కవిచంద్రునికి రచయితల నూలుపోగు- అలరించిన ‘కన్యాశుల్కం’ కైమోడ్పు – వార్త
[విశాఖపట్టణంలో జరిగిన ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన వార్తని అందిస్తున్నారు మల్లాప్రగడ రామారావు.]
“సాయంకాలమైంది” అన్న గిరీశం మాటలు ప్రస్తావిస్తూ, రావిశాస్త్రి, “మానవమాత్రుడు ఇలా రాయగలడా?” అన్నారని విన్నాను. ఈ వాక్యం తోటే మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’ ప్రారంభమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నాటకం ఎన్నాళ్ళకీ నిత్యనూతనమే.
కన్యాశుల్క దురాచారం వరకట్నం పిశాచంగా మారినందుకు కాదు. ఈ దయ్యమూ వదిలినా ‘కన్యాశుల్కం’ నాటకం నవనవోన్మేషమే. ఎందుకంటే మానవలోకంలో ఎల్లప్పుడూ గిరీశాలూ, లుబ్దావధాన్లూ, పూటకూళ్ళమ్మలూ, సుబ్బమ్మలూ మాత్రమే కాదు హెడ్ కానిస్టీబుల్లూ, బైరాగులూ, కన్యాశుల్కం స్త్రీ పురుషులందరూ కాలానుగుణమైన వేషభాషలతో అన్నియుగాలలోనూ సంచరిస్తూనే ఉంటారు.
సకృత్తుగా మధురవాణిలూ, సౌజన్యారావు పంతుళ్ళూ అవతరిస్తూ ఉంటారు. ఈ స్పృహతో, విశాఖపట్నం రచయితలు కొందరు ఈ సజీవ నాటకాన్ని కుదించైనా ప్రదర్శించాలని కంటున్న కల పది సంవత్సరాల తర్వాత, మహాకవి 109 వర్థంతికి రెండు రోజులు ముందుగా, నవంబర్ 28న నిజమైంది. కారణాంతరాల వల్ల ఇందుకు వేదికైన విశాఖ పౌర గ్రంథాలయం సమావేశమందిరం ప్రేక్షకుల ఒత్తిడికి ఉక్కిరి బిక్కిరయింది.
ఈ సంకల్పం చెప్పుకున్న కవి, విమర్శకుడు రామతీర్థ, రంగస్థల ప్రయోక్త బాదంగీర్ సాయి ఇద్దరూ కీర్తిశేషులయినప్పటికీ, మిగిలిన నేస్తులు రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి. రమణమూర్తి సౌజన్యతో, పేరి రవికుమార్ సారథ్యంలో, మూల నాటకంలోని మాటలను మార్చకుండా గంటకు కుదించిన “కన్యాశుల్కం” ప్రదర్శించి రసజ్ఞుల ప్రశంసలకు పాత్రులైనారు.
రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందిన రాంభట్ల నృసింహశర్మ రచించగా, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గురజాడ అప్పారావు గేయాన్ని వినిపించిన తర్వాత, డా.డి.వి.సూర్యారావు గురజాడ రూపుదాల్చి, నాటక రచనలో కవి ఆంతర్యాన్ని ప్రకటించిన అనంతరం నాటక ప్రదర్శన మొదలయ్యింది.
ఆరు పర్యాయాలు రిహార్సల్స్ చేసి పురుష పాత్రధారులుగా రూపాంతరం చెందిన రచయితలు నటులుగానూ ఔననిపించుకున్నారు.
గిరీశం పాత్రలో రాంభట్ల నృసింహశర్మ, వెంకటేశం పాత్రలో ఓలేటి శంకర్, రామప్పపంతులు పాత్రలో పేరి రవికుమార్, అగ్నిహోత్రావధాన్లుగా పిల్లా రమణమూర్తి, కరకటశాస్త్రి పాత్రలో సిహెచ్.చిన సూర్యనారాయణ, లుబ్ధావధాన్లు పాత్రలో వి.వి.రమణమూర్తి, సౌజన్యారావు పంతులుగా కొచ్చర్లకోట సత్యనారాయణమూర్తి, నటించారు.
వృత్తి రీత్యా నటులైన సుప్రియ, శివజ్యోతి మధురవాణిగా పూటకూళ్ళమ్మగా మెప్పించారు.
రాంభట్ల రచించిన ఉపక్రమణికను, సన్నివేశాల మధ్య వచ్చే పేరి రవికుమార్ రచించిన కథానుసంధానాన్ని శ్రీ మేడా మస్తాన్‌రెడ్డి తన బాణిలో వినిపించారు.
రంగాలంకరణను, నటుల అలంకరణను నవరసమూర్తి సమకూర్చారు. పి.రాజు సంగీతాన్ని అందించారు.
ప్రదర్శనానంతరం ఎవరూ అడగకుండానే మ్రోగిన చప్పట్లే నట రచయితల కృషి సఫలతకు నిదర్శనం.