కాపలా

    7
    3

    [box type=’note’ fontsize=’16’] గొర్రెపిల్లకు ఒళ్ళు మండిపోయింది. తనవల్లనే దొంగ దొరికాడని యజమానికి చెప్పాలనిపించింది. కానీ, తన మాటలు పట్టించుకోడనే సంశయంతో ఆగిపోయింది. కానీ గొర్రెపిల్ల బాధని కుక్క పోగొట్టింది. ఎలా? చదవండి శాఖమూరి శ్రీనివాస్ వ్రాసిన బాలల కథ  “కాపలా” . [/box]

    [dropcap]ఇ[/dropcap]ది చాలాకాలం క్రిందట జరిగిన ఘటన. కొన్ని మేకలు, గొర్రెలను ఒక వ్యక్తి కావలి కాస్తుండేవాడు. మేతకై అతను వాటిని పలుప్రాంతాలకు తిప్పుతుండేవాడు. అలాంటి సందర్భంలో ఒకసారి కాపరి వాటినో గడ్డిమైదానానికి తీసుకెళ్ళాడు. అక్కడ వాటికి పుష్కలంగా మేత దొరికింది. పగలంతా మేసి సాయంత్రానికి కడుపు బరువెక్కి అన్నీ కూర్చుండి పోయాయి. మేతకు ఇబ్బంది లేకపోవడంతో కొద్దిరోజులు అక్కడే ఉండాలనుకున్నాడు కాపరి. ఆ మైదానానికి దరిదాపుల్లో మనుషుల సంచారమే లేదు! ఇంతలో మెల్లగా చీకట్లు కమ్ముకున్నాయి. కాపరి వాటినన్నిటినీ గుంపుగా ఒకచోటికి తోలాడు. కాపరి మందతోపాటు ఒక కుక్కను కూడా వెంట తెచ్చుకునేవాడు. అది రాత్రిపూట కాపలా కొరకు! తోడేళ్ళలాంటి జంతువులు మందపై దాడికి వస్తే కుక్క కాపరిని హెచ్చరిస్తుంది. అయితే ఈ సారి కుక్క తనతోపాటు తన పిల్లను కూడా  వెంటబెట్టుకుని వచ్చింది.

    పలుప్రాంతాలు తిరగడం, గాలిమార్పు, ఎండ, వాన, చలులకు గురికావడంతో కుక్కకు కాస్త సుస్తీ చేసింది. దాంతో అది కాపరిని ఒప్పించి తన పిల్లను కాపలా ఉంచింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాపలా కాసే పద్ధతి పిల్లకు క్షుణ్ణంగా వివరించింది. కుక్కపిల్ల తల్లి చెప్పిందంతా జాగ్రత్తగా విని కాపలాకు సిద్ధమైంది. ఒక ఎత్తైన రాయి మీదకు వెళ్ళి నిల్చుంది.

    గంట గడిచింది. బహుశా అమావాస్య అయ్యింటుందేమో! చిమ్మచీకటి. గొర్రెలు, మేకలు, కాపరి అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ’గంటకు ఒక్కసారైనా చుట్టూ తిరిగి ప్రమాదం లేదని నిర్ధారించుకోవాలి. దాని వలన మన నిద్రమంపు కూడా పోతుంది.’ తల్లి చెప్పిన మాటలు కుక్కపిల్లకు గుర్తొచ్చాయి. చుట్టూ తిరిగొద్దామనుకుంది. కానీ, మనసులో ఎక్కడో భయం దానిని కాలు కదలనీయలేదు. చీకటే కాదు నిశ్శబ్దం కూడా దానిని మరింత భయపెట్టింది. భయం నుంచి బయటపడేందుకు, సాధారణస్థితికు వచ్చేందుకు దానికో ఉపాయం తట్టింది. వెంటనే సన్నగా కూనిరాగం తీయడం ప్రారంభించింది. అది పగటిపూట కాపరి పాడే పాటల్లో ఒకటి! కొంచెంసేపు రాగాలాపన చేశాక కాస్త భయం తగ్గినట్లు అనిపించింది.

    ఆ కూనిరాగం నిద్రపోని ఒక మేకపిల్ల వినింది. కుక్కపిల్ల అద్భుతంగా పాడినట్లు అనిపించింది. తనకు కూడా ఓ పాట పాడాలనిపించింది. దాంతో మేకపిల్ల కూడా రాగం తీయడం ప్రారంభించింది. దాని గొంతు వినగానే తల్లిమేక దిగ్గున మేల్కొంది.

    ’ఇంత రాత్రివేళ ఏం చేస్తున్నావు?’

    ’అదా…పాట పాడుతున్నాను. కుక్కపిల్ల చూడు ఎంత చక్కగా పాడుతోందో! దానిలా పాడాలనిపించింది.’

    ’అదంటే కాపలా ఉండాలి కాబట్టి రాగాలు తీస్తోంది. నీకేమైంది? అన్నీ మేల్కొంటే ఇబ్బంది. ఆదమరిచి నిద్రపోతున్న వాటిని లేపడం పద్ధతి కాదు. పడుకో.. నీకంతగా పాడాలనిపిస్తే  ఉదయం పాడుదువులే.’ తల్లిమాటను మన్నించిన మేకపిల్ల బుద్ధిగా పడుకుంది.

    ఇదంతా ఒక గొర్రెపిల్ల వినింది. ’ఈ మేకపిల్ల రేపు పగటిపూట కచ్చితంగా పాట పాడి కాపరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇప్పటికే అతను దీన్ని తెగముద్దు చేస్తున్నాడు. కాళ్ళు కందిపోతాయేమోనని ఎత్తుకుని తిప్పుతున్నాడు. అయినా నాకేం తక్కువ. నేను కూడా ఓ పాట సాధన చేసి రేపు వినిపిస్తాను.’ అని గొర్రెపిల్ల అనుకుంది.

    అనుకున్నడే తడవుగా గొంతెత్తి పాడేందుకు ప్రయత్నించింది. అయితే నాలుగురోజులుగా దానికి తీవ్రమైన జలుబు చేసి ఉంది. ముక్కు, గొంతు, కఫంతో నిండి ఉన్నాయి. గొంతులోంచి రాగం తీసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అయినా అది తన బలమంతా ఉపయోగించి పాట పాడింది. అది బిగ్గరగా, కర్ణకఠోరంగా ఉండడంతో ఒక్కసారిగా అన్నిటికీ మెలకువ వచ్చింది. మందలో అలజడి మొదలైంది.

    అలజడి ప్రారంభం కాగానే మందలో దాక్కున్న ఓ వ్యక్తి చంకలో మేకపిల్లను ఇరికించుకుని బయటకు గెంతాడు. వాడొక దొంగ! మందలోకి మెల్లగా చేరి ఓ మేకపిల్ల గొంతు బిగించి పట్టుకుని అదును కోసం చూస్తూ ఉన్నాడు. మందంతా మేల్కొనగానే  తాను దొరికిపోతానని పరుగు తీయడం ప్రారంభించాడు. మందతోపాటు మేల్కొన్న కాపరి అది చూసి కుక్కను వాడిపై ఉసిగొల్పి, తాను కూడా వెంటబడ్డాడు. కుక్క వెళ్ళి దొంగ కాలు గట్టిగా పట్టుకుంది. దాని పళ్ళు కాలిపిక్కలో దిగగానే గావుకేక పెడుతూ దొంగ మేకపిల్లను వదిలేసి కూలబడ్డాడు. ఇంతలో కాపరి అక్కడికి చేరుకుని తన చేతిలోని కర్రతో వాడికి దేహశుద్ధి చేసి మేకపిల్లను చంకలోకి తీసుకున్నాడు. దెబ్బలకు అల్లాడుతూనే దొంగ అక్కణ్ణుంచి పారిపోయాడు.

    మంద దగ్గరకు తిరిగొచ్చిన కాపరి కుక్కపిల్లను దగ్గరకు తీసుకుని దాని తల నిమురుతూ పొగిడాడు. అదంతా చూసిన గొర్రెపిల్లకు ఒళ్ళు మండిపోయింది. తనవల్లనే దొంగ దొరికాడని యజమానికి చెప్పాలనిపించింది. కానీ, తన మాటలు పట్టించుకోడనే సంశయంతో ఆగిపోయింది.

     మరుసటిరోజు ఉదయం కాపరి తన భుజంపైని మూట విప్పి కుక్కపిల్ల ముందు పెట్టి అందులో ఆహార పదార్థాలను తినమన్నాడు. కాపరి అక్కణ్ణుంచి వెళ్ళేదాకా అది వాటిని ముట్టలేదు.

    అతను పక్కకు వెళ్ళగానే వాటిలో కొన్ని తీయటిపండ్లను నోటితో కరుచుకుని వెళ్ళి గొర్రెపిల్లకు ఇచ్చి, “దొంగ నీవల్లే దొరికాడని నాకు తెలుసు. కానీ, యజమాని నన్ను తప్ప నిన్ను ఎట్టి పరిస్థితిలో నమ్మడు. ఇవిగో ఈ పళ్ళు నీకొరకే.” అని వాటిని దాని ముందు పెట్టింది.

    గొర్రెపిల్ల మనసులోని బాధ కాస్త తగ్గింది. సంతోషంగా వాటిని తినింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here