[డా. ప్రభాకర్ జైనీ గారి ‘కన్యాశుల్కం రివిజిటెడ్ ఇన్ 2022’ అనే నవలని జి.ఎస్. లక్ష్మి గారు సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు.]
[dropcap]భా[/dropcap]రతదేశ సమాజం నిలకడగా నిలబడడానికి కారణం కుటుంబ వ్యవస్థేనని మేధావులు విశ్లేషించారు.
మంచికయితేనేం.. చెడుకయితేనేం మారుతున్న కాలంతోపాటు సమాజంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాని పర్యవసానమే ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతున్న చీలుతున్న కుటుంబ వ్యవస్థ.
కుటుంబ మనేది ఇరువురు వ్యక్తులు వివాహం చేసుకొనడం వల్ల ఏర్పడుతుంది. అటువంటి వివాహ వ్యవస్థే స్వార్థంతో కూడిన వ్యాపారంగా మారిపోతుంటే ఒకప్పటి కన్యాశుల్క మనే సాంప్రదాయం ఇప్పుడు మళ్ళీ కనపడుతోంది అని వివరించి చెప్పే రచన శ్రీ ప్రభాకర్ జైనీ గారు వ్రాసిన ‘కన్యాశుల్కం రివిజిటెడ్ ఇన్ 2022’ అనే నవల.
52 వారాలపాటు ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురించబడిన ఈ నవల చాలామందిని ఆకర్షించింది.
కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే ఒక వైశ్యుడు, అతని కొడుకుల పెళ్ళిళ్ళ విషయంలో ఎదుర్కున్న సమస్యలూ, దానితోపాటు అలాగే అతని స్నేహితులు కూడా వారి వారి కొడుకుల పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడంలో పడిన పాట్లూ చదువుతుంటే మనకి ఆశ్చర్యమనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం ఇంత స్వార్థంగా ఉందా అనిపించక మానదు.
అదే సమయంలో ‘నేను’ అని రాసుకున్న ఆ కుటుంబ యజమాని వ్యక్తిత్వం మనను ఆకట్టుకుంటుంది.
మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత డబ్బున్నా అంతా తన గొప్పతనమే అనుకోకుండా దైవానుగ్రహం అనుకోవడం, తల్లితండ్రులు పాతబస్తీ వదిలి తమ దగ్గర ఉండడానికి వారు కోరినట్లు చేయడం, జీవిత భాగస్వామిని తనతో సమానంగా చూసుకోవడం (ఒక్కొక్కసారి తనకన్నా కూడా ఎక్కువగానే అనిపిస్తుంది కూడా..), కొడుకుల కోసం పడే తాపత్రయం, స్నేహితులకి ఇచ్చే విలువా.. అన్నింటికన్నా తన చుట్టూ ఉన్నవాళ్ల బాగోగులు పట్టించులోవడం లాంటివి చూస్తుంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది.
ఈ నవలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాత్ర ‘మహా’. ఒక ఇల్లు సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉండాలంటే అది పూర్తిగా ఆ ఇంటి ఇల్లాలి పైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి ఇల్లాలికి తెలిసిన హోమ్ మేనేజ్‌మెంట్ ఏ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ చెప్పలేరు. మూడుతరాల మనుషులని ప్రతిరోజూ ఒకే తాటిమీద నడిపించడమంటే ఒక్క ఇంటి ఇల్లాలికే సాధ్యం. సరిగ్గా అటువంటి ఇల్లాలే ‘మహా’. ఈ నవలకే ఆమె మహారాజ్ఞి.
ప్రస్తుతం సమాజంలో కొన్ని ప్రత్యేకమైన కుటుంబాలలో పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడంలో మారుతున్న ప్రక్రియలను ఆకట్టుకునే రీతిలో, అనుకోని సంఘటనలను కూర్చి ముందేమి జరుగుతుందోననే ఉత్కంఠతో, ఆసక్తికరంగా చదివించే ఈ నవల ఎప్పటిలాగే ప్రభాకర్ జైనీ గారి రచనలలో మరో మాణిక్యం.
***
రచన: డా. ప్రభాకర్ జైనీ
పేజీలు: 224
వెల: ₹ 250/-
ప్రతులకు:
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత వద్ద:
Address:
Dr. Prabhakar Jaini, Flat No. 111,
‘C’ Block, Vishnu Residency,
Gandhinagar, Hyderabad – 500080
Cell: 7989825420