కన్యాశుల్కం నాటకాన్ని తెలుగువాళ్లెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా? – పుస్తక సమీక్ష

6
2

[dropcap]‘క[/dropcap]న్యాశుల్కం నాటకాన్ని తెలుగు వాళ్లెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా?’ అన్న వ్యాస సంపుటిని ఇటీవలే వెలువరించారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారు! సాహిత్య వ్యాసాలు, ముందు మాటలు, సమీక్షలను ఇందులో చేర్చారు! నవల మరియు కథా రచయితగా ప్రసిద్ధుడైన ఆయనకు తెలుగు సాహిత్యంలోని ఇతర ప్రక్రియలైన కవిత్వం, నాటకం, సాహిత్య విమర్శలపై ఎంతటి అభినివేశం ఉందో ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివితే మనకు అర్థమవుతుంది!

ఇందులో వ్యక్తుల గురించి వారి రచనల గురించి ఆయన వేసిన అంచనాలు, చేసిన సూచనలు, నెమరు వేసుకున్న జ్ఞాపకాలు ఎంతో విలువైనవి వర్ధమాన రచయితలు తప్పకుండా తెలుసుకోదగినవి! విద్యార్థి దశలో ప్రారంభమైన ఆయన సాహితీ వ్యాసంగం అధ్యాపకత్వం మీదుగా వృద్ధి చెంది 80వ వడికి చేరుకోబోత ప్రస్తుత తరుణంలో కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది! అర్థ శతాబ్దం దాటిన ఆయన అనుభవ సంపదకు ఈ వ్యాస సంపుటి ఒక దర్పణం వంటిది! ఈ పుస్తకం చదువుతుంటే 50 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రలోని ప్రధాన ఘట్టాలు మన కళ్ళముందు కదలాడుతాయి! ఈ పుస్తకానికి ముందుమాటగా ఉన్న వ్యాసం చాలా ముఖ్యమైనది! సాహితీ ప్రియులను ఆలోచింపజేసేది! కన్యాశుల్కం నాటకాన్ని తెలుగు వాళ్ళు ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకో లేదా అన్నది ఆ వ్యాసం పేరు! కన్యాశుల్కం నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వేల్చేరు నారాయణరావు ఆ నాటకం పై రాసిన సుదీర్ఘ వ్యాఖ్యానానికి ప్రతిస్పందనగా నవీన్ గారు ఈ వ్యాసాన్ని రాశారు! వెల్చేరు గారి వ్యాస సారాంశం ఏమిటంటే కన్యాశుల్కాన్ని ఆకాశానికి ఎత్తిన వాళ్ళందరూ ఆ నాటకాన్ని సంఘ సంస్కరణ కోసం రచించబడిన నాటకం గానే అర్థం చేసుకున్నారనీ, నిజానికి ఆ నాటకంలో సంఘ సంస్కరణ అన్నది ప్రధానమైన అంశం కానే కాదనీ, పైగా గురజాడను ఇతర సంఘ సంస్కరణవాదులైన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగంలతో చేర్చడానికి కన్యాశుల్కాన్ని పొగిడిన పెద్దలంతా విపరీతంగా పోటీ పడ్డారని స్థూలంగా వేల్చేరు యొక్క అభియోగం!

అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి! ఇతరులెవరూ కూడా చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా చెప్పి అలా చెప్పడం సరైంది కాదని వాదించడం ఏ విధంగా సరి అయినది అన్నది నవీన్ ప్రశ్న! ఈ విషయాన్ని చెప్పడం కోసమే నవీన్ గారు చాలా పెద్ద కసరత్తు చేశారు! కన్యాశుల్కాన్ని మెచ్చుకున్న పెద్దలెవరూ దానిని సంఘ సంస్కరణకు ఉద్దేశించి రాసినట్లుగా ఎక్కడా చెప్పలేదని నవీన్ అనేక దృష్టాంతాలతో వివరించారు! అందుకు ఆయన ఆ నాటకం పై విశేష కృషి చేసిన ఉద్దండుల అభిప్రాయాలను ఈ వ్యాసంలో ఉటంకించారు!

సెట్టి ఈశ్వరరావు, నిడదవోలు వెంకట్రావు, అబ్బూరి రామకృష్ణారావు, కట్టమంచి రామలింగారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, శ్రీ శ్రీ, కె.వి.రమణారెడ్డిల అభిప్రాయాలను సందర్భానుసారంగా ఉటంకించారు! సెట్టి ఈశ్వరరావు అభిప్రాయం ప్రకారం కన్యాశుల్కం యథార్థ జీవిత ఇతివృత్తంతోనూ సహజం,సులభం, అయిన వాడుక భాషతోనూ ప్రగతి చింతనతోనూ విలువైన సాహితీ ప్రమాణాల్ని జతచేసి అది కొత్త భాషా సాహిత్యాలకు నాంది అయ్యింది! ఆ విధంగా ‘అది ఆధునిక యుగానికి ఆది కావ్యం అయింది”!.

అలాగే కన్యాశుల్కం కేవలం నాటకమే కాదు, అది తెలుగు వారి రాజకీయ సాంఘిక సాహిత్య జీవితానికి అద్దం వంటిది అన్నది నిడదవోలు వెంకట్రావు అభిప్రాయం! వీరితోపాటు అబ్బూరి రామకృష్ణారావు, శ్రీ శ్రీ, కె.వి.రమణారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డిల అభిప్రాయాలను కూడా సందర్భోచితంగా ఈ వ్యాసంలో ఉటంకించారు! వీళ్లంతా వెల్చేరు నారాయణ రావు కంటే ముందుగానే కన్యాశుల్కం నాటకం యొక్క గొప్పదనాన్ని కీర్తించిన విషయాన్ని గుర్తు చేశారు! అంతేకాకుండా వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం పట్ల గురజాడకు సానుభూతి లేకపోవడానికి గురజాడ విపరీత మనస్తత్వమే కారణమని రారా అన్నట్లుగా వెల్చేరు చెప్పుకొచ్చిన విషయాన్ని తెలుపుతూ నవీన్ గారు ‘ఇది అబద్దం’ అన్నారు!

వీరేశలింగం ఉద్యమం పట్ల గురజాడకు ఎందుకు సానుభూతి లేదో రారా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని నవీన్ గారు గుర్తు చేశారు! వీరందరి అభిప్రాయాలతో పాటుగా కన్యాశుల్కంలో శాశ్వతమైన సాహిత్య విలువలు ఉన్నాయి కాబట్టే అది ఈనాటికీ సజీవంగా ఉందనీ, ఈ నాటకంలోని పాత్రలు, సంభాషణలు, ఈనాటికీ ప్రజల నాలుకల మీద ఆడుతున్నాయంటే ఆ నాటకంలోని సాహిత్య విలువలే కారణం అనీ, అంతే తప్ప సంఘ సంస్కరణోద్యమ చిత్రణ కాదని తెలుగు నాటక అభిమానులు ఎప్పుడో గుర్తించారని నవీన్ అభిప్రాయపడ్డారు వెల్చేరు అన్నట్లు కన్యాశుల్కం నాటకాన్ని సంఘ సంస్కరణ కోసం రచించబడిన నాటకం అని ఎవరూ అపార్థం చేసుకోలేదని వెల్చేరు నారాయణరావు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు!

పైగా ‘వేల్చేరు’ది అన్నీ నాకే తెలుసునన్న అహంకారం,అతి తెలివి తప్ప మరేమీ కాదని నవీన్ అభిప్రాయపడ్డారు! అసలు నవీన్ గారి ఈ వ్యాసం వేల్చేరు వ్యాసం తర్వాత వెంటనే కనుక ప్రచురించబడి ఉండినట్లయితే తప్పకుండా దీనిపై చర్చ జరిగి ఉండేది! ఆ పని ఇప్పుడు చేసినా, తెలుగు సాహిత్యాభిమానులకు మేలే జరుగుతుంది! ఇందుకు సాహితీవేత్తలు ఎవరైనా ముందుకు వస్తారో లేదో వేచి చూడవల్సిందే!

ఇక మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం అన్న అనుమాండ్ల భూమయ్య వ్యాసాన్ని కూడా నవీన్ గారు చాలా నిశితంగా పరిశీలించారు! మాలపల్లి నవల లో ఉన్న ఒక రెండు గీతాలను తీసుకొని మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం అని భూమయ్య చేసిన సూత్రీకరణ తో కూడా నవీన్ పూర్తిగా విభేదించారు! మాలపల్లి నిజానికి కావ్యం కాదు నవల! నవల అనేది వచన ప్రక్రియ! అట్లాగే కావ్యం కవితా ప్రక్రియ! నవల చాలా విశాలమైనది! దీనిలో కవిత్వం, కథ లాంటి ఇతర ప్రక్రియలు కూడా అవలీలగా ఇమిడిపోతాయి అని నవీన్ అన్నారు! మాలపల్లి లో ఉన్న రెండు గీతాలను ఆధారం చేసుకుని ‘ఉన్నవ’ మొదటి అభ్యుదయ కవి అనడానికి మాలపల్లి అభ్యుదయ మహాకావ్యం అనడానికి భూమయ్య చూపించిన ఆధారాలు చాలా బలహీనమైన వని తేల్చేశారు నవీన్! అంతేకాకుండా మాలపల్లి మహా కావ్యం అని అనకూడదని కావాలంటే మహా నవల అనవచ్చునని ఆయన సూచించారు!డెబ్బైయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా గోపీచంద్ రచించిన ‘అసమర్ధుని జీవయాత్ర’ పైనా, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’నవలపైనా చలం రమణాశ్రయ జీవితం పై వచ్చిన నవల, నందిగం కృష్ణారావు ‘మరణానంతర జీవితం’ పైనా,రామా చంద్రమౌళి బృహత్ నవల ‘కాలనాళిక’ పైనా, నవీన్ గారు ఆలోచనాత్మకమైన వ్యాసాలు రాశారు!

ఇక ‘చుక్కలు’- ‘నవ్వవా ఒకసారి’ ‘అద్దేపల్లి కవిత్వం’ అలాగే ‘అదే గాలి’ వ్యాసాలను పరిశీలించినప్పుడు ఆయనకు కవిత్వం మీదున్న పట్టు ఏమిటో అర్థమవుతుంది! పొట్లపల్లి రామారావు కవిత్వంలోని గాంభీర్యత, కే శ్రీనివాసులు రెడ్డి కవిత్వంలోని భావకవిత్వపు సొగసులను పాఠకులకు ఆసక్తిని గొలిపే విధంగా ఆయన అందించారు! ముకుంద రామారావు చేసిన ప్రపంచ దేశాల కవితల అనువాదాన్ని ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు! ఆధునిక కవిత్వం మీద అద్దేపల్లికి ఎంత అవగాహన ఉందో, శ్రీ శ్రీ పద్యాల మీద ఆయనకు గల సాధికారతను సోదాహరణంగా వివరించారు! అంతేకాకుండా సినారే జ్ఞాపకాలు, సినిమా పాటల విశ్లేషణ అన్న వ్యాసాల్లో కూడా నవీన్ కున్న అభినివేశం ఎంతో తెలిసివస్తుంది. సినిమాలంటే సహజంగానే ఆసక్తి ఉన్న ఆయన సినారె పాటల పై విశ్లేషణ చేసిన తీరు పాఠకులని ఇట్టే ఆకట్టుకుంటుంది! అంతకుముందు తెలుగు సినిమా పాటలలో లేని అరబ్బీ పదాలు పర్షియన్ భావరాగాలు,తూగి సాగే గజళ్ల నడకలు, సూఫీ ఆలోచనలు సినారె చిత్రరంగ ప్రవేశంతో ఒక వెల్లువలా ప్రవేశించాయంటారు ఉర్దూ తెలిసిన వాళ్ళు, మనలాంటి వాళ్లం ‘ఆహా’ అని పరవశించి పోతాం అంటూ సినారె రచనా వైభవాన్ని గూర్చి నవీన్ ఎంతో ఆరాధనతో చెప్పారు! ఇక కథల విషయానికి వచ్చినప్పుడు ఎంతో ప్రముఖుడైన బుచ్చిబాబు నుండి ఇటీవలే కథకుడిగా రాణిస్తున్న గోపిని కరుణాకర్ వరకు వారి వారి కథల తత్వాన్ని గురించి కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేశారు! “అంతరంగమే ఆయన కదనరంగం” అన్నది బుచ్చిబాబు కథలు విశ్లేషించే వ్యాసానికి ఆయన పెట్టిన పేరు! బుచ్చిబాబు తన కథలలో వ్యక్తుల మానసిక సంఘర్షణకు ఇచ్చిన ప్రాముఖ్యత తద్వారా కథా రచనా రంగంలో తనకు తాను సంపాదించుకున్న ముద్ర గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు! రామా చంద్రమౌళి కథల ప్రత్యేకత – ముఖ్యంగా కవిత్వాంశ కలిగి వున్న కథారచనకు చంద్రమౌళి పెట్టింది పేరని ఆయన ప్రశంసించే ప్రయత్నం చేశారు! యువకుడైన కరుణాకర్ కథల్లోని కొత్తదనాన్ని ఎంతో ప్రశంసించిన ఆయన, కథకుడు తనను తాను గొప్పవాడినంటూ చెప్పుకోవడం బాగాలేదని సున్నితంగా మందలించారు! తన కథల గురించి తానే భూకంపం సృష్టించినవని, సునామి సృష్టించాయి అని చెప్పుకోవడం ఒక సంస్కారవంతుడైన రచయిత చేయాల్సిన పని కాదని నవీన్ ఈ సందర్భంగా తప్పుపట్టారు! కరుణాకర్ పుస్తకానికి ముందుమాట రాసిన చిన వీరభద్రుడు రచయిత కథనరీతిని “విమోచనాత్మక వాస్తవికత” అనడాన్ని నవీన్ అంటే దాని అర్థం ఏమిటో సామాన్య పాఠకులకు వివరిస్తే బాగుండేది అని తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు! హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ నుండి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వరకు తాను చదువుకున్న కళాశాలలలో తను నేర్చుకున్న విషయాల గురించి, సంపాదించుకున్న సాహితీ మిత్రుల గురించి, అక్కడ రూపుదిద్దుకున్న తన వ్యక్తిత్వం గురించి అనేక అంశాల ప్రస్తావన ఈ సంపుటిలో కనిపిస్తాయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో యం.ఎ.చదువుకున్న రోజులలో, సినిమాలు, వామపక్ష రాజకీయాలు, ఆనాటి శ్రీశ్రీ -విశ్వనాథల సాహిత్యం ఈ మూడింటితోనే కాలం గడిచిపోయింది అంటారు నవీన్! వరవరరావు గంటా రామిరెడ్డిల సహచర్యం, రాఘవాచారిలాంటి సీనియర్ల ప్రభావం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన గుర్తు చేసుకున్నారు! వెలిచాల కొండలరావు వ్యక్తిత్వం, తన గురువైన ప్రొఫెసర్ యాదవ రెడ్డిల మార్గదర్శనం పట్ల నవీన్‌లో ఒకరకమైన ఆరాధనా భావం వ్యక్తం అయింది! ఒక అర్ధ శతాబ్దపు అనుభవాలు – జ్ఞాపకాల సమాహారమైన ఈ వ్యాస సంపుటి సాహితీ ప్రియులను తప్పకుండా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!!

***

కన్యాశుల్కం నాటకాన్ని తెలుగు వాళ్లెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా? (సాహిత్య వ్యాసాలు)
రచన: అంపశయ్య నవీన్
పేజీలు: 316,
వెల: రూ. 300/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 040-34652387

నవచేతన పబ్లిషింగ్ హౌజ్, బండ్లగూడ,
నాగోల్, హైదరాబాద్. ఫోన్:040-29884453

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here