మహాకవి గురజాడ “కన్యాశుల్కం” లోని ఆంగ్ల భాషా కవితా పంక్తులు -వాటి మూలాలు

2
3

[box type=’note’ fontsize=’16’] గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం మొదటికూర్పులోని గిరీశం చేత ఒకటి లేదా రెండు, మూడు పాదాలుగా మాత్రమే చెప్పించిన ఆంగ్ల సూక్తుల గురించి, ఆంగ్ల పద్యాల గురించి, వాటి రచయితల గురించి రేఖామాత్రంగా తెలియజేసే వేదప్రభాస్ గారి రచన. [/box]

గురజాడ అప్పారావుగారు తన కన్యాశుల్కం మొదటికూర్పులోని *(1) ఒకటవ అంకంలో గిరీశం చేత ఒకటి లేదా రెండు, మూడు పాదాలుగా మాత్రమే చెప్పించిన ఆంగ్లసూక్తుల గురించి, ఆంగ్లపద్యాల గురించి, వాటి రచయితల గురించి*, కన్యాశుల్కం నాటిక పుట్టి, 125 ఏళ్ళయిన సందర్భంగా, రేఖామాత్రంగానైనా  తెలియజేయాలన్నదే ఈ రచన ప్రధానోద్దేశం.

ప్రాచీన సాహిత్య పత్రిక అముద్రిత గ్రంధ చింతామణి 1899 మార్చి సం.10, సంచిక-3 లో గురజాడ వారి  కన్యాశుల్కాన్ని ఉద్దేశించి రాసిన మాటలు.

“ఈ నరమాంస విక్రయమను కన్యాశుల్కము ముఖ్యముగ నింగ్లీషు వాసన తెలియనివారిలో నిపుడు జరుగుతున్నది. దాని నాపవలయునని గ్రంధకర్తగారి యుద్దేశము. అట్టివారికి స్పష్టముగ తెలియుటకై, గ్రామ్యోక్తులిందు జేర్పబడినందులకై మేమా మోదించితిమి. ఇట్టి గ్రంధములకు సలక్షణమగు గ్రాంధిక భాష నిరుపయోగము గాన “శశిరేఖ” అబిప్రాయముతో మేమేకీభవింపముగాని, ఇంగ్లీషు పదములు విశేషముగ జేర్చినందులకై మాత్రము కొంచె మాలోచించుచున్నారము. గ్రంధకర్త అభిప్రాయానుసారముగ, నీకాలమునందలి తెలుగు సంభాషణలలో నింగ్లీషు పదములు జేరుచున్నవనుట నిజమే. అయిననవి అందరకు వాడుకగా నుండు,సైడ్డు కాలువ, మిటికిలేషన్’.. అనునట్టి సర్వసాధారణ పదమువలె గాక, సింప్లిసిటీ, లవ్’సిగ్నల్స్’, ఇన్సిన్సియారిటీ, కంపారిజన్, డ్రెడ్ ‘ఫుల్లీఇన్’ లవ్, వంటి నపూర్వపదము లింగిలీషు రాని వారికెట్లు బోధపడునో తెలియదు. సర్వసాధారణమగు సంభాషణ కానందున గ్రంధకర్తగారి యుద్దేశమునకు భంగము కలిగినదని సంశయించుచున్నారము.. నాటకరంగమున ఇట్టి మాటలు చ్చరించుటయు, నందులకై లోకము నవ్వుటయు నొక ముఖ్యోద్దేశము కాదు గదా! అర్థము గాని నాడిది బధిర శంఖారావమే గానీ వేరు గాదు… ఇంగ్లీషు పదములలో వాడుకలో నుండువానిని ప్రయోగించినచో నా భాషాజ్నానము లేని వారికి దెలియునని, మా వాదముగాని, వానిని బొత్తిగా ప్రయోగింప గూడదని గాదు. ప్రాక్రుతమునకు ఛాయ రాసినట్లుగ నట్టి వాడుకలేని ఇంగ్లీషు మాటలకు నొక తెలుగర్థము గల ఛాయ సంపూర్ణముగా నున్నను గొంతమేలని తోచెడి. అది నాటకరంగమునకు నిష్ప్రయోజనమైనను, జనులకు గ్రంధము జదువునపు డుపయోగపడునని నమ్ముచున్నాము” అని ఈ పత్రిక కన్యాశుల్కాన్ని విమర్శించింది. (*2)

కవులు తమ కావ్యం ప్రజల సొమ్ము అనుకున్నప్పుడు, విమర్శకులు తమ విధి సంఘసేవ అనుకున్నప్పుడు, సంయమనం, సహృదయత వాటంతట అవే కనబడతాయి. మనకి నేటికీ వొరవడి పడమటి గడ్డే కదా.

1.”పూర్ రిచ్చర్డు చెప్పినట్టు పేషన్సు ఉంటేనే కానీ లోకములో పని జరగదు” అని ఆయన గిరీశంతో తెలుగులో చెప్పించిన ఉవాచ, “He that can have patience can have what he will”అని ఆంగ్లంలో చెప్పిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ది.

బెంజమిన్ ‘ఫ్రాంక్లిన్’  (Benjamin Franklin) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త. ఆయన జనవరి 17, 1706న జన్మించాడు. ఏప్రిల్ 17, 1790న మరణించాడు. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాతల్లో ఒకడు. అతడు రచయిత, ముద్రాపకుడు, రాజకీయసిధ్ధాంతకర్త, రాజకీయ నాయకుడు, పోస్టుమాస్టర్, శాస్త్రవేత్త, అన్వేషకుడు, ప్రజాసేవకుడు, జాతీయ నాయకుడు. విద్యుత్తు రంగంలో పరిశోధకుడు. పిడుగు నిరోధకాన్నీ, చత్వారపు కళ్ళద్దాలనీ, కనుక్కున్న భౌతిక శాస్త్రవేత్త. ఆనాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వలస ప్రాంతాల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడి”The first American”గా బిరుదుపొంది, గౌరవింపబడిన వ్యక్తి. అతడు తనకి “పూర్ రిచర్డ్” అని మారు పేరు పెట్టుకున్నాడు. అతను ఉపయోగించిన ఎన్నోసూక్తులు కూడా ఎంతగానో పేరుపొంది, ఎందరో ఉపయోగించుకున్నవే అయ్యేయి. గురజాడ అప్పారావు గారు కూడా patience మీద ఆయన చెప్పిన సూక్తిని తన కన్యాశుల్కంలో వాడేరు.

  1. 1897లో కన్యాశుల్కం మొదటి కూర్పులో ప్రచురింపబడి, తర్వాత ప్రచురింపబడిన రెండవ కూర్పులో కనిపించని ఆంగ్ల పద్య చరణం.

When lovely woman stoops to folly,
And finds too late that men betray,
What charms can smooth her melancholy,
What Arts can wash out her guilty away.

ఆయన రాయని చరణం

ఆలివర్ గోల్డ్‌స్మిత్

The only art her guilt to cover,
To hide her shame from ev’ry eye,
To give repentance to her lover,
And wring his bossom is-to die.

 ఇవి ‘ఆలివర్ గోల్డ్‌స్మిత్’ తనకు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చిపెట్టిన, “ది వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్” (1766) పుస్తకంలో ఛాప్టర్ ’24’లో రాసిన రెండు పద్యాలు.

అప్పారావు గారు వాటిలో మొదటి దాన్ని గిరీశం వ్యక్తిత్వాన్ని చెప్పేందుకు ఉపయోగించేరు.

  1. “Can love be controlled by advice?

 Will Cupid our mothers obey?”

కన్యాశుల్కం నాటకం ప్రారంభంలో గిరీశం పాత్ర చెప్పిన పై రెండు పంక్తులూ, 1728లో జాన్ గే అనే ప్రఖ్యాతి చెందిన స్కాట్లాండు రచయిత రాసిన  ది బెగ్గర్స్ ఒపెరా” అనే బాలేలో మొదటి అంకంలోని 8వ రంగంలో ‘పోలో అనే అమ్మాయి చెప్పిన లేదా పాడిన పాటలోనివి.

జాన్‌ గే (1685-1732)

జాన్‌ గే, ఎంతో పేరుపొందిన ఆంగ్లకవీ, నాటక రచయిత. అతను రాసిన వాటిలో The Beggars Opera” (1728) అన్నగేయనాటిక, అతని కీర్తిని మరింత పెంచింది. దానిలోని ఒకపాత్ర అన్నదాన్ని కన్యాశుల్కం మొదటి కూర్పులో గురజాడ అప్పారావుగారు గిరీశం చేత చెప్పించేరు. మరెందుకోగాని, దాన్ని తరువాత కూర్పులోనుంచి తొలగించేరు.

ఆ మొత్తం పాటలో కొంత భాగాన్నికింద పేర్కొనడం జరిగింది.

The Beggar’s Opera (1728)

by

John Gay

Act I, Scene 8

POLLY:

CAN LOVE BE CONTROLLED BY ADVICE?
WILL CUPID OUR MOTHERS OBEY?
THOUGH MY HEART
WERE AS FROZEN AS ICE,
AT HIS FLAME
‘TWOULD HAVE MELTED AWAY.
WHEN HE KISSED ME

  1. “It is women that seduce all mankind”

ఇది కూడా, పధ్ధెనిమిదవ శతాబ్దపు పూర్వార్ధంలో ఎంతో ప్రసిధ్ధి చెందిన పాశ్చాత్య రచయిత జాన్ గే రాసిన, ఎంతో ప్రాచుర్యాన్నిపొందిన ’బెగ్గర్స్ ఒపేరా’ నృత్య నాటకంలో, జాన్’గే, ఆడవాళ్ళ మీద రాసిన, రెండవ పాటలోని మొదటి పాదానికి చిన్నమార్పు చేసి గురజాడ అప్పారావుగారు తన నాటకంలో గిరీశం చేత పలికించినదే.

‘Tis woman that seduces all mankind
By her we first were taught the wheedling Art
Her very eyes can cheat when most she is kind
She tricks us of our money with our hearts
For her like volves by night, we roam for prey
And practise ev’ry fraud to bribe her charms
For suits of love, like law are won by pay
And beauty must be fee’d into our arms. ———- J.Gay

 5. “O whistle to me Ill come away

Though father, mother and grand mother

Should go mad.

పైన పేర్కొన్న మూడు పద్యపంక్తులు ’Robert Burns’ రాసిన Whistle, And I’ll Come To You, My Lad” అనే కోరస్ గానంలోని నాలుగు చరణాల్లో, మొదటి చరణంలోని 2, 3 వరుసల్లోనివి అవుతాయి. గురజాడ కవి ఆ పద్యాన్ని కొద్దిగా మార్చిఇం గ్లీషు భాష చదవగలిగే వాళ్ళకి అర్థమయ్యేలా తన నాటకంలో రాసేరు.

Robert Burns (1759-1796)

Robert Burns అనే స్కాట్లాండు దేశస్తుడైన ఆంగ్లకవి, గీతరచయిత, 37 సంవత్సరాల వయసులోనే మరణించినా నేటికీ స్కాట్లాండు దేశస్తుల మనస్సులో నిలిచిపోయిన వారి జాతీయకవి. అతను తన 15వ ఏట కవిత్వం రాయడం మొదలుపెట్టి తను మరణించే కాలానికి 220 పద్యరచనలను చేసిన వ్యక్తి. అంతేకాదు, 400 పాటలను కూడా కూర్చిన కవి. అతను, ఆ దేశపు భావకవిత్వానికి ఆద్యుడు, రూపకర్త. స్కాట్లాండు దేశంలో అనేక పట్టణాల్లో అతని విగ్రహాలు కనిపిస్తాయి.అతను రైతుకవిఅని పేరుపొందేడు. తన స్కాటిష్ భాషలోనే అతను తన కవిత్వం అంతా రాసి, స్కాట్లాండు దేశంలోనే కాదు, ప్రపంచదేశాలన్నిటిలోనూ చిరస్థాయిగా గుర్తింపు పొందేడు… అతని పేరుతో 1956లో రష్యాదేశం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

 

  1. The Widow

కన్యాశుల్కం మొదటి కూర్పులో వెంకటేశం, గిరీశాన్ని అడుగుతాడు:  ”మీరు విడోసు మీద రాసిన పొయిట్రీ ఇస్తామన్నారు. ఒక మాటూ చదివేరు కారు.”  దానికి గిరీశం ఇలా అంటాడు. “అది నేను రిఫార్మరులో అచ్చు వేయించేటప్పటికి ‘టెన్నిసన్’ గుండె కొట్టుకున్నాడు. ‘మై మదర్’ అనే పొయిట్రీ నీకు వచ్చునా?”

అప్పుడు వెంకటేశం: “వచ్చును. బారోసు రీడర్లో చదివేను” అంటాడు.

రెండో కూర్పులో కొద్ది  మార్పులతో వాళ్ళిద్దరి సంభాషణా ఇలా ఉంటుంది.

వెంకటేశం: “మీరు విడోసు మీద రాసిన పొయిట్రీ ఇస్తామన్నారు. ఒక మాటూ చదివేరు కారు.”

గిరీశం: “అడగ్గానే ఇస్తే వస్తువ విలవ తగ్గిపోతుంది. అదొహటిన్నీ మఱ్ఱెండేళ్ళు పోతే గానీ దాని రసం నీకు బాగా  బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చాస్తాను. నోటు బుక్కు తీసి రాయి.

She leaves her bed at A.M.Four
And sweeps the dust from off the floor.
And heaps it all behind the door
The Widow

 ఇక ఇప్పుడు ఈ అనుసృజనకి మాతృక అయిన “The Mother” గురించి వివరిస్తాను.

ఈనాటికీ ప్రపంచంలోని అన్ని దేశాలవాళ్ళకీ, చిన్నపిల్లలకి రైమ్స్  భోదించేటప్పుడు, మిగతావి తెలిసినా, తెలియకపోయినా “Twinkle Twinkle Little Star” మాత్రం తెలియకుండా ఉండదు. అయితే, ఇది ఒక్క చరణం మాత్రమే ఉన్న రైమ్ కాదనీ, అసలది రైమ్ కానేకాదు. చిన్నపిల్లల్ని నిద్ర పుచ్చేటందుకు పాడే జోలపాటగా దాన్ని Ann Taylor, Jane Taylor అనే కవల సోదరీమణులు (1783/1866) రాసేరనీ చాలామందికి తెలియదు. ఆ సోదరీమణుల్లోAnn Taylor రాసినదే, గిరీశం తన శిష్యుణ్ణి మొదటికూర్పులో అడిగిన.”మైమదర్” పద్యం. ఆ పద్యం లేదా పాట ప్రపంచంలో చాలామందికి చాలా ఇష్టమైనది. మే 5వ తేదీన ప్రతీ ఏటా జరిగే Mothers Day  నాడు కోట్లాది మంది ఎంతో ఇష్టంగా వినేదే ఆ పాట. ఉదహరించడం కోసం మాత్రమే దానిలోని రెండు చరణాలు కింద రాస్తున్నాను.

Who sat and watched my infant head
When sleeping on my cradle bed,
And tears of sweet affection shed?
My Mother.
When pain and sickness made me cry,
Who gazed upon my heavy eye,
And wept for fear that I should die?
My Mother.

125 ఏళ్ళ కిందట రచనలు చేసి, నేటికీ, కథ, కవిత, నాటక రచనల్లో మహామేరునగమైన మహాకవి గురజాడ ఆనాటి ఆంగ్లభాషా సాహిత్యాన్ని ఎంతగా ఔపోసన పట్టేడో, ఎంతగా తన గ్రామ్యవాద… వ్యవహారిక రచనల్లో వాటికి స్థానం కలిగించేడో తెలుసుకుంటే, ఆ మహాకవికి తెలుగువాళ్ళెవరైనా ముకుళిత హస్తాలతో…  నీరాజనాలర్పిస్తారు… ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఆయన రచనల మీద పరిశోధనాంశాలు చాలా మిగిలే ఉన్నాయి.

* (పై విషయాలు “కన్యాశుల్కంలో ఆంగ్ల సాహిత్య సౌరభాలు” అనే విశ్లేషణ ప్రధానంగా రాసిన, నా పుస్తకంలో పూర్తి వివరణాత్మకంగా ఉంటాయి)

  (*1. విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ వారిచే ప్రధమ ముద్రణగా, ప్రచురణ నెం.854 గా ఆగష్టు 1969లో, ద్వితీయ ముద్రణగా మార్చి 1977లో. స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్, విజయవాడ వారిచే ప్రచురితమైంది.)

 (*2. ఇది తిరుమల రామచంద్ర రాసిన “సాహితీ సుగతుని స్వగతం” వ్యాస సంపుటంలో పేజీ నెం.92 నుంచి సేకరించినది.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here