Site icon Sanchika

కంట్లో నలుసు

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘కంట్లో నలుసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఉండేది ఇద్దరు మనుషులు. అన్ని గదులూ రోజూ తిరుగుతారేంటి? రోజూ చీపురుతో తుడువు, మాపు పెట్టు అంటారేంటి, వారానికి రెండు సార్లు మాపు పెట్టి రోజు మార్చి రోజు చీపురుతో తుడిచి ఊరుకునేదానికి? శుక్రవారం ఎట్లాగూ వాకిట్లో ముగ్గు కడిగిస్తారు. మళ్ళీ మధ్యలో మంగళారం ముగ్గు పెట్టటమేంటి? నాకాలీసెం అవుతది. నేను ముగ్గెయ్యను” అని పనిమనిషి కరాఖండీగా చెప్పింది.

“అన్ని పనులకూ కలిపే జీతం మాట్లాడుకున్నావుగా. మళ్లీ ఇలా పేచీగా మాట్లాడవేంటి? ఒప్పుకున్న ప్రకారం పని చేయి” అన్నది స్వరూప.

“నేనంతే చేస్తాను. మీరు నన్ను పనిలోంచి తీసేసినా, నా దారిన నేను పోతాను.” అన్నది గట్టిగా.

‘ఏంటీ మనిషి? ఈవిడతో పని చేయంచుకోవాలంటే రోజూ చికాకుగానే వుంటున్నది. అసలే, తమది కొత్త కాపురం. ఏ పని చెప్పినా ముఖం చిట్లగించుకుంటూ ఈవిడ చెప్పే సమాధానాలు, రోజులో ఎక్కువ భాగం వద్దనుకున్నా కూడా గుర్తుకొస్తున్నాయి. ఏదో ఒక దారి చూడాలి’ అనుకున్నది స్వరూప.

***

“స్వరూపా! పగలంతా ఖాళీగానే వుంటావుగా. రాత్రి పూట కూడా ఆ ఫోన్ చేస్తూ కూర్చుంటావేంటి? నాతో కబుర్లు చెప్పొచ్చుగా” అన్నాడు శ్రీకాంత్.

“అవునూ. మీరు కష్టపడి సంపాదిస్తుంటే నేను తేరగా తిని ఇంట్లో కూర్చుంటున్నాను. మొన్నటి రెండు ఇంటర్వ్యూల్లో నేను సెలక్ట్ కాలేక ఉద్యోగం తెచ్చుకోలేకపోయానని మీకు ఎగతాళిగా వున్నది. నేనేం మీ ఇంటికి వట్టి చేతులతో రాలేదు. లక్షల కట్నంతో వచ్చాను.” అన్నది ఉక్రోషంగా. అంతే కాక తన చేతిలోని ఫోన్‌ను మంచం మీద విసిరి కొట్టింది.

“మనం సరదాగా కబుర్లు చెప్పుకుందామన్న ఒక్క మాటకు, ఇంత రాద్ధాంతం చేస్తున్నావు, నీతో ఏ మాట అనాలన్నా భయంగానే వుంటున్నది.”

“అవును. నేనింతే. నన్ను అనవసరంగా విసిగించవద్దు.” అంటూ స్వరూప అటు తిరిగి పడుకున్నది.

***

“ఈ గిన్నెలకు ఎంగిలే పోవటం లేదు. కాస్త చూసి శుభ్రం చేయి. పైగా గిన్నెలకు ‘విమ్’ వాసన ఘాటుగా వస్తున్నది. మరిన్ని నీళ్లలో గిన్నెల్ని శుభ్రం చేయి.”

“గిన్నెలన్నింటినీ ఎంగిళ్లతో ఎండబెట్టకుండా ఎప్పటికప్పుడు నీళ్లతో శుభ్రం చేసి పెట్టండి. నేనొచ్చే ముందు గిన్నెలపై నీళ్లు చల్లి నాన పెట్టండి. తోమిన అంట్లు తొలిపి తొట్టి గిన్నె పెడతాను. ఆ తర్వాత మళ్లీ మీరు చేసుకునే శుభ్రాలు చేసుకోండి” అన్నది ఇక దానికి తిరుగులేదన్నట్లు.

“ఏ మాటా చెప్పనీయవు. నీళ్ల కుళాయి తిప్పి అలా వదిలేస్తావు. వెళ్లే ముందు కూడా వాటిని సరిగా ఆపవు, నీళ్ళు వృథాగా పోతున్నాయి. నీళ్ల బిల్లు చాలా అవుతుంది.”

“ఎప్పుడున్నా మర్చిపోయి ఓ రోజు సరిగా కుళాయి కట్టలేదేమో? కాస్త ఆ కుళాయి ఆపేసుకుంటే పోలా? ఆ భాగ్యానికే ఓ నిలదీస్తున్నారు.”

‘ఛీ! ఈవిడతో మాట్లాడటమే ఓ తలనెప్పి అయి కూర్చున్నది. సౌమ్యంగా, ఒక్క మాటా మాట్లాడదు గదా?’ అనుకున్నది స్వరూప.

***

“కూరలో కాస్త ఉప్పు తగ్గించి వేస్తే బాగుండేది గదా? మరీ ఉప్పు కశంగా వున్నది” అంటూ శ్రీకాంత్ పళ్ళెం లోని కూరను తీసి పక్క నున్న ఖాళీ గిన్నెలో వేశాడు.

“కాస్త ఉప్పు ఎక్కువైన మాట నిజమే. ఉప్పు కశం తగ్గటానికి ఏ కొబ్బరి కారమో కలిపేసుకుంటే పోయేది. ఆ భాగ్యానికి నన్ను ఎత్తి చూపుతూ కూర తీసి పారేశారు. మీ అమ్మ లాగా రుచిగా చేయటం నాకు రాదు. నన్ను మా అమ్మ వాళ్లు గారంగా పెంచి వంట నేర్పకుండా మీ ఇంటికి పంపారు. ఏం చేస్తాను, కట్టుకున్న మొగుడికి కడుపునిండా తిండి పెట్టడం కూడా చేతకాని దద్దమ్మను” అంటూ తను తినే పళ్లెంలో నీళ్లు పోసి పళ్ళెం తీసుకుని వెళ్లిపోయింది.

“ఛ. ఛ. మన పెళ్లై ఏడాది గడిచింది. క్రిందటేడు ఆన్‌లైన్ వర్క్ చేసుకుంటూ మా ఇంట్లో అమ్మ వాళ్ల దగ్గరున్నాం. వాళ్ల ముందు కాస్త నిదానంగా వుండేదానిని. కంపెనీ ఆఫీసుకు వచ్చి పని చేయమన్నదని మనం ఈ ఊరు వచ్చి కొత్త కాపురం పెట్టుకున్నాం. నీకు విసుగు మరీ ఎక్కువై పోయింది. ఏ మాట చెప్పినా ముఖం మట్లగించుకుంటావు. అంత కోపం పనికిరాదు స్వరూపా. నీ అసలు స్వభావం ఇదన్న మాట” అంటూనే శ్రీకాంత్ కూడా పూర్తిగా తినకుండానే లేచి వెళ్లిపోయాడు.

అది చూసి స్వరూప మనసు బాధపడింది. భర్త తననెంతో అపురూపంగా చూసుకుంటాడు. అతణ్ణి బాధపెట్ట కూడదనుకున్నది. అదేంటో శ్రీకాంత్ ఏ చిన్న మాట అన్నా తను ఓర్చుకోలేక ఒక మాటకు బదులు పది మాటలు చాలా దురుసుగా అనేస్తున్నది. తను అంతగా కోపగించుకోవాల్సిన పెద్ద విషయాలేం కాదు. తనే మనసును అదుపులో పెట్టుకోలేక కోపంగా మాట్లాడేస్తున్నది.

***

“అక్కడో చీపురు, అక్కడో చీపురు వేస్తే, ఇంట్లో దుమ్ము ఎలా వదుల్తుంది? ఇల్లంతా నిదానంగా శుభ్రం చేయి.”

“నిమ్మళంగా తుడుస్తూ కూచోటానికి నాకు మీ ఇల్లు ఒక్కటేనా? నాలుగిళ్లకు తిరగాలి. పనులు చెయ్యాలి. ఇంట్లో కూర్చునే మీలాంటి వాళ్ళకు మా చాకిరీ గురించి ఏం తెలుసు? నే మళ్ళా ఇంటికి పోయి నా ఇంటో వాళ్లకు వండి పెట్టుకోవాలి. ఇంట్లో ఎన్ని బాధలుంటాయో మీలాంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది?” అన్నది పనిమనిషి గట్టిగా నోరు పెట్టుకుని అరుస్తూ.

‘తాను చెప్పిన దేమిటి? ఈ పనిమనిషి అనేదేంటి? ఉట్టి పుణ్యానికే కారణం లేకుండానే రేగుకంపలా పడుతుందేమిటి! ఈవిడ గోల నాకు పెద్ద తలనొప్పిగా తయారయింది. నిదానంగా, సౌమ్యంగా వుండనే వుండదు. ఛ ఛ. ఇదెక్కడి మనిషి! ఈవిడ మూలాన, ఈవిడనే మాటల గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తోంది. ఈవిడ ముఖం ముటకరింపు మాటల వలన తన మనసు చికాకు పడుతున్నది’ – ఇలా ఆలోచిస్తుంటే ఒక్కసారిగా భర్త శ్రీకాంత్ తలపుల్లో కొచ్చాడు. శ్రీకాంత్ మామూలు మాటలకు తను కూడా విపరీతంగా స్పందించి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నది. అతనసలే మృదు స్వభావి. తన గోలకు అతనెంత మనసు చిన్నబుచ్చుకుంటున్నాడో? అమ్మ ఎప్పుడూ చెప్తూ వుండేది – ‘స్వరూపా! మరీ మాటలమారిగా మారి ఆ అబ్బాయిలో చీటికీ మాటికీ గొడవ పడకు. జాగ్రత్త’ అని.

తనను ఇంటర్వ్యూలకు ప్రిపేర్ చేయటానికి ఎన్ని మెళకువలు ఎంత ఓపిగ్గా నేర్పాడు? రెండు సార్లు కూడా తను సంతృప్తిగా ఇంటర్వ్యూల్లో ఆన్సర్ చేయలేకపోయింది. ఆ పరిస్థితిలో శ్రీకాంత్ ఎంతగానో ఓదార్పు మాటలు చెప్పాడు. “ఇంతలో పోయిందేమీ లేదు స్వరూపా, మరో కంపెనీకి, మరో ప్రయత్నం చేద్దువు గాని, ఏం ఫర్వాలేదు” అన్నాడే గాని వెక్కిరింతగా, చిన్నచూపుగా ఒక్క మాటా మాట్లాడలేదు. ‘నాతో ఏమి మాట్లాడినా ఆప్యాయితే వుంటుంది. నేనే పెడసరంగా తయారవుతున్నాను. ప్చ్’ అనుకున్నది.

***

“ఈ రోజుతో నువ్వు పనిలో చేరి నెల రోజులు పూర్తయింది. ఆరు శెలవులు తీసుకున్నావు. ఈ రోజు జీతం తీసుకెళ్ళు. రేపట్నుండి నువ్వు పనికి రావఖ్ఖర్లేదు. నేనే చేసుకుంటాను.” అన్నది స్వరూప.

“ఇప్పటికిప్పుడు మానేయమంటే వెంటనే నాకు మరో ఇల్లు దొరకొద్దా? ముందే చెప్తే మరో ఇల్లు చూసుకునే దానిని. ఈ నెల జీతంతో పాటు మరో నెల జీతం కూడా కలిపి ఇయ్యాల్సిందే, నాకెవ్వరూ కూర్చోపెట్టి తిండి పెట్టేవాళ్లు లేరు.” అంది రుసరుసలాడుతూ.

“కాస్త నిదానంగా మాట్లాడు. నీ మాటల పద్ధతి మార్చుకుంటావని నెలంతా ఎదురు చూశాను. నీ దురుసుతనం రోజురోజుకూ పెరగటమేకాని తగ్గటం లేదు. ఇంకా భరించాల్సిన అవసరం నాకు లేదు. నీ విసుర్లు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు జరుగుబాటు లేదని అంటున్నావు కాబట్టి మరో నెల జీతం కూడా ఇస్తాను. నీకేమైనా ఇబ్బందులు కాని, బాధలు కాని వుంటే నిదానంగా చెప్తే వినేదానిని. అణకువగా మాట్లాడి, శుభ్రంగా పనిచేస్తావన్న నమ్మకంతో నిన్ను పనిలో పెట్టుకున్నాను. అవేమీ నీలో లేనపుడు నువ్వు నాకనవసరం. ఇదిగో డబ్బులు. తీసుకుపో.”

“పోక చూరు పట్టుకుని వేలాడను లేవమ్మా. చెప్పా పెట్టకుండా మాన్పించావు కాబట్టి డబ్బిచ్చావు. తప్పు నీలో పెట్టుకుని పోపో అంటావేంటి? నోరెత్తకుండా, నమ్మకంగా, శుభ్రంగా పనిచేసేవాళ్లు మీకు ఎవరు దొరుకుతారో నేనూ చూస్తాను.” అంటూ సణుక్కుంటూనే పనిమనిషి వెళ్లిపోయింది.

పనిమనిషిని వదిలించుకున్నాక ‘అమ్మయ్య’ అనుకున్నది స్వరూప. కాని వెంటనే శ్రీకాంత్ ఆలోచనల్లో కొచ్చాడు. తన మాటలకూ, విసుగుకూ చిన్నబుచ్చుకునే భర్త ముఖం గుర్తుకురాసాగింది. ప్రస్తుతం తనతో ఏ మాటైనా మాట్లాడటానికి చాలా సంకోచిస్తూ, ఒక విధంగా భయం భయంగానే మాట్లాడుతాడు. భార్యాభర్తల మధ్య జరిగే మాటలకు భర్తలో బిడియం కలిగేటట్లు తను చేస్తున్నది. పాపం శ్రీకాంత్ మనసు ఎంత విలవిలలాడుతున్నదో? పనిమనిషి ప్రవర్తనకు, మాటలకు విసుగొచ్చి ఇంకో నెల జీతం ఇచ్చి వదుల్చుకోగలిగింది. తన ప్రవర్తన కూడా శ్రీకాంత్‍కు విసుగొచ్చి, ఆ విసుగు ఏవగింపుగా మారితే? అప్పుడు తన పరిస్థితి ఏంటి?

నిన్ను నేను భరించలేను. నాకక్కర లేదు. విడిపోదాం. కావాలంటే భరణం ఇస్తాను పొమ్మంటే, తనేం చేయగలుగుతుంది? ఈ రోజుల్లో ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే విడిపోవటం జరుగుతున్నది. వద్దు. వద్దు, నాకా పరిస్థితి వద్దు. నా మనసును, నోటినీ అదుపులో వుంచుకుంటాను. ఈపాటికే తన మీద భర్తకు ఏమన్నా విముఖత ఏర్పడితే దాన్ని వెంటనే తొలగించాలని దృఢంగా అనుకున్నది స్వరూప.

***

ముచ్చటగా, మూడోసారి జరిగిన ఇంటర్వ్యూలో సెలక్టయింది. ఇన్ఫోసిస్ కంపెనీ ఇది ఊరి బ్రాంచ్‌లో స్వరూపకు ఉద్యోగమొచ్చింది.

ప్రస్తుతానికి ఇద్దరే కాబట్టి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ, చేరో పని కల్సి చేసుకుంటూ నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఎవరి ఆఫీసుకు వాళ్ళు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటూ ముందుగా ఇంటి కొచ్చిన వారు రెండో వారి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version