కనువిప్పు

0
2

[dropcap]రాం[/dropcap]బాబు కాకినాడ వాస్తవ్యుడు. అతనికి చచ్చేటంత నాటకాల పిచ్చి. నాటకాలు చూడడం, వేయడం అతనికి ప్రాణం. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటినుంచి సూర్యకళామందిరంలో నాటకాలు ఎప్పుడు జరిగినా ఎంతో ఉత్సాహంతో వెళ్ళి చూసి వచ్చేవాడు. తనకి కూడ అవకాశం ఇమ్మంటూ ఎందరినో కాళ్ళావేళ్ళా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇది కాక అతనికి సంగీతమంటే కూడా మహా అనురక్తి. ఎక్కడ శ్రావ్యమైన పాట వినబడినా పరుగు పరుగున వెళ్ళిపోయేవాడు. సంగీతం నేర్చుకుంటానంటే చదువు దెబ్బ తింటుందని ఇంట్లో ససేమిరా వద్దన్నారు.

అసలు పదేళ్ళ వయసు వరకు ఏ ఇతర వ్యాపకం లేకుండా ఇల్లు, ఆట, బడి కింద ఉండేవాడు. కాస్తా ఎదో ఓ మంచి ముహూర్తాన పాటలు, నాటికల వైపు మరలిపోయాడు.

దీనికి తోడు రాంబాబు తాతగారింట్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అద్దెకు దిగాడు. అతనికి పాటలంటే చెవికోసుకునేంత ఇష్టం. పాటల రచన, రాగం, గాయకుని గళంలోని మాధుర్యమో, మెళకువలో తెగ చెప్పేవాడు. 1960 లలోని తెలుగు, హిందీ పాటలన్నిటిని వీళ్ళిద్దరూ చేరి మేధోమధనం చేసేవారు. గంటలు నిముషాలలా దొర్లిపోయేవి.

‘మీసాల మావయ్య’ అంటూ ఆయన చుట్టూ రాంబాబు తెగ తిరిగేవాడు.

“రాంబాబూ! అలా వెళ్ళొద్దాం రా!” అని కన్నుగీటి ఆయన తెగజోరుగా జంట కవుల్లాగ తిరిగేవారు.

ఆ ఏడు జిల్లాపరిషత్ నాటకాలకు రాంబాబు నిత్య ప్రేక్షకుడు. తనకెపుడు ఆ వేదిక ఎక్కుతానా అని ఆశగా ఉండేది.

స్కూలు ఎగగొట్టి మరీ నాటకాలు చూసే విపరీత ధోరణి లోకి వెళ్ళాడు.

ఓరోజు “రేయ్! రాంబాబు ఓసారిలా రా!” అని కిటికీలోంచి బిగ్గరగా పిలిచాడు శాస్త్రి గారు.

“వస్తున్నా మావయ్యా” అంటూ ఒక్క పట్టున పరుగుతీస్తూ వెళ్ళాడు.

“నేనూ… ఒక నాటకంలో డాక్టరు వేషం వేస్తున్నానురా! అందులో కాంపౌండరు వేషం ఖాళీగా ఉంది. నువ్వేమైనా వస్తావేమిట్రా!” అన్నారు పక్కింటి మావయ్య!

“ఓ! తప్పకుండా మావయ్యా!” అని సంబరంగా ఒప్పేసుకున్నాడు మన రాంబాబు.

రిహార్సల్స్ కోసం ఇద్దరూ యమ ఠంచనుగా వెళ్ళొచ్చేవారు. అందులో ముఖ్యపాత్రను ప్రముఖ రంగస్థల నటులు శేషాచలం గారు పోషిస్తున్నారు. ఆ పాత్రకు జబ్బు చేస్తే చూసే వైద్యుడి పాత్రను మీసాల మావయ్య, అసిస్టెంటుగా రాంబాబు వేస్తున్నారు.

ప్రదర్శన రోజు వచ్చింది. నాటకం మొదలైంది. ఆఖరున సుస్తీ చేసిన శేషాచలం పాత్ర, సుమారు చావుబ్రతుకుల మధ్యన ఉండగా, తన పిల్లలను పక్కన పెట్టుకుని, “నాయనలారా! నా జీవితమంతా నాటకాల పిచ్చితో మీ తాత ఇచ్చిన ఆస్తంతా హారతి కర్పూరంలా ఆవిరి చేసాను. సాధించిన పతకాలేమున్నా, లేకున్నా వయసు, ఆరోగ్యం, ఆస్తి మటుకు కరిగిపోయాయి. మీరైనా జాగ్రత్తపడండి. మీకు ఆస్తి ఇవ్వలేకపోయినా చదువొక్కటీ చదివిస్తున్నాను. అదే అన్నిటికి పరమౌషధం. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. నాటకం మనోరంజకం. అంతే గాని అదే జీవితం కాదు” అని ఆయాసపడుతూ చెప్పాడు.

‘కనువిప్పు’ నాటకం పూర్తి అయి తెర దింపారు.

పక్కవేషం వేసిన రాంబాబుకి మాత్రం నిజంగా ‘కనువిప్పు’ కలిగింది.

ఇంటికొచ్చాక అతనిలో అంతర్మథనం మొదలైంది. నిజమే నాటకాలకు వెచ్చించే కాలం చదువుకు పెడితే ఉద్యోగం గ్యారంటీ.

ఈ ఆలోచన వచ్చాక రాంబాబు వెనక్కి తిరిగి చూడలేదు. తరగతిలో ప్రథమ శ్రేణి పిల్లలతో ధీటుగా చదువుకొని, కళాశాల చదువులయ్యి హాయిగా ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

నాటక వీక్షకులలో మొదటి వరుసలో కూర్చుని ఆనందిస్తూ, కుదిరినపుడు విరాళాలు కూడ ఇస్తూ సంగీత కచేరీలకు, నాటక ప్రదర్శనలకు చక్కని ప్రోద్బలం అందిస్తూ జీవితాన్ని గడిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here