Site icon Sanchika

కనువిప్పు

[శ్రీమతి ఎనమల్ల శైలజ రచించిన ‘కనువిప్పు’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“ప్లీ[/dropcap]జ్, నాన్నా ప్లీజ్” అంటూ చిన్నపిల్లాడిలా మరీ మరీ బ్రతిమాలుతున్నాడు నా ఏకైక సంతానం సమీర్. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయినా కూడా ప్రస్తుత కాలం పోకడలకు పోకుండా, తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇస్తూ, వారి పట్ల అంకితభావం కలిగిన మరో శ్రవణ కుమారుడిలా వుంటాడు.

సెమిస్టర్ ఎగ్జామ్స్ మరో రెండు రోజుల్లో ముగుస్తున్నాయని, తర్వాత వచ్చే సెలవుల్లో ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా వారం రోజులు టూర్ వెళ్ళాలని వాళ్ళ ప్లాన్. దగ్గర్లోని ట్రెక్కింగ్ ప్రదేశాలు అయితే బాగుంటాయని ఫ్రెండ్స్ అందరి ఏకగ్రీవ తీర్మానమట. దాని గురించి నా అనుమతి కోసం రెండురోజులుగా నా వెంట పడుతున్నాడు. ఆఫీస్ నుండి ఇలా వచ్చానో లేదో ఇదిగో మొదలెట్టాడు ఇప్పుడే.

ఈ తరం పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో వుంటారు. బర్త్ డే పార్టీలని పబ్‍లకు వెళ్ళడం, డ్రంకెన్ డ్రైవ్ కేసులూ, డ్రగ్స్.. ఒకటేమిటి రకరకాల విపరీత ధోరణులు. అలా అని అందరిని ఒకే తాటిపైకి చేర్చలేము, కానీ పిల్లలే కదా అని వదిలేస్తే మన పరిధి దాటిపోతారేమో అని నా భయం. అందుకే సమీర్ విషయంలో నేను అంతగా ఆలోచిస్తాను. వాడి సరదాలకి అడ్డు పడాలని కాదు గానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని ముందు జాగ్రత్త నాది.

“ప్లీజ్ నాన్నా..” మళ్ళీ అడుగుతున్నాడు ఇంకాస్త దగ్గరగా వచ్చి.

“చూద్దాం.. ఆఖరి పరీక్ష కదా అని లైట్ తీసుకోకుండా, ఎగ్జామ్ బాగా రాసేలా చదువు మీద దృష్టి పెట్టు. మిగతావన్నీ తరవాత. ఇంకా టైం వుంది కదా..” అని గదమాయించి పంపించేసాను అక్కడ్నుంచి.

వాడు అలా అడుగుతుంటే ఒకింత గర్వంగానూ వుంది మరి. ఎందుకంటే స్నేహితులు చెబుతూ వుంటారు వాళ్ళ పిల్లల గురించి – ‘అసలు తమ మాట వినరు. అన్నింటికీ ఎదురు సమాధానం చెబుతారు’ అని. కానీ సమీర్ వాళ్ళందరికీ వ్యతిరేకం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని నాలో నేనే మురిసిపోతున్నాను. ఇంతలో పక్కనే కాఫీ కప్‌తో మా ఆవిడ రమ మెల్లగా దగ్గరికి వచ్చి కప్పు చేతికందిస్తూ ఏదో సణుగుతూ వుంది. అర్థం కానట్లు చూసాను.

మళ్ళీ ఏదో సణగడం. “ఏవిటి?” అన్నాను కాస్త గంభీరంగా.

“పాపం అండీ.. వారం రోజులుగా పదే పదే అడుగుతున్నాడు వాడు. ఈ ఒక్కసారికీ పంపిద్దాం అండీ”.

కొడుకు తరపున వకాల్తా పుచ్చుకుంది. పిల్లలు అమ్మ దగ్గర వున్నంత చనువుగా నాన్నతో వుండలేరు కదా. అందుకే ఈ అప్లికేషన్ వాడు ముందే అమ్మకి పెట్టుకున్నట్టున్నాడు అనుకున్నాను.

సమీర్ ఎప్పుడూ చెడు సహవాసం బారిన పడకుండా జాగ్రత్తగా చూడాలని రమతో నేను తరచూ చెబుతూ వుంటాను. అందుకేనేమో ఈ వారం రోజుల్లో తను ఏ రోజూ నన్ను అడిగే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు అడిగింది కూసింత భయంగానే.

సమీర్‌కి చెప్పిందే రమకి కూడా చెప్పాను. కాస్త ఘాటుగా..

“చూద్దాంలే. ఇంకా టైం వుంది కదా.. ముందైతే వాడిని పరీక్ష బాగా రాయమను… షికార్లు తర్వాత” అంటూ పక్కనే వున్న ఫోన్ తీసుకొని సీరియస్‌గా నా దృష్టిని ఫోన్ వైపు మళ్ళించాను. తను మారు మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది.

రమ లోపలికి వెళ్ళగానే ఫోన్ ప్రక్కన పెట్టేసి ఆలోచిస్తున్నాను.. వారంరోజులు కదా.. ఎలాంటి ఫ్రెండ్స్ వున్నారో వీళ్ళ గ్రూప్‍లో.. ఏమని చెప్పాలి.. పంపిస్తే ఎలా?.. వద్దంటే ఏమౌతుంది?.. పలురకాల సందేహాలు.. ఎందుకో వెంటనే మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయనైతే ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడు ఇలాంటి సందర్భాల్లో అనుకున్నా. ఒక్కసారిగా బాల్యం తాలూకు జ్ఞాపకాల దొంతరలు చుట్టుముట్టాయి.

***

మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. చిన్న కుటుంబం. ఇంట్లో నాకు, తమ్ముడికి అమ్మంటే చనువు. నాన్నంటే చచ్చేంత భయం. అలా అని నాన్నేమీ చండశాసనుడు కాదు. మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కాస్త కటువుతనం ప్రదర్శించేవాడు అంతే. కానీ మేమేం తక్కువ కాదన్నట్లు ఇద్దరం బాగానే విసిగించేవాళ్ళం..

చిన్నతనంలో నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దశలవారీగా అన్నీ గుర్తుకు వచ్చాయి.

నాకు ఏడేళ్ళు వున్నప్పుడు పక్కింటి పిల్లలని కొట్టడం, నాన్నతో బడిత పూజ. పదేళ్ళ వయసులో నాన్నకి తెలియకుండా అమ్మ ఇచ్చిన డబ్బులు సరిపోవు అన్నట్లు నాన్న జేబులోంచి కొట్టేసి మరీ సినిమా చూసి రావడం.. ఆ తర్వాత నాన్న చేతిలో వీపు విమానం మోత. పన్నెండేళ్ళ వయసులో ఇంట్లో చెప్పకుండా స్కూల్ నుంచి సాయంత్రం సరాసరి ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళడం. అర్ధరాత్రి తర్వాత కానీ ఆచూకీ తెలుసుకొని ఏమీ అనకుండా వదిలేసారని హమ్మయ్య అనుకునే సరికి తెల్లవారగానే కోటింగ్ పెండింగ్ ఎందుకు అనుకుని కానిచ్చేయడం.

పదిహేనేళ్ళ వయసులో ప్రేమ వ్యవహారం, క్లాస్‌మేట్ సునందకి ప్రపోజ్ చేసి తన కోసం తిరుగుతూ చదువు అటకెక్కించడం. నాన్న నా చెంప చెళ్ళుమనిపించడం. ఇంటర్‍లో స్నేహితులతో గొడవలు.. ఎంత జాగ్రత్త పడినా ఆ విషయాలు ఇంటికి రావడం. కాకపోతే నేను పెద్దవాడినైపోయాననుకున్నారో తక వయసు పెరిగే కొద్దీ శరీరం మొద్దుబారి పోతుందని అనుకున్నారో తెలియదు గానీ ఈ సారి దేహశుద్ధి జరగలేదు. కూర్చోబెట్టి చెప్పారు మంచి చెడూ.. అంటూ. కానీ అన్నీ పెడచెవిన పెట్టడమే నా పని.

నేను డిగ్రీలో వుండగానే చిన్నప్రేగు కాన్సర్‌తో పోరాడి అమ్మ కన్నుమూసింది. అమ్మ పోయినప్పటి నుండీ నాన్నే అమ్మ పాత్ర కూడా పోషించారు. తన సుఖ సంతోషాలను వదులుకొని ఇంటి పనులు, వ్యవసాయ పనులు అంటూ చాలా కష్టపడ్డారు.

మొత్తానికి ఒక సంవత్సరం ఆలస్యంగా డిగ్రీ పూర్తి చేసాను. ఆ తర్వాత పై చదువులకు నాన్న నన్ను అమెరికా పంపించారు. ఆ రోజుల్లో విదేశాల్లో విద్య అంటే అతి తక్కువ మందికి మాత్రమే దొరికి అదృష్టం. అలాంటిది నాన్న పొదుపు చేసి కూడబెట్టిన డబ్బులకి మరికొస్త అప్పు ఇత చేసి మరీ నన్ను పంపించారు. చదువు పూర్తి అయ్యాక అక్కడే ఒక ఫార్మాకంపెనీలో చేరి, కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకి షిఫ్ట్ అయ్యాను. ఇపుడు అదీ కంపెనీకి సంబందించిన అన్ని బ్రాంచెస్‌కి హెడ్‌గా వ్యవహరిస్తున్నాను పూణే కేంద్రంగా. తమ్ముడు కూడా మంచి ఉద్యోగం సంపాదించి ఇపుడు భార్యాబిడ్డలతో జర్మనీలో వుంటున్నాడు.

చిన్నప్పటి నుండీ నాన్నని కష్టపెట్టిన తీరుకి ఆయన కోపంతో మమ్మల్ని గాలికి వదిలి వేయకుండా ఎంతో సహనంతో కొవ్వొత్తిలా తను కాలిపోతూ మా జీవితాలలో వెలుగులు పూయించారు.

నేను అమెరికాలో వుండగానే రమతో నాకు పెళ్ళి నిశ్చయం అయ్యింది. పెళ్ళయ్యాక ఉద్యోగరీత్యా పూణేకి మకాం మార్చాం. ఆ తర్వాత మూడు నెలలకే నాన్న తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. కారణాలంటే చాలానే వున్నాయి. కడదాకా తోడు వుంటుంది అనుకున్న – అమ్మ సగం సగం దూరమే కలిసి ప్రయాణం చేసి అర్థాంతరంగా నిష్క్రమించడంతో మానసికంగా చాలా క్రుంగిపోయారు. దానికి తోడు ఇంటి బాగోగులు, పని ఒత్తిడి, అన్నీ వెరసి కుడిచేయి, కుడికాలుకి పక్షవాతం వచ్చి లేవలేని పరిస్థితి.

ఏం చేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో వున్న నన్ను చూసి రమ మాట్లాడిన తీరు నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. “అసలే మీకు ఆఫీస్‌లో విరామం లేని పని. వుంటుంది.. నీను ఇంట్లో ఖాళీగానే వుంటాను కదా.. మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను లెండి. మీరు ధైర్యంగా వుండండి” అంది. ఇంతగా అర్థం చేసుకొనే భార్య దొరికినందుకు ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

కానీ కొత్తగా పెళ్లి గంపెడంత ఆతలతో మెట్టినింట అడుగుపెట్టిన రమకి ఎందుకు కష్టం కలిగించాలి అనిపించింది. చేసేదేమీ లేక నాన్నని సొంతూరికి తీసుకెళ్ళాను. అక్కడైతే బందువులంతా వుంటారు.. రోజూ అందరితో మాట్లాడుతూ వుంటే తనకి కూడా కాస్త ఊరటగా వుంటుంది అనుకొని ఒక వారం రోజులు అక్కడే ఉండి పని మనిషినీ, వంట మనిషినీ, ఒక ఆయాని కుదిర్చి అన్నీ సక్రమంగా సమకూర్చానన్న ఆత్మసంతృప్తితో తిరిగి వచ్చేసాను.

***

“స్నానం చేసారా? భోజనం వడ్డించమంటారా? ఏవిటండీ ఈ రోజు టీవీ కూడా. చూడకుండా దీర్ఘాలోచనలో వున్నారు?” అంటూ నా భుజం తట్టి లోపలికి వెళ్తున్న రమని చూసి ఒక్కసారిగా గతంలో నుండి బయటకి వచ్చాను.

అదే పనిగా నాన్న ఎందుకు ఇంతలా గుర్తుకు వస్తున్నాడు. నాకు నేను వేసుకున్న ప్రశ్న.. అవును మరి.. అమ్మ మనకి గోరుముద్దలు తినిపించి ఎంత ప్రేమగా చూసుకున్నా గానీ, ఎప్పుడూ మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం తనకంటే ఉన్నత స్థానంలో వుండాలని – ఆ దిశగా మనం గమ్యం చేరేవరకు మనల్ని భయపెడుతూ, ఆడుతూ, కొడుతూ, సముదాయిస్తూ, మన భవిష్యత్తు పునాదులు వేసేది నాన్నే కదా మరి.

ఆ రోజుల్లో మా ప్రవర్తన తీరుకి నాన్న విసిగిపోయి అన్నీ మా ఇష్టానికి వదిలేసి వుండి వుంటే ఇపుడు మా పరిస్థితి ఎలా వుండేదో అని తలుచుకుంటే చాలు.. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బాల్యంలో నాన్నంటే భయం, గౌరవం వున్నప్పటికీ నేను ఏ రోజూ, ఏ విషయంలోనూ సమీర్ తరహాలో ఆయన అనుమతి కోసం ఎదురు చూడలేదు. కాకపోతే దండిస్తారేమో అని భయం వుండేది. కానీ ఇప్పుడు నాన్న నన్ను చూసి భయపడతారు. ఎందుకంటే ఇపుడు నేను ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఏదైనా, చెబుతున్నపుడు, ప్రతిసారీ ‘మీకేమీ తెలియదు ఊరుకోండి’ అంటుంటాను. అందుకేనేమో ఊర్లో ఒంటరిగా వదిలేసి వచ్చినా కూడా నిస్సహాయంగా మారుమాట్లాడకుండా వున్నారు పాపం. నిజానికి ఆయనకేమీ తెలియకుండానే నేను ఇంత వాడినయ్యానా? కాదుకదా? నాలో చిన్న పశ్చాత్తాపం.

కానీ సమీర్ విషయంలో అలా జరగట్లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నా.. ఏ రోజు కూడా నా అనుమతి లేకుండా ఏ పని చేయడు. అందుకే ఇపుడు తన టూర్ కోసం అంతగా బ్రతిమాలుతున్నాడు.

సమీర్ ఆఖరి పరీక్ష రోజు రానే వచ్చింది. “ఎగ్జామ్ బాగా రాసాను నాన్నా” అంటూ ఆనందంగా దగ్గరికి వచ్చాడు. టూర్ గురించి మళ్ళీ నోరు తెరిచి అడగలేదు. ఆరునూరైనా నేను ఇక ఒప్పుకోను అనుకున్నాడోమో మరి. అయినా వాడికి నా మీద కోపం రాలేదు.

ఇపుడు తెలుస్తుంది నాలో లోపం ఏంటో.. ఒక కొడుకుగా మా నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను. ఏ రోజూ తన మాటకి విలువనిచ్చేలేదు. ఒక తండ్రిగా నా కొడుకుని అర్థం చేసుకోలేకపోయాను. వాడు నాకు ఇచ్చే విలువను తెలుసుకోలేకపోతున్నాను. ఇపుడనిపిస్తుంది ఈ రోజుల్లో ఎంతమందికి దొరుకుతుంది నాలాంటి అదృష్టం అని. తండ్రి చేతిలో, కొడుకు చేతిలో ఇప్పటికీ గౌరవింపబడడం మామూలు విషయం కాదు. రెండు రోజులు బాగా ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకున్నాను.

సమీర్‌ని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని క్షేమంగా వెళ్ళిరండని సెండాఫ్ చేసి అదే రోజు ఊరెళ్ళి మా నాన్నని తీసుకొని పూణేకి తిరిగి వచ్చాను. వచ్చిన కొద్ది రోజులకే నాన్న పూర్తిగా కోలుకున్నారు. ఇరవై సంవత్సరాలుగా మంచం పట్టిన మనిషి సడెన్‌గా ఎలా మామూలు మనిషి అయ్యాడు అని తెలిసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అవును మరి ‘ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే ఖరీదైన బహుమతి వారి సమయం’ అని ఎక్కడో చదివాను. ఇపుడు నాన్నని చూస్తే నిజమే అనిపిస్తుంది.

నాకూ నాన్నకీ భోజనం వడ్డిస్తుంది రమ. సరదాగా కబుర్లు చెబుతున్నారు నాన్న. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సమీర్ టూర్ ముగించుకొని ఇంటికి వచ్చాడు. తలుపు తెరవగానే అమ్మానాన్నలని కూడా పట్టించుకోకుండా.. ‘తాతయ్యా..’ అంటూ ఆలింగనం చేసుకున్నాడు. మనవడిని చూడగానే తాత కళ్ళలో ఆనందబాష్పాలు. మనవడిని మరింత గట్టిగా హత్తుకున్నాడు.. పక్కనే చెమర్చిన కళ్ళతో నేను. ఇన్నాళ్ళుగా కోల్పోయిన ఆనందం ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది. తృప్తిగా అనిపించింది. నిండుకుండలా నా కళ్ళలో తొణికిసలాడుతున్న కన్నీళ్ళని గమనించినట్లుంది రమ. దగ్గరికి వచ్చి తన చీర కొంగుతో మృదువుగా తుడిచింది.

Exit mobile version