Site icon Sanchika

కనువెలుగు – కనుమరుగు

[dropcap]”ఒ[/dropcap]గే ఒగ గడియల ఏమయిస్తుందినా? ఎట్లయిస్తుందినా?” అంటా గేలీగా (చులకనగా) మాట్లాడితిని.

“అదేంరా అట్లంటావు. అంతా అరగడియలా అయిపోవచ్చు ఇంగ ఒగ గడియలా ఏమైనా కావచ్చు” అనే అన్న.

అన్న అన్నింది తడువు “ఏమయిస్తుందినా… ఎట్లయిస్తుందినా” అంటా అట్లే తగులుకుంట్ని.

“నీకి ఎట్ల చెప్పేది” అంటా అన్న అందాజు చేస్తావున్నట్లే

“రేయ్! బంకశలి పండ్లు తింద్రు రాండ్రా” ఆ పక్కనింకా జిట్టన్న తాత గట్టిగా గొంతు చించుకొనె.

మేము ఇద్రు పోయి కావలసినన్ని బంకశలి పండ్లు తింటిమి. తెలుసా మీకి ఈ పండ్లు రవంత తియ్యగా, పులుపుగా, బంక బంకగా వుంటాయి. ఈ కాలములా మా పక్క మామిడి పండ్లే కాదు ఇట్లా బంకశలి పండ్లు, ఈత పండ్లు కూడా బాగా కాస్తాయి. ఏ కాలముల సిక్కే కాయి పండు ఆ కాలములా తింటా పోతే ఏ కాయిలాలు (రోగాలు) వచెల్దనేది మా వూర్లా పెద్ద మాట.

“రేయ్! జట్టిగా. నేను తాతని అయితినిరా” అని రంకేస్తా రంగన్న మా తాకి వచ్చె.

“మనవడా, మనవరాలా” జట్టన్న తాత అడిగె.

“మనవరాలురా”

“మంచిది. ఓ కనువెలుగు అయ్యె” అంటా కుశాలుపడే తాత.

వాళ్లిద్రు మాట మింద మాట మాట్లాడతా నగతా వుంటే మేమిద్రు కూడా గడియగడియల్ని అనుభవిస్తా కుశాలు పడతా వుండాము.

అదే గడియల “నెప్పి… నెప్పి” అంటా ఎద పట్టుకొని కిందకి పడిపోయ జిట్టన్న తాత.

“ఏమాయ తాతా” అంటూ నేను తాతని మాట్లాడిస్తిని. కాని తాత మాట్లాడలే. ఉసురు, పసురు లేకుండా అట్లే వుండాడు.

“వాడు ఇంగ మాట్లాడేల్దప్పా! వాడు మనల్ని విడచి పోయిడిసినప్పా, కనుమరుగు అయెప్పా” అంటా కిర్లిశా రంగన్న తాత.

ఒగే కిత జనం గుంపు గూడిరి.

“ఇబుటు తానే మాట్లాడిస్తిని, అబుడు తానే మాట్లాడిస్తిని. అంత బిర్నా ఎట్లాయే” అంటా జనం ఏమేమో మాట్లాడతా వుండారు.

వాళ్ల మాటలు వింటా, తాతని చూస్తా ఆడే నేలమింద కూకొనిస్తిని.

“ఇబుడు తెలిసినారా ఒగే ఒగ గడియలా ఏమయిస్తుందని ఒగే ఒగ గడియల ఎట్లేట్ల అయితుందని… ఒగే గడియల కనువెలుగు కావచ్చు, అదే గడియల కనుమరుగు కావచ్చు” నా బుజం మీంద చెయ్యి వేస్తా అనే అన్న.

నా ఎన్నము (మనసు) ఏడికో ఎల్లీశా.

***

కనువెలుగు = జననం, కనుమరుగు = మరణం

Exit mobile version