[dropcap]మా[/dropcap] నాన్నగారు కాలం చేసి ఇవాళ్టికి తొమ్మిదవ రోజు. రేపు దశావహం. ఆ తరువాత పెద్ద కర్మ కోసం అన్నీ అమర్చుకుంటున్నాము. భారమైన మనసుతో అయినా అన్నీ ఏర్పాటులు యథావిధిగా చేసుకు పోతున్నాము.
మా అమ్మ పోయిన దగ్గరనుంచి నాన్నగారిలో ఒక రకమైన వైరాగ్యం మొదలయింది. గత ముప్పై ఏళ్లుగా తనకంటూ ఏమైనా కొనుక్కోవటం నేను చూడలేదు. ఆయన అవసరాలు చూసుకుని మేము ఏదిస్తే అంతటితో తృప్తిపడటం అలవర్చుకున్నారు. కష్టపడి సంపాదించుకున్నది కూడా మా కోసమే కానీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు, ఆయన.
అంతా సర్దుమణిగాక, వచ్చిన దగ్గర బంధువులు ఎవరి దారినవారు వెళ్ళిపోయాక నా కుటుంబంతో పాటు, కార్తీక్ కుటుంబం, స్వాతి కుటుంబం మిగులుతుంది. అప్పుడు వస్తుంది అసలు సమస్య.
***
మా తల్లి తండ్రులకు నేనూ, నా తమ్ముడు కార్తీక్, చెల్లి స్వాతి ముగ్గురం సంతానం. నాన్నగారు ఎంతో ఆస్తి కూడబెట్టకపోయినా మా ముగ్గుర్నీ ఏ లోటు లేకుండా పెంచారు, చదివించారు, ఘనంగానే పెళ్లిళ్ళు చేశారు. కానీ మా యిద్దరు అన్నతమ్ముల అదృష్టమో, లేక మా చెల్లి దురదృష్టమో తెలీదు.
నేను ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసి, ముంబైలో ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించుకున్నాను. దేముడి దయవల్ల ముంబై లాంటి నగరంలో నాది అంటూ ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కోగలిగాను.
నా తమ్ముడు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. తను కూడా బాగానే సంపాదించుకుంటున్నాడు. కానీ మా చెల్లి భర్త మాత్రం అంత చదువుకున్నవాడైనా సరైన ఉద్యోగం చేపట్టలేక పోయాడు. ఏ ఉద్యోగంలోనూ సరిగ్గా స్థిరపడలేక అలా ఉద్యోగాలు మారుస్తూ సరైన సంపాదన లేక అవస్థ పడుతున్నారు.
నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ మంఛి చదువులు చెప్పించాలని నేను కూడా మా తండ్రిగారి లాగానే చాలా ఆశ పడ్డాను. కానీ మా పెద్దవాడు చదువులో ఏ మాత్రం ఉత్సాహం చూపించలేదు. కొంత జ్ఞానం వచ్చిందగ్గరనుంచీ తను స్వంతంగా కంపెనీ పెట్టుకుంటానంటూ మొండి పట్టుపట్టాడు. ఎలాగో అతి కష్టం మీద గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్వంతంగా ఒక ఎడ్వెర్టైసింగ్ కంపెనీ పెట్టటానికి చాలా వరకు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. నాకు ఇందులో ఏ మాత్రం నమ్మకం లేకపోయినా మావాడి పోరూ, మా ఆవిడ పోరు భరించలేక లొంగిపోయాను.
ఇక రెండో వాడు ఎలాగో వాళ్ల అన్నయతో మా బాధ చూసి ఎంత అర్థం చేసుకున్నాడో కానీ, చెప్పిన మాట విని ఇంజినీరింగ్ చేసి, మంచి ఉద్యోగంలో చేరాడు. ఇంక పర్వాలేదు అని నేను కుదుటపడి పట్టుమని ఇంకా పూర్తిగా రెండు ఏళ్ళు అవలేదు, “నాకు ఈ ఉద్యోగంలో అస్సలు తృప్తిగా లేదు. మీరు సాయం చేస్తే నేను పై చదువులకి ఆస్ట్రేలియా వెళ్తాను” అంటూ గొడవ పెట్టటం మొదలు పెట్టాడు.
ముంబై లాంటి నగరంలో ఎంత సంపాదించినా దానికి తగ్గ ఖర్చులూ అలాగే ఉంటాయి. మా రెండోవాడు ఉద్యోగంలో చేరటం, నేను ఉద్యోగ విరమణ చేయటం ఏడాది తేడాలో జరిగింది. పెద్దవాడు మాట వినక పోయినా కనీసం చిన్నవాడు బుద్ధిగా చదువుకుని సెటిల్ అయ్యాడు కదా అని సంతోషిస్తున్న సమయంలో వీడు ఈ కొత్త బెడద తెచ్చి పెట్టంగానే మళ్లీ మా కథ మొదటికి వచ్చిందా అనుకున్నాను.
పిల్లల చిన్నప్పటి నుంచీ వాళ్ల తీరూ తెన్నూ వాళ్ల ఖర్చులూ చూసి మా నాన్నగారు గోల పెట్టేవారు –
“ఒరేయ్, పిల్లలకి డబ్బు విలువ తెలిసేట్టు పెంచరా. వాళ్లు అడిగిన ప్రతిదీ కొని ఇస్తుంటే, డబ్బు సంపాదించటం ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు. ఏ కష్టం వచ్చినా వెనక అమ్మా నాన్న ఉన్నారన్న ధైర్యం పిల్లలకి ఉండాలి కానీ డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెడ్తూ వెనక నాన్న ఉన్నారుగా అన్న ధీమా మంచిది కాదురా. పిల్లలకి ఖర్చులు అదుపులో పెట్టటం నేర్పురా” అని శత పోరేవారు. మా నాన్నగారి చెప్పేది నాకు అర్థం అయ్యేది కానీ మా పిల్లలకి మాత్రం ఆ సలహా బోధించలేక పోయాము నేనూ నా భార్యా. నేను కొంత ప్రయత్నం అయినా చేశాను. కానీ నా భార్యకి మాత్రం మా నాన్నగారి మాటలు చాదస్తంగా, పిల్లలు తెలివైన వారుగా కనిపించారు
పోనీ అదేదో అమెరికా వెళ్తానన్నా, కార్తీక్ స్పాన్సర్ చేస్తాడు కాబట్టి కొంత తక్కువ ఖర్చులో అయిపోయేది. కానీ మా వాడు మా సలహా వింటేనా.
తను రెండేళ్లు సంపాదించనది, నేను కొంత వెనక వేసినది, కొంత లోనూ తీసుకున్నా కూడా, కావల్సినంత సొమ్ము కూడటం లేదు. ఇక మిగిలింది మా నాన్నగారు.
ఇప్పటికే ఆయన నా పెద్ద కొడుకు కంపెనీ కోసం, చాలానే సాయం చేశారు. మళ్లీ ఇంత త్వరలో రెండోవాడి కోసం డబ్బు సాయం చేయమని అడగటానికి నాకు నోరు రావటం లేదు.
ఇదంతా ఇలా ఉండగా, అటు మా చెల్లి స్వాతి పరిస్థితి అసలు ఏమీ బాగా లేదు. అన్నీ చూసుకునే స్వాతి పెళ్లి చేశాము. కానీ తన భర్త ఎంత వయస్సు వచ్చి పిల్లలు ఇద్దరు పెద్దవాళైనా, ఒక ఉద్యోగంలో స్థిరపడలేక పోయారు. లాభం లేదని స్వాతి తన చదువుకి తగ్గ ఉద్యోగంలో చేరి ఎలాగో సంసారం లాక్కు వస్తోంది. మధ్య మధ్య వాళ్ల పిల్లల చదువులకి అవసరం వచ్చినప్పుడల్లా, నాన్నగారు వారికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. స్వాతికి వచ్చే నెల జీతం తప్పితే మా బావకి ఖచ్చితమైన సంపాదన ఏమీ లేదు.
అతి కష్టం మీద ఎడ్యుకేషన్ లోను పెట్టుకుని, పెద్దకొడుక్కి పెద్ద చదువు చెప్పించగలిగింది స్వాతి. అతను చేతికి అంది వచ్చి వాళ అమ్మా నాన్నలకి సాయంగా నిలిచాడు. ఇంటి ఖర్చులలో సాయం చేస్తూ, తన లోన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ తీర్చుకుంటూ కష్టపడుతున్నాడు. ఇంకా స్వాతి రెండో కొడుకు చదువుకి ఉన్నాడు. మితిమీరిన పనులు, పరిస్థితుల వల్ల, మానసిక వత్తిడి వల్ల స్వాతి ఆరోగ్యం బాగా దెబ్బతింది. తరుచూ అనారోగ్యం వల్ల చేతిలో ఉన్న ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తే, మొత్తం కుటుంబ భారం పెద్ద కొడుకుపై పడుతుందని, అలాగే ఇల్లూ ఉద్యోగం లాక్కువస్తోంది.
కానీ రాను రాను, తరుచూ సెలవలు పెట్టటం వల్ల ఉద్యోగం మానక తప్పింది కాదు. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న పెద్ద కొడుకు “నేను ఉన్నాను కదమ్మా. నువింక కష్టపడలేక పోతున్నావు, ఉద్యోగం మానేసి మంచి పని చేశావు. ఏం భయం లేదు. ఒక రెండేళు కళ్ళు మూసుకుంటే, తమ్ముడు కూడా చేతికి అంది వస్తాడు. పరవాలేదు” అంటూ ధైర్యం చెప్పాడు.
***
స్వాతి కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయి. అన్నగా నేనూ ఎంతో కొంత సాయం చేశాను. ఈ మధ్యే మా అబ్బాయలు పెడుతున్న బెడద వల్ల నేను ఏమీ సాయం చేయలేక పోతున్నాను స్వాతి కుటుంబానికి.
కార్తీక్ కూడా వీలయనప్పుడల్లా సాయం చేస్తూనే ఊన్నాడు. ఇంత అయినా కూడా స్వాతి నాన్నగారిని తప్ప మా అన్నదమ్ముల్ని ఎప్పుడూ డబ్బు సాయం అడగలేదు. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో.
***
ఇక పోతే మా రెండో కొడుకుని ఆస్ట్రేలియా పంపటానికి సరిపడే సొమ్ము ఎలా సమకూర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాము. నాన్నగారిని సాయం చేయమని అడగటానికి నాకు మొహం చెల్లటం లేదు. ఆయన బాంక్‌లో ఎంత ఉందో మాకు తెలుసు. అది అంతా కలిపితే సరిగ్గా సరిపోతుంది. కానీ అలా అంతా ఊడ్చి ఇవ్వమని అడగటం న్యాయం కాదని నాకూ నా భార్యకి తెలుసు. ఇప్పటికే ఆయన సేవింగ్స్‌లో పెద్ద మొత్తం మా పైనే ఖర్చు పెట్టారు. నిజానికి ఆయన సొమ్ము పై మా ముగ్గురికీ హక్కు ఉన్నది.
కార్తీక్‌కి నాన్నగారి సొమ్ము అవసరం లేదు. మా అమ్మ ముందే కాలం చేయటం వల్ల, మా నాన్నగారు తన ఉద్యోగ విరమణ తరవాత మా దగ్గరే ఉండి పోయారు. మధ్యలో నెలా రెండు నెలలు కోసం కార్తీక్ దగ్గరకు, స్వాతి దగ్గరకు వెళ్లి వచ్చేవారు.
అందువల్ల మాకు పెద్ద అవసరం వచ్చినప్పుడు స్వతంత్రంగా ఆయన్ని సాయం అడగటం, ఆయన వీలయినంతవరకు కాదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. గత రెండు నెలలుగా నాన్నగారికి ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఎక్కువ సమయం మంచంపై పడుకునే గడుపుతున్నారు. ఈ విషయం తెలిసి ఒక రోజు స్వాతి, “నాలుగు రోజులు నాన్నగారి దగ్గర ఉండాలని ఉంది, రమ్మంటావా?” అని అడిగింది.
“దానిదేముంది స్వాతీ. తప్పకుండా రా” అని తనతో చెప్పాక మాకు మరో ఆలోచన వచ్చింది .
‘స్వాతి బాగా ఇబ్బందుల్లో ఉంది. వచ్చి ఉన్న నాలుగు రోజుల్లోనే నాన్నగార్ని తన సేవింగ్స్‌లో కొంత భాగం రాసి ఇవ్వమంటే కాదనటానికి నాన్నగారి దగ్గర ఏం కారణం లేదు. కానీ ఉన్నది కాస్తా స్వాతికి రాసిచ్చేస్తే నా కొడుకుని విదేశాలకు ఎలా పంపటం?’ అని నాకూ మా ఆవిడకు బెంగ మొదలయింది .
“స్వాతి వచ్చి తన పేరున ఏమి రాయించుకోక మునుపే మనం మామగారికి ఉన్న విషయం వివరంగా చెప్పి వెంటనే సాయం చేయమని అడగండి. మీకు మొహమాటంగా ఉంటే చెప్పండి నేను మాట్లాడుతా” అంటూ మా ఆవిడ పోరు మొదలుపెట్టింది.
స్వార్థంతో కూడిన పని అని తెలిసినా, ఆ సమయంలో నాకు మా ఆవిడ ఆలోచన సమంజసంగా అనిపించింది. ఏమంటే ఇంత బతుకు బతికి వేరే బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ ఇంత పెద్ద సొమ్ము అప్పుగానైనా అడగటానికి నాకు అహం అడ్డు వస్తోంది.
***
ఆరోజు నాన్నగారి దగ్గర కూర్చుని మెల్లగా నేను విషయం వివరించాను. “మీకంటూ వేరే ఖర్చులు ఏమి లేవుకదా. ఆపాటి రోజువారి ఖర్చులు కాని, మీ ఆరోగ్యం చూసుకోవటానికి మేము ఉన్నాము కదా. రెండోవాడు ఆస్ట్రేలియా వెళ్ళడానికి మీరే సాయం చెయ్యాలి” అంటూ.
అనుకున్నట్లుగానే నాన్నగారు “అదేమిట్రా ఉన్నదంతా మీకు రాసి ఇచ్చేస్తే రేపు స్వాతికి, కార్తీక్‌కి ఏం జవాబు చెపుతాను?” అని.
“స్వాతికి అవసరం అయినప్పుడల్లా మీరు సాయం చేశారు కదా. ప్రస్తుతం తనకి పెద్ద అవసరాలు తీరాయి. స్వాతి పెద్దకొడుకు చేతికి అంది వచ్చాడు. ఇంకా రెండేళ్ళు పోతే చిన్నవాడు కూడా అందుకుంటాడు. వారి కుటుంబం దేముడి దయ వల్ల మంచి దారినే పడింది. కార్తీక్ చక్కగా సంపాదించుకుంటున్నాడు. తను మీ దగ్గర ఏదో ఆశిస్తాడు అనుకొను. ఇన్నేళ్ల నుంచి మీరు మా దగ్గర ఉన్నారు. మీకున్నదాంట్లో ఎక్కువ భాగం మాకు పెడ్తే స్వాతి గానీ కార్తీక్ గానీ అభ్యంతరం చెపుతారనుకోను, మావగారు. ప్రస్తుతం మాకు అవసరం కదా, మీరు సాయం చేయక పోతే మేము ఎవర్నిడుగుతాము చెప్పండి.” అంటూ మా ఆవిడ ఒత్తిడి చేసింది.
ఇలా రెండు మూడు సార్లు చెప్పగా చెప్పగా నాన్నగారు కొంత తన పేరున అట్టే పెట్టుకుని మిగతాది అయిష్టంగానే మాకు రాసి ఇచ్చేశారు.
అనుకున్నట్లుగానే స్వాతి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లింది. ఉన్న నాలుగు రోజులు నాన్నగారి దగ్గరే ఎక్కువ సేపు గడిపింది. ఈ మధ్యలో డబ్బు ప్రస్తావన ఏది రాలేదు.
ఒకవేళ తను అలాంటి ప్రస్తావన తెస్తే ఏం చెప్పాలా అని ఆందోళన పడ్డాను. కానీ అలాంటి అవసరం రానందుకు తేలిగ్గా ఊపిరి పీల్చాను.
తిరిగి వెళ్లిన కొన్నాళ్లకి స్వాతి మళ్లీ ఫోన్ చేసి, “అన్నయా, నాన్నగారు ఒంటరిగా ఫీలవుతున్నారనిపిస్తున్నది. నాకు పిల్లలు పెద్దవాళైయ్యారు. కొన్నాళ్ళు వచ్చి నాన్నగారి దగ్గర ఉంటే బాగుంటుంది అంటే చెప్పు, నేను వచ్చి ఉంటాను.” అంది.
నాకు మళ్లీ అదే భయం, అదే ఆలోచన. ఇన్నేళ్ళు నాన్నగారు మా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒంటరితనం పోగొట్టటానికి స్వాతి వస్తానంటే నాకు ఏదో అనుమానం, ఏదో సందేహం. ‘ఆఖరి రోజుల్లో దగ్గరుండి సేవలు చేసి ఉన్న ఆస్తి, సొమ్ము తన పేరున రాయించుకున్న వారిని చూసాము. ఒక వేళ స్వాతికి కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే….’ అన్న సందేహం నన్ను పీడిస్తున్నది . ఏమో… నాలోని స్వార్థం ఎదుటి వారి గురించి కూడా సమంగా ఆలోచించనివ్వటం లేదు. అందువల్ల స్వాతి ఇక్కడికి వచ్చి ఉండటాన్ని నేను ప్రోత్సహించలేక పోయాను.
***
ఎలాగైతేనేం నా రెండో కొడుకు విదేశాలకు వెళ్లటం, అక్కడ స్థిరపడటం అయింది.
గత నెల నుంచి నాన్నగారు మెల్లగా క్షీణిస్తూ ఆఖరికి ఒక రోజు ఉదయం లేచి మేము చూసేసరికి ఆయనలో చలనం లేదు. పాపం పోయే ముందు ఏం బాధపడ్డారో కూడా తెలీలేదు. నిద్రలోనే ప్రశాంతంగా ప్రాణం విడిచారో, లేక ఏమైనా బాధ పడ్డారో మాకు మాత్రం ఏమీ తెలీలేదు
వెంటనే కావల్సిన వారందరికి కబురు చేయటం, వారు రావటం జరిగింది. కబురు తెలిసిన మరునాడే స్వాతి కుటుంబం వచ్చింది. నాల్గవ రోజుకి కార్తీక్ కూడా భార్యతో పాటూ వచ్చాడు. భారమైన మనసుతో పెద్ద కర్మ కూడా జరిపించాము. ఎంతో ఆస్తి చేసుకోక పోయినా తాను సంపాదించింది అంతా తన సంతానం కోసమే ఖర్చుపెట్టి, చాలా సామాన్యమైన జీవితం గడిపారు నాన్నగారు. మా అమ్మ పోయిన దగ్గర నుంచి ఆయన లోని కోరికలు కూడా చనిపోయాయా అన్నట్టు ఆయన అవసరాలు కూడా చాలా తక్కువ గానే ఉండేవి.
పెద్ద కర్మ అయిపోయాక కార్తీక్ తిరిగి వెళ్ళి పోయాడు. నాన్న తన పేరున ఏమైనా ఉంచారా అని కార్తీక్ ఏమి అడగలేదు. స్వాతి, పిల్లలు కూడా వెళ్ళి పోయారు.
నేను భయపడినట్టు, కార్తీక్ గానీ స్వాతి గాని నాన్నగారి సేవింగ్స్ విషయం ఎత్తనందుకు నా మనసు కొంత స్థిమిత పడింది. అందరూ వెళ్లిపోయాక నాన్నగారి గది, ఆయన సామాను సర్దటం మొదలు పెట్టాను. ఆయన మంచం పక్క సర్దుతుంటే తలగడ కింద ఒక కవరు దొరికింది. ఏమై ఉంటుందా అని చూస్తే, అందులోంచి స్వాతి నాన్నగార్ని ఉద్దేశించి రాసిన ఉత్తరం బయట పడింది.
అప్రయత్నంగా చదవటం మొదలు పెట్టాను.
“గత కొన్ని నెలలుగా అన్నయ ఏదో అనుమానాలతో సందేహాలతో ఆందోళన పడుతున్నాడని నాకు అనిపిస్తునది. నా అంచనా తప్పు కావచ్చు. నేను ఎన్ని సార్లు వచ్చి తనతో మాట్లాడుదామనుకున్నా, నాకు అవకాశం కలగలేదు. అందువల్లే నేను ఈ ఉత్తరం వదిలి వెళ్తున్నాను.
ఎందుకైనా మంచిదని, ఈ ఉత్తరం ద్వారా, మీ సొమ్ముపై నేనూ నా పిల్లలూ సర్వ హక్కులూ వదులుకుంటున్నాము. దేముడి దయవల్ల ఎప్పటికప్పుడు మీ సాయం వల్ల నా పిల్లలు ఒక దారికి వచ్చారు. ఇక నాకు ఎలాంటి బెంగా లేదు.
మీ జీవితంలో ఎక్కువ భాగం మీరు అన్నయ దగ్గరే గడిపారు కాబట్టి మీ మిగతా స్వార్జితం మీరు అన్నయకి ఇచ్చినా, నాకు ఏం అభ్యంతరం లేదు. ఇక మీ దగ్గర నుంచి నేను కానీ నా పిల్లలు కూడా ఏమీ ఆశించటం లేదు. నేనూ నా పిల్లలు కూడా కింద మా సంతకాలు పెట్టాము.”
ఇది స్వాతి ఉత్తరం సారాంశం.
అందరి కంటే చిన్నది అయినా పెద్ద మనసుతో వ్యవహరించింది. నేను ఎంత తప్పుగా అంచనా వేసాను. మంచి మనసుతో నాన్నగారితో ఆఖరి రోజుల్లో కొంత కాలం గడపటానికి వస్తానంటే హర్షించలేక పోయాను. తను మనసులో ఎంత బాధ పడిందో కానీ నా భయం బాగా అర్థం చేసుకుంది.
స్వాతి ఉత్తరం నాకు కనువిప్పు అయితే ఈ కథకి ఒక కొసమెరుపు అయిందా??