా తీసి పెట్టు అని ఒత్తిడి చేయటంద్వారా కూడా హిట్ సినిమా వస్తుంది అన్న గారంటీ లేదు.

సరి కొత్త ఆలోచనలతో, నిజమైన తపనతో సినిమా దర్శకత్వం చేయాలని తపించి పోయే ఎందరో కొత్త దర్శకులు ఉన్నారు. ముందుగా వారు తీసిన షార్ట్ ఫిలింస్ కావచ్చు, ఇతరత్ర క్రియేటివ్ వర్క్స్ కావచ్చు వాటిని చూసి, ఆ దర్శకుడి సత్తాని అంచనా వేసి, అతని దగ్గర నిజంగా బలమైన కథ ఉందా అని తెలుసుకుని, అతనికి ఒక అవకాశం ఇవ్వవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా, పరిమిత బడ్జెట్‌తో అతనికి ఒక అవకాశం ఇవ్వాలి. తెరపై అతను కథని చెప్పే నైపుణ్యాన్ని సరియిన వ్యాపారవేత్త అయిన నిర్మాత అంచనా వేయగలడు. అందుకే ఇందాక చెప్పాను, సినీ క్రాఫ్ట్స్‌పై ఎంతో కొంత గ్రిప్ ఉన్న నిర్మాతలు అయితేనే చక్కటి సినిమాని నిర్మించగలరు.

తమ టాలెంట్‌తో ఎంతో చక్కగా సినిమాలు తీసే యువ దర్శకులు ఎందరో ఉన్నారు ఇండస్ట్రీలో. నిర్మాతలు ఈ విషయంలో చాలా దూరదృష్టి కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆర్జీవి కావచ్చు, భట్ బృందం కావచ్చు, తమిళ దర్శకుడు శంకర్ కావచ్చు, మన ఎస్సెస్ రాజమౌళీ కావచ్చు, వీరు స్వతహాగా దర్శకులే అయినప్పటికీ ఎందరో యువదర్శకులకి అవకాశం ఇచ్చారు. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, రొయ్యల వ్యాపరంలాగానో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగానో లేదా ఏదో ఇతరత్రా వ్యాపారాలలాగా సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంలాగా భావించి, రాత్రికి రాత్రి డబ్బు మూటలు పట్టుకుని నగరానికి వచ్చే నిర్మాతల కారణంగా సినీ రంగంలో మూస సినిమాలు వెల్లువెత్తాయి.

సినీక్రాఫ్ట్స్ గూర్చి అవగాహన లేకున్నా కనీసం కళాహృదయం ఉండాలి, సరయిన టాలెంట్‌ని పట్టే నేర్పు ఉండాలి, ఇలాంటి నిర్మాతలు తీసిన సినిమాలు మాత్రమే ఖచ్చితంగా హిట్ అవుతాయి.

ఇక దర్శకులు ఎలా ఉండాలి:

వీళ్ళు ఖచ్చితంగా కళాహృదయం కలిగి ఉండాలి. రాజమౌళి గారిలా చక్కటి వ్యాపార దృక్పథం ఉంటే మరీ మంచిది. దర్శకుడు బలమైన కథ ఉంటేనే సినిమా తీయాలి. తాను చెప్పదలచుకున్న విషయం పట్ల అతనిలో బలమైన పాషన్ (తపన) ఉండాలి. తాను ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఎలా చెప్పాలనుకుంటున్నాడు, ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అన్న అంశం పట్ల అతనికి పూర్తి అవగాహన ఉండాలి. ఆ తపన అతన్ని నిలువనీయకూడదు, కూర్చోనీయకూడదు. ఒక జ్వాల లాగా అది ఎగసి ఎగసి పడుతూ ఉండాలి. అదిగో సరిగ్గా అలాంటి మానసిక స్థితిలో ఉన్న దర్శకుడి నుంచే సరయిన హిట్ వస్తుంది. తను చెప్పదలచుకున్న ఎంత రొటీన్ కథ అయినా పర్వాలేదు. చెప్పేవిధానంలో వైవిధ్యం ఉంటే ప్రేక్షకులు ఎప్పటికీ ఆహ్వానిస్తారు.

తను తీయబోయే సినిమాని హిట్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ కథ వ్రాసుకుంటే, అది ఆ సినిమా వైఫల్యానికి మొదటి అడుగు అన్న మాట.

రిషబ్ షెట్టి మాట్లాడుతూ, దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీయాలి అని మేము తీయలేదు. అదే పాన్ ఇండియా సినిమాగా మారింది అన్నాడు.

కె.విశ్వనాథ్ గారు శంకరాభరణం విజయం గూర్చి మాట్లాడుతూ, ఇది హిట్ అవుతుందా లేదా అని ఆలోచించి తీయలేదు, ఒక తపనతో తీశాము అని చెప్పారు.

సాధారణంగా పాత్రికేయుల సమావేశంలో ప్రతి దర్శకుడు చెప్పే మాటలే అవి, మా చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది అని. నిజానికి కథ అసలు పాత్ర వహిస్తుంది సినిమా విజయంలో అని కొందరు చెపుతుంటారు. నా దృష్టిలో కథ, కథనం, టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఇవేవి ప్రధాన పాత్ర వహించవు ఒక సినిమా విజయంలో.

ఒకే ఒక సక్సెస్ ఫార్ములా: అదేంటి అంటే నిజమైన తపనతో తీయటం. సినిమాకి కేప్టేన్ దర్శకుడు. అతను పూర్తి తపనతో తాను చెప్పదలచుకున్న విషయాన్నిచెప్పగలగాలి. అంతే. ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. వారికి భాషా భేదాలు లేవు, టెక్నాలజీతో పని లేదు, పెద్ద హీరో ఉన్నాడా లేడా అని కూడా చూసుకోరు.

నిజమైన తపనతో సినిమా తీయగలిగే దర్శకుడిని పట్టుకోవడంలోనే ఉంది నిర్మాత వ్యాపార దక్షత. అంతే, ఆ తరువాత దర్శకుడికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here